అక్షర

దాశరథి అనువాద మాధుర్యం.. విలక్షణ వచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాకవి- దాశరథి సాహిత్యం; నాల్గవ సంపుటం-
ప్రాచీన లక్నో- యాత్రాస్మృతి;
పుటలు: 581;
వెల: రూ.400;
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌజ్
అభివ్యక్తిలో అనితర సాధ్యమైన ప్రతిభను ప్రదర్శించిన ఆధునిక యుగపు మహాకవి స్వర్గీయ దాశరథి. ఆయన సాహిత్యానికి నానాటికీ ఆదరణ పెరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో దాశరథిని గురించి యువతరంలోనూ గొప్ప జిజ్ఞాస ఏర్పడింది. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వరంగల్లు, నిజామాబాద్, చంచల్‌గూడ కారాగారాల్లో నిర్బంధ జీవితాన్ని గడిపిన త్యాగమూర్తి, ధీరుడు స్వర్గీయ దాశరథి. నాటి ఆయన అనుభవాలు, జ్ఞాపకాల సారాంశం ‘‘యాత్రాస్మృతి’’ రూపంలో ఉంది. ఈ రచనతోపాటు ‘‘అబ్దుల్ హలీమ్ షరర్ అనే ప్రఖ్యాత ఉర్దూ రచయిత, పాత్రికేయుడు రచించిన ‘గుజాష్తా లక్నో’’ (అనువాద శీర్షిక: ప్రాచీన లక్నో) తెలుగు అనువాదం ఇపుడు ఒకే సంపుటంగా లభ్యమవుతున్నాయి. ‘‘ప్రజాకవి దాశరథి సాహిత్యం- నాల్గవ సంపుటం’’ పేరుతో విశాలాంధ్ర ప్రచురణల సంస్థ ఈ రచనల్ని ప్రచురించింది.
ఇందులో మొదటగా ప్రాచీన లక్నోను గురించి సంక్షిప్త రీతిలో సమీక్షించుకుందాం: ఉత్తర భారతదేశంలో అత్యంత విలక్షణమైన పట్టణాల్లో లక్నో ఒకటి. ఇక్కడి ఉర్దూ భాషను ప్రామాణికమైనదిగా పండితులు గుర్తించారు. లక్నో జీవనశైలి కూడా ఎంతో విశిష్టరీతిలో ఉంటుంది. కొన్ని హిందీ చలనచిత్రాల్లో లక్నో జీవితచిత్రణ ఉంది. భారతరత్న- మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి పలు పర్యాయాలు లక్నో లోక్‌సభా స్థానం నుండి విజయాన్ని సాధించారు. లక్నో పట్టణం పట్ల తన తిరుగులేని అభిమానాన్ని ఎన్నోసార్లు ప్రకటించారు. హిందుస్థానీ సంగీత కళాకారులు, ఉర్దూకవులు, కళాభిమానులు, భావుకులు అందరూ ఇష్టపడే లక్నో ఆసక్తికలిగిన చరిత్రకారులకు తరగని గని. లక్నో ప్రాంత వైవిధ్యభరితమైన సంస్కృతి- సంప్రదాయాల పరంపరను గురించి ఎంతైనా చెప్పవచ్చు. పాత్రికేయుడు, రచయిత, అబ్దుల్ హలీమ్ షరర్ స్వాతంత్య్రానికి ముందే ఈ ప్రయత్నంచేశారు. ‘‘గుజాష్తాలక్నో’’ పేరుతో లక్నో సాంస్కృతిక జీవన రీతికి ఒక వర్ణచిత్రంగా ఉర్దూ పాఠకుల ముందు చిత్రించి చూపారు. ఇది లక్నోను గురించిన సమగ్ర పరిచయ వేదిక. గుజాష్తా లక్నోను 1973లో ప్రచురించారు. ఈ ఉర్దూ రచనను తనదైన అందమైన వచన శైలిలో దాశరథి తెలుగుచేశారు. ఎక్కడా ఎటువంటి విసుగు కలగకుండా సాఫీగా సాగిపోయే దాశరథి వచన రచన తాలూకు ముద్ర అనువాదం అంతటా కనబడుతుంది. ఉర్దూ భాషాసాహిత్యాలతో లోతైన పరిచయం, వచన రచనలో ప్రతిభా, సంపతి, భావుక హృదయం ఇవన్నీ దాశరథి అనువాదంలో అడుగడుగునా కనబడతాయి. పాఠకుడికి లక్నోపట్ల ఆసక్తిని పెంపొందింపజేసే తీరు దాశరథి అనువాదంలో పుష్కలంగా ఉంది.
