అక్షర

మనస్తత్వ వివరణల దృశ్యకావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బండశాపం’ (పద్య కావ్యం);
-జోస్యము విద్యాసాగర్;
పుటలు: 96;
వెల: రూ.100/-
ప్రతులకు: జె.విద్యాసాగర్, 12-2-827/5
కాంతినగర్, మెహిదీపట్నం, హైదరాబాద్- 500 028.
**
పురాణ ప్రసిద్ధమైన అహల్యా వృత్తాంతం అందరికీ తెలిసిందే. అయితే ఆ కథలో ఒక అపూర్వ ఘట్టం కొత్తగా సృష్టించి- అంటే- కథలో ఒక మార్పు- చేర్పుచేసి అహల్యను అకలంక చరితగా నిలబెడుతూ జోస్యము విద్యాసాగర్ ఒక కథాకావ్యం రాశారు. దాని పేరు ‘బండశాపం’.
సతీ అహల్యకు సుమ అనే పేరుగల ఒక పొరుగింటి నెచ్చెలి ఉంటుంది. అహల్య, సుమలకు సాహిత్యాభిరుచి మెండు. దేవేంద్రుడు ఊర్వశీ వ్యామోహియై, ఆ అప్సర స్ర్తితో సురతాసరసాలు అనుభవించటం అనే ఘట్టం ఒకటి ఊహించి అహల్య ఒక నాటకం రాస్తుంది. ఆ నాటకాన్ని కేవలం కళాభిరుచితో గౌతముడు గృహాంతర మేగియున్న ఒక రాత్రివేళ సుమ ఇంద్రుడుగాను, అహల్య ఊర్వశిగాను ఆహార్య సహితంగా (డ్రెస్స్డ్ రిహార్సెల్స్) సరదాగా నటిస్తుంటారు. నాటకంలో ‘ఊర్వశీ’ అనే సంబోధన మాత్రం ఎక్కడా ఉండదు.
ఆ సమయంలో గౌతమ మహర్షి ఇంటికి తిరిగొస్తూ కిటికీలోనుండి చూసి, ఇంద్రుని వేషంలోని సుమను నిజంగానే ఇంద్రుడుగా భ్రమించి, ఆగ్రహోదగ్రుడై, ఉన్నపళాన అహల్యను ‘బండరాయివై పోవుదువుగాక’ అని శపిస్తాడు. ఇది ఈ ‘బండశాపం’ కావ్యంలోని కథ. కేవలం మూడు ముక్కల యింత చిన్న కథను సూర్యాస్తమయ, చంద్రోదయాది వర్ణనలతో, మూడు ముఖ్యపాత్రల దైనందిన చర్యల, మనస్తత్త్వ వివరణలతో అటు శ్రవ్యకావ్యంగాను, సుదీర్ఘ సంభాషణలతో ఇటు దృశ్యకావ్యంగాను మలచారు విద్యాసాగర్ 272 పద్యాలతో. పరికరం, ఉపమ, ఉత్ప్రేక్ష, ఉదాత్త, స్వభావోక్తి, ప్రతీప, అనన్వయాది అర్థాలంకారాలు, అంత్యప్రాసాది శబ్దాలంకారాలు, ధ్వని శిల్పం, రసపోషణ- ఇత్యాదులైన ప్రధాన ప్రబంధ లక్షణాలు చాలానే ఉన్నాయి ఇందులో. అక్కడక్కడ దీర్ఘ సంస్కృత సమాస ధారాళత కూడా చక్కగా చోటుచేసుకుంది.
అది గౌతమ ఋష్యాశ్రమ ప్రాంతం. ముని మాపువేళ. మెల్లమెల్లగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. ‘‘పచ్చి సమయ సమిధ పడి అగ్నిహోత్రాన/ ఎగయ రాజుకొనని పొగల సెగల/ కారు నలుపు చేరెనాన్ జీకట్లు/ మింట ముసరెనంత మెల్లమెల్ల (నిత్యాగ్నిహోత్ర యజ్ఞకుండంలో పచ్చి కట్టెపడిన కారణాన జ్వాలలు సరిగా లేవక కేవలం పొగ మాత్రమే చుట్టుపక్కలకు వ్యాపించిందేమో అన్నట్టుగా సంజ చీకట్లు కమ్ముకున్నా యి) అంటూ ఉత్ప్రేక్షాలంకారంలో చేసిన వర్ణన అక్కడి పవిత్ర స్థల - సందర్భోచితంగా ధ్వనిస్తూ బాగుంది.
21వ పద్యంలో భర్తృ మానసానుగుణ్యంగా నీవలె సేవ చేయటం, జీవితపు సంపూర్ణ సమర్పణ భావంతో నడుచుకోవటం నీలాగా మఱి ఇంకెవరికీ చేతకావు... కావు అంటూ కాకులు కావుకావు మంటున్నాయి అన్న వాక్యంలోని భావ సౌందర్యం చెప్పుకోదగింది.
17వ పద్యంలో వేకువ జాముననే మేల్కొనిన అహల్యను చూసి వేగుచుక్క పొడమింది. చీకటి గుంపులు చెల్లాచెదరైపారిపోయాయి. ఉషోదయ కాంతులు తమ విధి నిర్వహణలోకి దిగినాయి అనటంలో ప్రకృతే అహల్యను చూసి సమయపాలన నేర్చుకుంటోంది అంటూ అవివక్షిత వాచ్య ధ్వనితో చెప్పటం, అందులోని పరోక్ష ప్రతీపాలంకారం- ఇవికూడా బాగున్నాయి.
‘‘వెలిబారు నళిబారు చెలువారు చెలిచేరు/ నీలాలకల సోయగాల జూచి’’ వంటి పద్యాలు కొన్ని ప్రాచీన ప్రబంధ కవుల పంథాలో పరిమళించాయి.
162వ పద్యంలో అహల్య నోటివెంట అనుకోకుండా ‘‘నా బ్రతుకునే పరిమార్చునొ బండరాతిగా’’ అనే అపశకున వాక్యం వెలువడటం ఎంతో ధ్వని శిల్ప రమ్యతతో ఒప్పారింది.
అయితే కావ్యదోషాలు కూడా కొన్ని దొర్లాయి. వ్యాకరణపరంగా నిత్య సంధులు నిర్లక్ష్యం, అంత్యాక్షరాల హ్రస్వీకరణ స్వతంత్రత, అజంత శబ్దాలను యథేచ్ఛగా హలంతాలుగా మార్చటం, సంప్రదాయ సాహిత్యశాస్తబ్రద్ధపు హుందాతనానికి వెలితి కలిగేట్టుగా చేసిన కొన్ని కొన్ని గ్రామ్య, వ్యావహారిక భాషా పదప్రయోగాలు, శబ్దదోషాలు, గణదోషాలు, యతి భంగాలు, నీచోపమ, అసమోపమ మొదలైనవి ఉన్నాయి.
‘‘పక్కనబెట్టి వ్యాకృతిని...’’అనే పద్యంలో తాను ‘వ్యాకరణాన్ని పట్టించుకోలేదు’. ‘చిన్నయ సూత్రాలను పక్కనబెట్టాను. రచనా నిబంధనలు నాకు అడ్డం అనుకున్నాను. ఈ విషయంలో నేను అసహాయుడను, తెలియనివాడిని, భాషపై పట్టులేదు’ అని కవి ప్రకటించుకున్నారు. కానీ, కావ్యంలోని అనేక పద్యాల రచనాసౌష్ఠవం పరిశీలిస్తే మాత్రం ఆయన గణనీయ స్థాయికి అధ్యయనానుభవం కలవారే అని అర్థం అవుతుంది.
పురుష సూక్తము, లలిత సహస్రనామ స్తోత్రాలు ఛందస్సును, వ్యాకరణాది శాస్త్రాలను దైవస్వరూపాలుగా పేర్కొన్నాయి. అలాంటి ఉదాత్త సాహిత్యాంశాలను నిర్లక్ష్యం చేయటం సముచితంగా లేదు.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం