వినదగు!

ఆత్మీయ, నిస్వార్థతలే సేవక నాయకత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేవ, సహృదయతలే నిజమైన నాయకత్వ లక్షణాలు. సేవాతత్పరత నెలకొన్న చోట నాయకత్వం నిలదొక్కుకుంటుంది. అంటే స్వార్థం లేని చోటనే సర్వెంట్ లీడర్‌షిప్ సాధ్యవౌతుంది. అసలు ఇంకొకరికి సేవ చేయటం చిన్నతనంగా భావించే వ్యక్తిత్వంలో అసలైన నాయకత్వం కాగడా పట్టి వెతికినా కనిపించదు. సన్యాసులు, తపోధనులు సర్వస్వాన్ని త్యజించి తమ లక్ష్యం వైపుగా మగ్నమై ఉంటారు. అలాగే త్యాగధనంతో చరించేవారే అసలు సిసలు నాయకులు అనిపించుకుంటారు.
ఎటువంటి స్వార్థచింతనా లేకుండా సమాజ హితాన్ని కాంక్షించటం, అందుకు బాధ్యత వహించటం నాయక లక్షణం అంటుంది భగవద్గీత. ఎటువంటి స్వార్థ బంధనాలు ఉండకూడదు. పరిపూర్ణ మనస్సుతో కర్మాచరణకు దిగాలి. కర్మాచరణ ముఖ్యమే తప్ప దాని లాభాన్ని మన కోసం ఆశించకూడదు. చివరికి చేసే పనివల్ల ఆనందం లభిస్తుందా అన్న చింతన కూడా ఉండకూడదు. అలాగే సిగ్గుతో సేవ చేయటమూ హర్షణీయం కాదు.
కార్యాచరణలో ఆందోళన పనికిరాదు. ఉన్నచోటనే కర్మాచరణ తత్వమూ నాయకుల మనస్తత్వం కారాదు. ఇన్ని విధాల సమాయత్తమైతే తప్ప నాయకత్వం శోఖించదని కృష్ణుడు అర్జునుడితో అంటాడు. అప్పుడు తప్ప ధర్మ ప్రతిష్ఠాపన అన్నది నాయకుడికి సాధ్యం కాదన్నది కృష్ణ ఉవాచ. అంటే నాయకుడికి అన్నివిధాల రైట్ యాక్షన్ అన్నది సాధ్యం కావాలి.
అర్జునుడు కురుక్షేత్రంలో కూలబడటం మనం చెప్పుకునే రైట్ యాక్షన్‌కు విరుద్ధం. కారణం ఏదైనా ఒక ఆశయం కోసం నడుం బిగించి తప్పుకోవటం అనుచిత చర్యనే. అసలు అవతలి వారందరిలోను తనను చూసుకోవటం వల్లనే భావోద్విగ్నుడయ్యాడు. ఇక్కడ తనను చూసుకోవటం అంటే బంధుత్వాల నుండి, బంధాల నుండి విడివడక పోవటమే. అటాచ్‌మెంట్ కొనసాగుతూనే డిటాచ్‌మెంట్‌ను సాధ్యం చేసుకోవాలి. ఇలా బాంధవ్య రాహిత్యం డిటాచ్‌మెంట్ - సాధ్యం కాకపోవటం స్వార్థం విడనాడనందువల్లనే. ఒక విధంగా వారందరిలో కనిపించింది తన ప్రతిబింబే. వారూ బంధాలకు, బంధుత్వాలకు వశులే కదా అనిపించింది. అలా అర్జునుడు నాయకుడిగా వేసిన మొదటి అడుగు తప్పటడుగు అయింది.
ఆ తప్పటడుగు అర్జునుడిలోని వైయక్తిక కీర్తి, వైయక్తిక లాభం, వైయక్తిక కామన, వైయక్తిక అధికార లాలసలకు ప్రతిరూపమే. కామన, తృష్ణలే కదా తనను ఇంతకాలం నడిపిస్తూ వచ్చాయని గ్రహించాడు కాబట్టే అర్జునుడు తన తత్వానికి తానే భయకంపితుడై ఆయుధాల్ని జారవిడిచాడు.. మనిషీ జావకారిపోయాడు. అసలైతే ఇక్కడ గమనించాల్సింది బ్రతుకంతా అర్జునుడు పోరాడుతూ వచ్చింది ఈ తరుణం కోసమే. కాబట్టి జీవిత లక్ష్యం నెరవేరాలంటే పోరు తప్పదు.
అయిన వారిపైన అయినా, కానివారిపైన అయినా గెలుపొందక తప్పదు. ఇక్కడ తనది వ్యక్తి స్వార్థం కాదు.. వ్యవస్థా స్వార్థం.. అంటే వ్యవస్థా ధర్మం. ధర్మ ప్రతిష్ఠాపనే వ్యవస్థ కోరుకుంటున్నది కాబట్టి ధర్మాన్ని నెలకొల్పటమే అర్జునుడి తక్షణ కర్తవ్యం.. నాయక బాధ్యత.
మనం నాయకులుగా రాణించాలంటే ఉన్నతాశయం కలిగి ఉండాలి.. ఉన్నత లక్ష్య సాధన వైపుగా దూసుకుపోతుండాలి. ఆ సాధనా పరిణామంలో ఎటువంటి స్వార్థానికీ తావుండకూడదు. అందుకే కృష్ణుడు అర్జునుడితో అంటాడు ‘అశోచ్యా నవ్య శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే’ అని. అంటే శోకించదగని వారి గురించి శోకిస్తున్నావు అని. దీనర్థం లక్ష్యసాధనలో మమకారాలు పనికిరావు.. స్వపరాలు ఉండకూడదు.. అందరూ అన్నీ సమమే కావాలి.
మొత్తానికి నాయకుడు ఆత్మవర్తనుడు కావాలే కానీ దేహ వర్తనుడు కాకూడదన్నది కృష్ణ ఉవాచలోని సారాంశం. అందుకే ప్రతి ఒక్కరిని దేహధారులుగా కాక ఆత్మయుతులుగా చూడమంటాడు అర్జునుడిని. మరణించటం అంటే దేహం అనే చినిగిన వస్త్రాన్ని విడిచిపోవటమే అని అంటాడు. కాబట్టి నాయకుడు ధర్మాన్ని స్థాపించాలనుకుంటున్నప్పుడు దుష్టచేష్టలతో పండిన దేహాన్ని గురించి పట్టించుకోకుండా ఆ దేహాల్ని తుదముట్టించటం వల్ల ఆత్మకు విముక్తి లభిస్తుందన్నది కృష్ణోపదేశం.
మనలోని ప్రతి ఒక్కరికి హయ్యర్ గోల్ ఉన్నట్టుగానే కృష్ణుడికీ ఒక హయ్యర్ గోల్ ఉంది. అదే ధర్మసంస్థాపన. ఈ నేపథ్యంతోనే కృష్ణుడు అర్జునుడితో అంటాడు-
‘జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి’ అని
జన్మించినవారు మరణించక తప్పదు - అన్న వాస్తవం తెలిసి కూడా తప్పింపశక్యం కాని దాని గురించి కృద్ధులవటం తగదనటంలో మరణదండనకు కర్త కావటం నాయక లక్షణం అని కాదు.. ధర్మస్థాపనకు మీనమేషాలు లెక్కించటం తగదని.
‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి’
అన్న శ్లోకం ద్వారా కృష్ణుడు చెప్తున్నదేమిటి? నాయకుడికి ఉన్నత లక్ష్యం ఉండాలంటాడు.. అయితే ఆ లక్ష్యసాధనలో నాయకుడు చేసే కర్మ ద్వారా అధికారాన్ని ఆశించకూడదు. ఫలాన్ని తన కోసం వినియోగించుకోకూడదు.. అంటే కర్మఫలానికి తాను కర్తే తప్ప భోక్త కాకూడదు. అప్పుడు కానీ నాయక చర్య రైట్ యాక్షన్ కాదు. అందుకే అర్జునుడ్ని భావోద్విగ్నత నుండి బయటపడి ఫలాసక్తి లేనివాడిలా ఉన్నత లక్ష్యదిశగా యుద్ధం చేయమంటాడు.
కురుక్షేత్రం అన్న వెంటనే మన కళ్ల ముందు నిలిచే చిత్రం ఆయుధాలను జారవిడిచి కూలబడ్డ అర్జునుడు.. ఉపదేశిస్తున్న కృష్ణుడు. ఒక్క క్షణం మనం అర్జునుడి విషణ్ణ వదనాన్ని తేరిపార చూస్తే అంతటి ధీరోదాత్తుడైన నాయకుడు సత్వ రజ తమో గుణాలకు అతీతుడు కాలేకపోయాడా అనిపిస్తుంది.
మంచికి, పవిత్రతకు పట్టం కట్టిన వాడే అర్జునుడు. కాబట్టి సాత్వికుడే. పెరిగిన వాతావరణంలో పార్థుడు శుద్ధవర్తనంతోను, అశుద్ధవర్తనంతోను తొట్రుపడుతూ వచ్చినవాడే.. కాబట్టి రజోగుణ రుచీ తెలిసినవాడే. కురుక్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత కానీ ఆత్మీయులను వధించి తాను బావుకునేది లేదనుకోవటం ఇంకా మానసికంగా చీకటింటనే ఉన్నట్టు.. ఇదే తామస ప్రవృత్తి. అయితే ఈ త్రిగుణాల మాటు నుండి అసలైన నాయకుడు పుట్టుకు రావటమే కృష్ణుడు వాంఛిస్తున్నది. ఈ త్రిగుణాలకు ప్రలోభపడక నాయకుడన్న వాడు వీటిని నియంత్రించగలగాలి.
అసలు కృష్ణుడు ఫలాసక్తి లేకుండా కర్మాచరణకు దిగమని పదేపదే చెప్పటంలో కృష్ణుడి ఆంతర్యం ఏమిటి? ఫలితాన్ని ఆశించకుండా ఈ సృష్టిలో ఏ ఒక్క జీవికీ మనుగడ సాధ్యం కాదు కదా! చివరికి ఆ కృష్ణుడు సైతం ధర్మప్రతిష్ఠాపనను ఆశించే కదా అర్జునుడికి సారథి అయింది.. ధర్మ ప్రతిష్ఠాపనకు సారథ్యం వహించింది. అయితే కృష్ణ చర్యనుబట్టి తెలుస్తున్నదేమిటంటే ఫలితాన్ని స్వప్రయోజనానికి, స్వార్థానికి మాత్రమే ఉపయోగించుకోకూడదని, అతిగా ఆశించటమూ పనికిరాదని. స్వార్థం, అత్యాశల వల్ల ఆశించిన ఫలితం లభించనపుడు డాష్‌డ్ ఎక్స్‌పెక్టేషన్ డిప్రెషన్ కలుగుతుంది.
ఫలితం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవలసిందే.. ఫలితాన్ని అంచనా వేయాల్సిందే.. ఫలితం కోసం శక్తివంచన లేకుండా శ్రమించవలసిందే... అయిన తర్వాత ఆశించటంలో మిన్నకుండాలి. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత ఆశించిన ఫలితం లభించకపోతే మనం కంట్రోల్ తప్పుతాం. అప్పుడు అది డాష్‌డ్ ఎక్స్‌పెక్టేషన్ డిప్రెషన్‌కి దారితీస్తుంది.
ఆశించిన ఫలితాన్ని అందుకోనపుడు అధమ ప్రవృత్తితో ఒత్తిడికి గురికావటం జరుగుతుంది. దీనికి కారణం మన చేతకానితనం అనుకోవటమే.. లేదా మనం అంతటి శక్తిపూర్ణులం కాదనుకోవటమే.. పైగా దీంతో భవిష్య జీవితంపై నిరాశ, ఒక భయకంపిత తత్వం నెలకొనటం జరుగుతుంది. క్రమేపీ ఈ రకమైన ఒత్తిడి ఆత్మన్యూనతకి దారితీస్తుంది.
