అక్షర

నవ దృక్పథం-నయా విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నవ దృక్పథం’
కొండ్రెడ్డి సాహిత్య వ్యాసాలు
వెల: రూ.100/-
పేజీలు: 160
ప్రతులకు: ఇం.నెం.8/150
కొత్తపేట, కనిగిరి-523230
ప్రకాశం జిల్లా
9948774243

కవి కవిత్వం చెబుతాడు. విమర్శకుడు ఆ కవిత్వాన్ని విప్పి చెబుతాడు. కవి వేరు... విమర్శకుడు వేరు. కవిది సృజన. విమర్శకుడిది విశే్లషణ. మరి కవే విమర్శకుడైతే? కవిత్వ ధర్మాన్ని, మర్మాన్ని మరింత బాగా చెప్ప గలుగుతాడు. విమర్శ సులువవుతుంది. మరింత సాధికారమవుతుంది.
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఈ కోవకే చెందినవాడు. కవిత్వంతో ప్రారంభమైన కొండ్రెడ్డి సాహితీ వ్యాసంగం క్రమంగా విస్తరించి విమర్శ బాట పట్టింది. పద్య కవిత్వాన్ని, వచన కవిత్వాన్ని సరిసమానంగా రాయగల చేవ గలవాడు. విమర్శకుడిగా అవతారమెత్తి అనేక వ్యాసాలు రాశాడు. అవి వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఈ వ్యాసాలన్నిటినీ ఒకచోట చేర్చి ‘నవ దృక్పథం’ పేర సంకలనంగా తెచ్చాడు. ప్రస్తుతం సమీక్షిస్తున్న ఈ సంకలనంలో మొత్తం 42 వ్యాసాలున్నాయి. హారంలో దారంలా ఈ వ్యాసాలన్నిటిలోని మూల సూత్రం సాహిత్యంలో ‘నవ దృక్పథం’ అవసరాన్ని నొక్కి చెప్పడమే.
‘‘సామాజిక విధ్వంసక మూలాలను పట్టుకొని ఎత్తిచూపలేని సాహిత్యం మానవ మనుగడకు దోహదపడదు- అనేది నా నిశ్చితాభిప్రాయం. సిద్ధాంతాల ముసుగుల్లోనో, ఆధ్యాత్మిక మూఢ విశ్వాసాల్లోనో దాక్కొని మనిషిని తప్పుదారి పట్టించే సాహిత్యాన్ని ఎండగట్టాలనేది నా సంకల్పం’’ అన్న రచయిత మాటల్నిబట్టి ఈ వ్యాసాల మూల సారాంశాన్ని ఇట్టే గ్రహించవచ్చు.
పింగళి లక్ష్మీకాంతంగారు ‘సాహిత్య విమర్శ’ గ్రంథం రచించే నాటి విమర్శక ధోరణికి, ఇప్పటి విమర్శకు మధ్య ఎంతో వ్యత్యాసముంది. అప్పటి కవిత్వ కొలతలూ, కొలమానాలు ఇప్పుడు మారిపోయాయి. విమర్శ పేరుతో పరామర్శ ఎక్కువైంది. కవిత్వ అంతరాంతరాల్లో తొంగి చూడాల్సిన విమర్శకుడు పైపై పూతలకే పరిమితమై తన పనైందనిపిస్తున్నాడు. కవితాత్మను పట్టుకోకుండా, సాహిత్య మూల సూత్రాల జోలికి పోకుండా ‘కట్టె, కొట్టె, తెచ్చె’ అన్నట్లు కేవలం తడిమి ఊరుకుంటున్నాడు.
కొండ్రెడ్డి విమర్శను యిందుకు మినహాయింపుగా చెప్పాలి. సాహిత్యం ఎలావుండాలి? దాని లక్ష్యం, పరిమితులేమిటి? సాహిత్యానికి సామాజిక బాధ్యత అవసరం, వివిధ సాహిత్యవాదాలు, వాటిలో చోటుచేసుకున్న వైషమ్యాలు, నేటి సాహిత్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, అనువాద ధోరణులు, ఆధునికాంతర వాదం, వస్తు విస్తృతి, ప్రపంచీకరణ ప్రభావం, వెర్రి తలలు వేస్తున్న వ్యక్తి పూజ, పఠన సాహిత్యం, పునః మూల్యాంకన అవసరం వంటి వివిధ కోణాలనుంచి ఆధునిక సాహిత్య గమనాన్ని ప్రత్యక్షంగా గమనించి, నిశితంగా విశే్లషించి దాని గమ్యాన్ని నిర్దేశించాడు.
‘‘సాహిత్యం సిద్ధాంత కోరల్లో చిక్కి జడత్వం సంతరించుకొని స్ఫటికాకృతి చెందరాదు. సత్యం ప్రవాహస్థితిలో వుండాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలను వెలువరించాలి. అనంతానే్వషణ దిశగా సాహిత్యం పయనించాలంటాడు (పే-13). చెప్పినదానే్న, పాతబడ్డ అంశాలనే కొత్త అభివ్యక్తిలో మార్చిమార్చి చెప్పుకుపోవడంవల్ల వస్తు వైవిధ్యం కొరవడుతోందని బాధపడతాడు (పే-19). సాహిత్యంలో అస్తిత్వవాదాలను తీవ్రంగా విమర్శించాడు. అస్తిత్వ వాదాలు మరచిపోయిన చరిత్రను తిరగదోడుతూ, మాసిపోయిన గాయాలను కెలుకుతూ తమ ఉనికిని కోల్పోకుండా శిలాజాలుగా మిగిలి కనిపిస్తున్నాయంటాడు’. అలాగే సాహిత్యంలో వ్యక్తి పూజపై ధ్వజమెత్తిన తీరు బాగుంది.
మన సాహిత్యం శ్రీశ్రీ, గురజాడ, విశ్వనాథల దగ్గరే ఆగిపోయిందా? గత కాలము మేలు వచ్చు కాలము కంటే అన్న ధోరణి సాహిత్యానికి వర్తించదన్న విషయాన్ని రచయిత చెప్పిన విధం బాగుంది. పాత కవుల గురించి రాసీ రాసీ కలాలు అరిగిపోయాయి. వారి రచనలపై వచ్చిన విమర్శ రాశులు కొండల్ని తలపిస్తున్నాయి. మరి కొత్తవారి సంగతేంటి? ఎప్పుడూ పాత తరాన్ని పట్టుకొని వేలాడటమేనా? కొత్తవారి గురించి రాయాల్సిన పనిలేదా? సమాజంలో వస్తోన్న మార్పులు, నవ్య ధోరణులపై జరుగుతున్న సృజనను ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం లేదా? అంటాడు. అలాగే సాహిత్యంలో ఆధునికాంతర వాదాన్ని అర్థం చేసుకోవాల్సిన సందర్భాన్ని వివరించే వ్యాసం సాహిత్య పోకడలపై కొండ్రెడ్డి నిశిత పరిశీలనా దృష్టికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
భాషవేరు, సాహిత్యం వేరు కాదని, రెండూ జమిలి ఆదర్శమంటాడు (పే-125). సాహిత్యానికి లక్ష్యసిద్ధి మాత్రమే కాదు, మార్గశుద్ధి కూడా వుండాలనడం మెచ్చదిగింది (పే-141).
సాహిత్యంలో నవదృక్పథం అవసరాన్ని నొక్కిచెప్పే ఈ వ్యాసాలన్నీ ఉపన్యాసాల ధోరణిలో సాగాయి. రచయిత ఉపన్యాసకుడు కూడా కావడం దీనికి కారణం కావచ్చు. ఈ వ్యాసాల్లో రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నిటితో పాఠకులు ఏకీభవించకపోవచ్చు.
‘మార్క్సిస్టు భావజాలంతో కూడిన తర్కంతో మూఢ విశ్వాసాల కతీతంగా గత సామాజిక నేపథ్యాల్ని, దాని అసలు స్వరూపాన్ని అవగాహనించుకుంటూ నడుస్తున్న సామాజిక స్థితిగతులను సరిపోల్చుకుంటూ సమస్యల్ని ఎత్తిచూపే సాహిత్యం కావాలన్న రచయిత అభిప్రాయం ఏకపక్షంగా వుంది.
మార్క్సిస్టు భావజాలంతో కూడిన తర్కం సాహిత్యానికి అంత అవసరమా? మార్క్సిస్టు భావజాలం, తర్కం లేనిది సాహిత్యం కాదా? అలాగైతే భావ కవిత్వం మొత్తం సాహిత్యం కాకుండా పోవాలి.
సాహిత్య విలువల్ని పెంచడానికి, ఉబుసుపోని సాహిత్యం కాకుండా బతుకుతెరువు బాటకు దిక్సూచిలా వుండే సాహిత్యం కావాలన్న రచయిత మాటలకు అర్థం ఏమిటో తేలీదు. బతుకు తెరువు సాహిత్యం ఎలావుంటుందో రచయిత వివరించి వుంటే బాగుండేది. అయితే సాహితీవేత్తల సృజన శక్తికి ఓ దృక్పథం వుండాలి. ఓ సిద్ధాంతం వుండాలి. దానివల్ల సృజన శక్తి ఓ నిర్దిష్ట లక్ష్యంవైపుకు చేర్చుతుందన్న రచయిత మాటలు ఎంతైనా నిజం.
నవ్య సాహిత్య సృష్టి, విమర్శనా దృక్పథం, సాహిత్య దిశా నిర్దేశనం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ వ్యాస సంకలనం మార్గదర్శిగా వుపయోగపడుతుంది. విమర్శకుడు నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా, అవహేళన ఉద్దేశం లేకుండా, అనవసరంగా సాహిత్యాన్ని దుయ్యబట్టే దురుద్దేశం లేకుండా లోతైన విశే్లషణలతో సాహిత్య రంగంలో ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకునేవిధంగా సాహిత్య విమర్శ సాగాలంటాడు కొండ్రెడ్డి.. ఈ వ్యాసాల్లో అలాగే చేసాడు. సాహిత్యాభిలాషులంతా చదివి, ఆకళింపు చేసుకోవాల్సిన ఆసక్తికర విషయాలెన్నో ఇందులో వున్నాయి.

-ఎ.రజాహుస్సేన్