అక్షర

రైతు కవిత్వాన్ని స్వాగతిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెన్నువిరిగిన కంకులు (రైతు కవిత్వం)
రచన: డా.మక్కెన శ్రీను
పేజీలు: 70,
వెల: రూ.60/-
ప్రతులకు: రచయిత- 9885219712
**

తనకు తెలిసిన జీవితాలను అక్షరబద్ధం చేయమని రచనాసక్తి ఉన్నవాళ్లను మనసు నెట్టుకొస్తుంది. అలా ఆలోచనలకు కవిత్వాంశ తోడై పద్యాలు జాలువారుతాయి. కవిగా తన స్థానం సుస్థిరపరచుకొనే ప్రయత్నంకన్నా తన భావనలు నలుగురికి చేరవేయాలన్న తపన ఈ రచనలకు అంకురార్పణ చేస్తుంది. తెలుగులో ఏ వస్తువునైనా చివరకు గోడమీది నీడనైనా, తెరమరుగవుతున్న జ్ఞాపకాన్నైనా రసాత్మకంగా పలవరించే ప్రసిద్ధ కవులున్నా, వారికి సమాంతరంగా వస్తుప్రాధాన్యతను ఎజెండాగా చేసుకొని రాస్తున్న కవులెందరో ఉన్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో వచ్చిన అత్యధిక కవిత్వం ఈ కోవకు చెందినదే. సమస్య పరిష్కారంతో అందులోని చాలా అక్షరాలు జీవం కోల్పోయినా, కొన్ని పరిష్కారం దొరకని అరిష్టాలపై రచనలు వస్తూనే వుంటాయి. బాల కార్మికులపై, మహిళలపై అత్యాచారాలు, రైతు జీవన వ్యధలపై రాసిన అక్షరాల్లోని వేదన ఎవరూ రాసినా ఆర్ద్రంగానే ఉంటుంది. అంశంలో ఉన్న తీవ్రత అలాంటిది.
డా.మక్కెన శ్రీను రాసిన ‘వెన్నువిరిగిన కంకులు’ రైతు కవిత్వం అంశ ప్రాధాన్యత గలది. రైతు జీవితంలోని అన్ని పార్శ్వాలను అధ్యాయాలుగా చేసుకుని రాసిన నాలుగు పాదాల కవిత్వమిది.
రైతు గొప్పదనాన్ని, రైతుకూ మట్టికీ ఉన్న అనుబంధాన్ని ‘అభివాదం’గా, నేలను నమ్ముకున్న రైతుల వృత్త్ధిర్మాన్ని ‘శ్రమవేదం’గా, రైతులు మోసగింపబడుతున్న తీరును అప్పులు, హాహాకారాలను ‘ఆర్తనాదం’గా, రైతు లేనిదే రాజ్యంలేదనే ఈ విషయాన్ని ‘సమ్మోదం’గాను ఈ కావ్యాన్ని విభజించారు రచయిత. గతంలో ‘జీవన కవనం’అనే వచన కవితా శతకం, ‘మట్టి కుదుళ్లు’ అనుబంధపు ఆనవాళ్లు అనే కవితా సంపుటి, ‘్భవ తరంగం’ అనే దీర్ఘ కవిత వెలువరించిన కవి డా.మక్కెన రైతుబిడ్డ. రైతు కష్టసుఖాలు చూసిన అనుభవాలతో రైతు జీవితానే్న ఏకైక అంశంగా తీసుకొని ‘వెన్ను విరిగిన కంకులు’గా రైతులను అభివర్ణిస్తూ ఈ కావ్యాన్ని రూపొందించారు.
కావ్యమంతా కవికి రైతుపై ఉన్న మమకారాన్ని, ఆప్యాయతను, అనుబంధాల్ని, సునిశిత భావనలతో, సరళమైన అభివ్యక్తితో వ్యక్తపరుస్తుంది.
‘నాగలి భువికి చేసే లేత గాయం/ చినుకులు పూసే మట్టికి లేపనం’ అనడంలో మట్టికి చినుకుకున్న అనుబంధం ఉంది.
రైతు ధైర్యాన్ని వివరిస్తూ- కాలం కరుణించకున్న బెదరడు/ ఆకాశం కనె్నర్ర చేసిన అదరడు/ నాగేటి సాలు వెంటే రైతు పయనం/ ఆకలి తీర్చడమే ఆశయ సాధనం’అంటాడు. ఇంకా-మొక్కలకు లాలిత్యం నేర్పించినవాడు/ ప్రకృతి కాఠిన్యం ఎదిరించి నిలిచినవాడు’ రైతు గుండెను ఆవిష్కరించే వాక్యాలు.
హాలికుడు నిలువెత్తు స్వేద దీపం, సహనమే ఆకాశ అల్లుడికి భూషణం, శరీరమే నిత్య పనిముట్టుగా పావనం, రైతే ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంటి వాక్యాలు కొత్తగానూ, కవికి రైతు పట్ల ఉన్న గౌరవాన్ని తెలియపరుస్తాయి.
రైతు కష్టాల్ని అక్షరీకరిస్తూ కవి రైతును- దళారుల చేతుల్లో దగాపడే నిత్య దుఃఖితుడు, కళాకాంతులెరుగని రైతు సత్యహరిశ్చంద్రుడు’ అనడంలో డా.మక్కెనకు అన్నదాత పట్ల ఉన్న లోతైన అవగాహనను బయటపెడుతుంది.
‘కార్పొరేటు బాబుల దెబ్బకు ముక్కలైన పొలం/ ఆకాశ హర్మ్యాల కింద నలిగిన సేద్యఫలంగా రైతుమిగలడం అత్యంత విషాదం.
‘రైతు లేని రాజ్యం విగ్రహం లేని నైవేద్యం, రైతు తలగుడ్డ అవ్వాలి జాతి పతాకం’ కవి కాంక్ష యావన్మందీ ఆకాంక్షనే.
రైతు ప్రధానంగా వచ్చిన ‘వెన్నువిరిగిన కంకులు’ సరళ భాష, స్పష్టమైన వ్యక్తీకరణ కారణంగా ఆబాలగోపాలాన్ని అలరిస్తాయి.
కవిత్వంపై ఆసక్తిఉన్నవారు తమ పరిధిలో అక్షరాల్ని అల్లుతూపోవడంవల్ల తనలోని మానవీయ కోణంతోపాటు, సాహిత్య భాండంలో తనూ భాగమై పోవచ్చు. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు ప్రశంసార్హమైనవే.

-బి.నర్సన్