ఇకపోతే, దాశరథికి గొప్ప వచన రచయితగా సాహిత్య చరిత్రలో నిలబెట్టేది ఆయన సంక్షిప్త ఆత్మకథ ‘‘యాత్రాస్మృతి’’. దాశరథిలోకి సంపూర్ణకవి హృదయానికి ప్రతిబింబం ఈ ఆత్మకథా శీర్షిక! నిజంగానే ఇదొక భావుక- సాహస కవి జీవనానుభవ మాలిక. చాలామంది షష్ఠిపూర్తి అనంతరమే ఆత్మకథా రచన చేస్తారు. అయితే దాశరథి మాత్రం అంతకుమునుపే ఆత్మకథను రచించారు. ప్రసిద్ధ సంపాదకులు, రచయిత పురాణం సుబ్రహ్మణ్యశర్మ సంపాదకత్వంలో వెలువడిన ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ధారావాహిక రీతితో ఇది ప్రచురణను పొందింది. 1980వ దశాబ్ది మధ్యకాలంలో వచ్చిన ‘‘యాత్రాస్మృతి’’ ధారావాహికను పాఠక లోకం ఎంతో ఆదరించింది. ఈ రచన పుస్తకం రూపంలో దాశరథి కన్నుమూసినా తరువాత తొలుత 1988లో వెలుగుచూసింది. అటుతర్వాత తిరిగి ప్రచురణలు పొందింది. ప్రస్తుతం విశాలాంధ్ర ప్రచురణల ద్వారా తిరిగి మరోమారు ప్రచురణ పొందింది.
‘‘యాత్రాస్మృతి’’లో ఎనె్నన్నో విశేషాలున్నాయి. ఇది వందల పుటలు విస్తరించిన స్వీయ చరిత్రకాదు. ‘‘అల్పాక్షరాలలో అనల్పార్ధ రచన’’ అన్న సూత్రానికి ప్రతిబింబం వంటిది. ఇది దాశరథి తన అనుభవాల పరంపరను చిన్నచిన్న వ్యాస ఖండికలుగా అందించారు. ఇవి పనస తొనల వంటి మధురిమను అందిస్తాయి. ఇందులో దాశరథి తన స్వీయ అనుభవ అంశాలకు పెద్దగా ప్రాముఖ్యత కల్పించలేదు. తన కాలంనాటి సంఘటనలకే పెద్దపీట వేశారు. ఎక్కడా అలవోకగా రాసినట్టు కనిపించదు. అవసరం వచ్చినపుడు సంవత్సరాలతోపాటు తేదీలను సైతం ఖచ్చితంగా నమోదుచేశారు. చారిత్రక సంఘటనల్ని తెలపాల్సి వచ్చినపుడు మహాకవి దాశరథిలోని నిష్పాక్షిక చరిత్రకారుడు కనబడతాడు. వచన రచనలో దాశరథి లాలిత్యం ప్రతి వ్యాస ఖండికలోనూ శ్రుతిబద్ధంగా విన్పిస్తుంది. నిజాం పాలన తాలూకు పరిస్థితుల్ని దాశరథి చిత్రించిన తీరు అప్పటి సమాజాన్ని అంచనావేసేందుకు బాగా తోడ్పడుతుంది. ‘‘ఈ యాత్రాస్మృతి వ్యాసాలలో డాక్టర్ దాశరథి ఆనాటి తెలంగాణ పరిస్థితులను నిరంకుశ పరిపాలన కింద నలిగిపోయిన ప్రజల ఇక్కట్టులను రాక్షసమైన యేలుబడిలో అణచివేయబడిన ప్రజల భాషల దయనీయస్థితికి సంస్కృతిని ఆనాటి చెరసాలలోని పరిస్థితులను ఏవిధమైన ప్రాథమిక సత్త్వాలు లేని సమాజాన్ని చక్కగా చిత్రించినాడు...’’ అని రాశారు- ప్రసిద్ధ సాహితీవేత్త దేవులపల్లి రామానుజరావు. ఆయన అభిప్రాయం యాత్రాస్మృతికి సంక్షిప్త సారాంశం.

-గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి