కర్నూల్

దత్తత గ్రామాల్లో మరుగుదొడ్లకు బిల్లులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మిగిలిన గ్రామాలకు హుళక్కేనా..!
బేతంచెర్ల, డిసెంబర్ 22:స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఎంపిడిఓ దత్తత గ్రామమైన హెచ్. కొట్టాలలో మంగళవారం జిల్లా గ్రామీణ నీటి సరఫరా సబ్ ఇంజినీర్ భానుప్రసాద్, జడ్‌పి సిఇఓ ఈశ్వరయ్య మరుగుదొడ్లపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఆయన కొట్టాలలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను రెండు రోజుల్లో మంజూరు చేస్తామన్నారు. మిగిలిన గ్రామాల్లో పెండింగ్ బిల్లుల విషయమై మాట్లాడలేదు. దీంతో దత్తత గ్రామాల్లోని మరుగుదొడ్లకు తప్ప మిగిలిన గ్రామాల్లో మరుగుదొడ్ల లబ్ధిదారుల బిల్లులు పరిస్థితి ఏంటన్న చర్చలు జోరుందుకున్నాయి. మండల పరిధిలోని హెచ్.కొట్టాల గ్రామాన్ని ఎంపిడిఓ నాగరాజునాయుడు, అంబాపురం గ్రామాన్ని ఆర్‌డబ్ల్యుఎస్ ఏఇ ముక్తార్‌బాషా, సిమెంట్ నగర్‌ను పిఆర్ ఏఇ మహేష్ దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో డిసెంబర్ 31వ తేదీ లోగా వందశాతం మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు బహిర్గత మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. అయితే ఏ ఒక్క గ్రామంలో ఇంత వరకూ 25 శాతం మరుగుదొడ్ల నిర్మాణం కూడా పూర్తికాలేదు. వీటితో పాటు మిగిలిన గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అధికారులు గ్రామస్థులుపై ఒత్తిడి పెంచారు. అలాగే మరుగుదొడ్డి నిర్మించుకున్న లబ్ధిదారులకు రూ. 12 వేలు బిల్లు ఇస్తామని తెలిపారు. దీంతో గ్రామాల్లోని నిరుపేదలు సైతం కొందరు మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా మరికొందరు పూర్తిచేశారు. అయినా బిల్లులు మాత్రం మంజూరుకాలేదు. దీంతో ఇంకా మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సిన వారు బిల్లు మంజూరు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని చూసి జంకుతున్నారు. హెచ్.కొట్టాలలో ఉన్నత వర్గాలవారు ఉన్నా, 143 మరుగుదొడ్లు కావాల్సి ఉండగా కేవలం 25 మరుగుదొడ్లు పూర్తి కాగా మరో 28 నిర్మాణంలో ఉన్నాయి. అయితే జనవరి 26వ తేదీ నాటికి వందశాతం మరుగుదొడ్లు కలిగిన గ్రామంగా అవార్డు అందుకోవాలనే తపనతో అధికారులు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మిగిలిన గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం మాటేమిటో, బిల్లులు ఎప్పుడు మంజూరవుతాయో అధికారులే చెప్పాల్సి ఉంది.

పంట రుణాల కింద
రూ. 263 కోట్లు పంపిణీ
* ఏపిజిబి ఆర్‌ఎం సుబ్బారెడ్డి
చాగలమర్రి, డిసెంబర్ 22: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రీజియన్ పరిధిలో ఈ ఏడాది 32 వేల మంది రైతులకు పంటరుణాల కింద రూ.263 కోట్లు పంపిణీ చేసినట్లు రీజనల్ మేనేజర్ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం చాగలమర్రిలోని ఎపిజిబిని ఆయన సందర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఏడాది రూ.936 కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. ఇందులో రైతులకు రూ.263 కోట్లు ముద్ర కింద 4,635 మందికి రూ.23 కోట్లు, 3,594 పొదుపులక్ష్మి గ్రూపులకు రూ.94 కోట్లు, పాడి పరిశ్రమకు సంబంధించి 2,150 మందికి రూ.13 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. బంగారు రుణాల కింద 9.9 శాతం తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నామన్నారు. ఎలాంటి మార్టిగేజ్ లేకుండా రైతులకు రూ.2 లక్షల వరకు అప్పు ఇస్తున్నామన్నారు. పాడి పరిశ్రమ, పంట రుణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మేనేజర్ దస్తగిరి, సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి
* మాజీ మంత్రి టిజి.వెంకటేష్
కర్నూలు అర్బన్, డిసెంబర్ 22:క్రీడాకారులకు అన్ని రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాజీ మంత్రి టిజి.వెంకటేష్ కోరారు. నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ యువ ఖేల్ అభియాన్ రాష్ట్ర స్థాయి బాలబాలికల ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టిజివి మాట్లాడుతూ జిల్లాలో క్రీడా మైదానాలు పనులు చివరి దశలో వున్నాయని అవి పూర్తయితే క్రీడాకారులకు ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడాకారులు క్రీడల్లో రాణించేందుకు మంచి పౌష్ఠికాహారంతో పాటు కఠోర సాధన చేయాలని సూచించారు. క్రీడలు ఆరోగ్య వాతావరణంలో ఆడటం వల్ల జీవితం ఆనందదాయకం అవుతోందన్నారు. అనంతరం ఆయన క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో శాప్ డిప్యూటీ డైరెక్టర్ అజయ్‌కుమార్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.విజయకుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సత్యనారాయణ, మాంటిస్సోరీ విద్యాసంస్థల సంచాలకులు రాజశేఖర్, పిఇటిలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఫుట్‌బాల్ మొదటి రోజు విజేతలు..
ఆర్‌జికెఎ రాష్ట్ర స్థాయి బాలబాలికల ఫుట్‌బాల్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మొదటి రోజు పోటీల్లో విజేతల వివరాలు.. బాలికల విభాగంలో గుంటూరు ప్రకాశంపై 7-0, అనంతపురం కర్నూలుపై 2-0, కృష్ణ శ్రీకాకుళంపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించాయి. బాలుర విభాగంలో కర్నూలు ప్రకాశంపై 3-0, చిత్తూరు గుంటూరుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించాయి.

