అక్షర

అలజడి రేపే కవితాగానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి ప్రవాహం
జీవన్ కవిత్వం
పేజీలు: 170
ధర: రూ.150/-
ప్రతులకు: రచయిత
9059881131
***

అమెరికా సామ్రాజ్యవాద దోపిడి పట్ల పూర్తి అవగాహన, వ్యతిరేకత ఉన్న కవి జీవన్. గ్లోబలైజేషన్ వల్ల ధ్వంసమవుతున్న సామాన్యుడి జీవితం పట్ల ఆయన కలత చెంది ఆ మనోవేదనకు అక్షర రూపం ఇవ్వడం ద్వారా తన బాధను ఇతరులతో పంచుకో ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భాగమే స్మృతి ప్రవాహం పేరిట వచ్చిన జీవన్ కవిత్వ పుస్తకం.
కవిత్వం రెండు రకాలుగా అనుకున్నప్పుడు ఒకటి ఏ వస్తువునైనా తీసుకొని కవిత్వాన్ని దండిగా పండించడం, రెండోది వస్తువు జన సామాన్యం ఎరుకలోకి రావలసినదై ఉండి కవిత్వ రూపంలో వారి కందజేయడం. జీవన్ ప్రాథమికంగా ఉద్యమాల ప్రేమికుడు. ఒక భావజాలానికి బద్ధుడిగా కనిపిస్తాడు. మార్కెట్ మాయాజాలం నడకల్ని కనిపెట్టినవాడు, మాయలు, మర్మాల వెనుకున్న కుట్రను గ్రహించినవాడు. తనకు తెలిసిన, తాను కనుగొన్న రేపటి ఉపద్రవాన్ని తుఫాన్ హెచ్చరికలా ప్రజలకు తెలియజేయడానికి కవిత్వాన్ని మాధ్యమంగా ఎంచుకున్నాడు.
ఈ కవిత్వంలో స్వగతం లేదు, సొంత సోది అసలే లేదు. తన ఇల్లు, ముంగిలి, పెండ్లాం, పిల్లలు, వయసు, బతుకు, మూడో తరం పసిపిల్లల కేరింతలు తదితరాలు మన ముందు పరచి మనల్ని తన కాళ్ల చుట్టూ తిప్పుకోడు. అంతా దునియా కీ మేలా. ప్రపంచీకరణ భూతంపై విరుచుకపడడమే తన ప్రాథమ్యంగా భావించిన కవి జీవన్ తన గుండె బరువు తీరేలా కవితాగానం చేశాడు.
వస్తువు విస్తృతి రీత్యా కవితల్లో దీర్ఘతనం తప్పలేదు. సాదాసీదాగా చెప్పుతూ పోయినా వస్తువులోని గాఢత కవిత్వీకరణకు బలాన్ని చేకూర్చింది. కవి ఎంచుకునే వస్తువులోనే ఓ వైవిధ్యత ఉన్నది. ఆవశ్యకము లేని దానిని ఎక్కడా స్పృశియించలేదు. చెప్పదలచుకున్న విషయాన్ని విస్పష్టంగా చెప్పాడు. తన ప్రజాస్వామ్యవాద దృక్పథాన్ని మూల స్తంభం చేసుకొని ఏ అంశాన్నైనా కవితగా మార్చగలగడంలో జీవన్ కవిగా నిలబడగలడు.
నాదో విన్నపమంటూ ‘సుసంపన్న, ధీరోదాత్త వారసత్వం కలిగిన తెలంగాణ గడ్డ మీద నిలబడి ప్రపంచాన్ని అవలోకించే క్రమంలో నాలో అలజడి రేపిన భావ ప్రకంపనలను అక్షరబద్ధం చేయ ప్రయత్నించాన’ని రాసుకున్న కవి జీవన్ మాట నిలబెట్టుకున్నాడు.
‘ఆకలికి ప్రతిరూపమైన/ అనాథ బాలుడు/ చెత్తకుండీలో ఎంగిలి మెతుకులకై/ పందులతో పోరాటం చేస్తున్నప్పుడో/ మరుగున పడిన/ ఏ జ్ఞాపక శకలమో/ శూలమై/ హృదయాన్ని చీలుస్తున్నప్పుడో/ నా కవితా పాదం మొదలవుతుంది’ అన్న కవితా పంక్తులు పుస్తకం నిండా ఉన్న కవి వేదనకు స్వాగతం పలుకుతాయి.
నేడు దేశభక్తిపై రాద్ధాంతం జరుగుతున్న వేళ కవి జీవన్ 2012లోనే ‘నా దేశభక్తి/ విజాతి మోచేతి నీళ్లను/ పరమాన్నంగా జుర్రుకొంటున్నది/ పరాయి పాలనపై/ కత్తులు దూసిన నా జాతీయత/ బహుళ జాతుల సార్వభౌమత్వానికి/ స్వాగత గీతిక ఆలపిస్తున్నది’ అని అసలు రంగు బయటపెట్టాడు.
‘కాటేసిన కాళరాత్రి’ ఈ తరం వారికి ఎమర్జెన్సీ చీకటి రాత్రిని తెలియజేసే కవిత. ఇది జీవన్ జీవన స్మృతి గీతమే కావచ్చు.
‘వికృత క్రీడ’ సామ్రాజ్యవాద దృక్కోణాన్ని బయటపెట్టే కవిత. ‘మాకు నిర్విఘ్న మారణ హోమాలు కావాలి/ మానవ హననం/ భూగోళం అణువణువున విస్తరించాలి/ విశ్వాంతరాళాల దనుక/ ఆయుధ వ్యాపారం వ్యాపించాలి/ ధరాతలం/ ఆ చంద్రార్కం/ మా పాదాల కింద/ అణగిమణగి/ పడి ఉండాలి’ అని అమెరికా అసలు రూపాన్ని బయటపెడ్తాడు. మహా విషాద పర్వం, వసంత గీతిక, ఆఖరి సర్దుబాటు లాంటి మరిన్ని కవితలు ‘చుక్కల టోపీ దొర’ దురాగతాలను బహిర్గతం చేస్తాయి.
ఇందులోని ‘తెలంగాణ’ కవితలు కాలంతోపాటు కదం కదపక తప్పని రచనలు. వీటిలో కూడా ‘ఇది తెగువ గల్ల తెలంగాణ మాగాణం/ దౌర్జన్యంపై పూరించిన సమరశంఖం’ అంటూ తన స్వరాన్ని తగ్గించలేదు జీవన్.
జీవన గీతం, గ్లోబలిపీఠం వరసలో వచ్చిన మరో జీవన్ సిరీస్ స్మృతి ప్రవాహం. కవిగా నిలబడాలనే కాంక్షకన్నా తన భావనలు ప్రజలకు చేరాలనే కవి బలమైన ఆకాంక్ష ఈ అక్షరాల్లో కనపడుతుంది.

-బి.నర్సన్