అక్షర

వైవిధ్య భరితం... పెద్దింటి కథల సమాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జుమ్మేకి రాత్‌మే’’ (కథలు)
పెద్దింటి అశోక్‌కుమార్
వెల: 140 రూపాయలు,
పేజీలు: 203.
నవచేతన బుక్‌హౌస్

కరువు, వృత్తిపనుల నాశనం, గ్రామీణ విధ్వంసం, అల్లకల్లోలమైన ఉత్తర తెలంగాణ జీవితాలను అద్భుతంగా చిత్రీకరించిన రచయితగా పెద్దింటి అశోక్‌కుమార్‌కు మంచి గుర్తింపు వుంది. వీటికి భిన్నంగా ఈసారి విస్తృత పరిధిలో వైవిధ్య భరితమైన కథలతో ‘‘జుమ్మేకి రాత్‌మే’’ సంకలనంతో మన ముందుకు వచ్చారు.
బడిపంతులుగా రచయిత చదువుకోవాలని ఆరాటపడే పిల్లలను చూశారు. చదువు ఎలా వ్యాపారంగా తయారయిందీ, చదువుల పేరిట పిల్లల బాల్యాన్ని ఎలా చిదిమేస్తున్నారో గమనించారు. వీటన్నింటిని కథలుగా మలచడంతోపాటు నిరుద్యోగుల నిష్క్రియాపరత్వాన్ని ఎండగడుతూ కథ రాశారు. ఎప్పుడూ ఫస్ట్‌క్లాస్‌కోసం ఆరాటపడుతూ బడికిపోయే అమ్మాయిని, బడికి పోనివ్వకుండా పొలం కాపలాకు పంపితే ఆ అమ్మాయి పడిన మనోవేదనకు ‘‘ములాఖత్’’ అద్దం పడుతుంది. చదువంటే ర్యాంకులు, ఎమ్సెట్ అని అభిప్రాయం స్థిరపడ్డాక పిల్లలకు చదువులంటే నరకంగా తయారయ్యాయి. ఈ పరుగు పందెంలో వెనుకబడకూడదనుకునే తల్లిదండ్రులు పిల్లలకు బాల్యాన్ని దూరంచేస్తున్నారు. ర్యాంకుల పేరిట ఆడపిల్లలను సైతం దూరంగావున్న హాస్టళ్ళలో పడేస్తే, ఆ పిల్లల మానసిక క్షోభ ఎలా వుంటుందో అత్యంత సహజంగా చిత్రీకరించిన కథ ‘‘ప్రోగ్రెస్’’. ప్రతి తల్లిదండ్రులు చదవాల్సిన కథ ఇది. పక్షులైనాసరే రెక్కలొచ్చెంతవరకే పిల్లలను సాదుతాయి. పెద్ద చదువులు చదివి నిరుద్యోగులుగా తల్లిదండ్రుల మీద బతికే పిల్లలు వాటిని చూసి చాలా నేర్చుకోవాలని ‘‘అనగనగా ఓ కోడిపెట్ట’’ చెబుతుంది.
దారిద్య్రంనుండి బయటపడటానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి స్ర్తిలు ఎన్ని కష్టాలు పడతారో, ఎంత హింసను అనుభవిస్తారో కొన్ని కథలు తెలియజేస్తాయి. ఏ దిక్కులేని ఆడదాని జీవితం. ‘‘ఏడిండ్ల పిల్లకూన’’లా తయారవుతుందని ప్రతీకాత్మకంగా చిత్రించిన కథ ఒకటి. ఉద్యోగాల రీత్యా దూరంగావున్న భార్యాభర్తలు. దూరంగా ఉన్నప్పుడు ఉండే ప్రేమ దగ్గరయినప్పుడు ఆవిరైపోతుంది. అహంభావం, ఆధిపత్య ధోరణులే దీనికి కారణం. ఇది గుర్తించనంత కాలం వారు ‘‘రెండు నదులు’’గా వేరువేరుగానే మిగిలిపోవాల్సి వస్తుంది. బతకలేని చేనేత కార్మికుల జీవితాలకు ఆత్మహత్యలే పరిష్కారం కావడం అమానుషం. సంపాయించే మొగుడు చచ్చిపోతే అప్పులతో భార్య ఆ కుటుంబాన్ని నడిపించడం ఎంత దుర్భరంగా మారుతుందో ‘‘ఎదురు చేప’’ కథలో చూడవచ్చు. అయినా కథను ఆశావహ దృక్పధంతో ముగించడం బాగుంది. మస్కట్‌లో వున్న భర్త ఇండియాలో మూడు నెలలు గడపడానికి వచ్చినప్పుడు- అన్ని సంబంధాలను, పనులను వదిలించుకుని అతడి కొరకే వేచి వున్నట్లు, ఐదేండ్లు ఉగ్గబట్టుకుని పలవరిస్తున్నట్టు నటిస్తూ అతడి ఈగోను సంతృప్తిపరచడం ఆమెకు అలవాటైపోతుంది. ఎప్పుడైతే ఆమెను పనినుండి ముఖ్యంగా భూమినుండి దూరంచేస్తారో అప్పుడే ఆమె పిచ్చిదై పోతుంది. అసలు సమస్య ఎక్కడుందో వెతకడం, పరిష్కారం చూపించడం ‘‘గ్లాసియర్’’ కథలో కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలలో చిక్కుకుని స్ర్తిలు ఎలా నలిగిపోతున్నారో ఈ కథలు వివరిస్తాయి.
అందరికీ చెందాల్సిన భూమి, నీళ్ళు, డబ్బు కొందరి గుప్పిట్లో అంటే బలం, అధికారం వున్నవాడి చేతిలో ‘‘బందీలు’’గా వున్నాయని ప్రతీకాత్మకంగా చెప్పే కథ ఒకటి. ఆయా అంశాలకు దేవతారూపం కల్పించి, తామెలా బందీలైపోయారో వారి నోటంటా చెప్పించడం ఇందులో వుంది. రైతులు, పేద ప్రజల సేవ అని ముందు మాట్లాడిన డాక్టర్ ఊర్లోకి వచ్చి ప్రాక్టీస్ పెట్టుకున్న తర్వాత డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజల్ని పీడించడం, మనిషి రక్తం తాగే పులిలా తయారుకావడం తలచుకుంటే ‘‘్భయంగా వుంది’’అంటారు. దొంగ సారా తాగితే జనాలు ఛస్తారు. నిజమే, కాని దాన్ని ఎవరు అరికట్టాలి? తయారుచేసే వాళ్ళు ఎవరు? చేయించేవాళ్ళు ఎవరు? సారా కాంట్రాక్టర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు ఒకటైం తర్వాత దాన్ని ఎవరు అడ్డుకుంటారు? ఎవరైనా ధైర్యం చేస్తే వాళ్ళు బ్రతికుండరు. ఇదంతా ఒక విష ‘వలయం’లా తయారయింది. మామూలు వాళ్ళకంటె భిన్నంగా బతికే వాడిని, వ్యవస్థకు ఎదురీదే వాడిని లోకులు ‘‘ఇహ వీడు తొవ్వకు రాడు’’అనుకోవడం ఎంత సహజంగా మారిందో ఇంకో కథ వివరిస్తుంది. అన్ని విలువలను తోసిరాజని డబ్బు సంపాదనే ధ్యేయంగా మిగిలిన ఈ కాలంలో మనుషుల్లో చోటుచేసుకున్న వ్యాపార మనస్తత్వాన్ని, వాళ్ళు చేసే దుర్మార్గాలను ఈ కథలు తెలియజేస్తాయి.,
ఊరందరికి సెంటర్ పాయింట్‌గా వుండే ఎడ్లకొట్టం. అప్పట్లో యువతకు ఎడ్లకొట్టమే కార్యాలయం. ఊర్లో సంఘం పెడితే కొట్టంలోనే క్లాసులు జరిగేవి. ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు గోడలు కూలిపోతే ఇరవై వేల ఖర్చు. వరి నాట్లకని, కోతల కని ఎక్కడెక్కడి నుండో కూలీలు వస్తే వారికి ఎడ్లకొట్టమే విడిది. ఊళ్ళోకి వచ్చే బిక్షు గాయకులకు అదే ఇల్లు. మద్య నిషేధ కాలంలో వాళ్ళు తాగడానికి తెచ్చుకున్న సారా దొరికిందని పోలీసులు. సారా కేసుల పైకప్పు కాలిపోతే ఇరవై వేల ఖర్చు. పోలీసులు ఆ కొట్టాన్ని విప్పేయమన్నా, తల్లిదండ్రులు, భార్య ఆ ఎడ్లకొట్టాన్ని అమ్మేయమని పోరినా అది ఎందరికో నీడ అని దాని జోలికిపోడు. పట్నంనుంచి వచ్చిన రచయితకు ఇప్పుడు ఆ ఎడ్లకొట్టం సారా అంగడిగా మారిపోవడం కనిపిస్తుంది. యువత అంతా మత్తులో జోగడం, హత్యలు-అరాచకాలు చూసి విరక్తిచెంది ఎందరు వద్దన్నా వినకుండా ఆ కొట్టంను విప్పేస్తాడు. దాని అడుగున ఇప్పుడు మరో నిర్మాణం జరగాల్సి వుందని సూచించడంతో ‘‘మా ఎడ్లకొట్టం ఎట్ ది రేట్ ఆఫ్ 2010’’ కథ ముగుస్తుంది. ‘‘పామును తరిమిన చీమలు కథలో ఊరి సమస్యలను నాటకాలుగా మలిచి, బడి పిల్లలతో ప్రదర్శించి జనాల్లో చైతన్యం కలిగించడానికి పంతుళ్ళు ప్రయత్నిస్తుంటారు. కాంట్రాక్టర్ నాగరాజు ఊళ్ళో కంకర మెషిన్ పెడితే రాళ్ళు, గుట్టలు మాయంకాక తప్పదు. పర్యావరణ కాలుష్యంతో ఊరు నాశనమయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తూ, నాటకం రాసి ప్రదర్శన ఏర్పాటుచేస్తారు. తీరా ప్రదర్శన మధ్యలో పాత్రధారులు మారిపోయి కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మాట్లాడడం పంతుళ్ళను ఆశ్చర్యానికి, అయోమయానికి గురిచేస్తుంది. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించలేదనీ, ప్రశ్నించలేదనీ, వారిలో చైతన్యం కొరవడిందని పంతుళ్ళు బాధపడుతారు. కాని విచిత్రంగా, మర్నాడు గుట్టను ముట్టొద్దని ఊరుఊరంతా కదలడంతో అంతా ఆశ్చర్యపోతారు. ఉద్యమానంతరం ఊళ్ళల్లో చోటుచేసుకున్న ఫలితాలను ఈ రెండు కథలు చక్కగా చిత్రీకరించాయి.
దుబాయ్ నుంచి మస్కట్‌కు అక్రమంగా వచ్చిన శంకర్‌ను సరిహద్దు దాటించాలి. వాడ్ని మిక్సింగ్ క్రషర్ మెషిన్‌లో దాచి సలీం బయలుదేరుతాడు. తీరాచూస్తే ఆ శంకర్ ఎవరో కాదు. తన చెల్లెల్ని ప్రేమించి మోసంచేసి గల్ఫ్‌కి పారిపోయి వచ్చినవాడు. దుబాయ్‌లో వున్న ఆమె అన్న తనకోసం వెతుకుతున్నాడని మస్కట్‌కు పారిపోతున్నాడు. ఆ అమ్మాయి ఉరిపెట్టుకుని చనిపోయిందని తెలిసి ఇంటికి పోవాలనుకుంటాడు. వాడ్ని చంపాలన్న కోపం సలీంకు. చంపకపోయినా సెక్యూరిటీకి పట్టిస్తే ఏడేళ్ళ జైలుశిక్ష. ‘‘జుమ్మేకి రాత్’’న ఒక మంచి పనిచేయాలన్న భార్య ఫాతిమాకు ఇచ్చిన మాటప్రకారం వాడ్ని సురక్షితంగా వదిలేస్తాడు. తమ జీవితంలో చిచ్చుపెట్టిన హంతకులను శిక్షించే అవకాశం చేతిలోవున్నా, ఉదార హృదయంతో క్షమించి వాళ్ళకు ప్రాణభిక్ష పెట్టిన కరుణామూర్తుల కథలు ఇవి. ఈ కథలు చదువుతుంటే ‘‘చంపదగిన యట్టి శత్రువు తమ చేత చిక్కెనేని...’’అనే పద్యం జ్ఞాపకమొస్తుంది. పాత్రోచిత మాండలికంతో, ప్రతీకాత్మక కథనాలతో ఆసక్తికరంగా రూపొందిన ఈ కథలు తప్పకుండా చదవాల్సిన కథలు.

..............................................................................................................................................
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-కె.పి.అశోక్‌కుమార్