అక్షర

దాటిన బాటలో చూసిన ముళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వత్తావా మా వూరికి’
(కవిత్వం)
సైదులు ఐనాల
పేజీలు: 104; వెల: రూ.60/-
ప్రచురణ: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
ప్రతులకు: రచయిత : 9948714105
---
రచయితకు జీవన నేపథ్యమే బలం. ప్రత్యేకంగా కవులకు-కాల్పనికతతో పనిలేనందువల్ల- పుట్టినూరు, పల్లెజీవనం ఓ వస్తు భాండాగారంగా వెంట ఉంటుంది. తెలంగాణలోని ఆధునిక సాహిత్యాన్ని పరిశీలిస్తే కవులయినా, కథకులయినా అధికంగా గ్రామీణ వాతావరణంలో పుట్టిపెరిగినవారే కనిపిస్తారు. గ్రామాలు తెలియని వారిని ఐనాల కవిత్వం ‘వత్తావా మా వూరికి’అని పిలుస్తోంది. కళ తప్పుతున్న గ్రామాలకు కవి ఊరు ఒక ముఖ చిత్రమే.
‘పొద్దెక్కినా పొయ్యిలో పడుకున్న/ పిల్లిని చూయిత్తా/ దగ్గిన దగ్గులో లటుక్కునూడిపడ్డ గుండెకాయని చూయిత్తా’నంటూ తన ఊరికి ఆహ్వానిస్తాడు.
కవి ఐనాల సైదులు వృత్తిరీత్యా అధ్యాపకుడు. బాల్యంనుండే, చదువుకునే రోజులనుండే పుస్తకంతోపాటు సమాజాన్ని చదవడం నేర్చాడు. పదేళ్ల వయసులోనే అంబేడ్కర్‌ను గుండెలకద్దుకున్నాడు. సమాజంలో గౌరవం మనిషి ప్రతిభనుబట్టిగాక కులాన్నిబట్టి దక్కడం ఆయన కవిత్వానికి నేపథ్యమైంది.
ఈ సంకలనంలోని 44 కవితలు 2005-06 రెండు సంవత్సరాలలో రాసినవైనా కవిత్వం నిత్యనూతనంగా ఉంది, కారణం సమస్యలు తగ్గకపోగా పెరిగిపోవడమే అనుకోవచ్చు. విద్యాధికుడైనా కొద్దీ కవి ఆలోచనా పరిధి విస్తరిస్తూ సామ్రాజ్యవాది స్వార్థం సునామీ అనే స్థాయిని చేరాడు. అన్నింటికీ సమాధానం/కంప్యూటర్ అయినప్పటినుండి/ కూడుకున్నది పూడ్చలేని అగాధం’అని 2005లోనే అన్నాడు.
అస్తిత్వవాదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కవితల్లో ధిక్కారస్వరం అవి న్యూనతాభావంలో ఈదులాడడం కనిపిస్తుంది. ‘బహుశ నేనిప్పుడు/ నల్లని వేణువు/తొర్రల్లోంచి ఊదబడ్డ/ గాలి తెమ్మెరనేమో’అట్లే- మిత్రమా... /నెత్తుటి దిబ్బల సాక్షిగా/ నేనెప్పటికీ/ నల్లకలువనే’ అనుకోవడం సమూహాల్లో కలువలేనితనాన్ని చెబుతుంది.
కవి తన కవిత్వంలో తననే కాకుండా తన తాతల తండ్రుల పరిస్థితిని కూడా అక్షరీకరిస్తాడు. తన అస్తిత్వానికి మూలమైన పెద్దలను మరవకుండా తరాలుమారినా మారని సామాజిక పరిస్థితుల గత వర్తమానాలను చర్చిస్తాడు. ‘తాత తర్వాత నాయన/ ఇప్పుడు నావంతొచ్చింది/ మళ్లీ యుద్ధం మొదలైంది/ బుక్కెడు బువ్వకోసం చరిత్ర ఎంత తవ్వినా అదే మరకలు, అదే వాసన అంటూ గత కాలపు సంఘటనల్ని గుర్తుచేసుకుంటాడు.
కవి ఒక్కతరం వెనక్కి వెళ్లినా కనబడేది ‘నాయన నాల్గుబొక్కలు’ మాత్రమే. తన తండ్రి జీవనచిత్రాన్ని ఆవిష్కరించిన ఈ కవిత ఆనాటి అమాయకపు, సర్దుకొని బతికే నాయనల కష్టాన్ని తెలిపి కన్నీళ్లు పెట్టిస్తుంది. ‘మాదిగోనికి చల్లబోస్తే/ దూడలు చస్తాయని/ మాడిసిన కారం వేసినప్పుడు/ గా మర్మమేంటో తెల్సుకోలేని/ అమాయకుడు/ ఆ ‘నాయన’. ఇలా సాగుతుంది కవిత.
‘ప్రాణంపోసే ప్రకృతే/ కన్నతల్లియై దీవిస్తుంటే.... / వాడు మాత్రం నన్ను/ ఎడమెందుకు చేస్తున్నట్టు...?’అని వర్ణవ్యవస్థని ప్రశ్నిస్తాడు ‘ఎడం’ కవితలో.
ఐనాల కవిత్వంపై పట్టున్న కవి. గుండెలోంచి వస్తువును తీసుకొని తన శిల్ప నైపుణ్యతతో చక్కని రూపకల్పన చేసే కళ ధీటైన భావాల్ని సైతం సుతిమెత్తగా వ్యక్తీకరించే సుగుణం ఆయన పనిముట్లు. తాను దాటివచ్చిన ముళ్ల కంచెల్ని, దాటుతున్న అగాధాల్ని ఉన్నదున్నట్లుగా వివరించడం కవి సైదులు కావ్యతత్త్వం.
కవి ఆలోచనాతరంగాల్తో ఓ ఒంటరితనముంది. ‘తప్పిపోయిన గొర్రె పిల్లను’ అనే భావన వదిలించుకోవాలి. కవితల్ని తడుముతుంటే కవి అన్నట్లు వీటిలో ఉన్న తడి నిజంగా ఆయన అమ్మానాయనలదే. ఏ రకంగా చూసినా ‘వత్తావా మా వూరికి’ మనసుకు హత్తుకునే కవిత్వం.

-బి.నర్సన్