సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు - 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రీధర్ చాలా సున్నిత మనస్కుడు. నెలకి రెండు మూడుసార్లు నాకోసం వచ్చేవాడు. మిగతా వారిలా కాకుండా నా గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. మాలాంటి వారికి అలాంటి వ్యక్తులు అరుదుగా ఎదురవుతారు. ఆ తర్వాత నా జీవితం అనుకోని మలుపు తిరగడంతో శ్రీ్ధర్ మళ్లీ కలవలేదు. నేను దీన స్థితిలో చిక్కుకుపోయినట్టు అతనికి తెలిసి, నా నెంబరు మీకిచ్చి సాయం చెయ్యమని చెప్పి ఉండాలి...’
తలూపి అన్నాడు రాజేష్.
‘అమెరికా ప్రయాణానికి ముందు చాలా టెన్షన్ పడ్డాడు. డబ్బు సమకూర్చుకోవడం, వీసా తీసుకోవడం వంటి పనులతో బిజీ అయ్యాడు. స్వంత ఊరులోని రెండెకరాల పొలాన్ని తక్కువ ధరకి అమ్మేశాడు. తరాల నుండి తరిగి చివరగా మిగిలిన ఆ పొలం అమ్మినపుడు కన్నీళ్లు వచ్చాయి శ్రీ్ధర్‌కి’
ఇద్దరూ కాసేపు నిశ్శబ్దంగా సముద్రం వైపు చూస్తూ కూర్చున్నారు. చేపల వేటకి వెళుతున్న బోట్లు ఓడల్ని దాటుకుని వరుసగా వెళుతున్నాయి. రాసమణి చప్పున రాజేష్ వైపు తిరిగి చెప్పింది.
‘శ్రీ్ధర్‌తో మీకూ, నాకూ ఎలాంటి బంధుత్వం లేదు. చిత్రంగా మన పరిచయానికి అతను కారకుడయ్యాడు. సూటిగా చెప్పాలంటే ప్రస్తుతం నేను జీవిస్తున్న ప్రపంచంలోకి సామాన్యులు ప్రవేశించలేరు. పైకి ఏ మాత్రం కనిపించని ఉక్కు పంజరమది. మీరు కాల్ చెయ్యడం నేను కలవడం అనుకోకుండా జరిగిపోయాయి. ఈ రోజు తాజ్‌లో ఓ ప్రముఖుడు దిగాడు. రాత్రి తొమ్మిది నుండి రేపు ఉదయం ఆరు వరకూ అతను నా యజమాని’
‘నా కర్థం కాలేదు’
అప్పుడు ఆమె సెల్‌కి మిస్డ్‌కాల్ వచ్చింది. రాసమణి వెనక్కి చూసింది. రోడ్డు మీద పల్సర్ బైకుతో అంతకు ముందు అక్కడ దించిన మనిషి ఉన్నాడు. లేచి నిలబడి చెప్పిందామె.
‘అవకాశం చిక్కితే మరోసారి కలుద్దాం. మీ సందేహాలకు అప్పుడు సమాధానం ఇస్తాను’
‘మీకు కాల్ చెయ్యొచ్చా?’ అడిగాడు రాజేష్.
ఆమె రోడ్డువైపు కదలబోతూ ఆగి చిన్నగా చెప్పింది.
‘మధ్యాహ్నం రెండూ, రెండున్నర మధ్య... కాల్ రిసీవ్ చేసుకోకపోతే రెండోసారి చెయ్యవద్దు. వీలుంటే నేనే చేస్తాను’
రాసమణి వెళ్లి బైక్ వెనుక కూర్చుంది. రామకృష్ణా బీచ్ టర్నింగ్‌లోని తాజ్ రెసిడెన్సీ వైపు దూసుకుపోయింది పల్సర్.
రాజేష్ సముద్రం వైపు తలతిప్పాడు.
