అక్షర

వినోదం.. విజ్ఞానం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామెత కథలు
-శ్రీమతి జ్యోతిర్మయి;
వెల: రూ.120/-
ప్రతులకు: జయంతి
పబ్లికేషన్స్, పి అండ్ టి కాలనీ, దిల్‌సుఖ్‌నగర్,
హైదరాబాదు
2.రచయిత
505, మెడోస్ అపార్టుమెంటు, వైట్‌ఫీల్డ్స్,
కొండాపూర్,
హైదరాబాదు-81
***
భాషకు నిండుదనం చేకూర్చేవి సామెతలు. అందుకే ‘‘సామెత లేని మాట, ఆమెత (వాదు)లేని ఇల్లు’’ వ్యర్థం అన్న భావనతో వాడుతుంటారు. సామెతలను ‘‘అనుభవసారములు’’అని కూడా అనవచ్చును. అనుభవ సారాలైన సామెతలు ఎప్పుడు పుట్టాయో నిర్ణయించుట కష్టం. బహుశా భాష, భావం, అంత ప్రాచీనమైనవిగా సామెతల్ని నిర్ధారించవచ్చును.
ప్రాచీన భారతీయ వాఙ్మయమంతా సామెతల మయం అనవచ్చును. ‘సామెత’అన్న పదానికి మూలాలు సంస్కృతంలోని ‘సామ్యత’అన్న పదంలో దొరుకుతాయి. సాటి చూపి: అంటే- పోల్చి చెప్పటమే ‘సామెత’ ప్రధాన గుణము. ఎక్కడో ఒక సంఘటన జరుగుతుంది. దానిపై సామెత పుడుతుంది. అంటే సామెతలన్నీ కథా సహితాలన్నమాట. ఈ కథలు పౌరాణికాలు కావచ్చు(చూచి రమ్మంటే కాల్చివచ్చినట్లు- హనుమంతుడు. లంకాదహనం) చారిత్రకాలు కావచ్చు (అయ్యవారు రాలేదని అమవాస్య ఆగదు) సాంఘికాలు కావొచ్చు (తన బలిమికన్నా, స్థానబలిమి మేలు) లేదా, కాల్పనికాలు కావొచ్చు (పిల్లికి రొయ్యల మొలతాడు కట్టినట్లు). ఒక్కోసారి, ఇవేవీకాకుండా, వస్తుగుణాత్మకమై కథారహిత సామెతలు కావచ్చు (ఉదా: ఇంగువ కట్టిన గుడ్డ, కంచే చేను మేయటం). ఒక వ్యక్తి తాను చెప్పే విషయానికి బలం చేకూర్చటానికి సామెతల్ని ఉపయోగిస్తారు.
శ్రీమతి మాడిశెట్టి (గందె) జ్యోతిర్మయిగారు సుమారు పదేళ్ళనుండి బొమ్మరిల్లు మాసపత్రికకు ‘‘సామెత కథలు’’ అన్న శీర్షికతో ఒక సామెత, దాని వెనక ఉన్న కథను వ్రాస్తున్నారు. వాటిని ఇప్పుడు ‘‘సామెత కథలు’’ అన్న టైటిల్‌తో మన ముందుకు తెచ్చారు.
ఇందులో 102 సామెతలు. వాటిని వివరించే కథలున్నాయి. సందర్భాన్ని అనుసరించి ఒక్కో సామెతకు ఒక పేజీనుండి నాలుగు పేజీల వరకు వివరణ కథల్ని ఇచ్చారు. ఇందులో ఎక్కువగా ‘స్వకపోల కల్పిత’కథలే ఉన్నాయి. ఈ కథలతోబాటు, ఆ సామెత వెనక జన బాహుళ్యం వాడుకలో ఉండే కథ కూడా వివరిస్తే బావుండేది. ఉదా: రెంటికిచెడ్డ రేవడి. రేవడి అంటే చాకలి. ఒకనాడు ఒక చాకలి ఏట్లో గుడ్డలు ఉతుకుతున్నాడు. నదీ ప్రవాహానికి దగ్గరగా ఉతకాల్సిన బట్టలున్నాయి. నదిలో ఉతుకుతున్న చాకలివద్ద మరికొన్ని బట్టలున్నాయి. ఇంతలో ఏరు పొంగింది. గాభరాలో చాకలి తాను ఉతుకుతున్న బట్టల్ని అలాగే వదిలి, గట్టుమీది బట్టలవేపు పరిగెత్తాడు. అప్పటికే పొంగిన ఏట్లో అవి కొట్టుకుపోయాయి. చాకలి బాధపడుతూ ఉతుకుతూ ఏట్లోనే విడిచిన బట్టలవేపు పరిగెత్తాడు. అప్పటికే, అది కూడా పొంగిన ఏటి నీటిలో కొట్టుకుపోయాయి. ఇలా ఆ చాకలి ఏట్లో ఉతుకుతున్న బట్టలు గట్టుమీద ఉంచిన బట్టలు రెండింటినీ పోగొట్టుకున్నాడు. ఇలా రెండింటిని నష్టపోయిన వాడయ్యాడు.
జ్యోతిర్మయిగారు తన కథల్లో ఇలాంటి ప్రత్యేక అర్థాల్నికూడా వివరిస్తే ఆమె సంకలనానికి మరింత నిండుతనం, సంపూర్ణత చేకూరేది.
తెలుగులో డా.తెనే్నటి సుధాదేవిగారు, 500పైగా తెలుగు సామెతల్ని గ్రంథీకరించి రికార్డు సృష్టించారట! శ్రీమతి జ్యోతిర్మయిగారి 102 సామెతలుగల ఈ సంకలనం బహుశా రెండవది అవుతుందేమో.
బొమ్మరిల్లు సంపాదకురాలు వసుంధర, డా.ముక్తేవి భారతి, డా.గురజాడ శోభాపెరిందేవి మరియు అనితాసాగర్ చీలా గారల ముందుమాటలు సంకలనానికి పరిపూర్ణత చేకూర్చాయి.
వినోదం, విజ్ఞానం చేకూర్చే ఇలాంటి పుస్తకాల్ని ప్రోత్సహించి ప్రచురిస్తున్న జయంతి పబ్లికేషన్స్‌వారు అభినందనీయులు. సామెతల యెడ బలమైన భావంతో, తన కల్పనాశక్తిని జోడించి, శారీరక అసౌకర్యాన్ని కూడా లెక్కచేయక ఈ 102 సామెతలకు కథలు బోనస్‌గా ఓ కథను ఈ పుస్తకంలో అందించిన శ్రీమతి జ్యోతిర్మయిగారు అభినందనీయులు.

-కూర చిదంబరం