అక్షర

సులభ శైలిలో వేదసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మణ సద్గురు.. వేదాంత వాహిని
సంకలనము : కీ॥ బ్రహ్మశ్రీ చంద్రగిరి ఎస్.సుబ్రహ్మణ్యం
మూల్యము: రూ.250/-లు.
ప్రతులకు: ఎస్.వి. రమణ, బ్రహ్మస్పర్శిని ప్రచురణలు
21/303, మురుగేశం కాంపౌండ్, ఎస్.ఎఫ్.ఎస్.వీధి
కడప- 516 001
ఫోన్. నెం. 08562-274562

వేదాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస మహాపండితుల తోపాటుగా సామాన్యులకూ కొద్దో గొప్పో ఉంటుంది. మనిషిగా పుట్టి వివేకాన్ని ఆర్జించుకున్న ప్రతివారూ అమృతత్వ సాధన కోసం పరితపించడం సహజం. భగవద్గీత మనిషి క్షణమైనా కర్మ చేయకుండా ఉండలేడని చెప్తుంది. కాని ఆ చేసే కర్మ మంచిదా? చెడుదా? అన్న విచక్షణ వివేకాలను చెప్పేది వేదం. త్రిగుణీతీతుడి కమ్ము అర్జునా.. అని అర్జునుని ఉపాధిగా చేసుకొని చెప్పిన భగవంతుని బోధ కూడా మనిషి త్రిగుణాలకు దూరంగా ఉండడం కష్టం సాధ్యమేనంటుంది. అహితం పాపాన్ని హితం పుణ్యాన్ని ఇస్తుందని చాలా సులభంగా ఇదే వేదరహస్యమని వేదవ్యాసుడు చెప్పినప్పటికీ ఇంకా వేదంలో ఏముందో తెలుసుకోవాలనుకొనే మనిషికి ఎందరో మహానుభావులు వేద సారాన్ని ఎన్నో చక్కని రీతుల్లో ఉద్బోధిస్తునేవున్నారు. అటువంటివారిలో బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణ గురువర్యులు అగ్రగణ్యులు.
వీరి బోధించే వేదతత్వం అతిసామాన్యులకు కూడా సుధామధురరసంగా భాసిస్తుంది. అయితే ఈ లక్ష్మణ గురువర్యుల బోధను ప్రతివారు వినే సౌలభ్యం కలుగుతుందో లేదో నని, ప్రతివారు ఈ సద్గురువుల బోధను ఆకళింపుచేసుకొని వీరు ప్రసాదించే వేదాంత వాహినిలో కలిసి ఆత్మవిద్యారహస్య అధ్యయన తత్పరులు కావాలనే సదుద్దేశంతో ఎస్. చంద్రగిరిసుబ్రహ్మణ్యం వారి బోధనలకు అక్షరాకృతిని కలిగించారు. అంతేగాక మహామహోపాధ్యాయ డా.సముద్రాల లక్ష్మణయ్య గారి నివేదనతో మరింత జిజ్ఞాసను ప్రతివారిలో కలిగించాలని లక్ష్మణ సద్గురువుల బోధను పుస్తకరూపంలో తీసుకువచ్చారు.
ఈ ‘‘లక్ష్మణ సద్గురు వేదాంత వాహిని’’ అన్న గ్రంథంలో మనిషి జన్మనెత్తిన వారిలో జ్ఞాని ఎందుకు ఉత్తముడో సవివరంగా వివరించారు. కర్మచేయకుండా ఉండలేని ఈ నరజన్మను కర్మత్యాగం చేసి బ్రహ్మజ్ఞాని అవమని బోధించారు. జల, అన్న, గో, భూ, వస్త్ర, తిల, స్వర్ణ ఇత్యాది దానాలన్నింటికన్నను జ్ఞానదానమే మహోన్నతమైనదని చెపుతూ బ్రహ్మశ్రీ లక్ష్మణ సద్గురువులు చెప్పిన ప్రసంగాలను చదవి అర్థం చేసుకోవడానికి వీలుగా సరళతరమైన శైలిలో కూర్చారు. అంతేకాక నవ చక్ర విచారాన్ని రేఖాచిత్రముగా ఆవిష్కరించి దాని గురించి సవివరంగా చెపుతూ మధ్యలో ఉపనిషత్తులను, అన్నమయ్య, త్యాగయ్యల గేయాలను ఉటంకిస్తూ జిజ్ఞాసుల ఆసక్తిని మరింతగా ఉద్దీప్తం చేశారు.
మలిముద్రణలో వచ్చిన ఈ ‘లక్ష్మణ సద్గురు వేదాంత వాహిని’ చదివిన ప్రతివారూ బ్రహ్మవిద్యావగాహనను సులభంగా కలిగించుకోగలిగే స్థాయికి వస్తారనే అభిప్రాయాన్ని ఈ గ్రంథం కలిగిస్తుంది. జ్ఞానులు ఎలా నిత్యనైమిత్తికాలకు దూరం అవుతారో సంగ్రహంగా చెపుతూ నిత్యమూ హృదయాకాశంలో జ్వాలాయమానంగా ప్రకాశించే సూర్యునకు ఉదయాస్తమానాలు లేవుకనుక సంధ్యావందన కార్యాలు ఎలా నిర్వర్తించగలడు అన్న సంశయాన్ని లేవనెత్తి జ్ఞానులకు నిత్యకర్మలు ఎలా నిష్ప్రయోజనమో తెలియచెప్పారు. జ్ఞానచర్చను విపులంగా చూపే ఈ వేదాంత వాహినిలో ఉన్న లక్ష్మణ సద్గురువు బోధను సులభమైన పఠనాశైలిలో అక్షరీకరించడం ముదావహం.

-రాయసం లక్ష్మి