సాత్వికులైన నాయకులు విశాల దృక్పథంతో చరిస్తుంటారు కాబట్టి వారిని ఈ విధమైన ఒత్తిడి అతలాకుతలం చేయదు... కారణం ఫలితాన్ని వారు వ్యక్తిగతంగా తీసుకోరు కాబట్టి.. కార్యాచరణ వరకే బాధ్యత వహిస్తారు. సంపూర్ణ విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ఆచరణకు దిగుతారు కాబట్టి ఫలితం ఎటువంటిదైనా బాధించదు. తామేమిటో తమకు తెలుసు కాబట్టి తాత్కాలిక ఓటములు నిరాశ పరచవు. వారికి విలువలే ప్రధానం తప్ప ఫలితాలు కావు. అందుకే అనేది"The true measure of leader is the ability to recognize our temptations and to rise to a purer state whereby we do that which needs to be done and we relinquish the rest' అని.
మొత్తానికి కృష్ణోపదేశం ద్వారా స్పష్టమయ్యే కొన్ని నాయకత్వ లక్షణాలు-
‘ఇంద్రియ స్యేంద్రియ స్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ
తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపంథినౌ’
అంటే, ఇంద్రియ స్పర్శతో కలిగే రాగద్వేషాలు ప్రతి ఒక్కరికి సహజ స్వభావాలే. అయితే వాటికి వశం కాకపోవటమే నాయక ప్రవృత్తి కావాలి. రాగద్వేషాలకు అతీతం కాకుండా ఎంతగా ముందుకు దూసుకెళ్లినా అవి ఏదో ఒకనాడు దెబ్బతీసే తీరతాయి.
‘కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్’
రజోగుణం నుండి జనించే కామమే క్రోధం.. ఈ కామనకు క్షుధార్తి ఎక్కువ. అధిక ఆకలితో అతిగా ఆశించటం జరుగుతుంది కాబట్టి ఈ జీవన పరిణామంలో
దీన్ని శత్రువుగానే పరిగణించాలి. అసలు కామన వల్లనే కదా అన్ని అనర్థాలు. మన దుఃఖానికి కారణం ఈ క్రోధమే.
‘్ధమేనా వ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ
యథోల్బేనావృతో గర్భస్త్థా తేనేదమా వృతమ్’
అంటే, పొగవల్ల అగ్ని కానరాదు. మకిలి వల్ల అద్దం ప్రతిబింబించదు. గర్భంలో చర్మం కప్పివేయబడటం వల్ల పిండం కనిపించదు. అలాగే జ్ఞానం కూడా కామనతో కప్పివేయబడి ప్రకాశించదు.
‘ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా
కామరూపేణా కౌంతేయ దుష్పూరేణానలేన చ’
కామన ఎప్పటికీ అనంతమే. అంటే కామానికి పొడిగింపే తప్ప ముగింపు అంటూ ఉండదు. కాబట్టి కామన జ్ఞానికి సదా శత్రువే. ఎందుకంటే కామన జ్ఞానాన్ని కప్పివేసి, ప్రకాశింపచేయదు కాబట్టి.
‘ఇంద్రియాణి మనో బుద్ధి రస్యాధిష్ఠాన ముచ్యతే
ఐతేర్విమోహయత్యేష జ్ఞాన మావృత్య దేహినమ్’
మన మనసు, బుద్ధి, ఇంద్రియాలే కామనను ప్రకోపింప చేస్తుంటాయి. అందుకే మన జ్ఞానం అక్కరకు రాక మోహావేశుల్ని చేస్తుంది.
‘తస్మాత్త్వ మింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ
పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనమ్’
మన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కొరగాకుండా చేసే కామనకు మనం పూర్తిగా దూరం కావాలి. కామం అనే వాస్తవానికి వశం కాకుండా ఉండాలంటే మనం మన ఇంద్రియాలను జయించాలి.
ఇలా మనలోని ప్రతి ఒక్కరం నాయకత్వ ప్రతిభతో రాణించాలంటే ఇంద్రియ చాపల్యాలకు, రాగద్వేషాలకు, కామనలకు దూరం కావలసిందే. సకల ప్రాణికోటిపై ఆత్మీయ భావన పెంచుకుంటూ, సేవాదృక్పథంతో సృష్టి పరిణామానికి సహకరించటమే నాయకత్వ శోభ. *

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946