అక్షర

దేశభక్తి వీచికలు.. ఇక్బాల్ గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి మొహమ్మద్
ఇక్బాల్ గీతాలు
ఆంధ్రీకరణ: అల్లూరి వేంకట నరసింహరాజు
ప్రతులకు:
రవి పబ్లిషింగ్ హౌస్,
21-7/4, ధర్డ్‌ఫేజ్,
కూకట్‌పల్లి
హౌసింగ్‌బోర్డ్ కాలనీ,
హైదరాబాదు.

‘సారే జహాసే అచ్ఛా... హిందూ సితాహమారా!’ ఈ గీతం వినగానే మహాకవి ఇక్బాల్ మన కళ్లముందు మెదులుతాడు. మీర్జాగాలిబ్ తర్వాత ఉర్దూలో చెప్పుకోదగ్గ కవుల్లో ఇక్బాల్ ఆద్యుడు. పురా భారతీయ సంస్కృతిని ఎలుగెత్తి పాడిన కవి ఆయన. దేశభక్తి, తాత్త్విక దృష్టి, స్వేచ్ఛాప్రవృత్తి, సంఘ సంస్కారం ఇక్బాల్ కవితల్లో ప్రతిఫలిస్తాయి. పార్సీ, అరబ్బీ, ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ భాషల్లో వైదుష్యం సంపాదించిన ఇక్బాల్ తన తొలి కవితల్ని పారసీలో రాసినా ఆ తర్వాత ఉర్దూ, పారసీలలో సమాంతరంగా సాగాయి.
1877 నవంబర్ 9వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని ‘సియాల్‌కోట్’లో జన్మించారు ఇక్బాల్. తాను కాశ్మీరీ బ్రాహ్మణుల వంశానికి చెందిన వాడినని, తన వంశీయులు సోమనాథ్ దేవాలయ అర్చకులని తాత ముత్తాతలు విగ్రహారాధకులని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ఇక్బాల్ కుమారుడు జావేద్ రచించిన తన తండ్రి జీవిత చరిత్ర ‘‘జిందరూద్’’ (జీవన్నది)లో ఈ విషయాన్ని వివరించాడు.
ఇక్బాల్ దేశ ప్రేమికుడు. ఈ దేశమంటే ఇక్బాల్‌కు ఎంత ప్రేమో ఆయన కవితల్లో చూడొచ్చు. ఉర్దూలో తన తొలి కవితాసంపుటి ‘‘బాంగెదరా’’ (1924)లోని మొదటి కవిత హిమాలయాలకు సంబంధించింది. హిమనగాల అందాల్ని, వాటి ప్రాముఖ్యాన్ని ఇంతగా అభివర్ణించిన కవి మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.
కాగా ప్రస్తుతం సమీక్షిస్తున్న పుస్తకం ‘మహాకవి మొహమ్మద్ ఇక్బాల్ గీతాలకు ఆంధ్రీకరణ. డాక్టర్ అల్లూరి వేంకట నరసింహరాజు ఇక్బాల్ ఉర్దూ కవితల్ని తెలుగులోకి అనువదించారు. గతంలో డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి ఇక్బాల్ రచించిన కొన్ని కవితల్ని తెలుగులోకి అనువదించారు. చాలాకాలం తర్వాత రాజుగారు ఈ పుస్తక రూపంలో ఇక్బాల్ ఉర్దూకవితల పరిమళాల్ని తెలుగులోకి దిగుమతి చేశారు.
తనకు ఉర్దూ రాకపోయినా తెలుగు లిపిలో ఇక్బాల్ గీతాల్ని, వాటి తాత్పర్యాలను గ్రహించి ఆంధ్రీకరించినట్లు రచయిత నిజాయితీగా చెప్పుకున్నాడు. అనువాదకునికి మూల భాషతోపాటు అనువదించే భాషలో కూడా సాధికారత వుంటే అనువాదం రాణిస్తుంది. అయినా రాజుగారు మూల కవితల్లోని వౌలికభావాల్ని తెలుగులోకి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు.
‘‘లబ్‌పే ఆతీహై దువాబన్‌కే తమన్నా మేరీ
జిందగీ షమ్మకి సూరత్‌హో ఖుదాయా మేరీ’’
దీనికి రచయిత ‘‘పెదవులపై నా కోరిక/ పెల్లుబుకును ప్రార్థనగా/ ఓ దేవా! నా బ్రతుకును/ ఓ దీపముగా మార్చుము’’అంటూ తెలుగీకరించారు. ఇక్బాల్ తాత్త్విక దృష్టికి ఈ కవిత మంచి ఉదాహరణ.
‘‘దూర్ దున్యాసే మేరే దమ్‌సే అంధేరా హోజాయే
హర్‌జగా మేరే చమక్ నేసే ఉజాలా హోజాయే’’
ఈ దీపంతో చీకటి/ పారద్రోలుడు జగతి నుండి/ ఎల్లచోట్ల నా కాంతియె/ వెల్లివిరిసి ప్రకాశింప అంటూ అనువదించారు. మాత్రాఛందస్సులో సాగటంవల్ల అనువాదం స్వతంత్ర కవితల్లా అనిపిస్తాయి.
‘‘సారే జహాసేఅచ్ఛా హిందూ సితా హమారా
హమ్ బుల్బులే హై ఉస్‌కే యేహ్‌గుల్ సితాహమార!’’
భువనమ్మున మన భారత/ భూమియే ఉత్తమమైనది/
ఇది మన ఉద్యానవనము/ ఇట మనమే కోకిలలము
ఈ కవిత ఇక్బాల్ దేశభక్తికి పతాక. మహాత్మాగాంధీ కూడా ఈ కవితా పంక్తుల్ని అనేక సందర్భాల్లో ఉటంకించారంటే... దీని ప్రాముఖ్యమెటువంటిదో అర్థంచేసుకోవచ్చు.
ఇక్బాల్‌లోని స్వేచ్ఛాప్రియత్వానికి
‘‘ఆయ్ తాయరె లహూతి.....’’ అన్న కవితను ఉదాహరణగా చెప్పొచ్చు. దీన్ని రచయిత అనువదించిన తీరు కూడా బాగుంది.
‘వినువీధులలో స్వేచ్ఛగ/ విహరించే ఖగమా/
భృతికై స్వేచ్ఛను విడచుట/ మృతియే మరవకుమా’-
ఈ సంపుటిలో మొత్తం 118 ఉర్దూ కవితలకు ఆంధ్రీకరణలున్నాయి. తెలుగు లిపిలో ఉర్దూ కవితను పేర్కొని, దాని కింద తెలుగు అనువాదాన్ని జతచేయడం బాగుంది. దీనివల్ల ఉర్దూలో కూడా ప్రవేశమున్న పాఠకులకు మూల భావ స్వారస్యాన్ని కూడా అర్థంచేసుకొని ఆస్వాదించే వీలు కలుగుతుంది. ఇక్బాల్ వంటి మహాకవి కవితల్ని తెలుగువారికి పరిచయం చేయాలన్న ఆంధ్రీకర్త ప్రయత్నం అభినందనీయం.

- ఎ.రజాహుస్సేన్