అక్షర

పల్లెటూరి యాసకు పట్టం కట్టిన కథనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందనవోలు కథలు
రచయిత: డా.ఎం.హరికిషన్;
పుటలు: 176; వెల: 100 రూ.
ప్రతులకు: పి.పుల్లయ్య,
శ్రీరామ థియేటర్ ఎదురుగా,
బళ్ళారి రోడ్, కర్నూలు.
డా.ఎం.హరికిషన్, 45/205-1,
లేబర్ కాలనీ, చర్చ్ ఎదురుగా,
టీచర్స్‌కాలనీ, కర్నూలు.
సామాజిక స్పృహను మేల్కొలుపుతూ, పరోక్షంగా సందేశాత్మకంగాను, కొంతవరకు ఆలోచనలను రేకెత్తించేదిగాను ఉంటూనే సాఫీగా సాగిపోయిన ఒక ఇరవైమూడు కథల సంకలన గ్రంథం డా.ఎం.హరికిషన్ రచించిన ‘కందనవోలు కథలు’.
‘కందనవోలు’ అంటే నేటి కర్నూలు నగరం. కర్నూలు జిల్లాలోని బాస, యాస, కొన్నికొన్ని ఊళ్ళు, సాంఘిక, వ్యావసాయిక, భౌగోళిక స్థితిగతులు, ఫ్యాక్షనిజం (ముఠా రాజకీయాలు), ఆధునిక నాగరికతలోని బాగోగులు మొదలైన అంశాల రూపురేఖలను ఈ కథలను చదివి తెలుసుకోవచ్చు- విహంగ వీక్షణంలా.
ఇందులో అన్నిటికీ మకుటాయమానమైన కథ చిట్టచివరి కథ అయిన ‘బసివిరాలు బరితెగించింది’ కథ. ఈ కథలో కథాకథన శిల్పం నిండుగా పండింది. ఆరోహణక్రమ ఉత్కంఠ, అనుకోని మలుపులు, ముచ్చటైన ముగింపు- ఈ మూడూ అమరి కథను కమనీయ రచనగా నిలబెట్టాయి. ‘బసివి’ ఆచారానికి బలైపోయే స్ర్తిమూర్తి పడే నరక యాతనను, జీవన పోరాటపు ఒడుదుడుకులను కళ్ళుచెమర్చే రీతిలో రాశారు హరికిషన్.
‘పొద్దుపోని పంచాయితీ’ కథలో పురుషాహంకార పూరితమైన నేటి సామాజిక, రాజకీయ పరిస్థితి చిత్రీకరణ నిండారింది. ‘ఈ దేశంలో అధికారం రావాలంటే మొగుళ్ళు జైలుకన్నా పోవాల, పైకన్నా పోవాల’ అనే కథాంతపు విప్లవాత్మక భావానికి పాఠకుడు కూడా వచ్చేంత నిర్మాణాత్మకంగా కథ సాగింది.
‘నాలుగోస్తంభం’ కథ చాలా బాగుంది. కథలో సస్పెన్సు ఉంది; ముగింపుబాగుంది. కొందరు ప్రింటుమీడియా యజమానుల, హక్కుదారుల స్వార్థపరత, కుటిలత (హిపోక్రసీ)ల గురించిన కథ ఇది.
‘ఒక్క కథ’ అనే కథలో నిన్నటి మొన్నటి తరాలవాళ్ళు చెప్పుకుంటూ అనుభూతించిన నిసర్గ రమణీయ కథలకోసం మొగంవాచి, ఒక బాలిక చచ్చి దెయ్యం అయిపోయి కూడా వాటికోసమే ఆరాటపడిపోతూ బ్రతికున్న మనుషుల వెంట పడుతుంటుంది. కథనం చాలా గమ్మత్తుగా సాగిపోతుంది. బాగుంది.
‘సత్వర న్యాయం’ కథ ఆధునిక కాలపు చట్టాలలోని లొసుగులను, కోర్టుల సాగదీతలను, గూండాగిరీల చలామణీని ఎత్తిచూపే లలిత హాస్యకథ.
ముంచెత్తే కష్టాల తుఫానుదెబ్బకు దిక్కుతోచని స్థితిలో ఉన్న సంసారికి అతని సతీమణే ఎంత సమర్థవంతమైన సచివత్వంతో మార్గదర్శనంచేసి పునశ్చైతన్యం కలిగిస్తుందో తెలుస్తుంది ‘పచ్చి కరువు’ కథలో.
దళితులను దూరంచేసుకుంటున్న హిందూ-ముస్లిం మతాల పెద్దల చాదస్తం గూర్చిన కథ ‘హిందూ-ముస్లిం భాయ్ భాయ్’.
ఉద్యోగాలంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే అనుకుంటున్న ఈ రోజులలో ఇతర ఉద్యోగుల మానసిక, సాంసారిక వేదనలు జాలిగొలుపుతాయి ‘చూపు’ కథలో.
‘గాయపడ్డ నమ్మకం’ ఒక మంచి జాతీయభావ కథ. ఇందులోని పతాకావిష్కరణ వృత్తాంతం ఎంతో ఉత్కంఠ భరితం. ఒక పంద్రాగస్టు పండగరోజున తత్సంబంధ సభ ప్రారంభమవుతుంది. ‘ఎవరైనా ఒక స్వాతంత్య్ర సమర వీరునితో మాట్లాడిద్దామా?’ అంటాడు ఒక అధికారి (బహుశః ఆ అధికారి కలెక్టరైయుండవచ్చు). ‘‘ఆఁ? ఆ ముసలాళ్ళతోనా?.... వాళ్ళ సుత్త్భిరించటం కష్టం’’ అంటూ అక్కడున్న మంత్రి, శాసనసభ్యులు మాత్రమే ప్రసంగిస్తారు. తమ ప్రసంగాలు పూర్తికాగానే వేరే అవసరమైన పనులున్నాయి అంటూ మధ్యలోనే వెళ్ళిపోతారు. ప్రత్యేక అతిథిగా వచ్చిన వృద్ధస్వాతంత్య్ర సమరయోధుడైన విశ్వనాథం లేచి మాట్లాడదామనుకుంటే అంతా పిల్లలే. తోలుకొచ్చిన బడి పిల్లలు. ప్రజలెవరూ లేరు..... - ఇలా అద్దం పట్టారు రచయిత మన నేటి రాజకీయుల దౌర్భాగ్య సంస్కృతికి.
‘చుక్కలు చీకట్లో దాక్కున్నాయి’(‘రాజమ్మ’కథ) వంటి విలక్షణ అభివ్యక్తి వాక్యాలు; తన ఊరి మోతుబరి చేత భంగపడిన వెంకటేశులు యొక్క అవమానభార ఫలిత ఉద్విగ్నత, ఆవేశాలను వర్ణిస్తూ ‘వరద వత్తిడిని తట్టుకోలేని ఆనకట్టలా ఉన్నాడు’వంటి సమయోచిత ఉపమాలంకారాలు (‘చిచ్చు’ కథ): ‘కొంగుతడిసి నోళ్ళకు చలిగానీ కోక తడిసినోళ్ళకు చలేమిటి?’ (‘పచ్చకరువు’కథ) వంటి నిసర్గ సామెతలు; గడాలు (దున్నుడు పనిముట్లు), బోకులు (వంటపాత్రలు), అతని అంచుకు (అతని దగ్గరకు, అండకు), చేయబట్టింది (చేయసాగింది), దుడ్లు (డబ్బులు), పిలంపి (పిలిపించి), గాసగాడు (పనివాడు, పాలేరు), అంగీ (చొక్కా), చనకాల (చర్నాకోల), సవాళ్ళు (వేలం పాటలు) మొదలైన కర్నూలు జిల్లా మాండలికాలు; ‘‘ఆరోజు మద్దస్తంసేసి (రాజీ కుదిర్చి) నలుగుర్లో పుస్తె తెంపుకొని పాయెగదా!(పోయెగదా!) (రాజమ్మకథ) వంటి కర్నూలు ప్రాంత గ్రామీణ భాషా సహజ సుందరత-
ఇలాంటి సొబగులున్నాయి చాలాచోట్ల. తెలంగాణాకు చెందిన పాలమూరు జిల్లాకు పక్కనే కర్నూలు ఉన్నది కనుక ఇందులోని బాస, యాస తెలంగాణా-రాయలసీమల మిశ్రమంగా ఒక విలక్షణతతో ఒప్పారినాయి.
‘నిశ్శబ్ద ఆర్తనాదం’ ఒక కథకాదు, కథగాలేదు. అత్తగార్ల గండ్రగొండితనం గురించిన ఒక ‘ఏక పాత్రికా’ రచనలాగా ఉంది. ‘సదవకురా చెడేవు’ కథగూడా అంతే. శిల్పం దృష్ట్యా కథ కాదు. ‘క్రీమీలేయర్- రిజర్వేషన్లు’ అనే అంశంమీద ఆలోచనాత్మకము, ప్రేరణార్థకము అయిన ప్రసంగంలా ఉంది. చివరలోని ‘యాభై సంవత్సరాల స్వతంత్ర భారతంలో అన్ని కులాల్లోను అగ్రవర్ణాలు (వర్గాలు అంటే బాగుండేదేమో!) తయారయి పోయాయి’ అన్న వాక్యం ఒక నిష్ఠుర సత్యం.
‘చిచ్చు’ కథ ముగింపులో అస్పష్టత ఉంది- కొందరు వ్రాస్తున్న ఆధునిక కవిత్వంలా.
‘మిస్సింగ్’ కథ కేవలం ఒక ఆవేశపూరితుడి మోనోయాక్షన్ లాగా ఉంది.
పాత్ర సంభాషణా పద సహజత పేరుతో.... మూసుకో వంటి దూషణ వాక్యాలు, ‘యో..’కి తెలుగు పర్యాయ పదంతో కూడిన అశ్లీల భాష సామెతలు ఎబ్బెట్టుగా ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ చదువుతుంటే అభిరుచి కలిగించే కథలు చాలానే ఉన్నాయి ఇందులో.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం