నమ్మండి! ఇది నిజం!!

నాలుగు నిమిషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని మానవ మేథస్సుకి అందవు. కారణం మనిషికి కాలం, ప్రదేశం లాంటి లెక్కలు ఉంటాయి. వాటికి అతీతంగా జరిగేవి అర్థం చేసుకునే స్థితికి బహుశ మనిషి ఇంకా ఎదగకపోవడమే అని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అలాంటి వాటిలో అట్లాంటిక్ మహాసముద్రంలో కేనరీ ద్వీపాలకి పశ్చిమ దిశలో, స్పెయిన్‌కి కొద్ది దూరంలోని ఎల్‌ఫెర్రో అనే ద్వీపంలో జరిగిన సంఘటన ఒకటి. అక్కడ ఇనుము బాగా లభ్యం అవుతుంది కాబట్టి నావికులు ఆ ద్వీపానికి ఆ పేరు పెట్టారు. చాలా స్పెయిన్ ద్వీపాల్లా అది కూడా నేడు పర్యాటక కేంద్రంగా మారింది. 266 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని దాని జనాభా పదివేల లోపే.
మిగెల్ కాంపియన్ సగటు అమెరికన్ పౌరుడు. అతనికి పరిచయం ఉన్న వారు ఎవరూ అతనికి పిచ్చి ఉందని అంగీకరించరు. 1956లో ఓ రోజు అతను ఎల్‌ఫెర్రోలో ఓడ దిగి, ఆ ద్వీపంలోని హోటల్ దూసద్‌కి కాలినడకన చేరుకున్నాడు. అది చాలా చిన్న హోటల్. సూట్‌కేస్‌తో లోపలికి వెళ్లి రిసెప్షనిస్ట్‌ని తనకో గది కావాలని అడిగాడు. వెంటనే అతన్ని గుర్తు పట్టినట్లుగా చిరునవ్వు నవ్వి కాంపియన్ చేతిని పట్టుకుని రిసెప్షనిస్ట్ కరచాలనం చేస్తూ పేరు పెట్టి పలకరించాడు. తర్వాత అతను రిజిస్టర్ తెరిచి తన పేరుని రాయడం చూసి కాంపియన్ తన పేరు ఎలా తెలుసని అడిగాడు.
నెల రోజుల క్రితం కాంపియన్ తమ హోటల్‌లో బస చేశాడని, నెల్లో మర్చిపోలేదని రిసెప్షనిస్ట్ చెప్పాడు. అతను తనని చూసి మరెవరోగా భ్రమపడి ఉండచ్చని కాంపియన్ అనుకున్నాడు. లంచ్ కోసం డైనింగ్ హాల్‌లోకి నడిచి ఓ బల్ల ముందు కూర్చున్న కాంపియన్‌ని చూసి ఏభై పైబడ్డ ఓ లావుపాటి వెయిటర్ ఆనందంగా పలకరిస్తూ, అతన్ని మళ్లీ చూడటం ఆనందంగా ఉందని చెప్పింది. అయోమయంలో పడ్డ కాంపియన్‌ని మరో వెయిటర్ కూడా గుర్తు పట్టి పేరు పెట్టి పలకరించాడు.
లంచ్ ట్రేలో హేమ్, ఎగ్‌లని తెచ్చిన ఆ వెయిట్రెస్‌ని, అంతకు మునుపు తను ఎన్నడూ ఆ హోటల్‌కి రాలేదని, తనకి అవి ఇష్టమని ఎలా తెలుసని అడిగాడు. మీరు ఒహాయో నించి వచ్చిన కాంపియన్ కాదా? అని ఆవిడ అడిగింది. అవునని, కాని తను తన జీవితంలో ఆ ద్వీపానికి రావడం అదే మొదటిసారి అని కాంపియన్ చెప్తే, ఆవిడ ‘ఓ! క్లారాకి భయపడుతున్నారా? అర్థమైంది. మీరు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు’ అని నవ్వుతూ చెప్పింది.
హోటల్ సమీపంలోని బార్‌కి కాంపియన్ వెళ్లగానే బార్ టెండర్ అతన్ని పేరుతో పలకరించాడు. చదరంగం ఆడే ఓ ముసలాయన లేచి అతని దగ్గరికి వచ్చి ఆనందంగా కౌగిలించుకుని కాంపియన్ తిరిగి వస్తాడని తనకి తెలుసని చెప్పాడు. తను ఆయన్ని అంతకు మునుపు ఎన్నడూ చూడలేదని కాంపియన్ చెప్పాడు. బార్‌లో ఆ ముసలాయనతో చదరంగం ఆడే ఓ యువకుడు కాంపియన్‌ని కోపంగా చెంప దెబ్బ కొట్టి వెళ్లిపోయాడు. ఆ సంఘటనకి కాంపియన్ నివ్వెరపోయాడు.
తిరిగి రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి తను ఆ హోటల్‌లో గతంలో ఎన్నడైనా వచ్చి బస చేసి ఉంటే హోటల్ రిజిస్టర్‌లో తన పేరు, సంతకం చూపించమని కోరాడు. అతను రిజిస్టర్ తిరగేశాడు కాని ఆ ఎంట్రీ కనపడలేదు. అక్కడికి వేగంగా, ఉత్సాహంగా వచ్చిన ఓ యువతి కాంపియన్‌ని కౌగిలించుకుంది. ఆమె తనకి తెలీదని కాంపియన్ చెప్పగానే ఆమె దుఃఖంగా ఏడుస్తూ బయటకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది.
