భగత్‌సింగ్

విప్లవ పాలకేంద్రం (భగత్‌సింగ్ - 15)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘1927 మేలో నన్ను అరెస్టు చేశారు. అది నాకు పెద్ద సర్‌ప్రైజ్. పోలీసులు నా కోసం వెతుకుతున్నారని అప్పటిదాకా నాకు తెలియదు. ఓ తోటగుండా వెళుతూండగా పోలీసులు హఠాత్తుగా నన్ను చుట్టుముట్టారు. అప్పుడు నా నిబ్బరం నాకే ఆశ్చర్యమనిపించింది. నన్ను కస్టడీలోకి తీసుకుని మరునాడు రైల్వే పోలీసు లాకప్‌లో వేశారు. అక్కడ నిండా నెలరోజులు ఉన్నాను.
పోలీసు వాళ్లతో రోజుల తరబడి మాట్లాడితే నాకు అర్థమయిందేమిటంటే కాకోరీ బృందంతో నాకు సంబంధం ఉన్నట్టు వారి దగ్గర ఏదో సమాచారం ఉంది. విప్లవోద్యమంలో నా ఇతర కార్యకలాపాల గురించీ వారికి కాస్త ఉప్పందినట్టుంది. కాకోరీ కేసు విచారణ జరుగుతున్న సమయాన ముద్దాయిల్ని విడిపించే పన్నాగంతో నేను లక్నోలో ఉన్న సంగతి వాళ్లు కనిపెట్టారు. ప్లాను వేశాక మేము కొన్ని బాంబులని సంపాదించామనీ, పరీక్ష కోసం వాటిలో ఒకదాన్ని 1926 దసరా మేళాలో గుంపు మీదికి విసిరాననీ వాళ్లకు తెలుసట. నేను విప్లవ పార్టీ కార్యకలాపాలను బయటపెడుతూ స్టేట్‌మెంట్ ఇస్తే చాలు నన్ను వదిలేస్తారట. దానివల్ల నేను స్వేచ్ఛగా బయటపడొచ్చు; పైగా ఏదో రివార్డు కూడా ఇస్తారట; కనీసం అప్రూవరుగా కూడా కేసులో ఉంచరట.
ఈ బేరాలు వింటూంటే నాకు నవ్వొచ్చింది. అంతా హంబగ్. మాలాంటి భావాలు ఉన్నవాళ్లు అమాయక ప్రజల మీదికి బాంబులు విసరరు.
ఓ రోజు సి.ఐ.డి. సూపర్నెంటు మిస్టర్ న్యూమన్ నా దగ్గరికి వచ్చాడు. చాలాసేపు మాట్లాడాడు. నా మీద సానుభూతి కురిపించాడు. చివరికి - అసలు కబురు చెప్పాడు. వాళ్లు అడిగిన విధంగా నేను స్టేటుమెంటు ఇవ్వకపోతే రాజ్యం మీద యుద్ధానికి కుట్ర చేసిన నేరానికి కాకోరీ కేసులోనూ, దసరా గుంపుపై బాంబు విసిరి, పలువురిని చంపిన కేసులోనూ నన్ను ప్రాసిక్యూట్ చేస్తామని బెదిరించాడు. నిన్ను ఉరి తీయడానికి సరిపడినన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అనీ హెచ్చరించాడు.
‘నాకేమీ తెలియదు. నేను నిర్దోషిని. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి’ అని నేను చెప్పాను.

