AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకో ప్రశ్న

పరశురామ
క్షేత్రం ఏది?

హరిదాసు మంచినీళ్లు తాగి, తను ఇరవై నాలుగు రోజులుగా చెప్పే రామాయణాన్ని ఇలా కొనసాగించాడు.
‘ఇవాళ బాలకాండ సర్గ 67, 68 ల్లోని కథని చెప్తాను. ఈ శ్రవణమే పుణ్యదాయకం.
జనక మహారాజు దూతలు గుర్రాలు అలసిపోయేలా వారం రోజులు ప్రయాణం చేసి అయోధ్యా నగరానికి చేరారు. ద్వారపాలకులు ఆ దూతలని వృద్ధుడైన దశరథుడి దగ్గరికి తీసుకెళ్లారు. వారు నమస్కరించి ఇలా చెప్పారు.
‘మహారాజా! మిథిలాధిపతి అయిన జనక మహారాజు మీ గురువులు, పురోహితులు, పరివారం క్షేమం అడుగుతున్నారు. మా రాజు ఇలా చెప్పమన్నారు. ‘నా కూతుర్ని వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పిన మాట అందరికీ తెలుసు. కొందరు రాజులు ఈ పరీక్షలో ఓడిపోయారు. కాని దైవకృప వల్ల విశ్వామిత్రుడి వెంట మిథిలకి వచ్చిన వీరుడైన రాముడు సభలో ఆ దివ్య ధనస్సుని మధ్యకి విరిచి ఆమెని గెలుచుకున్నాడు. ఆ పరీక్షలో నెగ్గిన ఆ వీరుడికి సీతని ఇవ్వటానికి నీ అనుమతిని కోరుతున్నాను. నువ్వు గురువులు, పురోహితులతో వెంటనే వచ్చి నాకు ఆనందాన్ని కలిగించు. నీకు కూడా నీ కొడుకులని, వారి పెళ్లిని చూసి ఆనందం కలుగుతుంది. విశ్వామిత్రుడు, శతానందుడి అనుమతితో జనక మహారాజు ఈ సందేశాన్ని మా ద్వారా మీకు పంపుతున్నారు’
ఆ తర్వాత దూతలు వౌనంగా ఉండిపోయారు. ఆ సందేశాన్ని విన్న దశరథుడికి ఆనందం కలిగింది. వశిష్ఠ, వామదేవులతో, ఇతర మంత్రులతో ఇలా చెప్పాడు.
‘రాముడు లక్ష్మణుడితో విశ్వామిత్రుడితో ఇప్పుడు విదేహ దేశంలో ఉన్నాడు. జనకుడు రాముడి పరాక్రమాన్ని చూసి అతనికి తన కూతుర్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆయన ఆచారం మీకు నచ్చినట్లైతే, ఆలస్యం చేయకుండా వెంటనే మిథిలా నగరానికి వెళ్దాం’
మంత్రులు సరే అనటంతో దశరథుడు మర్నాడే ప్రయాణం అని వారికి చెప్పారు. జనకుడి దూతలు అతిథి సత్కారంతో ఆ రాత్రి అయోధ్యలోనే విశ్రాంతి తీసుకున్నారు.
దశరథుడు సుమంత్రుడితో మర్నాడు ఉదయం ఇలా చెప్పాడు.
‘్ధనాధ్యక్షులు పుష్కలంగా ధనాన్ని, వివిధ రత్నాలని తీసుకుని ముందు వెళ్లాలి. నేను చెప్పగానే చతురంగ సైన్యం, మంచి రథాలు, పల్లకీలు బయలుదేరాలి. బ్రాహ్మణులైన వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, దీర్ఘాయుష్షు గల మార్కండేయుడు, కాత్యాయన ఋషి ముందు వెళ్లాలి. జనకుడి దూతలు తొందర పెడుతున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా నా రథాన్ని సిద్ధం చేయించండి’
ఆ విధంగా అంతా బయలుదేరారు. వారం రోజులు ప్రయాణం చేశాక దశరథుడు విదేహ దేశాన్ని చేరాడు.
శతానందుడు వృద్ధుడైన దశరథుడికి స్వాగతం పలికాడు.
‘దేవతలతో కలిసి దేవేంద్రుడు వచ్చినట్లుగా మీరు వశిష్ఠ మహర్షి, బ్రాహ్మణోత్తములతో నా ఇంటికి రావడం నా భాగ్యం. పరాక్రమంలో గొప్పవాడైన రఘువంశ రాజులతో వియ్యం కూడా నా భాగ్యం. అందువల్ల నా వంశం పూజించ దగ్గదైంది. ఋషులు సమ్మతిస్తే వారి పెళ్లిని జరిపించండి’ జనకుడు కోరాడు.
‘జనక మహారాజా! స్వీకరించడం అనేది ఇచ్చే వాడి చేతిలో ఉంది. దాత ఇస్తేనే కదా తీసుకునేవాడు తీసుకునేది. నీ కన్యాదాన నిర్ణయం ప్రకారం నువ్వు ఎలా చెప్తావో అలా చేద్దాం’ దశరథుడు చెప్పాడు.
మునీశ్వరులు కూడా ఒకరినొకరు కలుసుకున్నందుకు సంతోషించారు. దశరథుడు రామలక్ష్మణులని చూసి ఆనందించాడు. ధర్మ రహస్యాలు తెలిసిన జనక మహారాజు ఆ రాత్రి యజ్ఞానికి సంబంధించిన క్రతువుని పూర్తి చేశాడు.
వెంటనే శ్రోతల్లోని ఒకతను లేచి చెప్పాడు.
‘సీతారాముల పెళ్లికి దశరథుడ్ని ఆహ్వానించే ఈ ఘట్టం నేను క్షుణ్ణంగా చదివాను. మీరు చెప్పిన వాటిలో నాకు ఏడు తప్పులు కనిపించాయి.’
(బాలకాండ సర్గ 67, 68)

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

అయోనిజ అంటే ఏమిటి?
స్ర్తి గర్భం నించి పుట్టని వారిని
అయోనిజ అంటారు.

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.రాజమందిరానికి కాదు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మహర్షుల బసకి వెళ్లాడు.
2.ఆ ధనస్సు చరిత్రని వారికి వివరించింది శతానందుడు కాదు. జనకుడు.
3.శివుడు నిమి చక్రవర్తి నించి ఆరో వాడైన దేవరాతుడికి దాచడానికి ఇచ్చాడు. ఈ సంగతి హరిదాసు చెప్పలేదు.
4.సీత అయోనిజ అని జనకుడు చెప్పిన సంగతి హరిదాసు చెప్పలేదు.
5.ఆ దివ్య ధనస్సు దగ్గరికి వాళ్లని తీసుకెళ్లలేదు. జనకుడు దానే్న తెప్పించాడు.
6.ఏభై మంది దృఢమైన వారు ఎనిమిది చక్రాల ఇనప పెట్టెలో ఉంచిన ఆ ధనస్సుని అతికష్టం మీద లాక్కుని వచ్చారు. ఈ సంగతి హరిదాసు చెప్పలేదు.
7.విశ్వామిత్రుడు శతానందుడ్ని అయోధ్యకి పంపలేదు. జనక మహారాజు తన మనుషులని అయోధ్యకి పంపాడు.