కర్నూల్

అడుగంటుతున్న ఆశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అమలుకు నోచుకోని సిఎం హామీలు..
* ప్రశ్నార్థకంగా ఓర్వకల్లు పారిశ్రామికవాడ..
* బడ్జెట్‌లో ఊసే లేని గుండ్రేవుల జలాశయం..
కర్నూలు, మార్చి 11:‘కర్నూలు నగరాన్ని రాజధానిగా ఎంపిక చేయడానికి సాంకేతిక అడ్డంకులు ఉన్నాయి, ప్రజలు అర్థం చేసుకోవాలి, రాజధాని చేయలేకపోయినా రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాను అగ్రగామిగా నిలబెడతా.. నాపై నమ్మకం ఉంచండి..’ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పిన మాటలపై క్రమేణా ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు. కేవలం మాటలకే పరిమితమయ్యారని అభివృద్ధిలో ఏ మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని ప్రజానీకం పెదవి విరుస్తున్నారు. ఇందుకు నిదర్శం 2016-17వ సంవత్సరానికి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు సరైన ప్రాధాన్యతనివ్వకపోవడమేనని వారంటున్నారు. జిల్లా వాసులు చంద్రబాబు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతుంటే వారికి దీటుగా సమాధానం చెప్పడానికి అధికార పక్షం వద్ద మాటలు లేకుండా పోయాయని రాజకీయ విశే్లషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయిలో కర్నూలు నగరంలో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు చాంతాడులా కొనసాగాయి. అయితే అవన్నీ నెరవేరేవి కావని ఆ నాడే ప్రజలు అభిప్రాయపడ్డారు. అయితే వాటిలో ప్రధానమైన రెండు, మూడు హామీలు అమలైనా జిల్లాకు ఎంతో మేలు చేస్తుందని చర్చించుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన తుంగభద్ర దిగువ కాలువ రైతుల హక్కు అయిన తుంగభద్ర జలాలను 100 శాతం అందజేయడం, చిరకాల కోరిక అయిన గుండ్రేవుల జలాశయ నిర్మాణం, ఆలూరు వద్ద హగరి నదిపై 10 టిఎంసిల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకం, ఓర్వకల్లు పారిశ్రామికవాడ నిర్మాణం, కర్నూలు నగరాన్ని కేంద్ర ప్రభుత్వ సుందర నగరాల జాబితాలో రాష్ట్రం నుంచి తొలి పేరు సూచించడం, ఓర్వకల్లు విమానాశ్రయం, కెసి కాలువ మరమ్మతులు, హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రాధాన్యత కలిగిన వాటికి నిధుల కేటాయింపులు కూడా సరైన రీతిలో చేయకపోవడమే ప్రజాగ్రహానికి కారణమవుతోంది. కర్నూలు నగరాన్ని కేంద్ర ప్రభుత్వ పథకంలో చేర్చి సుందర నగరంగా మారుస్తామని ఇచ్చిన హామీ ఆ నాడే అటకెక్కింది. కర్నూలు స్థానంలో విశాఖ నగరాన్ని చేర్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వమే స్మార్ట్ సిటీగా తయారు చేస్తామని, విదేశీ నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పినా అవేవీ ఇప్పటి వరకూ నెరవేరలేదు. తాజా బడ్జెట్‌లో కర్నూలును సుందర నగరంగా మారుస్తామని ప్రస్తావించారే కానీ నిధుల కేటాయింపు మాటే ఎత్తలేదు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు సుమారు రూ. 140 కోట్లు అవసరం ఉండగా కేవలం రూ. 20 కోట్లు, కెసి కాలువకు రూ. 190 కోట్లకు పైగా నిధులు అవసరం కాగా రూ. 35 కోట్లు, ఎల్లెల్సీకి రూ. 75 కోట్లు అవసరమంటే కేవలం రూ. 4 కోట్లు కేటాయించారు. ఇక గుండ్రేవుల జలాశయ నిర్మాణం, హగరి (వేదావతి) నదిపై ఎత్తిపోతల పథకం ఊసే ఎత్తకపోవడం విస్మయం కలిగించింది. ఓర్వకల్లు పారిశ్రామికవాడ విషయాన్ని పక్కన పెట్టి కొత్తగా ప్రకాశం జిల్లా దొనకొండ పేరును చేర్చడం రాజకీయంలో భాగమేనని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించినా జిల్లాలో ఏ మేర ఖర్చు చేస్తారో పూర్తి వివరాలు వస్తే కానీ వెల్లడికావు. జిల్లా అభివృద్ధికి నోచుకోనప్పుడు విమానాశ్రయం నిర్మించి ఏం చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద సిఎం హోదాలో ఏ జిల్లాకు వెళ్లని విధంగా కర్నూలు జిల్లా పర్యటనకు అత్యధికంగా వచ్చిన చంద్రబాబు ఏదో చేస్తారని అనుకున్న ఆశలపై బడ్జెట్‌లో నీళ్లు చల్లారని ప్రజలు మండిపడుతున్నారు. కర్నూలును కరవు రహిత జిల్లాగా మారుస్తానని ప్రజలకు అభయమిచ్చిన ముఖ్యమంత్రి ఆ ప్రయత్నమే చేయకపోవడం ఆగ్రహాన్ని కలిగిస్తోందని పడమర ప్రాంత రైతులు మండిపడుతున్నారు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీని దెబ్బ తీయడానికి కర్నూలుపై చూపిన శ్రద్ధలో కొంతైనా అభివృద్ధిపై చూపి ఉంటే ప్రజలు హర్షించే వారని వైకాపా, వామపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. కాగా జిల్లా అభివృద్ధికి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయించి తీరుతామని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఆదోని పురపాలక స్థలం కబ్జా!
