అక్షర

అంతర్లీన వేదనకి అక్షర సాంత్వన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కవిత క్లుప్తంగా ఉన్నా, దీర్ఘంగా ఉన్నా రస నిష్పత్తి కల్గించినప్పుడు అది కవితే అవుతుంది. కవిత అనే పదార్థం ముఖ్యంగానీ దాని ఆకారవికారాలు ముఖ్యం కాదు. చదవగానే ఇట్టే పట్టుబడదు కవి హృదయం. పునః పఠనీయమైనప్పుడే అది కవిత అవుతుంది’ అంటారు కవి దాశరథి.
‘ఆవిరి’ మకుటంతో కవయిత్రి బండ్లమూడి స్వాతికుమారి వెలువరించిన కవితా సంకలనం చదివినప్పుడు పైన ఉటంకించిన దాశరథి గారి వ్యాఖ్యలు స్ఫురణకు వచ్చాయి. ‘చదవగానే ఇట్టే పట్టుబడదు కవి హృదయం’ అన్న మాట ఈ కవయిత్రి రచనల విషయంలో అక్షరసత్యం అనిపిస్తుంది. ‘అక్షరాలుగా మార్చుకుంటే తప్ప మనుషులు అర్థంకారు. కల్పనకి లొంగని నిర్జీవమైన వాస్తవాల నీడగా ప్రపంచం సాక్షాత్కరించింది. ముళ్లకంప గీసుకుపోయినందుకు కాదు, మచ్చలు మిగిలినందుకు రాయడం తప్పదు’ అని స్వయంగా కవయిత్రే తన ‘పోయెట్స్ డైరీ’లో రాసుకున్నారు. మిగిలిన ఆ మచ్చల ముద్రలని తన కవిత్వంలో భావగర్భితంగా ఆవిష్కరించారు.
‘వీడ్కోలు వలయాల్లో పెనుగులాడతారెవరో
వెళ్లలేకపోవడాన్ని ఆపలేక పోవడంలో
వీల్లేకపోవడాన్ని వదల్లేక పోవడంలో
... నీతోనే వుండి పోతారెవరో’ (వదల్లేక వదల్లేక)‘ముద్దిస్తే ఏడుపెందుకో మాత్రం
ఎన్ని ముద్దులిచ్చినా చెప్పను’ (ఆర్తి)

‘నువ్వూ నేను
విధిపన్నిన వలలోని పిట్టలం
పిట్టలని రారమ్మని ఆశపెట్టే గింజలం
గింజలు చల్లి దాక్కున్న వేటగాళ్లం’ (అవసరార్థం)

‘ఉన్నదంతా పొడుగాటి విరామం
దారి పొడవునా ముగింపులే
ఎక్కడో ఒకచోట కథ ఎదురవ్వడమే మలుపు’ (ముందుమాట)

‘మాటలు లేకపోవడం బాధే
అసలు మాటలొద్దను కోవడమే విషాదం’‘ఇకపై చాలా కథలుంటాయిగానీ
వాటిలో మనుషులెవరూ వుండరు’
ఇలాంటి ఎనె్నన్నో హృద్యమైన భావాలను మొదటి భాగంగా రాసిన తన పనె్నండు కవితల్లో ఆమె అక్షరీకరించారు.

‘బాగుండటం మాత్రమే బాగుంటుందని
నీకెవరు చెప్పారోగానీ
బాధుండటమే బతికుండడం కదా’
‘పెద్దయ్యాక తల్చుకుని బాగుందనుకోవడానికి
బాగుంటుంది కదా చిన్నతనం ’ అంటూ
జీవితంలో ఎదురయ్యే అనుభవాల సారాన్ని ‘అనుకోకుండా’ శీర్షికన తన సుదీర్ఘ కవితలో మనముందుంచారు స్వాతికుమారి.
మనిషిలోని ఒంటరితనపు బాధని, ఆత్మీయ స్నేహం కోసం పెనుగులాడే ఆర్తిని, ఆధునిక జీవన శైలిలో మనిషి తనకంటూ ఏమీ దాచుకోలేని సంక్లిష్టతని, వృద్ధాప్యంలో పలకరింపుల కోసం పరితపించే దయనీయ స్థితిని, ఊపిరిపాటగా మిగిలిన ఓ గాయకుడి హృదయ మాధుర్యాన్ని, ఇదీ అని చూపించడానికి వీలుకాని, అనుభూతికి మాత్రమే అర్థమయ్యే ‘ఆవిరి’ని, బాహ్యంగా కాక అంతర్ముఖంగా మనిషి చేసే ప్రయాణాల అంతరంగ మథనాన్ని కవయిత్రి సందర్భోచితంగా నర్మగర్భంగా తన కవితల్లో భావచిత్రాలుగా రూపుకట్టారు.‘స్వాతికుమారి పద్యాల నిండా, అక్షరాల నిండా, అక్షరాల మధ్య ఖాళీలనిండా మనస్సు వుంది. అందీ అందక ఊరించే మీనింగ్, పేజీల బయటికి చేతులు చాచే ఆర్తి వుంది’ అని హెచ్చార్కే ‘సుతిమెత్తని సవ్వడి’లో చెప్పారు. దట్టంగా పరుచుకున్న గుర్రపుడెక్క మాటున పైకి కనబడని జలరాశి వున్నట్లు అర్థం చేసుకోగల మనసున్నవారికి ఆమె కవితల భావ వ్యక్తీకరణ వెనుక అంతర్లీన వేదన, దుఃఖం సాక్షాత్కరిస్తాయి.ఆశించిన మార్పు కోరుకునే ఆరాటమూ ఆవిష్కృతమవుతుంది. ఇద్దరి మధ్య చోటుచేసుకున్న భావ ప్రకటనా ధారగా ఈ కవితలు అంతర్జాల పత్రిక ‘కినిగె.కామ్’లో కాలమ్‌గా పాఠకులను అలరించాయి. అవే ఇప్పుడు జివి పబ్లికేషన్స్ ద్వారా పుస్తకరూపం దాల్చాయి.కొబ్బరికాయలోని నీరు ఎంత మధురంగా వున్నా దాన్ని ఆస్వాదించాలంటే నారికేళంతో కుస్తీ పట్టక తప్పదు. స్వాతికుమారి రచనా శైలి కూడా అదే తీరున వుండడంతో సామాన్య పాఠకులకు అది ఓ పట్టాన అర్థంకాదు. ఒకటికి రెండుసార్లు చదివితేగానీ ఆమె చెప్పదలుచుకున్న భావం అవగతం కాదు. ఇది మాత్రం ఇబ్బందికర అంశమే.
-డి.స్వాతి