అక్షర

కుంతకుని వక్రోక్తికి సంగ్రహ రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వక్రోక్తి సిద్ధాంతం
సిద్ధాంత గ్రంథము;
-డా.బొద్దుల వెంకటేశం, వెల: రూ.200/-
ప్రతులకు: నవోదయ,
ఆర్యసమాజ్ మందిరం ఎదురుగా,
కాచిగూడా,
హైదరాబాదు- 500 027.

వక్రము అంటే వంకర- ఇది శాబ్దికమే కానక్కరలేదు. ఆర్థికము కూడా కావచ్చును. భావము వాచ్యముకాక సూచ్యము చేయటం వక్రోక్తి- రసం గంగాధరము ఆంతరమని వక్రోక్తి బాహిరమని కొందరి అభిప్రాయం. ఇది పునరాలోచింపదగినది. ధ్వన్యాలోకాది అలంకారికులు అందరి మనస్సులోను భంగ్యంతరముగా ఉన్నది వక్రోక్తియే. కుంతకుడు వేయి సంవత్సరాలకు పూర్వం జీవించిన ఆలంకారికుడు. అతని వక్రోక్తి జీవితముపై లోగడ చాలా వ్యాఖ్యానములో మూలగ్రంథం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు డా.బొద్దుల వెంకటేశంగారు గ్రంథం వచ్చింది. వారు సంగ్రహంగా వక్రోక్తిని తెచ్చారు. ఇది మూలము కాదు. దానికి సంగ్రహ అనువాదము. అట్లని అనువాదమే అని చెప్పలేము. హిందీ- ఇంగ్లీషు భాషలలోని ఆలంకారికుల స్పర్శకూడా ఈ గ్రంథంలో సంక్షిప్తంగా పొందుపరిచి కుంతకుని భావాన్ని దానితో తులనాత్మకంగా అధ్యయనం చేశారు. ఈ పనిచేయడానికి విశేషమైన పాండిత్యం కావాలి. శ్రీ బొద్దుల వెంకటేశం సంస్కృత హిందీ భాషలలో ఆంగ్లంలో తగిన పాండిత్యం సంపాదించటం చేత ఇది సాధ్యమయింది. ఈ గ్రంథానికి వారు పెట్టిన పేరు వక్రోక్తి సిద్ధాంతం (ఎ థియరి ఆఫ్ ఆబ్లిక్ స్పీచ్) ఇందులో ఎనిమిది అధ్యాయాలున్నాయి. అధ్యేయ గ్రంథాలు వదిలితే ఏడవ అధ్యాయంలో ముఖ్య కారికలను ఇవ్వటం జరిగింది కాబట్టి మొదటి ఆరు అధ్యాయాలలోనే రచయిత వ్యాఖ్యానం సాగింది. ఇందులో మూడవ అధ్యాయం వక్రోక్తి అన్యసంప్రదాయాలు ఇతరులు అంతగా స్పృశించనిది. విషయ వస్తువిశే్లషణతో మొదలుపెట్టి కావ్యస్వరూపం వివరించారు. కావ్యాత్మ కావ్యశైలి కావ్యహేతువులు ప్రత్యక్షంగా వక్రోక్తికి సంబంధించనివే అయినా విద్యార్థుల సౌకర్యంకోసం ఇందులో ఒక అధ్యాయంగా చేర్చారు. ఇందులో వర్ణవిన్యాస వక్రత పద పూర్వార్థరసం- అలంకారం- రీతి ధ్వని ఔచిత్యం వీటిలో వక్రోక్తిని కుంతకుడు సాధించాడు. ఐతే కుంతకుడు స్వతంత్రుడు కాడు. తత్పూర్వ ఆలంకారికుల భావాలనే నెమరువేశాడు. అంటే ఇదొక ఆలంకారిక సహజ పరిణామం. ఆనందవర్ధనుని వలెనే కుంతకుడు తన వక్రోక్తి సిద్ధాంతాన్ని నాలుగు ఉనే్మషములుగా విభించినాడని వెంకటేశంగారు చెప్పారు. కాని కొంత గ్రంథం నష్టమైందనే ఒక అభిప్రాయం ఉంది. ఇది పరిశోధనాంశము. ఇది శాస్త్రగ్రంథము కాబట్టి తెలుగు మాతృభాషగా కల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. మూలము చదువుకోలేనివారు ఈ గ్రంథం చదివి సంతృప్తిచెందవచ్చు. అక్కడక్కడ వాక్యాలు హిందీ నుడిగారంలో ఉన్నాయి... ‘వార్త రూపంను ధరిస్తుంది’ 11వ పుట. వార్త రూపాన్ని అని ఉండాలి. లేక రూపమును అని కూడా ఉండవచ్చు. 119వ పుటలో కుంతకుడు తన మార్గంకు తెలిపిన లక్షణాలివి అని ఉంది. మార్గానికి అనేది తెలుగువాక్యం అవుతుంది. అంటే వెంకటేశంగారి మీద హిందీ భాషాప్రభావం ఎక్కువగా ఉందని తాత్పర్యం. ఈ గ్రంథం విద్యార్థులే కాదు రచయితలు కూడా చదువుకుంటే తమ రచనలలో వాచ్యము- సమాచారతుల్యము ఎంతో- వక్రోక్తితో చేసే అభివ్యక్తి ఎంతో తెలిసి ఆత్మవిమర్శ చేసుకోగలుగుతారు.

-ముదిగొండ శివప్రసాద్