* పట్టించుకోని అధికారులు
ఆదోనిటౌన్, మార్చి 11: ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని అత్యంత విలువైన రూ.కోటిపైగా విలువ చేసే మున్సిపాలిటీ స్థలాన్ని కొంత మంది కబ్జా చేశారు. స్థలంలో బండలు పాతి, కొట్టాలు వేసుకొని నివాసానికి కావాల్సిన అన్ని నిర్మాణ పనులను చురుకుగా చేపడుతున్నారు. టిజిఎల్ కాలనీలోని సాయిబాబా దేవాలయం పక్కనే ఉన్న మరుగునీటి కాలువ అర్చి పక్కన ఉన్న సుమారు 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి అధికార పార్టీ నాయకుల అండతో కొంతమంది గుడిసెలు వేసుకున్నారు. ఆ ఖాళీ స్థలంలో ఉన్న కొన్ని చెట్లను సైతం తొలగించారు. మరి కొన్ని చెట్లను ఆక్రమించుకొని బండలు పాతారు. మరో పక్క కాలువకు ఉన్న స్థలాన్ని సైతం కబ్జా చేసి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం స్థలం కబ్జా చేసిన విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి కాలనీవాసులు, వార్డు కౌన్సిలర్ భర్త కిశోర్, తదితరులు తీసుకెళ్లారు. అయినా మున్సిపల్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మున్సిపాలిటీకి చెందిన రూ.కోటి విలువ చేసే స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికార పార్టీ అండతోనే ఆక్రమణ:వైకాపా
అధికార పార్టీ నాయకుల అండతోనే మున్సిపాలిటీ స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారని, దీనిని అధికార పార్టీ నాయకులు సమర్థించడం తగదని, ప్రభుత్వ స్థలాలను కాపాడవల్సిన బాధ్యత అందరిపై ఉందని వైకాపా పట్టణ కన్వీనర్ చంద్రకాంత్‌రెడ్డి, చైర్‌పర్సన్ సరోజమ్మ భర్త రాముడు, వైకాపా నాయకులు నాగరాజు, కిశోర్, నల్లారెడ్డి ఆరోపించారు. శుక్రవారం వారు టిజిఎల్ కాలనీలోని సాయిబాబా దేవాలయం పక్కన కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. మరుగునీటి కాలువకు ఆనుకోని కబ్జా చేయడం వల్ల భవిష్యత్తులో వరద నీరు వస్తే ఎగువ ప్రాంతంలోప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు. కనీసం మరుగునీటి కాలువలో పూడిక తొలగించేందుకు వీలు లేకుండా ఆవుదూడ వంకపై ఇలాంటి అక్రమాలు చేయడం విచారకరమని అన్నారు. 2009లో వచ్చిన వరదతో వరద నీరు ప్రవహించలేక పైభాగంలో ఉన్న అనేక కాలనీలు జలమయం అయ్యాయన్నారు. అలాగే మున్సిపాలిటీ స్థలంలో చెట్లు వేసిన కూడా వాటిని తొలగించి కబ్జా చేయడం ఎంత వరకు సబాబు అని అన్నారు. ఇప్పటికే ఏడుగురు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. గుడిసెలు వేసుకున్న బాధితులను విచారణ చేయగా తమకు అధికార పార్టీ నాయకులు చెప్పడంతో వేసుకున్నామని వైకాపా నాయకులకు వివరించారు. ఈవిషయంపై రెవెన్యూ, మున్సిపల్, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని, మున్సిపాలిటీ స్థలాలను కాపాడుతామని నాయకులు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో చలపతి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
గజ వాహనంపై ప్రహ్లాదరాయలు
మంత్రాలయం, మార్చి 11: పరమ పావనమూర్తి శ్రీ ప్రహ్లాదరాయలు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శుక్రవారం గురువైభవ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు పురస్కరించుకుని పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజ లు చేసి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ మూల రాములకు పీఠాధిపతి పంచామృతాభిషేకం, తులసి అర్చన, ఉత్సవరాయలు పాదపూజ, కనక మహాపూజ, నిర్మల్యవిసర్జన తదితర ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరాయలును గజవాహనం, కొయ్య, వెండి, బంగారు రథోత్సవాలపై అధిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి మఠం ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు రథోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈకార్యక్రమంలో ఏఏఓ మాదవ శెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ప్రకాష్ స్వామి, ప్రిన్సిపల్ వాదిరాజాచార్, వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు..
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం యోగీంద్ర కళామండపంలో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శుక్రవారం మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాల్లో బెంగళూరుకు చెందిన విద్వాన్ పుత్తూరు నరసింహనాయక్‌చే నిర్వహించిన దాసవాణి, విద్వాన్ కె.హనుమేషాచార్‌చే నిర్వహించిన వేణుగానం భక్తులను ఆకట్టుకున్నాయి. వారికి పీఠాధిపతి శేషవస్త్రం, ఫల మంత్రాక్షింతలు, మెమోంటో ఇచ్చి ఆశీర్వదించారు.
శ్రీమఠంలో ప్రముఖులు...
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవ ఉత్సవాలను తిలకించేందుకు ప్రముఖులు బెంగళూరుకు చెందిన అరలుముల్లిగే పార్థసారథి, విద్వాన్ నాగరాజచార్, హులికుంటాచార్ వచ్చారు. వారికి పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు శేషవస్త్రం, ఫల మంత్రాక్షింతలు సీల్డ్‌ను ఇచ్చి ఆశీర్వదించారు.
13 నుంచి అహోబిలంలో
బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ, మార్చి 11: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో ఈ నెల 13న ఆదివారం నుండి అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. శ్రీలక్ష్మీ నరసింహస్వామికి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని 33 గ్రామాల్లో 44 రోజుల పాటు పర్యటించి గ్రామాల్లో వున్న తెలుపు (అరుగు)లపై ఆశీనులై భక్తుల నుండి విశేష పూలందుకొని బ్రహ్మోత్సవాల్లో జరిగే తన కల్యాణోత్సవాలకు భక్తులను స్వయంగా ఆహ్వానించి అహోబిల క్షేత్రం చేరుకుంటారు. అందులో భాగంగా బ్రహ్మోత్సవాల్లో ఎగువ, దిగువ అహోబిలాల్లో 11 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు ఇలా వున్నాయి. 13న ఎగువలో అంకురార్పణం, 14న ఉదయం ధ్వజారోహణం, రాత్రి సింహవాహన సేవ, దిగువలో సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ, కార్యక్రమాలు జరుగుతాయి. 15న ఉదయం హంసవాహనం, రాత్రి సూర్యప్రభవాహనం, దిగువన ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం భేరి పూజ, రాత్రి సింహ వాహనం, 16న ఎగువలో ఉదయం ఉత్సవం, రాత్రి హనుమంత వాహనం, దిగువన ఉదయం హంస వాహనం, రాత్రి సూర్యప్రభ వాహనం, 17న ఎగువలో ఉదయం శేషవాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, దిగువన ఉదయం శ్రీ యోగానృసింహ గరుడ విమానం, రాత్రి హనుమంత వాహనం, 18న ఎగువలో ఉత్సవం, రాత్రి శరభ వాహనం, దిగువన ఉదయం శేష వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, కార్యక్రమాలు వుంటాయి. 19న ఎగువలో ఉదయం ఉత్సవం, రాత్రి పొన్నచెట్టు వాహనం, దిగువన ఉదయం మోహినీ అలంకారం, రాత్రి శరభవాహన సేవ, 20న ఎగువలో శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణోత్సవం, రాత్రి గజ వాహనం, దిగువలో ఉదయం వేణుగోపాలన్ అలంకారం (చూర్ణ్భాషేకం), రాత్రి పొన్నుచెట్టు వాహన సేవ, 21న ఎగువలో ఉదయం ఉత్సవం, సాయంత్రం తొట్టి తిరుమంజనం, రాత్రి అశ్వవాహనం, దిగువలో శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవ అమ్మవార్ల కల్యాణోత్సవం, అనంతరం గజవాహన సేవ కార్యక్రమాలుంటాయి. 22న ఎగువలో ఉదయం రథోత్సవం, దిగువలో ఉదయం కాళింగనర్ధనోత్సవం, సాయంత్రం తొట్టి తిరుమంజనం, రాత్రి అశ్వవాహన సేవ, 23న ఎగువలో సాయంత్రం ద్వాదశారాదనం, పుష్పయాగం, రాత్రి గరుడోత్సవం, ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాలు ముగుస్తాయి. దిగువ అహోబిళంలో ఉదయం రథోత్సవం, సాయంత్రం ఉత్సవం జరుగుతుంది. 24న దిగువ అహోబిళంలో తీర్థవాది చక్రస్నానం, సాయంత్రం ద్వాదశరాధనం, పుష్పయాగం, రాత్రి గరుడోత్సవం, ధ్వజావరోహనం కార్యక్రమాలతో దిగువ అహోబిళంలో ఉత్సవాలు ముగుస్తాయి.
25 నుంచి తెప్పోత్సవాలు..
