వినదగు!

సంయోగ, వియోగ ఆత్మజ్ఞానం (వినదగు..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుమానం అసంపూర్ణ పరిణామం.. శంకా రాహిత్యమే పరిపూర్ణత్వం. ఎంతలా ఆధ్యాత్మిక సంపన్నులమైనా, ఎంతలా వరప్రసాదితులమైనా అనుమానం మనల్ని నిర్వీర్యుల్ని చేస్తుంటుంది. అయితే ఇది తెలుసుకోలేక అనుమానాన్ని కూడా ఒక ‘మాయ’కే చేరుస్తుంటారు ఆధ్యాత్మికులు. కానీ ఈ అనుమానాన్ని మాయగా భ్రమించక, అనుమాన తెరలు వీడటమే అసలైన ఆధ్యాత్మికత్వం.. ఆత్మతత్వం. అదే సక్సెస్‌కు, స్పిరిట్యుయాలిటీకి తొలి సోపానం.
‘అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్
తథాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి’
ఈ గీత అర్జునుడి అనుమాన ప్రవృత్తికి కృష్ణుడి నివృత్త సమాధాన బీజం. ఆత్మను దేహరూపంలో చూస్తూ ‘పునరపి జననం పునరపి మరణం’ అన్నట్లుగా నిత్యం జన్మిస్తున్నదాన్నిగా, నిత్యం మరణిస్తున్నదానిగా చూస్తూ శోకించటం తగదు అన్నది కృష్ణ ఉవాచ. పుట్టటం ఖాయం, చావటం ఖాయం అని తెలుసుకున్న తర్వాత ఇంకా దుఃఖించి ప్రయోజనం లేదు కదా!
‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మతస్య చ
తస్మాద పరిహార్యేర్థే న త్వం శోచితు మర్హసి’
అవును, పుట్టినవారు మరణించకపోరు.. మరణం మరొక జననానికి తావివ్వకా పోదు. ఈ జనన మరణాలు తప్పింప శక్యం కానివి... అపరిహార్యాలు. ఇలా పరిహరించటం సాధ్యం కాని చావుపుట్టుకల గురించి చింతిస్తూ శోకించటం అజ్ఞానమే!
సృష్టి ధర్మ గతిని మార్చటం సాధ్యమా?! అంటే సృష్టి ధర్మాలను వ్యతిరేకించి వర్తించాలనుకుంటే జీవితం దుఃఖమయం అవుతుంది కాబట్టి సృష్టి ధర్మాలను కాదనకూడదు. అప్పుడే జీవితం సుఖంగా, శాంతంగా సాగుతుంది. కేవలం భౌతిక దృష్టితో చూస్తే ఈ కృష్ణతత్వం వొంటబట్టకపోవచ్చు. భౌతికం నుండి విడివడి అధిభౌతికంగా చూడటం ప్రారంభిస్తే కృష్ణ గీత సులభంగానే కొరుకుడు పడుతుంది.
‘అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత
అవ్యక్తనిధనానే్యవ తత్ర కా పరిదేవనా’
మన కళ్ల ముందున్న మానవ సముదాయమే కాదు, సర్వప్రాణులూ వర్తమాన జన్మలో మనకు వ్యక్తాలు. కానీ జన్మకు ముందు, మరణించాక అవ్యక్తాలు. అంటే ప్రాపంచికంగా మనం చూస్తున్న జీవరాశి వర్తమాన రూపాన్ని సంతరించుకోక పూర్వం కనిపించనివే - ఈ వర్తమాన స్థితిని వీడిన తర్వాత కనిపించకపోయేవే. ఇలా ప్రస్తుతానికి కనిపిస్తూ, రేపటికి కనిపించకపోయే వాటిని గురించి వ్యాకులపడటం, బాధ చెందటం, శోకించటం తగదు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే మన ఇంద్రియ స్పృహనే ఈ వ్యక్తమంతా.. మన ఇంద్రియ స్పర్శతోనే ఇన్ని వికారాలు.. ఇన్ని ఆనంద విషాదాలు... ఇంతటి సుఖదుఃఖాలు. వ్యక్తంలోనే అంటే వర్తమానంలోనే మన బాంధవ్యాలన్నీ. అవ్యక్తంలో ఎటువంటి రాసుకు పూసుకోవటాలు ఉండవన్నది ఇక్కడ స్పష్టం.