అతను ఆమెని వెంబడించి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెతో తను ఆ ద్వీపానికి రావడం అదే మొదటిసారి అని, చాలా మంది తనని చూసి ఇంకెవరుగానో భ్రమిస్తున్నారని, నిజంగా ఆమె ఎవరో తనకి తెలీదని కాంపియన్ చెప్పాడు. కాని ఆమె దాన్ని నమ్మకపోవడం అతనికి విచిత్రంగా తోచింది. తను చెప్పేది ఆమె విశ్వసించడం లేదని గ్రహించాక అతను ఓడ టిక్కెట్లు అమ్మే ఆఫీస్‌కి వెళ్లి నెల క్రితం తన పేరు మీద ఆ ద్వీపానికి అమెరికా నించి టిక్కెట్ జారీ చేయబడిందా అని విచారించాడు. ఆ లిస్ట్ అమెరికాలో తప్ప తమ దగ్గర ఉండదని అక్కడి బుకింగ్ క్లర్క్ చెప్పాడు. తన పరిస్థితి వివరించాక అతను కాంపియన్ పాస్‌పోర్ట్ అడిగి తీసుకుని, దాన్ని పరిశీలించి ఆ పాస్‌పోర్ట్ ప్రకారం మొదటిసారి 14 జూన్ న స్పెయిన్‌కి వీసా మంజూరైంది కాబట్టి అంతకు మునుపు కాంపియన్ స్పెయిన్‌కి వచ్చే అవకాశమే లేదు అని చెప్పాడు.
కాంపియన్ ఆ రోజు పర్యాటకం ముగించి తిరిగి హోటల్‌కి వెళ్తే అక్కడ క్లారా, ఆమె తండ్రయిన చదరంగం ఆడుతూ లేచి వచ్చి పలకరించిన ముసలాయన ఫ్రానె్సస్కో కనిపించారు. అతని కోసం వారు వేచి ఉన్నారు. ఎక్కడో, ఏదో పొరపాటు జరిగిందని, తను ఆ ద్వీపానికి అంతకు మునుపు ఎన్నడూ రాలేదని, అమెరికా నించి తను 14 జూన్‌కి మునుపు ఎక్కడికీ వెళ్లలేదని పాస్‌పోర్ట్ చూపించాడు. అది డూప్లికేట్ పాస్‌పోర్టయి ఉండచ్చని ఫ్రానె్సస్కో కొట్టి పారేశాడు. తర్వాత జేబులోంచి తను, క్లారా, కాంపియన్, బార్లో తనని కొట్టిన క్లారా అన్నయ్య కలిసి తీయించుకున్న ఫొటోని చూపించాడు. అది నెల క్రితం తీసిన ఫొటో.
కాంపియన్‌కి నెల క్రితం కారు ఏక్సిడెంట్ అవడంతో మంచం దిగి రెండడుగులు కూడా వేయలేని స్థితిలో హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆ నెల్లో ఎక్కువ సమయం స్పృహలో కూడా లేడు. తన సూట్‌కేస్‌ని తెరచి ఆ మెడికల్ రికార్డ్‌లని చూపించాడు. ఫ్రానె్సస్కో వాటిని చదవసాగాడు. కాంపియన్ టేక్స్‌టన్ మెమోరియల్ హాస్పిటల్‌లో 18 ఏప్రిల్‌న చేరి, 28 మేన డిశ్చార్చి అయాడు అని ఆ రికార్డులో ఉంది. అందులో ఇంకో విషయం కూడా రికార్డైంది. కాంపియన్‌కి సర్జరీ చేసే సమయంలో అతని గుండె నాలుగు నిమిషాల పాటు ఆగిపోయిందని, కార్డియాక్ మసాజ్ చేయడం వల్ల తిరిగి కొట్టుకోవడం ఆరంభించిందని, నాలుగు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పూర్తిగా ఆగిపోవడం వల్ల ఆ నాలుగు నిమిషాల సేపు రోగి మరణించాడని కూడా ఉంది.
నాలుగు నిమిషాలు.. నాలుగు గంటలు.. నాలుగు సంవత్సరాలు. మనం కొలిచే కాలం ఇలా ఉంటుంది. కాలానికి అతీతమైన ఈ సంఘటన 1956లో నిజంగా జరిగింది. గంటల తరబడి జరిగినట్లు మనం కొన్ని క్షణాల్లో కల గనడంలేదా? కాంపియన్ జీవితంలో ఆ నాలుగు నిమిషాలు ఏం జరిగింది? ప్రపంచంలో ఎన్నో ద్వీపాలు ఉండగా డాక్టర్ సలహా మీద విశ్రాంతి కోసం అతను ఎల్‌ఫెర్రో ద్వీపానికే మళ్లీ ఎందుకు వచ్చాడు? ఇవన్నీ దేవుడికే తెలియాలి.

- పద్మజ