"Why I am an Athiest' అన్న వ్యాసంలో తన తొలి అరెస్టు గురించి భగత్‌సింగ్ స్వయంగా తెలిపిన వివరాలివి.
1926 అక్టోబర్ 26న లాహోర్‌లో వేలజనం సంబరంగా పాల్గొంటున్న దసరామేళాలో పేలిన బాంబు తొమ్మిదిమంది ప్రాణాలు తీసి, యాభై మందిని తీవ్రంగా గాయపరిచింది. పేలుడు ఎలా జరిగిందో, ఎవరు చేయించారో ఎవరికీ తెలియదు. కాకోరీలో రైలుదోపిడీ చేసిన విప్లవకారులే ఈ ఘాతుకానికీ పాల్పడ్డారని తెల్లదొరతనం నిందవేసింది. నిందితుల ఆచూకీ ఎవరు తెలిపితే వారికి ఐదువేల రూపాయల బహుమానాన్నీ ప్రకటించింది. అయినా విప్లవకారుల ప్రమేయం గురించి పిసరంత సమాచారం రాబట్టలేకపోయింది. ప్రజల పక్షాన పోరాడే విప్లవకారులు విచ్చలవిడిగా ప్రజల మీద బాంబులు వేసి నిష్కారణంగా ప్రాణాలు తీస్తారంటే ఎవరూ నమ్మరు. బాంబు పేలిన ఏడు నెలల తరవాత భగత్‌సింగ్‌ను ఆ కేసులో ఇరికించాలని చూడటాన్నిబట్టే అతడి అరెస్టుకూ బాంబు పేలుడుకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం.
లేని సంబంధం ఉన్నట్టు బనాయించి, భగత్‌సింగ్‌ని బెదిరించి, ఎలాగైనా అతడి నుంచి కాకోరీ కుట్ర వివరాలను, ఇతర విప్లవకారుల ఆరాలను రాబట్టాలని పోలీసులు శతవిధాల ప్రయత్నించారు. లాకప్‌లో వేసి, గొడ్డును బాదినట్టు బాది, చిత్రహింసలు పెట్టారు. ఎన్ని రకాలుగానో నిగ్గదీసి బోల్తా కొట్టించజూశారు. అయినా భగత్ బెదరలేదు. బెంబేలెత్తలేదు. పోలీసు ఉచ్చులో ఇరుక్కోలేదు. ఎన్ని తీర్ల రెట్టించినా తనకేమీ తెలియదనే అతడు చెప్పాడు. చివరికి పోలీసులకే విసుగుపుట్టి అతడిని లాహోర్‌లోని బోర్‌స్టల్ జైలుకు పంపించారు.
పక్క పేజీలో కనిపించే బొమ్మ భగత్‌సింగ్ రైల్వే పోలీసు లాకప్‌లో ఉండగా పోలీసులు తీయించింది. మంచం మీద కూచుని ఉన్నవాడు భగత్. పక్కన కుర్చీలో కూచుని అతడిని ప్రశ్నిస్తున్నవాడు సిఐడి డీఎస్పీ గోపాల్‌సింగ్. ఇంకో కుర్చీ ఖాళీగా ఉంది. బహుశా ఇంటరాగేషన్ చేయబోయే ఇంకో పోలీసు అధికారి కోసం కావచ్చు. భగత్ ఎడమచేతిని గొలుసుతో కట్టేశారు. ఖైదీ పారిపోకుండా గొలుసు రెండో కొసను మంచానికి కట్టేసి తాళం వేయడం రివాజు. ఎడమచేతి గొలుసును కుడిచేత్తో సవరిస్తూ తనను ప్రశ్నించేవాడి కళ్లలోకి భగత్ సూటిగా చూస్తున్నాడు. మనిషి కూల్‌గా ఉన్నాడు. అతడి జుట్టు సిక్కు పద్ధతిలో ముడివేసి ఉంది. మామూలుగా నడినెత్తిన కాదు. కొంచెం వెనకగా. వెనక గోడ మీద పూత కూడి కాస్త ఎత్తు వరకే ఉంది. గోడ పైభాగంలో ఇటుకలు కనిపిస్తున్నాయి. ఏదో పాతకొంపను లాకప్ కోసం వాడుతున్నట్టుంది. భగత్ వొంటి మీద అంగీ కుడివైపు ఛాతీ దగ్గర చిరిగి ఉంది.
ఐ.పి.సి. 302 సెక్షన్ కింద హత్యానేరం మోపి అరెస్టు అయితే చేశారు కాని, సాక్ష్యాధారాలేవీ దొరకనందున పోలీసులు భగత్‌సింగ్ మీద చార్జిషీటు వేయలేక పోయారు. కుమారుడిని విడిపించటానికి సర్దార్ కిషన్‌సింగ్ కోర్టుల చుట్టూ తిరిగాడు. మే 29న అరెస్టు చేస్తే నెల తిరిగాక జూలై 4న గానీ లాహోర్ హైకోర్టులో బెయిల్ రాలేదు.
అది కూడా ఏకంగా అరవై వేల రూపాయల పూచీకత్తు ఇవ్వాలన్న షరతు మీద. ఆ రోజుల్లో అరవై వేలంటే మధ్యతరగతి కుటుంబీకుడికి కళ్లు తిరిగేంతటి మొత్తం. దాని కోసం కిషన్‌సింగ్ నానా యాతన పడ్డాడు. కడకు అతడి స్నేహితులైన బారిస్టర్ దునీచంద్, దౌలత్‌రామ్‌లు చెరి 30 వేల రూపాయలు కష్టపడి కట్టి, భగత్‌సింగ్‌ని బయటికి తెచ్చారు.
