నమ్మండి! ఇది నిజం!!

చక్రాల కుర్చీలో చైనా యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్లు లేనివారు బీదవాళ్లైతే ఊత కర్రల సాయంతో నడుస్తారు. ధనవంతులైతే వీల్ చైర్‌ని వాడతారు. లయన్స్ క్లబ్స్ లాంటి సంస్థలు బీదలకి వీల్ చైర్స్‌ని విరాళంగా కూడా ఇస్తూంటాయి. సాధారణంగా కాళ్లు లేని వాళ్లు చక్రాల కుర్చీని ఇంట్లో తిరగటానికే ఉపయోగిస్తూంటారు. కాని చైనాలోని బీజింగ్‌కి చెందిన క్వాన్ పెంగ్ అనే కుంటి వ్యక్తి చక్రాల కుర్చీని ఇంట్లోనే కాక ఇంటి బయట దీర్ఘ ప్రయాణానికి కూడా ఉపయోగిస్తున్నాడు! ఇప్పటికి ఇలా క్వాన్‌పెంగ్ చైనాలో 2,800 కిలోమీటర్లు ప్రయాణించాడు.
చక్రాల కుర్చీ అవకరానికి గుర్తుగా చాలామంది భావిస్తూ, దాంట్లో కనపడటానికి సిగ్గు పడతారు. 29 ఏళ్ల క్వాన్ పెంగ్ మాత్రం సిగ్గుపడడు. అతను చైనాని తన చక్రాల కుర్చీలోనే ప్రయాణించి చూడదలచుకున్నాడు. 31 ఆగస్టు 2014న బీజింగ్ నించి తన ప్రయాణాన్ని ఆరంభించి మార్చి 2016కి 566 రోజులు ప్రయాణించాడు. ఐనా ఇంకా అతని ప్రయాణం ముగియలేదు. కొనసాగుతోంది. మరో 1,700 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. అంటే మొత్తం 4,500 కిలోమీటర్లు చక్రాల కుర్చీని చేత్తో తోసుకుంటూ క్వాన్ పెంగ్ ప్రయాణించదలిచాడు. ప్రయాణం ఆరంభించిన మొదటి రోజు అరవై కిలోమీటర్లు ప్రయాణించాడు. చక్రాలని తోయడంతో అతని భుజాలు మర్నాడు బాగా నొప్పి చేశాయి. కాని అతను అంతటితో విరమించుకో దలచుకోలేదు. 500 కిలోమీటర్లు ప్రయాణించాక అతనికి నొప్పి తగ్గి తన ప్రయాణాన్ని ఆనందించసాగాడు.
బీజింగ్‌లో ఆరంభం అయిన ఈ సుదీర్ఘ యాత్ర చైనాకి దక్షిణాన గల హైనన్ ప్రావిన్స్‌లో ముగుస్తుంది. మార్చి 2016లో అతను సందర్శించిన హుస్‌హూ ఇరవై రెండో నగరం, చైనాలోని ఐదవ ప్రావిన్స్. క్వాన్ పెంగ్ ఆ నగరానికి చేరుకున్నప్పుడు జర్నలిస్ట్‌లు అతన్ని ఇంటర్వ్యూ చేశారు.
‘విధి నా స్వేచ్ఛని హరించింది. కాళ్లు లేకపోతే కదలిక లేక స్వేచ్ఛని కోల్పోయినట్లే కదా? ఈ చక్రాల కుర్చీ ద్వారా దాన్ని మళ్లీ పొంది విధిని ఓడించాను. నా కళ్లతో చైనా మొత్తాన్ని సందర్శించాలనే ఆలోచన కాళ్లు పోక మునుపు నించి నాలో ఉంది. కాళ్లు పోయాక కొంతకాలం ఆ అవకాశం కోల్పోయినందుకు దుఃఖించాను. కాని ఓ రోజు చక్రాల కుర్చీలో ఎందుకు వెళ్లకూడదు అని అనిపించింది. ఇందువల్ల నేను వికలాంగులకి స్ఫూర్తిగా కూడా ఉంటాను. మీలాంటి విలేకర్ల వల్ల పత్రికల్లో, టీవీ ద్వారా వారు నా గురించి తెలుసుకుని స్ఫూర్తిని పొందుతారు’ క్వాన్ పెంగ్ చెప్పాడు.
అతను తను సందర్శించే ప్రతీ నగరంలో తనలాంటి వికలాంగులకి గల సౌకర్యాలని గమనించి రాసుకుంటున్నాడు. దురదృష్టవశాత్తూ ఎక్కడా అతనికి సరైన సౌకర్యాలు తారసపడలేదు. దాంతో స్థానిక అధికారులకి, మీడియా వారికి వాటిని ఏర్పాటు చేయాలని ఉత్తరాలు రాస్తున్నాడు. ఉదాహరణకి బాత్‌రూం తలుపు గడియలు చక్రాల కుర్చీలో కూర్చున్న వికలాంగుడి చేతికి అందే ఎత్తులో ఏర్పాటు చేయాలి.
క్వాన్ పెంగ్ జన్మస్థలం గన్సూ ప్రావిన్స్. అతని 17వ ఏట వెనె్నముకలో చిన్న ట్యూమర్ ఏర్పడింది. ఓ సర్జరీ ద్వారా దాన్ని తొలగించారు. ఆ సర్జరీలో కొన్ని నరాలు దెబ్బతినడంతో అతని కాళ్లకి శాశ్వతంగా పక్షవాతం వచ్చింది. ఐతే ఇతరుల మీద ఆర్థికంగా ఆధారపడటం ఇష్టంలేక 2013లో ఉద్యోగాన్ని వెతుక్కుంటూ బీజింగ్ చేరుకున్నాడు. బీజింగ్‌లో అతని అవకరం చూసి నలభై కంపెనీలు ఉద్యోగాన్ని ఇవ్వడానికి నిరాకరించాక నలభై ఒకటో కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఆ ఆఫీస్‌లో కస్టమర్ సర్వీస్ శాఖలో పనిచేస్తూ, ఖాళీ సమయాల్లో టావో బావో అనే ఆన్‌లైన్ స్టోర్‌ని తెరచి నడపసాగాడు. కొంత సంపాదించుకున్నాక చక్రాల కుర్చీ యాత్రని ఆరంభించాడు.
అతని వెంట పెద్దగా సామాను ఉండదు. దుస్తులు, పడక, కనీస అవసరాలైన పేస్ట్, బ్రష్, దువ్వెన లాంటివి తప్ప ఇంకేమీ వెంట తీసుకువెళ్లలేదు. పెట్టె ఐతే బరువు పెరుగుతుందని, వాటిని నల్లటి ట్రేష్ బేగ్‌లో పెట్టి వీల్‌చైర్‌లో ముందు, వెనుక భాగాల్లో కట్టుకుంటాడు. ఇదికాక ఓ బేక్‌పేక్ కూడా ఉంది. చక్రాల కుర్చీకి వెనక తగిలించుకున్న ఎర్ర జెండా మీద చక్రాల కుర్చీలో చైనా యాత్ర అనే పదాలని రాశాడు.