‘ఆశ్చర్య వత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్య వ ద్వదతి తథైవ చాన్యః
ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్’
ఆత్మను గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువే.. ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. అంతెందుకు మనలో కొందరం ఆత్మను ఆశ్చర్యకరమైందిగా చూస్తుంటాం.. ఇంకొందరం ఆశ్చర్యకరమైందిగా చెప్తుంటాం.. మరి కొందరం ఆశ్చర్యకరమైందిగా చెప్పగా వింటుంటాం. ఇంతలా ఎంత చూస్తున్నా, చెప్తున్నా, వింటున్న ‘ఆత్మ’ జ్ఞానం పూర్తిగా కలగటం లేదు. ఆత్మ ఎరుక ఎంత కలిగినా ఇంకా వెలితి ఉంటూనే ఉంటుంది. కాబట్టే ఆత్మతో ముడిపడి వున్న జనన మరణాల తత్వ విషయంలో సంపూర్ణంగా సత్యావిష్కరణ జరగటం లేదు. మొత్తానికి ‘ఆత్మ’ ఎప్పటికీ ఆశ్చర్యకరమైందే!
ఆత్మ ఎంతలా సనాతనమైందో ఆత్మజ్ఞానమూ అంతలా సనాతనమైందే. అయినా ఇంకా సంపూర్ణావిష్కరణ జరగలేదు. మనం సాగిస్తున్న సాధన ఈ ఆత్మావిష్కరణ కోసమే. ఎంతలా యోగ సాధన చేసినా ఆత్మదర్శనం కలిగినట్లే ఉంటుంది. ఆత్మ లౌకికం కానిది అలౌకికమైనది అని అనిపిస్తున్నా అద్భుతమే, అద్వితీయమే! అందుకే ఆత్మదర్శనానుభూతి అక్షరాలలో వొదగటం లేదు. ఎంతలా ఆత్మసాక్షాత్కారం సాధ్యమైనా ఆత్మ అక్షరార్చనకు అందదు. కృష్ణుడు ఎంతలా ఆత్మను ఎరుకపరుస్తున్నా అర్జునుడి తపన చల్లారటం లేదు. అందుకే కృష్ణుడు వివిధ రీతుల ‘ఆత్మ’ను ప్రస్తావిస్తున్నాడు. అర్జునుడిని ఆత్మతత్వం వైపుగా ప్రస్తావింప జేస్తున్నాడు.
మొత్తానికి కృష్ణుడు ఎరుకపరుస్తున్న ఆత్మతత్వాన్ని ఇలా అక్షరీకరించవచ్చు - ఏ విధంగా చూసినా ఆత్మ శరీర తత్వానికి వొదిగిపోదు... భౌతిక ఆకర్షణలకు లొంగిపోదు... ఇంద్రియ చాపల్యాల దరి చేరదు.. జీవ, ప్రాణ స్పందనలు ఆత్మను వశపరచుకోలేవు.. పంచేంద్రియ స్పందనలు సైతం ప్రాపంచికానికే, దేహానికే పరిమితం. ఇక దేహం ఆత్మ చైతన్యాన్ని భౌతిక పరిధులలో అనుభూతించటానికి ఉపకరిస్తుందే తప్ప ఆత్మ విషయంలో దేహ పాత్ర ద్వితీయమే.. ఆత్మనే అద్వితీయం.
ఆత్మ - జనన మరణ స్పృహ లేనిది.. పురాణం శాశ్వతం, నిత్యం, అవ్యయం, ఛేదనానికి, దహనానికి అంతుచిక్కనిది.. అచలం, అవ్యక్తం, అచింత్యం, అవికారం - ఇలా ఎన్ని విధాల చెప్పుకుంటున్నా వాస్తవానికి ఆత్మ ఎప్పటికీ ఒక ఆశ్చర్యార్థకమే.

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946