వివి వినాయక్ దర్శకత్వంలో సినిమాలకు మంచి గుర్తింపు
* నటుడు మంగిరిపల్లె వెంకటేష్
మహానంది, డిసెంబర్ 22: వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాల్లో తనకు మంచి గుర్తింపు లభించిందని నటుడు మంగిరిపల్లె వెంకటేష్ తెలిపారు. మంగళవారం ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయనకు ప్రొటోకాల్ ఇన్‌స్పెక్టర్ సురేంద్రనాధరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతవరకు 90 సినిమాల్లో నటించానన్నారు. జూనియర్ ఎన్‌టిఆర్ నటించిన ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్‌తో మంచి గుర్తింపు లభించిందన్నారు. సినీనటుడు శ్రీహరి తనకు స్నేహితుడని, ఆయన పరిచయంతో సినిమా రంగప్రవేశం చేశానన్నారు. బన్ని, అల్లుడు శీను, గబ్బర్‌సింగ్ లాంటి సినిమాలలో మంచి గుర్తింపు లభించిందన్నారు. సీనియర్ నటుడు రంగనాధ్ మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధకరమని, ఆయనకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థించానన్నారు. అలాగే కొరియోగ్రాఫర్ భరత్ మృతికి సంతాపం తెలిపారు. వీరి వెంట కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

మహానందీశ్వరుడి ఆదాయం రూ. 38.78 లక్షలు
మహానంది, డిసెంబర్ 22:జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలోని మహానందీశ్వరుడి ఆలయంలో హుండీల ఆదాయాన్ని లెక్కించగా రూ. 38.78 లక్షలు సమకూరినట్లు ఇఓ డా.శంకరవరప్రసాద్ తెలిపారు. గత 49 రోజులుగా భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీలను మంగళవారం ఆలయ ఆవరణలోని అభిషేక మండంలో ఇఓ, ఆలయ పాలక మండలి చైర్మన్ పాణ్యం ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో లెక్కించారు. ఇందులో ఆలయంలోని హుండీల ద్వారా రూ. 38,68,740, అన్నదానం హుండీ ద్వారా రూ. 9,575 సమకూరినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వేమూరి నారాయణ, బాలరాజుయాదవ్, శివారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఇఓ మధు, ఏఇ మురళీధర్‌రెడ్డి, పర్యవేక్షకులు ఈశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రమేష్, మల్లయ్య, నాగభూషణం, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లు రద్దు చేయాలి
* ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం
కర్నూలు అర్బన్, డిసెంబర్ 22:రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అమోదించిన ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును తక్షణమే రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం 44వ జాతీయ రహదారిని విద్యార్థులు దిగ్బంధించారు. తొలుత యూనివర్శిటీ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహేంద్ర, సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు స్వలాభం కోసం అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును అమోదించడం విడ్డురంగా వుందన్నారు. ఈ బిల్లు వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కనుమరుగయ్యే ఆస్కారం వుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యను పరోక్షంగా వ్యాపారం చేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు చేస్తున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును రద్దు చేయాలని లేనిపక్షంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనివర్శిటీ నిర్వాహక కార్యదర్శి లక్ష్మయ్య, రాఘవేంద్ర, వెంకటేష్, శివ, రామకృష్ణ, మురళీ పాల్గొన్నారు.