క్వాన్ పెంగ్ తన ప్రయాణం అంతా ఆహారం కోసం స్థానిక ప్రజల మీదే ఆధారపడుతున్నాడు. భోజనం దొరక్కపోతే రెస్ట్‌రెంట్‌లలో తింటాడు. రాత్రిళ్లు పబ్లిక్ పార్క్‌లలో, హాస్పిటల్ బాత్‌రూంలలో, టెంట్‌లో, వంతెనల కింద, రోడ్ల పక్కన చెట్ల కింద, పాడుబడ్డ ఇళ్లల్లో, రాత్రిళ్లు ఎవరూ ఉపయోగించని లిఫ్ట్‌లలో, లేదా బేంక్స్‌లో అవకాశాన్ని బట్టి నిద్రిస్తాడు. చోటు దొరకనప్పుడు చక్రాల కుర్చీలోనే నిద్రపోతాడు. ఒకటి, రెండుసార్లు హోటల్‌లో గది తీసుకోడానికి ప్రయత్నించాడు. కాని అతనికి గది ఇవ్వడానికి వారు నిరాకరించారు. హోటల్ నిండి పోయిందని అబద్ధం ఆడి పంపించేశారు. వారు అతన్ని బిచ్చగాడని భావించడమే అందుకు కారణం. చోటు దొరక్క వర్షంలో గొడుగు వేసుకుని అనేకసార్లు నిద్రించాడు. ఐతే గొడుగు వర్షాన్నించి రక్షణ ఇస్తుంది కాని చలి గాలి నించి ఇవ్వలేదు. మనుషులు లేని చోట చెట్ల మధ్యకి వెళ్లి రెండు చెట్ల మధ్య హేమక్ (బట్ట ఉయ్యాల)ని కట్టుకుని దాని మీద నిద్రపోతాడు. అక్కడ దోమల బాధ అధికంగా ఉంటుంది కాని శారీరక పరిశ్రమ వల్ల గాఢ నిద్ర పడుతుంది.
‘నేను నా అవకరంతో పోరాడటానికి ఈ యాత్రని చేపట్టలేదు. నా అవకరాన్ని చూసి ఎగతాళి చేసే వారితో పోట్లాడటానికి ఈ యాత్రని చేస్తున్నాను’ అమెరికన్ టీవీ సిఎనె్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఈ ప్రయాణంలో ఇంత దాకా ఆరు సార్లు చక్రాల కుర్చీలోంచి కింద పడ్డాడు. ఓ చోట ఓ మలుపులో కుర్చీని తిప్పుతూ పడ్డ సంఘటన భయంకరమైనదిగా ఇంటర్వ్యూలో చెప్పాడు. అనుభవం గడించాక మళ్లీ ఎన్నడూ పడలేదు. మనుషులతో అతనికి కొన్ని చేదు అనుభవాలు కలిగినా కొందరితో స్నేహం కూడా ఏర్పడింది.
భూమికి మూడున్నర అడుగుల ఎత్తు నించి ప్రపంచాన్ని చూస్తూ ముందుకి సాగడం క్వాన్ పింగ్‌కి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ ప్రయాణం ప్రతీ రోజు ఏదో కొత్త విషయాన్ని అతని కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది.
చైనాలో 8 కోట్ల 50 లక్షల మంది వికలాంగులు ఉన్నారని తాజా లెక్కలు చెప్తున్నాయి. ఐనా వారికి చక్రాల కుర్చీని నడిపే ప్రత్యేక రేంప్‌లు, బాత్‌రూమ్‌లు లాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. చైనాలోని పవిత్ర పర్వతమైన తైషాన్‌కి ఉన్న ఘాట్‌రోడ్‌ని ఎక్కడం, దిగడం తన ప్రయాణంలోని అతి కష్టమైన ఘట్టమని క్వాన్ పింగ్ బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. విదేశాల్లో వికలాంగులు సిటీ బస్‌లని ఎక్కేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని బిబిసి విలేకరి తనతో చెప్తే ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఈ ప్రయాణం వల్ల అతని చేతి కండరాలు బాగా బలిష్ఠమయ్యాయి. చక్రాల కుర్చీని తోసేందుకు అతను కాటన్ గ్లవ్స్‌ని వాడతాడు. ఎవరైనా తోయడానికి సహాయాన్ని చేస్తానంటే నిరాకరిస్తాడు. డబ్బు ఇస్తే తీసుకోడు. భోజనం వరకే ఆశిస్తాడు.

పద్మజ