అమృత వర్షిణి

తెలిసితే మోక్షము... తెలియకుంటే బంధము ( అమృతవర్షిణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

.......................
దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి
నిరంతరంబును నీ మాయే పరం
పరములాయ పాపవే! నీ మాయ!!
మును తల్లి గర్భమున ముంచెను నీ మాయ
వెనక జనించినట్టే వెలసె నీ మాయ
అనుగు కౌమార బాల్య యవ్వనములు నీ మాయ
జనులకు దాటరాని జలధి నీ మాయ

- తాళ్లపాక అన్నమాచార్యులు
............................

మన జీవన ప్రమాణం, కాల ప్రమాణం తెలుసుకోవటం మన వల్ల అయ్యే పని కాదు. ఎంత ప్రయత్నించినా అది ఎండమావే. ఈ లోక యంత్రాంగాన్ని నడిపే మాయగాడొకడున్నాడు. ఆయన కొలత కందడు. మాయామానుష విగ్రహుడు. పిన్నకు పిన్న. పెద్దలకు పెద్ద. ఈ సృష్టికంతకీ అధిష్టాన మాయనే. కనిపించకుండా సమస్తంలో వుంటూ, అంతర్యామిగా లోక వ్యవహారానికి సాక్షీభూతుడుగా వుండే పరమాత్మని బాల్యంలోనే గ్రహించి ఓ కుర్రవాడు మనందరిలాగే నలుగురితో కలిసి ఏడుకొండలూ ఎక్కి వేంకటేశ్వరుణ్ణి కనులారా దర్శించి మైమరచిపోయి మళ్లీ తిరుగుముఖం పట్టకుండా కొండమీదే ఉండిపోయాడు. పద కవితను ఆసరాగా చేసుకుని వేద వేదాంత ఉపనిషత్ సారాన్ని తన పదాల ద్వారా, సంకీర్తనల ద్వారా మన తెలుగు జాతికి అందించిన, సంకీర్తనాచార్యుడు. ఆయనే పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు.
తెలిసీ తెలియక ఏర్పడిన సంసారాన్ని తప్పించుకునే ప్రసక్తి లేదు. సంసార లంపటంతోనే మోహం. ఆ మోహంతోనే స్వార్థం. అందులోంచి కార్యకారణ విచక్షణా జ్ఞానం లేకపోవటం, ఆఖరికి మిగిలేది అజ్ఞానం.
సంసారంలో వుంటూనే, సంసార బాధల్ని మనసులోకి ప్రవేశించనీయకుండా యుక్తిగా తరించే మార్గాన్ని తెలుసుకున్న అన్నమయ్య కారణజన్ముడు కాకపోతే ఏకంగా 32 వేల సంకీర్తనలు ఎలా వ్రాయగలడు?
మూర్తిత్రయం వారు కూడా అనే్నసి కీర్తనలు వ్రాయలేదు. గూఢమైన విషయాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలా తన సంకీర్తనలలో చూపించిన మహనీయుడు ఆయన. ఈ సంకీర్తనలో ఆయన శరణాగతిని చూడండి.
‘ఇదిగో మా అజ్ఞానము..
ఎపుడును సహజమే..
కదివి నీవె నన్ను కరుణించవయ్యా!!
చరణం:
తల్లి చంకనున్న బిడ్డ చమితో చనుతాగుతూ
బల్లడు తండ్రి ఎత్తుకొనబోతేను
మల్లడి నీ మాయల మరిగిన జీవులము
మెల్లనే నీ సేవజేసి మిమ్ము చేరజాలము!
ఇదిగో మా యజ్ఞానము అనే ఈ సంకీర్తన బాలాంత్రపు రజనీకాంతరావు చాలా ఏళ్ల క్రితం తిరుపతి అన్నమాచార్య కళాపీఠం డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ రోజు కంపోజ్ చేసి నాకు వినిపించారు. అన్నమాచార్యులు పాడిన అపురూప రాగాల్లోని ‘దేవసాళగం’లో వున్న ఈ పాట సరిగ్గా ఆ సాహిత్యానికి సరిపోయి చెవికి సుఖాన్నిచ్చింది. మానవతి రాగ జన్యంగా చెప్పారు. రెండు చేతులెత్తి ఆ మేధావికి నమస్కరించాను. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత విజయవాడ రేడియో కేంద్రంలో ఓ లలిత సంగీత విభావరికి మళ్లీ ఆ దేసాళగంలోనే మరో చెంచిత పాట చేశారు. అన్నమయ్య ఆనాడు సామాన్యుడు ఆదరించి ఆనందించే జాజరలు, చందమామలు, కోవెలలు, చిలుకలు, తుమ్మెద పదాలు, లాలి, సువ్వి, గొబ్బి, ఉయ్యాల లాల, జోల, శోభన, మంగళ, వైభోగాలు, చాలా రాశాడు. అందులో యిదోటి-
‘మొల్లలేలె నాకు తనె్న
ముడుచు కొమ్మనవే నేఁ
జెల్ల పూవు కొప్పుతావి చెంచుదానను’
చెంచిత - వేంకటేశ్వరుని మధ్య నడిచే సంవాద గీతం దేవసాళగంలో కీ.శే. శిష్ట్లా శారద ఎంతో అందంగా పాడింది. సంప్రదాయాన్ని వదలకుండా జానపద శైలిలో పాడించిన పాటది. అన్నమయ్య భావనా ప్రపంచమే వేరు. ఎక్కడి నుండి ఎక్కడికెళ్తాడో, ఆ స్వామిని ఏమని భావిస్తూ పోతాడో ఓ పట్టాన అంతుపట్టదు.
చెంచులక్ష్మి నరసింహునితో ప్రణయకలహం నటిస్తూ చెలికత్తెతో అంటుంది.
‘మల్లె జాతికి చెందిన ఘుమఘుమలాడే కుందపుష్పా
లెందుకే! తనె్న ముడుచుకొమ్మనవే
నా మీద ప్రేమ పొడుచుకు వచ్చిందా
ఆయనే్న ఆ పూలు ముడుచుకొమ్మనవే
విలువ తక్కువ పూలను కొప్పులో ముడుచుకునే
(పెట్టుకునే..) చెంచుదానను’ అంటూ దెప్పిపొడిచే పాట ఇది.
సృజనకు మారుపేరు రజని. సంప్రదాయాన్ని వదలకుండా ఆయన చేసిన వేలాది పాటలన్నీ ఆయన మేధస్సుకు అద్దంపట్టేవే. కాపీనారాయణి రాగం చాలా చిన్నది. ఈ రాగంలో కీర్తనలు ఎక్కువలేవు. త్యాగరాజ కీర్తన ఒక్కటే అయినా ఎంతో ప్రసిద్ధమైపోయింది.
సరస సామదాన.. చతుర.. ఈ కీర్తన మధురైమణి అయ్యర్ ఇష్టంగా పాడుతూండేవారు.
‘మరుని నగరి దండ మా యిల్లెరగవా
విరుల తావులు లెల్ల విరిసేటిచోటు’
- అనే పల్లవితో వున్న ఈ సంకీర్తన ‘కాపీనారాయణి’లో రజని స్టూడియోలో పాడుతూండగా వెళ్లి విన్నాను. ఆయన ప్రక్కనే నా గురువు వోలేటి, మల్లిక్ కూడా ఉన్నారు. ‘ఎలా ఉందీ కీర్తన?’ అన్నట్లుగా వోలేటిగారి కేసి చూశారు రజని.
వోలేటి పరమానందంగా తలూపుతూ వెంటనే రికార్డ్ చేద్దాం అన్నారు. నన్ను కూడా పాడమని అడిగారు. నేనూ, మల్లిక్ కలిసి పాడాము.
ఏ స్వరానికి మాధుర్యంతో కూడిన భావం ఉంటుందో, ఏది మనసుకు దగ్గరవుతూ సాహిత్యం అర్థమవుతుందో లెస్సగా, పసిగట్టగల ప్రజ్ఞాదురంధురుడైన ‘రజని’ అన్నమాచార్య కళాపీఠానికి అప్పట్లో డైరెక్టర్ అవటం అదృష్టంగా భావించారు విద్వాంసులు. అది కాస్తా కించిత్ వైభవమే. అటువంటి మేధావులు అక్కడ స్థిరంగా ఉంటారనుకోవడం ఉత్త భ్రమ. అఠాణా రాగంలో ‘కులుకక నడవరో కొమ్మలాల - రజనీ స్వరరచనే. మాళవి రాగంలో అన్నమయ్య సంకీర్తన ఒకటి - అత్యద్భుతంగా కంపోజ్ చేశారు. రేడియో కోసం మల్లాది రవికుమార్ పాడిన ‘అరుదు కపీంద్రుని అధిక ప్రతాపము’ ‘సురలకు నరులకు సుద్దులెందుగలవా’ రాముడి సేవలో తరించిన హనుమంతుణ్ణి వేంకటేశ్వరుడి దాసుడిగా భావించిన అన్నమయ్య హనుమంతుడి గుణగణాలను అద్భుతంగా ఆవిష్కరించారు. మాళవి రాగం చిన్నదే అయినా ఎంత ప్రసిద్ధమైనదో సంగీత విద్వాంసులకు రసికులకు తెలుసు. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ కీర్తన ‘ఇది న్యాయమా?’ త్యాగయ్యగారి ‘నెనరుంచినాను అన్నిటికి నీ దాసుడని నేను’ అనే కీర్తనలు ఎంతో ప్రాచుర్యమున్నవి.
ఈ రాగంలో కీర్తన కంపోజ్ చేయటం తేలిక కాదు. రజనీ లాంటి సవ్యసాచికి అదేమంత కష్టంకాదు.
సుమారు 60 ఏళ్ల క్రితం మద్రాసు కేంద్రంలో రజని చేసిన మరో కీర్తన ‘సైంధవి’ రాగంలోని ‘ఇందుకుగా కోపించనేల నాకు/ ముందుగల కోపమెల్ల ముగిసెనుపోరా!’ వోలేటి - శ్రీరంగం గోపాలరత్నం యుగళంగా పాడారు. ‘నిషాదాంత’ రాగమిది. అలాగే సుప్రసిద్ధ గాయని ఆర్.బాలసరస్వతీ దేవి (కాపీ రాగంలో) ‘కమ్మనవే మాని రచనలు తా/ నెమ్మది కూడెనా నేడో రేపో॥
రేడియో శ్రోతలు ఎప్పుడూ మరచిపోరు. శృతులై, శాస్తమ్రులై, పురాణ సారములైన అన్నమాచార్య సంకీర్తనల సాహిత్యంలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఇటువంటి ఆలోచనామృతమైన సాహిత్యానికి సహజంగా ఆపాతమధురమైన సంగీతానే్న వాంఛిస్తారు.
సంగీత లక్షణ సార గ్రంథ రచనకు కారకుడై భజన పద్ధతికి మూలపురుషుడై ‘మేలుకొలుపు మొదలు పవళింపు సేవ’ వరకూ భాగవత సంప్రదాయంలో వాడుకలో వున్న ఉత్సవ పద్ధతినేర్పరచిన అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు సంగీత గౌరవం కల్పిస్తూ శతాధికంగా ఎన్నో కీర్తనలను స్వరబద్ధం చేసి సంగీత రసజ్ఞులకు అందించిన వారిలో సంగీత కళానిధులైన డా.శ్రీపాద పినాకపాణి, డా.నేదునూరి కృష్ణమూర్తి, ఇంకా వోలేటి వెంకటేశ్వర్లు, డా.నూకల చినసత్యనారాయణ, డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మొదలైన వారెందరో ఉన్నారు.
సంగీత కళానిధి డా.శ్రీపాద పినాకపాణి స్వరపరచిన హిందోళ రాగంలో ‘దేవ దేవంభజే దివ్య ప్రభావం’ హంసధ్వని రాగంలో ‘వందేహం జగద్వల్లభం అలరులు కురియగ ఆడెనదె -(శంకరాభరణం) మొదలైనవెన్నో ఉన్నాయి. భారతరత్న శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాడిన ఈ సంకీర్తనలు రికార్డుగా విడుదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన ‘సంగీత సౌరభం’ గ్రంథం 4 భాగాలుగా పాణి స్వరపరచిన కీర్తనలు ప్రచురించబడ్డాయి. వీటిలో 100కు పైగా అన్నమయ్య కీర్తనలున్నాయి.
సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి పేరు తలుచుకుంటే స్ఫురించే అన్నమయ్య సంకీర్తనలు ‘ఒకపరి కొకపరి కొయ్యారమై (ఖరహరప్రియ)’, ‘్భవములోన బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా’, కురంజి రాగంలో ‘ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు’, తిలాంగ్ రాగంలో ‘ఏమొకొ చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను’, ‘చేరి యశోదకు శిశువితడు’ (మోహనరాగం) - ఇటువంటి ప్రసిద్ధమైన కీర్తనలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి స్వయంగా నేదునూరి వద్ద నేర్చుకుని గ్రామఫోన్ రికార్డు ఇచ్చారు. రేవతి రాగంలో నేదునూరివారు స్వరపరచిన ‘నానాటి బ్రతుకు నాటకము’ కీర్తన విన్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ‘‘ఈ ఒక్క కీర్తన చాలు ఈయనకు సంగీత కళానిధి బిరుదివ్వడానికి’’ అని వ్యాఖ్యానించటం సంప్రదాయ సంగీతానికి ఆమె ఇచ్చిన గౌరవం.
రాగ సౌందర్యం, అనుస్వర, గమకాలతో, రాగ భావాన్ని ఇనుమడింపజేసి పాడే సౌకర్యం, మన కర్ణాటక సంగీత బాణీకి మాత్రమే ఉంది.
నాద విద్యోపాసనలోని రుచి తెలిసిన త్యాగరాజు ఆ నాదరూపుడైన స్వామి దర్శనార్థం వెళ్లిన సమయంలో అర్చకులు దర్శనాన్ని నిలిపివేసి అడ్డంగా తెర వేసేశారట. తనలో వున్న ఈర్ష్య, క్రోధం, మత్సరంతో కూడిన ‘తెర’గా భావించి దానిని తొలగించమని కోరితే ఆ ‘తెర’ దానంతట అదే తొలగిందని జనశృతి. సనక సనందనాదులు తుంబురు నారదాది మునుల గానంతో పులకించిపోయే శ్రీహరి సాక్షాత్ నారదాంశగా భావించబడే త్యాగరాజు గానానికి పరవశించి కన్నుల ముందు సాక్షాత్కరించటంలో ఆశ్చర్యముంటుందా? మన కష్టాలను విని, కోరికలు తీర్చేవాడెదురుగా కనిపించి అభయ హస్తం చూపిస్తే వెంటనే మనకొచ్చేది దుఃఖం. నోట మాట రాదు. పాదాలపై పడి, ఆర్తిగా పాడాలనిపిస్తుంది.
ఒక్కసారి దర్శనం చేసుకున్న త్యాగరాజ స్వామికే అంతటి అనిర్వచనీయమైన దివ్యానుభూతి కలిగిందంటే మరి అన్నమయ్య సంగతి?
‘కోరి మమ్ము నేలినట్టి కులదైవమాయని
గారవించి దప్పి తీర్చిన కాలమేఘమా’ అంటూ
‘చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమని’ నమ్మి
ఆ స్వామిని వదలకుండా గట్టిగా, పట్టుకున్న అన్నమయ్య దివ్యమైన గానం ఎలా ఉండేదో?
వైఖానస ఆగమనాన్ని అనుసరించి ఎంతో నిష్టగా జరిగే నిత్యసేవలు, తెల్లవారుఝామున సుప్రభాతంతో మొదలై రాత్రి ఏకాంత సేవతో ముగుస్తూంటాయి. 15వ శతాబ్దం నుంచి ఈ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాస, సంవత్సర బ్రహ్మోత్సవాలు అలా వైభవోపేతంగా జరుగుతూనే వున్నాయి. ఎంతో భగీరథ ప్రయత్నం చేసి రాగి రేకుల నుండి సేకరించిన అన్నమయ్య సంకీర్తనలు వెలుగులోకి రావడంలో వేటూరి ప్రభాకరశాస్ర్తీ, సాధు సుబ్రహ్మణ్య శాస్ర్తీ, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, గౌరీపెద్ది రామసుబ్బశర్మ, ఉదయగిరి శ్రీనివాసాచార్యులు, పి.టి.జగన్నాథరావు, కామిశెట్టి శ్రీనివాసులు వంటి మహనీయులు చక్కగా పరిష్కరించి అందుబాటులోకి తెచ్చారు. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కృషి ‘న భూతో న భవిష్యతి’. అనుమానం లేదు. అందులో అన్నమయ్య రాగ నిర్ణయం ఒక్కటే చేసి ఊరుకున్నాడు. ఆయన పాడే పద్ధతి తెలుసుకునే ఆధారాలంటూ ఏమీ లేవు. అన్నమయ్య సాహిత్యం, ఆ కీర్తనలలో మనం తెలుసుకోవలసిన పదాలకున్న అర్థ ప్రతిపదార్థాలు, వ్యాఖ్యానాలతో, ఎనె్నన్నో గ్రంథాలు ప్రచురించిన తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నమాచార్యుల సంకీర్తనల సంగీతం విషయంలో శ్రద్ధ చూపించలేదనేది చాలామంది సంగీతజ్ఞుల అభిప్రాయం. సంగీత త్రిమూర్తుల రచనలలో సంప్రదాయ సంగీతం అంతర్లీనంగా అమృతవాహినిగా ఉండబట్టే ఆ కీర్తనలు ఎన్ని దశాబ్దాలు గడిచినా, చెక్కుచెదరక అలాగే వున్నాయి.
చాలామంది లలిత సంగీత ప్రియులకు శాస్ర్తియ సంగీతం రుచించకపోవచ్చు. అన్నమయ్యకు శిష్యసంతతి లేకపోవడం, పైగా ఆయన సాహిత్యం సంప్రదాయ సంగీత రీతిలో పాడేందుకు అనువు కాదనే వింత కారణాలు చూపిస్తూ ఎవరికి తోచిన పద్ధతిలో వారు పాడేస్తున్నారు. లలిత సంగీత ధోరణిలో పాడే పాటకు స్థిరత్వముండదు. వాసి కంటే రాశే ప్రధానమనుకునే తిరుమల తిరుపతి దేవస్థానం వారు విచ్చలవిడిగా అన్నమాచార్య కీర్తనలు ప్రచారం చేయటంలో జాగ్రత్త వహించాలని సంగీతజ్ఞులు కోరుకోవడం అత్యాశ కాదేమో.
సంగీత మూర్తిత్రయంలో ప్రధానుడైన సద్గురు త్యాగరాజుకు శిష్య సంతతి ఎక్కువ. ఆయన కీర్తనలు శిష్య ప్రశిష్యుల వల్ల అలాగే పాడబడుతూ వాసి తగ్గకుండా జగద్విఖ్యాతి చెంది కర్ణాటక సంగీత వ్యాప్తికి దోహదపడ్డాయి. గడచిన తరంలోని విద్వాంసులందరూ నాదోపాసనలోని రుచి తెలిసినవారు కాబట్టి ఆదర్శప్రాయమైన గానంతో ఆ కీర్తనలకు గౌరవాన్ని యినుమడింపజేశారు.