పుణ్యక్షేత్రమైన అహోబిళంలో 25 నుంచి 27 వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగుతాయని ఆలయ ఇఓ తిమ్మనాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 10 రోజుల కార్యక్రమాల్లో అలసిన స్వామివారు అమ్మవార్లతో సేద తీరేందుకుగాను తెప్పలో మూడు రోజులపాటు విహరించనున్నారని తెలిపారు.
13న పీఠాధిపతి రాక..
ప్రముఖ పుణ్య క్షేత్రమైన అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి 13న అహోబిలం వస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రారంభమై 11 రోజుల పాటు జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు అహోబిలం రానున్నారు.
రైతులు, పేదలను ఆదుకోవడంలో
ప్రభుత్వాలు విఫలం
* కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
దేవనకొండ, మార్చి 11: రైతులను, పేదలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాషరెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని కోటికొండ గ్రామంలో ఒక వివాహానికి హాజరైన కోట్ల విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వాలు అన్ని రంగాల్లో విఫలం చెందాయని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడుస్తున్నా హంద్రీనీవా పను లు పూర్తి చేయనందున రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పెంచామని గొప్పులు చెప్పుకుంటున్నప్పటికీ అవి సక్రమంగా అందజేయకపోగా కోత విధిస్తున్నారన్నారు. రైతులు పండించుకున్న ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినప్పటికీ ఆహామీ అమలు కాలేదన్నారు. రాష్ట్ర విభజనకు బిజెపి ప్రధానమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లుతున్నారని అన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టనందున గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని కోట్ల పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీప్రదాన కార్యదర్శి పెద్దరెడ్డి, కోట్ల హర్షవర్థన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ప్రేమనాథ్‌రెడ్డి, వెంకటరెడ్డి, తిమ్ములు, ఆనంద్‌తోపాటు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దాసుపత్రి సమస్యలు పరిష్కరించాలి
* సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు ఓల్డ్‌సిటీ, మార్చి 11: కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో అరకొర సదుపాయాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి జిల్లా ప్రభుత్వ యం త్రాంగాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం బృందం శుక్రవారం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రజల సంజీవినిలా పని చేస్తున్న కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో అధికారుల నిర్లక్ష్యం వల్ల వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ఆరోపించా రు. రెండు రోజుల క్రితం రోగి గాయం తో ఆసుపత్రికి వస్తే కనీసం గాయాన్ని శుభ్రం చేయడానికి అవసరమైన సా మాగ్రి కూడా అందుబాటులో లేదంటే జిల్లా యంత్రాంగం ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జిల్లా ప్రజ ల ఆరోగ్యం పట్ల కలెక్టర్‌కు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందన్నారు. ఆసుపత్రికి 564 రకాల మందులు అవసరమై తే వాటిలో 50 శాతం మాత్రమే ప్రభు త్వం ఇస్తుందని, అత్యవసర మందు లు 200 రకాలు అవసరమైతే వాటిలో సగం కూడా సరఫరా చేయడం లేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య చికిత్స చేయించుకుంటున్న రోగులు కూడా ప్రైవేటు మందులపై ఆధార పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కనీసం 3 నెలలకు ఒకసారైనా సమావేశం అవ్వాలన్నారు. ఆసుపత్రిని సందర్శించిన బృందంలో సిపిఎం నాయకులు గౌస్‌దేశాయ్, పుల్లారెడ్డి, రాముడు, రాజశేఖర్ ఉన్నారు.
