అక్షర

శ్రమకు పట్ట్భాషేకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రమ కావ్యం’
డా సుద్దాల అశోక్ తేజ
పేజీలు:170, వెల:రూ.125/-
ప్రతులకు:నవ చేతన, నవ తెలంగాణ
బుక్‌హౌస్‌లలో లభ్యం
**
‘ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?’ అన్న మహాకవి దాశరథి హృదయ ఘోషకు ఇప్పుడొక కావ్యరూపకంగా అక్షరా‘కృతి’ని పొందింది. ఆ కృతి ఆకృతికారుడు సుద్దాల అశోక్‌తేజ, దాని నామధేయం ‘శ్రమకావ్యం’.
నండూరి రామమోహనరావుగారి నరావతారం మన బౌద్ధిక వికాసానికి దారులు వెదికితే తన ‘శ్రమకావ్యం’ ద్వారా అశోక్‌తేజ మనిషి తన లోతుల్లోకి వెళ్లి తొలి పాదముద్రలను దర్శించుకునే అక్షర దర్పణం రూపొందించారు. గేయ, సినీగేయ రచయితగా సుద్దాల సుప్రసిద్ధుడే అయినా ఈ రచనతో ఆయనలో ఓ సిద్దుడు కనిపిస్తాడు.
కవులు, కళాకారులు తామున్నా, లేకున్నా తమ ముద్ర సమాజంపై నిలిచి పోవాలనే తపనతోనే కళాసృజన చేస్తారు. సుద్దాల అశోక్‌తేజ ఈ ‘శ్రమ’ వృధా పోదు.
కావ్యారంభంలోనే కవి పాదం అడ్డు, పొడువులు కొలవలేనంత తెరపై మోపబడుతుంది. కాలానికి అందని దూరానికి వెళ్లి ‘ఓహో’ అంటూ పిలిచినట్లుంటుంది.
‘శ్రమైక జగతి/ పురోగమనాగమన గమనాన్ని
నేను గమనిస్తున్నాను’-
‘శ్రమ ఆదిమధ్యాంతాతీతముగ
దిగ్దిగంతముల నాక్రమించిన
శ్రమ విక్రమాకృతిని నేను కీర్తిస్తున్నాను’-
‘శ్రమోనమాలను/ శ్రమేశ్వర సూత్రాలను నేను రచిస్తున్నా’-
‘శ్రమ కవితా కథ కథన కావ్యానికి
సిరాపుష్పాలనేరి మాల కడుతున్నాను’
శ్రమ చారిత్రక కథా కావ్యాలాపనకు గొంతు
సవరించుకుంటున్నాను’- అంటూ ఉపోద్ఘాతాన్ని ప్రకటిస్తాడు.
ఈ మోటివేషన్‌తో ముగ్ధుడయిన చదువరి ఇక తిరిగి చూడడు. స్థలకాలాదులు మరిచి కవి వెంట, కవి కావ్యాద్రుతి వెంట మంత్రగతుడవుతాడు. ఎందుకంటే ఇది ‘తన కథ, తన పురాణగానం, తేజస్సు’ వెంట పయనం.
శ్రమయే సృష్టికి ఆదిరూపంగా ఆదిమానవులను శ్రముడు, శ్రమి అని సంబోధిస్తూ నేటి సమాజ రూపకల్పన పాదుగొల్పిన సందర్భాలను, సంఘటనలను సమస్యలను, సమాధానాలను అంకాలుగా విడగొట్టి ‘శ్రమా’లలుగా కూర్చాడు అశోక్ తేజ.
ముందు అరణ్యం.. తొలి నరుని పదముద్ర కెదురు చూసే అరణ్యం.. అరణ్యంలో నడక.. నాలుగు పాదాలతో నడుస్తున్న వనచరులు.. కొమ్మ వంచి పండు నోటికందించే పని ముందుకాళ్లకొచ్చింది. భూతలాన వానర కులాన మహాద్భుతపు మలుపిక్కడ తిరిగింది.
వికసించని తొలి మానవ మేధస్సది. అందుకొరకే భౌతిక శ్రమ.. అంతవరకె బౌద్ధిక శ్రమ.
ఇలా అవసరానుగుణంగా ‘రాయి-నిప్పు’, ధనష్కారం, గుహ-గృహం, నాగలి-గొర్రు, చక్రం-చక్రి, మన్ను-గినె్న, పాదుకలు-వస్తమ్రాలి, తాండవం-లాస్యం, పాటే-తొలిమాట, బొమ్మలిపి, జీవనది-పురిటిగది అనే క్రమంలో పరిణామక్రమంగా సాగిన మానవ వికాసం ఈ కావ్య అంతరంగం. ఇక బహిరంగం ఏమిటంటే మహాద్భుతమైన కవి విద్వత్తుయే. శ్రమకావ్యం ఓ గేయరూపకం. ఓ దృశ్యమానం.. కవి మహత్తుకు కొలమానం. పదలయ విన్యాసాల యక్షగానం.