ఇంటికి తీసుకెళ్లగానే తండ్రి చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? కర్ర తీసుకుని కొడుకును చితకబాదటం!
అప్పుడు కొడుకు ఏమి చేశాడు? చెట్టంత కొడుకుని, ననే్న కొడతావా? నేనేమి తప్పు చేశానని - అంటూ తిరగబడ్డాడా? కనీసం కోపం తెచ్చుకున్నాడా?
లేదు. చేతులు నెప్పి పుట్టేలా తండ్రి కొడుతున్నంతసేపూ భగత్‌సింగ్ నవ్వుతూనే ఉన్నాడట. ఆ సమయాన అక్కడే ఉన్న తల్లి విద్యావతి మల్వీందర్‌జిత్ సింగ్ వారాయిచ్‌కి చెప్పిన ముచ్చట ఇది.
బయటికి వచ్చినా స్వేచ్ఛ తక్కువ. బెయిలు మీద బయటపడ్డవాడు ఇంతకు ముందులాగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లలేడు. ఏది తలచుకుంటే అది చెయ్యలేడు. ఎందుకంటే పోలీసులు వెయ్యి కళ్లతో కనిపెడుతూంటారు. ఎక్కడికి కదిలినా వెంటాడుతూంటారు. వారి కళ్లు కప్పి పరారవటం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాని దానివల్ల పోలీసుల చేతికి ఇంకో ఆయుధం సతాయించేందుకు దొరుకుతుంది. పైగా జామీను ఇచ్చినవాళ్లూ చిక్కుల్లో పడతారు. అంత పెద్ద మొత్తాన్ని వదులుకోవలసి వస్తే ఎవరికైనా చాలా కష్టమే.
కాబట్టి బెయిల్‌పై వచ్చాక భగత్‌సింగ్ లాహోర్‌లో ఇంటిపట్టునే ఉన్నాడు. తండ్రి అతడి కోసం పాడి కేంద్రం పెట్టాడు. తండ్రీ కొడుకులు సంతకు వెళ్లి పాడిగేదెలు కొనుక్కొచ్చారు. భగత్ తెల్లవారుఝామున 4 గంటలకే లేచి కొట్టం శుభ్రం చేసి పశువులకు మేత వేసి పాలు పితికేవాడు. పాలబుంగలను గుర్రపు బండిలో వేసుకుని పట్నంలో కస్టమర్ల ఇళ్లకు సరఫరా చేసేవాడు. కావలసిన గ్రాసం గట్రా కొనుక్కొని తిరిగొచ్చి ఇంటి పట్టునే ఉండేవాడు. విప్లవ పార్టీ పనులు చేసినంత శ్రద్ధగా పాడిపనులూ చక్కబెట్టేవాడు. లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాలు ముందేసుకుని అస్తమానం ఏదో చదువుతూండేవాడు. తాను అభిమానించే అమరవీరుల, విప్లవ పోరాటాల గురించి వ్యాసాలు రాస్తూండేవాడు. అప్పట్లో అతడు రాసిన అనేక వ్యాసాలు పంజాబీ పత్రిక ‘కీర్తి’లో, హిందీ పత్రిక ‘చాంద్’లో అచ్చవుతూండేవి. రాత్రి పొద్దుపోయాక ఎక్కడెక్కడి సావాసగాళ్లూ పాడి కేంద్రానికి చేరుతూండేవారు. వాళ్ల కోసం భగత్ డేగిసాలో ప్రత్యేకంగా కాచిన వేడిపాలు తాగుతూ జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలూ, సైద్ధాంతిక అంశాలూ, పోరాటాల వ్యూహాలూ చర్చిస్తూండేవాళ్లు.
చూసేవారికి బాగానే ఉండేది. కాని ఆవేశానికి, సంచలనానికి మారుపేరైన భగత్‌సింగ్‌కి ఇలా చేతులు కట్టేసుకుని, పాలబ్బాయిలా వ్యాపారం చేసుకోవటం దుర్భరంగా ఉండేది. తన మీద కేసును ఎత్తివేయించుకోవటం కోసం అతడు చాలా ప్రయత్నాలు చేశాడు. కాని ప్రయోజనం లేకపోయింది. అతడి విప్లవతత్వం ఎరిగిన సర్కారుకు అతడి మెడ మీద నుంచి బెయిలు కత్తిని తీసేయటం ఇష్టం లేకపోయింది. ఎటూ తేల్చకుండా ఏదో ఒక సాకుతో కేసును సాగదీస్తూ వచ్చింది. ఆ స్థితిలో భగత్‌సింగ్ ఎంత చికాకు పడిందీ అమెరికాలో స్థిరపడిన తన ఊరి సావాసగాడు అమర్‌చంద్‌కి రాసిన ఈ ఉత్తరమే చెబుతుంది.

Dear brother Amar Chand
Namaste.
... ... ...
... ... ...
My fate has been rather queer.., countless difficulties have befallen me. Eventually the case was withdrawn. I was arrested again in 1927 and was released on a bail bond of Rs.60,000 So far no case has been instituted against me and God willing, it wont be. It is going to be about one year, but I am not yet been relieved of this bail bond. Be it all as per God's will.
What else I should write about myself? I am a victim of suspicious for no rhyme or reason. My mail is censored. My letters are opened. I wonder on what account have I been an object of such degree of suspicion. Well brother, ultimately truth shall be uncovered and truth would prevail.
Yours obediently
Bhagat Singh
[Bhagat singh, The Eternal Rebel, Waraich, pp.57-58]

ఫ్రియ సోథరుడు అమర్‌చంద్‌కి
నమస్తే.
... ... ...
... ... ...
ఇంకేం రాయను? నా తలరాత చిత్రంగా ఉంది. లెక్కలేనన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. 1927లో నన్ను అరెస్టు చేసి 60,000 రూపాయల బెయిలు బాండు మీద విడిచిపెట్టారు. ఇప్పటిదాకా నా మీద ఏ కేసూ మోపలేదు. దేవుడి దయ ఉంటే ఇక ముందూ పెట్టరు. ఇప్పటికి సంవత్సరం కావస్తోంది. కాని నన్ను ఈ బెయిల్ బాండు నుంచి తప్పించలేదు... అది కూడా దైవనిర్ణయమే అనుకుంటా.
నా గురించి ఇంకేం రాయను? ఏ కారణమూ లేకుండా నేను కేవలం అనుమానాలకు బలి అయ్యాను. నా పోస్టు సెన్సార్ అవుతోంది. నా ఉత్తరాలు తెరిచి చదువుతున్నారు. నా మీద ఇంత తీవ్రమైన అనుమానాలకు కారణమేమిటో నాకు తెలియదు. సరే సోదరా! చివరికి నిజం బయటపడుతుంది. సత్యమే జయిస్తుంది.
ఇట్లు నీ విధేయుడు
భగత్‌సింగ్

‘నేను నాస్తికుణ్ని’ అని చెప్పుకున్న భగత్‌సింగేనా ఈ ఉత్తరం రాసింది అని చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. దేవుణ్ని నమ్మే ఆస్తికుడిగానే ఇందులో భగత్ పొడగడతాడు.
వారినీ వీరినీ పట్టుకుని ఎన్నో విఫల యత్నాల తరవాత వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. గోపిచంద్ భార్గవ అనే ఎమ్మెల్యే పంజాబ్ అసెంబ్లీలో భగత్‌సింగ్ సంగతి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ‘్భగత్‌కి వ్యతిరేకంగా సాక్ష్యం ఉంటే అతడి మీద ఎందుకు కేసు పెట్టరు? ఏ నేరమూ చేసినట్టుగా సాక్ష్యం ఏదీ లేకపోతే అతడిని ఇంకా బెయిలు మీద ఉంచటంలో అర్థమేమిటి?’ అని భార్గవ అడిగిన ప్రశ్నకు సర్కారు వద్ద సమాధానం లేదు. అంతలో బోధ్‌రాజ్ అనే ఇంకో ఎమ్మెల్యే కూడా అదే విధమైన ప్రశ్నకు నోటీసు ఇచ్చాడు. బుకాయించి లాభం లేదని గ్రహించిన ప్రభుత్వం గత్యంతరం లేక బెయిలును ఎత్తేసి జామీను మొత్తం వెనక్కి ఇచ్చేసింది.
భగత్‌సింగ్‌కి మళ్లీ స్వేచ్ఛ వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దూకాడు.
*

బందిపోటు భగత్
ఈ వారం ‘్భగత్‌సింగ్’ ధారావాహిక సీరియల్ చదువుతూంటే ఒళ్లు గగుర్పొడిచింది. ఆ కాలపు విప్లవకారులకు సుఖాల మీద, భోగాల మీద ధ్యాస ఏ కోశానా లేదు. ఉన్నదానితోనే సర్దుకుంటూ, లేనినాడు కాళ్లు ముడుచుకుని ఖాళీ కడుపుతోనే శ్రామిక స్వర్గపు కలలు కంటూ, సిద్ధాంత చర్చలతో రాజకీయ రచ్చలతో ఆకలిని మరిచిపోతూ విరాగులలాగే బతికేవారన్నది వాస్తవం. కానీ - ఆనాడు అన్ని త్యాగాలకోర్చి.. బాధలను సహించి - దేశ స్వాతంత్య్రానికి పునాదులు వేసి.. స్వాతంత్య్ర సముపార్జనకు పాటుపడితే.. నేడు ఆ ఫలాలను అనుభవిస్తూ.. కనీసం ‘్భగత్‌సింగ్’ని తలచుకోక పోవడం కడు శోచనీయం.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)

ఎం.వి.ఆర్.శాస్ర్తీ