ఆటాపోటీ

అఫ్గాన్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరంతరం అంతర్యుద్ధంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, ఇస్లామిక్ మత వాదులు ఎన్ని అడ్డంకాలు సృష్టిస్తున్నా అఫ్గానిస్థాన్ క్రికెటర్లు వెనుకంజ వేయడంలో లేదు. ఆ జట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ, టెస్టు హోదా ఉన్న దేశాలకు గట్టి సవాళ్లు విసురుతున్నది. జింబాబ్వే టూర్‌కు వెళ్లి, అక్కడ వనే్డ సిరీస్‌ను 3-2 తేడాతో గెల్చుకున్న తీరు అఫ్గాన్ దూకుడుకు అద్దం పడుతున్నది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి నాలుగు వనే్డల్లో చెరి రెండు విజయాలతో జింబాబ్వే, అఫ్గానిస్థాన్ సమవుజ్జీగా నిలిచాయి. దీనితో గత నెల 26న హరారేలో జరిగిన చివరి, ఐదో వనే్డ అత్యంత కీలకంగా మారింది. ఆ మ్యాచ్‌ని అఫ్గాన్ ఏకంగా 106 పరుగుల తేడాతో సొంతం చేసుకొని, సిరీస్‌ను సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 253 పరుగులు సాధించింది. రహ్మత్ షా 79 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. మహమ్మద్ నబీ 48, ఓపెనర్ నూర్ అలీ జద్రాన్ 46 పరుగులతో రాణించారు. ఆతర్వాత ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడగా, డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం జింబాబ్వేకు 22 ఓవర్లలో 161 పరుగులను లక్ష్యంగా ఖాయం చేశారు. దీనిని ఛేదించడంలో దారుణంగా విఫలమైన జింబాబ్వే 54 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ గ్రేమ్ క్రెమర్ 14 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనితోపాటు ర్యాన్ బర్ల్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. మిగతా వారు సింగిల్ డిజిట్‌తో సరిపుచ్చారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో అమీర్ హమ్జా 20 పరుగులకు 3, మహమ్మద్ నబీ 14 పరుగులకు 3 చొప్పున వికెట్లు పడగొట్టారు. రషీద్ ఖాన్ ఎనిమిది పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. మొత్తం మీద టెస్టు హోదా ఉన్న ఒక జట్టును వారి సొంత గడ్డపైనే ఓడించి, సిరీస్‌ను సాధించడంలో అఫ్గాన్ సామర్థ్యానికి నిదర్శనం. టెస్టు స్టేటస్ ఉన్న మిగతా జట్లకు ఈ జట్టు పరోక్షంగా హెచ్చరికలు పంపుతున్నది.