మానవ పరిణామాలపై సైన్సులో ఎన్నో పరిశోధనలున్నాయి. పుస్తకాలూ ఉన్నాయి. అదంతా విద్యార్థులకు, జ్ఞానార్థులకు- మరి భాషయే తెలిసి, వీనులవిందుగా తన చరిత్ర వినుటకు సాధారణుడికి మార్గమేది? మనసుకత్తుకుని, ఊహాలోకాలు విహరింపజేసే పద చిత్రాలేవి? తరతరాలుగా ముందుతరాలు పూదిచ్చుకునే విగ్రహాలేవి? వీటన్నింటికీ సమాధానమే- ‘శ్రమకావ్యం’.
‘వెనె్నలను బంగారాన్ని/ తోడుపెడితే పేరుకున్న
గడ్డకట్టిన మీగడ పెరుగు
శ్రమిలా మారినట్లు’- ఓ అద్భుత పదచిత్రం.
‘చీకటిని ఏటవాలుగా కోసి
అతికించినట్లు/ ఎంత నల్లగా ఈమె
కనుబొమ్మలు కనురెప్పలు’
‘వెన్నముద్దలో వజ్రపు రజను/ పిసికి ముద్దలుగా చేసినట్లు
ఈ పాల పరువాలకీ
కోమల కాఠిన్యతేమి కఠిన కోమలత్వమేమి’- కవి తన భావుకత మాధుర్యంలో మనల్ని డోలలాడిస్తాడు.
‘సుమ వాయువు వీచితే కందిపోయే ఒళ్లు
పూరేకులొత్తితే కమిలే పాదాలు’- సుకుమారతకు దీన్ని మించిన భాష్యం దుర్లభమేమో..
వావివరుసలే లేని నాటి నర సంగమంగా
సుతునితో ఒకతి/ సోదరితో ఒకడు
కులుకుతూ సొగ/ సొలుకుతూ కనులతో
కాముకత గ్రోలుతూ- అనక తప్పకున్నా, అప్పటికింకా సుతుడు, సోదరి అనే బంధాలే లేనప్పుడు ఆ పదాల వాడుక కొంత ఇబ్బందికరమే.
పరిణామక్రమంగా వేట, బట్ట, గూడు ఆ తర్వాత సమూహాలు, ఆధిపత్య యుద్ధాలు-
భూమి పంచాయతి మహాభారతానికి
స్ర్తిల పంచాయతీ రామాయణానికి
ఆ రెండు పంచాయతులకు
తొలి బీజములు పడినపుడిప్పుడే- అంటూ నరుల ‘పిచ్చిత్రరీతి’ తెరలేపుతాడు.
ఆకలి, వేట, భయం ప్రధానంగా సాగే జీవితాల్లోకి నవ్వు ఆలస్యంగానే వచ్చిందంటాడు అశోక్ తేజ.
‘ఎంత శ్రమిస్తే వచ్చిందో
అపవాహ్న నాడి/ ఎంత తపిస్తే విచ్చిందో
నవ్వుల పీటముడి’- ద్వారా మన నవ్వు ఆనాటి శ్రమీశ్రముల ముఖ పరిశ్రమ ఫలితమే అంటాడు కవి.
‘ఒక శ్రుతిలో ఒక లయలో/ ప్రతి మాట అల్లుకొని
పాటగానే మనిషి తొలిమాట పుట్టింది’ అని కవి వర్ణన.
‘నీ పిల్లలోవైపు- నువ్వు ఓ వైపు/ కావడిలో మిము మోస్తూ
నేను పడమటివైపు’లో ఓ వైపు కుటుంబ భారం, మరోవైపు జీవన వైరాగ్యం తొలిమెట్లు కనిపిస్తాయి.
శ్రముని భార్య శ్రమిని ప్రసవించడానికి నడుం లోతు నీళ్లలోకి తీసికెలుతారు.
‘నీళ్లలో శ్రమి కనుటవల్లనె/ ఏమో ప్రసవించెనను మాట
‘నీళ్లాడిందిగా’/ జనుల నాలుకలపై నిలిచిపోయింది అన్న కవి అన్వయింపు అర్థవంతంగా వుంది.
శ్రమకు ఈ కావ్యంలో పట్ట్భాషేకం చేసిన సుద్దాల-
‘దుఃఖానికి కారణం కోరిక అన్నాడు బుద్ధుడు
దుఃఖానికి కారణం తీరిక అన్నాడు శ్రముడు’ అంటూ అన్ని సుఖాలకు మార్గం శ్రమలోనేనని బోధిస్తాడు.
చివరగా కావ్యానికి తెరదించుతూ కవి ముందుకొస్తాడు.
‘ఆగదీ సరిగమ ఆరిపోదీ శ్రమ
ఆగదీ మధురిమ తుదిశ్వాస వున్నంతదాకా
నా రుథిరమ్ములో తుది ఎరుపు చుక్క వున్నందాక’ అని ఓ ఆశ్వాసాన్ని ఇస్తూ స్వీయ హృదయ తంత్రుల్ని మోగిస్తాడు.
నీటి చల్లదనం మునిగితేనే తెలుస్తుది. ఈ శ్రమాక్షర వర్షంలో తడిసిపోండి.. చివరి చినుకుదాకా మీలో ఇంకనీయండి.. పునీతులుకండి.. శ్రమలు కండి...

-బి.నర్సన్