అక్షర

చిన్ననాటి ముచ్చట్లు.. ఈ రెపరెపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చిగురాకు రెపరెపలు’’
-మనె్నం శారద
వెల: రు.100/-
ప్రతులకు: జె.వి.పబ్లికేషన్స్, 103, జయ
అపార్టుమెంట్స్, 3-6-18, హిమాయత్‌నగర్,
హైద్రాబాద్

‘అడవి గులాబి’ కథనుంచి ప్రస్థానం మొదలుపెట్టిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి మనె్నం శారద నలభై మూడు నవలలు, వెయ్యికి పైగా కథలు, ఫీచర్స్, వ్యాసాలు, సీరియల్స్‌కి కథ, మాటలు వంటి సాహితీ సాధన చేసి పలు గౌరవాలు పొందిన రచయిత్రి.
ఈ పుస్తకం ఇతర రచనల వంటిది కాదు. దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత శారదగారు తన బాల్యంలోకి ప్రయాణించి సోదరి ఇందిర కోరిక మీద తన గురించి రాసుకున్న ఆత్మకథ లాంటి బాల్యకథ. బాల్యం గురించి ఇంత విషయం ఉంటుందా అన్పిస్తుంది. సినిమాల్లో అయితే చటుక్కున పెద్దయిపోయినట్లు చూపిస్తారు గానీ పిల్లలకి ఎన్ని సందేహాలు, సమస్యలు, ఇష్టాలు, అయిష్టాలు బాధలుంటాయి చెప్పండి.
ఇది ఓ అల్లరిపిల్ల కథ. అయిందానికీ కాని దానికీ ‘అమ్మ పెట్టే నాలుగూ’ తింటూ కూడా నాట్యాన్నీ, గానాన్నీ, చిత్రలేఖనాన్నీ అభిమానించిన పిల్ల ఊహల్లో ఊయల లూగుతూ, ఆరో ఏటే నాటకం రాసి విలన్‌గా నటించిన బుల్లి రచయిత్రి కథ. ఇందులో కష్టాలన్నీ నవ్వులే! కన్నీళ్ళన్నీ సంఘటనలే! మంచివాళ్ళు, అసూయ పడేవాళ్ళు, దయామయులు, పిల్లల పట్ల సరిగా ప్రవర్తించలేని అమ్మ, వాడుకొని మోసం చేసేవాళ్ళు అంతా కన్పిస్తారు.
పదకొండో ఏటే ‘‘పగబట్టిన పడుచు’’అనే డిటెక్టివ్ నవల రాసి, ఎమ్.ఎ. తెలుగు లిటరేచర్ కలలుగని టెక్నికల్ స్టడీస్ చేసిన నాయిక జీవితంలో తనకొచ్చిన అద్భుత అవకాశాలు వదిలేసుకుని రాజీపడటం చదివితే చాలామందికి తమ జీవితంలో వదిలేసుకున్న ఎనె్నన్నో అవకాశాలు గుర్తొస్తాయి. తొలి కథ శాపగ్రస్తుడు ‘మధువని’ కథల పుస్తకంలో ప్రచురితం కావటం గణేశ్ పాత్రో ప్రశంసలు పొందటం భవిష్యత్ సూచనలు.
చాలామంది తల్లిదండ్రులకి పిల్లల గురించి కలలుంటాయి. వాళ్ళ కలలు కూడా వీళ్ళే కంటుంటాడు. దీనివల్ల పిల్లల కలలు కరిగిపోతాయని వాళ్ళకి తెలీదు పాపం. ఇంట్లోవాళ్ళకి సాహిత్యాభిమానం ఉన్నా తమ పిల్లల్ని రచనా రంగంలో ప్రోత్సహించలేరు. ఒక డాక్టర్, పోలీసాఫీసర్‌ని దూరంగా చూసి ఆనందిస్తారు. అవసరానికి వాడుకుంటారు గానీ ఇంట్లోనే వాళ్ళుండటాన్ని హర్షించలేరు.. బాల్యపు అల్లర్లనుండి వికసించిన జాలి, దయ, ప్రేమ, పరోపకార గుణాలు పుట్టుకతో వచ్చేవి. బల్లిని ఖననం చేయటం, కూరలో ఇసక కలపటం, తెలుపుని అందం అంటుంటే ధిక్కరించటం, సైకిలు సీటు బ్లేడుతో కోయటం, చిలుకని పట్టబోయి గాయాలపాలవటం, సంగీతం మాస్టారికిచ్చిన మంచినీళ్ళలో ఉప్పు కలపటం, ఆయన పిలకకి కిటికీకి కలిపి దారం కట్టటం, మామయ్య రివాల్వర్ పేల్చేయత్నం. త్రాచుపాము తోక పట్టుకొని లాగుతూ ఆడటం లాంటి ఎన్నో ఆటలు అల్లర్లమధ్య ప్రమాదకరమైన సంఘటనలున్నాయి. అమాయకత్వం, సహజ స్వచ్ఛతవల్ల ప్రమాదం అర్థంకాని వయసులో ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి కొన్నైనా ఉంటాయనిపిస్తుంది. కానీ వర్ణ దృశ్యాల్లా అనే్నళ్ళ వెనక సంఘటనల్ని ముత్యాలహారంలా అద్భుత శైలిలో రాసి హాయిగా చదివించారు రచయిత్రి. ఇంతాచేసి ఇన్నిన్ని ఘనకార్యాల్ని ఐదు సంవత్సరాల నుంచి తొమ్మిదేళ్ళ వయసులో చేయటానికి సగం కారణం అమ్మతో చనువులేకపోవటం అన్పిస్తుంది. బంగారు బాల్యంలోనే ప్రకృతి పట్ల ప్రేమ, అక్షరాల పట్ల అనురాగం, అవ్యక్తమైన ఊహలు, చిత్రలేఖనం, నాట్యం అంటే మోజు, ఇతరుల బాధ చూడలేకపోవటం, అందరినీ ఆదరించాలనే ఆశ.. ఇవన్నీ గాలికి సయ్యాటలాడే చిగురాకు రెపరెపలైనా ఆ చిగురాకుల రెపరెపలే భవిష్యత్తులో అద్భుత సృజన కథనాలవటం ప్రతిభకు దార్లుగా, సూచికలుగా దీపించటం ఆనందకరం.
చదివించే చక్కని శైలి, ప్రింటుతో మనె్నం శారదగారి చిగురాకు రెపరెపలు అందరి మనసుల్లో జారిపోయిన బాల్యాన్ని పునఃప్రతిష్టచేసి ఆనంద పరుస్తాయనటంలో సందేహం లేదు. ఈ జీవితాద్భుత అనుభవాలకి భువనచంద్రగారి ముందుమాట సహజంగా అమిరింది. సోదరి ఇందిర ప్రేమ పదాలు, చిన్నప్పటి ఫొటోలు అందరికీ నచ్చే పుస్తకం.

-సి.భవానీదేవి