అక్షర

భక్తి ఒక మృదు వచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద నందనము
-పద్య కావ్యం;
కవి: కీ.శే.గెడ్డాపు అప్పలస్వామి; పుటలు: 44;
వెల: రు.40/-;
ప్రతులకు: శ్రీమతి గార
సీతారత్నం, తిరుమలనగర్,
శ్రీకాకుళంరోడ్, రాజాం 532 127. ఫోన్ 9885758123

దైవభక్తి-అందునా-ఇష్ట దైవ భక్తి అనేది భక్తుడికి ఎప్పుడూ ఒక చోదన శక్తి. సాహితీ ఆరాటము, రచనోత్సాహము, సహజంగా జన్యువులలో ఎంతో కొంత వాగ్ధార శక్తి ఉన్న భక్తుడు ఏదో ఒకటి భగవత్పరంగా రాసి, ఆత్మానందానుభూతి పొందకుండా ఉండడు. అలా అక్షర రూపం దాల్చిందే కీ.శే.గెడ్డాపు అప్పలస్వామి రచించిన ‘నంద నందనం’ అనే కృష్ణ భక్తి-స్తుతి కావ్యం.
ఇందులో కవి తన మాతాపితలను గూర్చి రాసిన నాలుగు పద్యాలు, ఇంకా ‘అంకితము’, ‘నంద నందనము’, ‘యువ కిశోరము’ అనే శీర్షికల కింద రాసిన పలు పద్యాలు అన్నీ కలుపుకుని మొత్తం నూట అరవై మూడు పద్యాలున్నాయి. ‘నందనందనము’ అనే శీర్షికతో ఉన్న 126 పద్యాలూ ‘నందనందన! గోపికా బృంద రమణ!’ అనే మకుటంతో ముగుస్తాయి.
పద్యరచన చాలా సరళరీతిలో సాఫీగా సాగిపోయింది. కృష్ణ పరమాత్మమీద కవి అప్పలస్వామిగారికి ఉన్న అచంచల విశ్వాసము, భక్తి ప్రపత్తులు సదృఢమైనవి అని చెప్పడానికి
‘‘కృష్ణ!నీ చరితమ్మె యుత్కృష్ట కావ్య
మదియ ఎవడేని కవియగునది స్పృశించి;
విలువ లేనట్టిదౌ తామ్ర ఫలకమైన
పరుసవేదిని తాకిన పసిడిగాదె?!’’ అన్న అర్ధాంతరన్యాసాలంకారంలోని పద్యం గీటురాయి. శ్రీకృష్ణుని చరిత్రమే ఒక మహోదాత్త కావ్యం. దానిని ముట్టుకున్నంత మాత్రాన-అంటే-ఆ దివ్య చరిత్రను ఏ కొంచెం మాత్రం విన్నా, చదువుకున్నా అట్టివానికి రచనాశక్తి అబ్బుతుంది. పనికిరాని రాగిరేకును పరుసవేది అనే సువర్ణ కరణీ మూలికకు తాకిస్తే రాగిరేకు కనకం అయిపోదా అని ప్రశ్నిస్తాడు కవి నిర్మల భక్తి శక్తిని నిండుగా నమ్ముకొని. నిజమే మరి. కాళిదాసు, తెనాలి రామన్న మున్నగు కవులందరూ సద్యఃకవితాశక్తి మంతులైన వారే-్భగవత్కృపాలబ్ధులై
‘‘జలధి శాయివి! జలధి జాజానివి జల
జ నయనుండవు చదలేటి జననకుడవయి
యమున పాయలు సేయుటే మనగవచ్చు?!’’ (సముద్రం మీద శయనిస్తావు, సాగర తనయే నీకు సతి. జలజాతాల వంటి కన్నులు గలవాడివి. ఆకాశ గంగకు తండ్రివి. నీ సంగతి అంతా నీటిమయమే. అలాంటి నీవు యమునా నదీ జలాలను చీల్చుకుంటూ పోతావా?!) అనటంలో వ్యాజనిందాలంకారపు సొగసులు కనిపిస్తాయి. అదొక చమత్కారం.
‘‘కటిక మధురాపురీశు సంకటము వాసి
భద్రమని చేరినావు వ్రేపల్లె వాడ
తల్లిదండ్రుల గంసుని దయకు వీడి’’ (కన్న తల్లి దండ్రులను కర్కశుడైన కంసుని దయాదాక్షిణ్యాలకు వదిలేసి నీ సుఖం కోసం నీవు మాత్రం మధురను వదలి వ్రేపల్లె వెళ్లిపోతావా? ఇదెక్కడి ధర్మమయ్యా?!) అంటూ లీలా విలాసుడైన కృష్ణుని ఆట పట్టించడం భగవంతుని యందు భక్తునకుండే చనువును తెలియజేస్తుంది.
‘‘నడికి రేయిని నీతోడి బుడుతలెల్ల
నిచ్చెనగ నిల్వ వెన్నంత మ్రుచ్చిలించి
భాండమును వ్రయ్యగొట్టు సంబరమదేమి?!’’
(తోటి పిల్లమూకలను పిల్చుకొచ్చి వాళ్లను ఒకళ్ల మీద ఒకళ్లునుగా నిలబెట్టి, నిచ్చెనగా చేసుకొని ఉట్టిపైని కుండలో ఉన్న వెన్నంతా దోచుకొని, దోచిపెట్టి, చివరకు ఆ కుండను కిందపడేసి పగలగొట్టి గంతులేస్తావా?) అంటారు అప్పలస్వామిగారు. ఈ పద్యంలో భాష, భావము లలిత సుందరంగా ఉన్నాయి.
నడిరేయి అనడానికి ‘నడికి రేయి’ అనటం ప్రాచీన భాషా ప్రయోగం బాగుంది. మొత్తంమీద ఈ పుస్తకం సాయంత్రప్పూట ఆరుబయట చల్లని వేళ మంచం వేసుకొని కూర్చుని చిన్నారులకు బాల కృష్ణుని కబుర్లు, మహిమలు (శృంగార రసస్పర్శ లేనివి) చెప్తు వాళ్లకు-ఈ కాలపు ఆంగ్ల మాధ్యమపు కానె్వంటు కల్చర్లో కొట్టుకుపోతున్న వాళ్లకు-మన పసందైన పద్యపు ఒరవడిని అలవాటు చేస్తూ ఒక అనిర్వచనీయ అనుభూతిని పొందటానికి అనువైన తేట తెలుగు మాటల ముచ్చటైన పుస్తకం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం