అక్షర

‘రామకోటి’తో కలిసిన ‘గీత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ మద్రామకోటి భగవద్గీత
పూజ్యశ్రీ సద్గురుస్వామి
శ్రీ కవీశ్వరానంద
వెల: రు.150
ప్రతులకు: గుత్తికొండ
చంద్రశేఖరరెడ్డి, శ్రీ గీతా సత్సంగ నిలయం,
వేమన శిల్పం,
పరసత్యాళ్ళూరు 522436, పెదకూరపాడు మండలం, గుంటూరుజిల్లా
--

శ్రీ కవీశ్వరానందస్వామి వారు పూర్వాశ్రమంలో గుత్తికొండ రామకోటిరెడ్డిగారు. కృష్ణుని పూర్వావతారమైన రాముని పేరు కలిపి ఈ గ్రంథానికి శ్రీమద్రామకోటి భగవద్గీత అని పేరును ఔచిత్యంగా పెట్టారు. భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలలో వున్న ఏడువందల శ్లోకాలను కవీశ్వరానందస్వామిగారు పద్యాలరూపంలో తెలుగులో రాసారు. ఆటవెలది, తేటగీతి, కందం మొదలైన పద్యాలను స్వీకరించారు. గీతామహాత్మ్యాన్ని యాభైమూడు పద్యాలలోను, వరాహపురాణంలోని గీతామహాత్మ్యాన్ని ఇరవై ఒక్క పద్యాలలోను వర్ణించారు. గీతను చదివి అర్ధం చేసుకుని ఆచరించి జీవన్ముక్తులు కావాలనే ఆకాంక్షతో ఈ రచన చేసి పాఠకులకు అందించారు. వ్యాఖ్యానాలతో, ఉపనిషద్వాక్యాలతో, ఆధునిక తత్వ గీతాలవరకు సందర్భానుసారంగా ఎన్నో విషయాలు వర్ణించబడినాయి. ‘పలికెడిది కృష్ణగీతట, పలికించెడు విభుడు కృష్ణపరమాత్ముడట నే పలకిన పరమశుభంబట, పలికెద వేరొండు గీత పలుకగ తగవే’ అనే మాటలు కవిలోని గాఢమైన భగవద్భక్తిని వెల్లడిస్తున్నాయి. వీరికి గల పౌరాణిక గ్రంధాల పరిజ్ఞానం తెలుస్తుంది. సామాన్య పాఠకునికి సులభమైన రీతిలో అర్ధమయ్యేందుకు వీలుగా గల సరళమైన శైలిని ఎంచుకున్నారు. ముందు దేవతాస్తుతి చేసారు. రమణ మహర్షి, అరవిందులు,రామకృష్ణ పరమహంసలను స్మరించారు. ‘మూకం కరోతి వాచాలం’ అన్నట్టుగా ఎవరి కృప మూగయైన వచింపగలుగ, ఎవరి దయ గుంటిదా కొండలెక్కగలుగునట్టి శ్రీకృష్ణు ననుకంపనాశ్రయించి నేను ఈ గీత వ్రాసితిని నిదియె వినతి’ అని చెప్పారు. శ్లోకాలకు పద్యానువాదం చేయడం ఒక ఎత్తు. ఈ పద్యాలకు వ్యాఖ్యానం రచించడం మరో ఎత్తు. వ్యాఖ్యానం పఠితులకు సంతృప్తిని కలిగించే రీతిలో వుండడం ఇందులోని విశేషం. కేవలం అర్ధం మాత్రమే చదువుతుపోతే భాషా పరిజ్ఞానంతోకూడిన ఆనందం కలుగుతుంది. విషయాన్ని లోతుగా పరిశీలించి చెప్పిన అంశాల ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఉదాహరణకు పాండవుల శంఖాలను గురించి చెప్పిన పద్యానికి చేసిన వ్యాఖ్యానంలో ఉఫయుక్తకరమైన వివరణలు అందించారు రచయిత. ‘అనాశ్రీతఃకర్మఫలమ్’ అనే శ్లోకానికి వ్యాఖ్యానం సవిస్తరంగా వుంది. కర్మవిముఖుడివి కావద్దని చెబుతూ కర్తవ్యబోధ చేస్తుంది ఈ భావం, పరోపకారాన్ని వివరించి జ్ఞానోపదేశం చేస్తుంది. ‘జితాత్మనః..శ్లోకాన్ని వివరిస్తూ వేమన పద్యాలతోను, రచయిత నవశతకంలోని పద్యాలతోను సమన్వయించి చెప్పారు, జగద్వస్తువుల నధిగమించి స్వానుభవైక మోక్ష లక్ష్మీసామ్రాజ్య జ్ఞానమును పొందుటకై ఎవరైనా కృషి చేయవలసిందే అనే హెచ్చరికను చేసారు. ‘పత్రం పుష్పం’ అనే శ్లోకానికి నారద భక్తి సూత్రాలను ఉదహరిస్తూ వివరించారు. సకల జీవరాసుల యందు ద్వేష భావము లేకుండా మైత్రియును, కరుణయును ఎల్లప్పుడు వున్నవాడై మమత్వం తృణీకరించి కష్టసుఖాదుల సమదృష్టి కలవాడై ప్రవర్తించు ఆత్మయందహంకారము పొడసూపనీయక సహనశీలుడై వర్తిల్లుతుండే వారు భగవంతునికి ప్రీతిపాత్రులు. ఇటువంటి జ్ఞానాన్ని బోధించిన గీతను పఠించడం, మననం చేయడం, ఒంటబట్టించుకోవడం అవసరం. భగవద్గీత మరింతగా వ్యాపించాలి. సామాన్య ప్రజలకు చేరువ కావాలి. గీతాసారం బోధింపబడాలి. ఆ ప్రయోజనం శ్రీమద్రామకోటి భగవద్గీత ద్వారా నెరవేరుతుంది.

-కె.లక్ష్మీఅన్నపూర్ణ