‘తిరువాన్కూర్’ మహారాజైన స్వాతి తిరునాళ్ త్యాగరాజుకు సమకాలికుడై ఎన్నో కీర్తనలు రాశాడు. ముత్తయ్య భాగవతార్, సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ వంటి మహా విద్వాంసులు స్వాతి పెరుమాళ్ కీర్తనలు స్వరబద్ధం చేసి ప్రచురించారు. ఏ విద్వాంసుడైన అలాగే ఆ కీర్తనలు గానం చేస్తారు. రాగతాళాలను మార్చరు.
పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యులకు అటువంటి సంగీత గౌరవం దక్కవద్దా? తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రేరణతో గతంలో శ్రీమతులు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, రాధ జయలక్ష్మి, డా.పినాకపాణి, డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పశుపతి, డా.నూకల చిన సత్యనారాయణ, డా.నేదునూరి కృష్ణమూర్తి, వోలేటి వంటి విద్వాంసులు అన్నమాచార్య కీర్తనలు పాడి, ఒక వొరవడిని చూపించారు. ఒక మార్గాన్ని నిర్దేశించారు.
అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి పూనుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ మార్గానే్న అనుసరిస్తూ సంగీత విద్వాంసుల సహకారంతో సంప్రదాయ సంగీత ధోరణిలో అన్నమాచార్యుల వారి సంకీర్తనలు ప్రచారం చేసే దిశగా కృషి చేయలేక పోయారనేది వాస్తవం. ఒకే కీర్తన నాలుగు బాణీల్లో నాలుగు రకాలుగా వినిపించడమే దీనికి ఉదాహరణ. అన్నమాచార్య సంకీర్తనలు ఎలా పాడాలనే విషయంలో, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ క్షణం వరకూ నిర్దిష్టమైన విధానమున్నట్లు తోచదు. ఎన్నో దశాబ్దాలుగా సంగీతంలో ఉన్నత ప్రమాణాలను నిర్దేశించగలిగేది దేశంలో ఆకాశవాణియే. శాస్ర్తియ, లలిత శాస్ర్తియ, లలిత, జానపద సంగీత విభాగాలలో అర్హులైన వారిని ఎంపిక చేసి గ్రేడింగ్ ఇచ్చే ఆడిషన్ విధానం అమలులో ఉంది.
సంగీత శాఖ ప్రొడ్యూసర్, మరో ఒకరిద్దరు బాగా ప్రసిద్ధులైన సంగీత విద్వాంసులే ఈ ఆడిషన్ బోర్డులో ఉంటారు. స్టేషన్ డైరెక్టర్, కార్యనిర్వహణాధికారుల ప్రమేయం ఉండదు.
కర్ణాటక సంగీత బాణీ లక్ష్యం ఒక్కటే. దీనికి రెండు పద్ధతులు లేవు. బాణీ ఒకటే అయితే, ఏ విద్వాంసులు పాడినా సంగీత పద్ధతి ఒకేలా ఉండాలి. మనోధర్మ జ్ఞానంలో తేడాలుండవచ్చును కానీ గానరుచిని తెలిపే వౌలిక విషయాలు మరుగున పడకూడదుగా? రాగభావాన్ని సూచించే గమకాలు, సంచారాలు గొంతులో పలికించలేనివారు ఓ పద్ధతిలోనూ, గమకంతో పాడితే సాహిత్య భావం పోతుందని పొడిపొడిగా లలిత సంగీతం మాదిరిగా మరి కొందరూ, ఇంకా మరింత ఆకర్షణగా ఉంటాయని సినిమా వరసల్లో పాడేస్తూ పోతే.. ఏదో రకంగా కీర్తనలు ప్రచారమై పోవాలనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లక్ష్యం నెరవేరవచ్చునేమో. కచ్చితమైన సుందరమైన బాణీలో వినబడవలసిన ఆ మహానుభావుడి కీర్తనలు తలో రకంగా వినిపిస్తూంటే, నిస్సహాయ స్థితిలో గమనించే సంప్రదాయ సంగీత ప్రియుల అభిప్రాయాలు అరణ్యరోదనే.
*

- మల్లాది సూరిబాబు 9052765490