* * *
‘అవును... ఇన్‌స్పెక్టర్ యుగంధర్‌నే’ కాల్ రిసీవ్ చేసుకుని చెప్పాడు.
అవతలి మనిషి చెప్పింది విని అడిగేడు.
‘స్పాట్ గుర్తుపట్టడం ఎలా?’
సెల్ ఆఫ్ చేసి రెండు క్షణాలు ఆలోచించాడు. ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్‌ని జీప్ ఎక్కించుకుని బయలుదేరాడు. యుగంధర్ సూచన్ల ప్రకారం వెళ్లసాగింది జీప్. గ్రేటర్ సిటీ అయ్యాక విశాఖ నగరంలో కలిసింది మధురవాడ. ఆ ప్రాంతం నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పోతిన మల్లయ్యపాలెంలో కొత్తగా పోలీసుస్టేషన్ ఏర్పాటు చేశారు. సిటీతో పోలిస్తే ఎక్కువ ఖాళీ స్థలాలతో ఉంటుందా ఏరియా. భూములకు సంబంధించిన సమస్యలు అధికం అక్కడ. మధురవాడ, పోతినమల్లయ్య పాలెం జాతీయ రహదారికి అటూ ఇటూ విస్తరించి ఉండటం వల్ల యాక్సిడెంట్ కేసులు తరచుగా నమోదవుతాయి.
వాంబే కోలనీ చేరాక కుడివైపు మట్టిరోడ్డులోకి తిరిగింది జీప్. ఓ అర కిలోమీటరు వెళ్లాక చెప్పాడు యుగంధర్.
‘ఆ మూడు తాడిచెట్ల దగ్గర ఆపు...’
చుట్టూ తోటలతోను, ఫెన్సింగ్ వేసిన లేదా మూడడుగుల కాంపౌండ్ వాల్ కట్టిన ఇంటి స్థలాలతో నిర్మానుష్యంగా ఉందా ప్రాంతం. పట్టపగలే అక్కడ మనుషులు లేరంటే రాత్రిపూట అక్కడ ఏం జరిగినా దిక్కుండదు.
జీప్ దిగి చుట్టూ చూశాడు యుగంధర్. కానిస్టేబుల్స్ చెరోవైపు వెళ్లారు. రెండు నిమిషాల తర్వాత ఓ కానిస్టేబుల్ అరిచేడు.
‘సార్! ఇక్కడుంది బాడీ...’
యుగంధర్ అటు కదిలాడు. డ్రైవర్ అతన్ని అనుసరించాడు. నడుమెత్తు పెరిగిన పిచ్చి మొక్కల్లో బోర్లా పడుంది శరీరం. షర్టు మీద ఎండిన రక్తం నల్లగా కనిపిస్తోంది. చుట్టుపక్కల పిచ్చిమొక్కలు నలిగి వంగి ఉన్నాయి. ఆ హత్య నిన్న జరిగి ఉంటుందని అంచనా వేశాడు యుగంధర్.
చనిపోయిన వ్యక్తి కాలికి ఖరీదైన బూట్లున్నాయి. బ్లూ కలర్ ప్యాంటు మీద వైట్ షర్ట్ టక్ చేశాడు. అక్కడ జరిగిన సంఘటన వివరిస్తున్నట్టు ప్యాంటు నుంచి షర్టు బయటకొచ్చింది. ఎడమ చేతికి టైటాన్ వాచ్. చిటికెన వేలికి పగడంతో ఉన్న ఉంగరం కనిపిస్తున్నాయి. కాస్త పొడవుగా తగినంత లావుగా ఉన్నాడు మనిషి. నలభై అయిదు - ఏభై మధ్య ఉంటుంది వయసు.
అతను సాధారణ వ్యక్తికాడని చూడగానే అర్థమవుతోంది. ఎవరో నమ్మకంగా అతన్ని అక్కడికి తీసుకొచ్చి హతమార్చిన దృశ్యం ఒకటి యుగంధర్ కళ్ల ముందు రూపుకట్టింది.
గొంతు కూర్చుని మరింత నిశితంగా చూశాడతను.
ఎడమ చేత్తో బ్యాక్ పాకెట్ తడిమాడు. అలాగే ప్యాంటు కుడి ఎడమ పాకెట్లు కూడా చూశాడు. ఎలాంటి వస్తువులు లేవు. శవాన్ని వెల్లకిలా తిప్పారు కానిస్టేబుల్స్. షర్ట్ పాకెట్ కూడా ఖాళీగా ఉంది. ఛాతీ మీద మూడు గాయాలు కనిపిస్తున్నాయి. షర్టు ముందు వైపు అంతా రక్తం పీల్చుకుని ఎండిపోయింది. శవం ఎవరిదో తెలుసుకుంటే దర్యాప్తు ముందుకెళుతుంది. లేదంటే అతనెవరో తెలుసు

కోవడం దగ్గరే కాలయాపన అవుతుంది.
యుగంధర్ తలపంకించి జేబులోంచి పెన్ తీశాడు. క్లూస్ టీమ్‌ని, డాగ్ స్క్వాడ్‌ని పంపమని కంట్రోలు రూమ్‌కి చెప్పాడు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ని వాంబే కోలనీకి పంపి, డ్రైవర్ని అక్కడే ఉండమని మట్టిరోడ్డులోకి ప్రవేశించాడు.
పరిసరాలు నిశితంగా చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు యుగంధర్. ఒకరు లేక ఇద్దరు ఆ హత్యలో పాల్గొంటే అక్కడికి వాళ్లెలా వచ్చారు? ఏదో వాహనం ఉపయోగించి ఉండాలి. బలవంతంగా తీసుకొచ్చి చంపడానికి అవకాశం తక్కువ. ఒకవేళ హతుడు ఇష్టపూర్వకంగా అక్కడికి వచ్చుంటే ఏ కారణంతో వచ్చాడు? ఆ ప్రాంతం గురించి బాగా తెలిసిన వాళ్లే హత్య చేసుంటారు. రియల్ ఎస్టేట్ వ్యవహారం ఇందులో ఉండేందుకు ఆస్కారం ఉంది. సైట్ చూపిస్తామని తీసుకొచ్చి చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
చటుక్కున ఆగిపోయేడు యుగంధర్.
ఓ మామిడితోట మధ్య నుంచి వెళుతోంది మట్టిదారి. ఎడమపక్క రెండు మామిడి చెట్ల నడుమ కారు ఆగిన టైరు గుర్తులున్నాయి. ఎక్కువసేపు కారు అక్కడ నిలిచినట్టు సిగరెట్ పీకలు కనిపిస్తున్నాయి. అగ్గిపుల్లలు లేవంటే లైటర్ ఉపయోగించి ఉండాలి. కారు తిరిగి రివర్స్ చేసుకుని వెళ్లినట్టు టైరు గుర్తులు సూచిస్తున్నాయి. ఆ దారి వెంట దృష్టి సారించేడు యుగంధర్. అది మెలికలు తిరిగి కొంతవరకే కనిపించింది.
వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లింది కారు. ఆ దారి ఎక్కడికి వెళుతుందో తెలియాలంటే జీప్‌లో వెళ్లాలి. డాగ్‌స్క్వాడ్ వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందేమో చూసి అప్పుడు అటు వెళ్లాలని అనుకున్నాడతను. రెండు గంటలు గడిచాక క్లూస్ టీమ్‌తోపాటు డాగ్ వచ్చింది.
జర్మన్ షెపర్డ్‌ని శవం దగ్గరకు తీసుకెళ్లి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు దాని ట్రైనర్. అది ఒకసారి శవం చుట్టూ తిరిగి మట్టిరోడ్డు వైపు కదిలింది. అంతకు ముందు యుగంధర్ గమనించిన టైరు గుర్తులు దగ్గర ఆగి పరిసరాల్ని వాసన చూసింది. ఆ తర్వాత కారు వెళ్లిన దారిలోకి మళ్లింది. ట్రైనర్ దానితోపాటు వేగంగా కదులుతున్నాడు. ఒక కిలోమీటరు వెళ్లాక ఆగి కుడివైపు ఖాళీ స్థలంలోకి చూస్తూ అరవసాగింది.
యుగంధర్ కూడా అక్కడకు చేరుకుని కుక్క అరుస్తున్న వైపు దృష్టి సారించాడు. ఏమీ కనిపించలేదు. మరెందుకు అరుస్తోంది? స్థలం మధ్యలో నేల మీద మట్టి ఫ్రెష్‌గా ఉంది. అక్కడ తవ్వమని కానిస్టేబుల్ని పురమాయించాడు. కొన్ని నిమిషాల్లో రెండు పాలిథిన్ సంచులు పైకి తీశాడతను.
ఒకదానిలో ఖరీదైన ఖాళీ విస్కీ బాటిల్, డిస్పోజబుల్ గ్లాసులు మూడు, రెండు షోడా పెట్ బాటిల్స్ ఉన్నాయి. రెండో దానిలో హత్యకి ఉపయోగించిన కత్తి, మనీపర్సు, సెల్‌ఫోన్ కనిపించాయి. క్లూస్ టీం నుండి గ్లౌజులు తీసుకుని చేతులకు తొడుక్కొని పర్సు తెరిచాడు యుగంధర్. క్రెడిట్ కార్డు, ఏటిఎం కార్డు, ఐడెంటిటీ కార్డు, కొంత కరెన్సీ ఉన్నాయి.
కె.రాంప్రసాద్, బ్యాంక్ ఆఫీసర్,
ఆంధ్రా బ్యాంక్,
మహరాణిపేట, విశాఖపట్నం.
సెల్‌లో ఫీడ్ చేసిన నెంబరు చూసి రాంప్రసాద్ ఇంటికి సమాచారం ఇచ్చాడు యుగంధర్. క్లూస్ టీంకి కొన్ని సూచనలు చేసి అక్కడ నుంచి బయలుదేరాడు. స్టేషన్ బయట కుర్చీలో కూర్చున్న వరహాలశెట్టిని గమనించి తలూపి తన గదిలోకి నడిచాడు.
వరహాలశెట్టి నమస్కారం చేసి చేతిలోని స్వీట్ పాకెట్ టేబుల్ మీద ఉంచి చెప్పాడు.
‘్థంక్స్ సార్! ఆ కుర్రాడు మా అమ్మాయి వెంట పడటం లేదు’
‘గుడ్.. ఇదేమిటి?’ స్వీట్ పాకెట్ చూసి అడిగాడు.
‘మీ నోరు తీపి చెయ్యాలని...’ నసిగేడతను.
‘మా స్ట్ఫాకి ఇవ్వండి’
వరహాలశెట్టి మరోసారి నమస్కారం చేసి స్వీట్ పాకెట్‌తో బయటకు నడిచాడు.
యుగంధర్ కుర్చీలో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాడు. అతని మనోఫలకం మీద హత్య చేయబడ్డ రాంప్రసాద్ రూపం ప్రత్యక్షమయింది. తనని హతమార్చాలనుకున్న వారితో గంగిగోవులా ఎందుకెళ్లాడు? రాంప్రసాద్‌ని చంపితే కలిగే ప్రయోజనం ఏమిటి హంతకులకి? ఆలోచనలు చెదరగొడుతూ సెల్ రింగయింది.
డిస్‌ప్లేలో కమిషనర్ నెంబరు కనిపించడంతో ఉలిక్కిపడ్డాడతను.

(మిగతా వచ్చే సంచికలో)

-మంజరి 9441571994