రొయ్యల చెరువుల పరిశీలన
మంత్రాలయం, మార్చి 11: అక్రమంగా చేపట్టిన రొయ్యల పెంపకంపై మత్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీహరి, తహశీల్దార్ చంద్రశేఖర్‌వర్మ శుక్రవారం దాడులు నిర్వహించారు. మండలపరిధిలోని చెట్నేపల్లి గ్రామ సమీపంలోని మోహినీపురంలో ఎటువంటి అనుమతులు లేకుండా చెరువుల్లో రొయ్యలను పెంచి తుంగభద్ర నదిలోని నీటిని కలుషితం చేస్తున్నారని సమాచారం అందడంతో దాడులు నిర్వహించామని మత్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. చెరువులను పరిశీలించి రెండు రోజుల్లో చెరువులను తొలగించకపోతే కటిన చర్యలు తీసుకుంటామని రొయ్యల పెంపకం దారులను హెచ్చరించారు. వారి వెంట విఆర్‌ఓ శే్వత, ఎఫ్‌డిఓ పక్కీరయ్య ఉన్నారు.
మోడల్ హౌస్ పరిశీలన
* 2 నెలల్లో నిర్మించాలని హౌసింగ్ పిడిని ఆదేశించిన కలెక్టర్
కర్నూలు, మార్చి 11: ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం కింద రెండు పడకల ఇంటిని మోడల్‌గా నిర్మించాలని కలెక్టర్ విజయమోహన్ హౌసిం గ్ పిడి రాజశేఖర్‌ను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం నన్నూరు గ్రామ సమీపంలోని రాగమయూరి రీసార్ట్స్‌లో వివిధ రకాల గృహ నమూనాలను కెజె రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరం లో నిరుపేదలకు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడకల గదులతో ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా వచ్చే రెండు నెలల్లో మోడల్ హౌస్‌ను నిర్మించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద పట్టణ ప్రాంతంలోని మురికివాడల్లో నివసిస్తున్న నిరుపేదలకు రెండు పడకల గదులతో ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసిందన్నా రు. 400 చదరపు అడుగుల్లో రెండు పడకల గదులతో ఒక ఇంటిని, 500 చదరపు అడుగుల విస్తీరణంలో మరో ఇంటిని మోడల్‌గా నిర్మించి ప్రజలకు చూపిస్తే ప్రతి పేద కుటుంబం దరఖాస్తు చేసుకుంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. నగర శివారు ప్రాంతం లో అపార్ట్‌మెంటు తరహాలో నిర్మించే కాలనీలో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు. కలెక్టర్ వెంట ఆర్‌డిఓ రఘుబాబు, హౌసింగ్ పిడి ఉన్నారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం..
* ఐదుగురి అరెస్టు..
రుద్రవరం, మార్చి 11: మండల పరిధిలోని ముకుందాపురం చెరువు పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేసిన్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో శిరివెళ్ళ సిఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ హనుమంతయ్య సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు ద్వి చక్ర వాహనాలతో పాటు 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుంగలను తరలిస్తున్న ముకుందాపురానికి చెందిన హరి, ప్రసాద్, నర్సాపురానికి చెందిన చిన్న ఓబులేసు, తండాకు చెందిన శివరాంనాయక్, రవినాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు. అయితే మరో ఇద్దరు నిందితులు పారిపోయారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 4 లక్షలకు పైగానే ఉంటుందని, నిందితులను ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరచినట్లు డీఎస్పీ తెలిపారు. ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ రెగ్యులర్ ఆపరేషన్స్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో పోలీసు సిబ్బంది రాంభూపాల్‌రెడ్డి, భాస్కర్, కుమార్‌బాబు, రంగారావు, ప్రతాప్, హరిబాబులకు డిఎస్పీ నగదు రివార్డు అందించి అభినందించారు.