అక్షర

వెలుగు చూసిన తెలుగు ఆటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోసూరు కతలు
ఆటాడుకుందాం...రా!
-అగరం వసంత్
121 పుటలు;
వెల: రూ.150లు
ప్రతులకు: కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం,
1/1097, బస్తీ
ఆవులపల్లి రోడ్డు,
హోసూరు- 635109,
తమిళనాడు.
**
దొరతనాలు తెలుగు సంస్కృతి పట్ల పట్టని తనానికి అలవాటుపడిన వేళల్లో.. ప్రజలు నిస్వార్థంగా తామై పెట్టుకున్న సంఘాలు అంతా ఇంతా అని చెప్పలేని పాత్ర నిర్వహిస్తూంటాయి. అటువంటి వాటిలో తమిళనాడులో హోసూరులోని ‘కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం’ ఒకటి మాత్రమే కాదు; ప్రముఖమైనది కూడా. తెలుగువాడా! నీ మూలాలు ఇవి, నీ యాస యిది, నీ బాస యిది నీ యవ్వారం యిది రాబాబూ, నీకత, నీకైత యిది అని చెప్పడానికి- తమిళ నేతలలో ఈ తెలుగు సంఘం రంగంలో దిగింది. మేలిపొత్తాలు వెలువరింతలో భాగంగా.. ఇప్పుడు ఈ ‘ఆటాడుకుందాం...రా! హోసూరు కతలు’ పుస్తక ప్రకటన.
అన్నంకన్నా ఆటలే ఇష్టమైన డా.ఎన్.వసంత్. అగరం వసంత్ అనే కలం పేరుతో వ్రాసిన ఒక విధమైన ఆ తెలుగు ఆటల పరిశోధనా గ్రంథమిది. అయితే మెథడాలజీల క్రోటను మొక్కల పరిశోధనల వంటివి కాదిది. నేల సారాన్ని ఇటూఅటూ కొమ్మల ద్వారా నృత్యం చేయించే ఫలవృక్ష పరిశోధన యిది.
ఇంద అని వంద తెలుగు ఆటలు. ఆటల రూపాల్ని వెల్లడించే నా భద్రినాథ్ చిత్రాలు. ఏ మనిషికైనా కుటుంబం, సమాజం అనేవి రెండే పార్శ్వాలు. తెలుగు సమాజానికి అర్పితం అయిన ఈ పుస్తకం అగరం తన పెండ్లాం బిడ్డలకి అంకితం చేశారు.
ఆధునిక కాలంలో మహానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి తమ ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో తెలుగువారి వినోదాల్ని, ప్రస్తావించారు. నేదునూరి గంగాధరం- రాజాజీ చిత్రాలతో ఆటలు- పాటలు అనే పుస్తకం రాశారు. శ్రీపాద కృష్ణమూర్తిశాస్ర్తీ వంటి కొందరు కవులు అక్కడక్కడ తమ పద్యాది రచనల్లో తెలుగు ఆటల్ని ప్రస్తావించారు. బండ్లమూడివారు పరిశోధన గ్రంథమే రాశారు. ఇంకా ఎంతోమంది సంబంధిత వ్యాసాలు, రచనలు చేసి వుండవచ్చు.
కానీ ఈ గ్రంథం మనకు తెలియని ఆటల్ని కతల రూపాన ఇవ్వడంవల్ల ఒక విలక్షణ గ్రంథమైంది.
కలువకుంట నారాయణ పొత్తానికి ముందు రాసిన మెచ్చకోలు మెచ్చుకోలుకల పాత్రంగా ఉంది. అందులో మనిషిగా జీవించడమంటే తినడం, నిద్రపోవడం, సంతానాన్ని కనడమే మాత్రమేనా? అని ప్రశ్నించుకుంటే ఆనందం పొందడమే పరమార్థంగా కనిపిస్తుంది. ఆ ఆనందాన్ని సాధించుకోవడానికి ఆదిమానవుడు మొదలుకొని, ఆధునిక మానవునివరకూ రకరకాలైన వ్యాపకాల్నీ క్రీడల్నీ రూపొందించుకుంటూ రావడం జరుగుతోంది అన్నారు.
ఈ పుస్తకంలో ‘అచ్చనరాళ్ళు’ సంబంధంగా పదకొండాటలున్నాయి. గోళీలు సంబంధంగా ఏడు ఆటలున్నాయి. కుంటే బిళ్ళ సంబంధంగా పధ్నాలుగు ఆటలున్నాయి.
ఈ దృశ్యక్రీడల్ని దృశ్యమాధ్యమాలు పట్టించుకోవలసిన అవసరం వుంది.
ఒక జ్ఞానశాఖకి సంబంధించిన గ్రంథం రాసినప్పుడు అది ఏ యాసలో అయినా వుండవచ్చుగాని చివరలో ప్రధాన అవసర శబ్దాల అర్థాలు పట్టికగా ఇవ్వడం పాఠక జనావసరంగా భావించాలి.
తెలుగమ్మ పలుకుల తియ్యని మాటల ఆట. ‘అ. ఆ’ ఆట వంటివి ఇందులో మెరిసి భాషాప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. పాత తెలుగు మడుగులగడ్డ హోసూరు అనిపిస్తుంది. ఇందులోని కతల మాటల తీసిగుట్టు పరికిస్తే. రెండుమూడు పుటల్ని మించని ఆటల కతలు కావడంతో పాఠకునికి విసుగు పొసగదు. మన బతుకుల కుదుళ్ళు ఉన్న ఈ ఆటలు పాఠ్యగ్రంథాలలోకి ఎక్కవలసిన అవసరం వుంది.
శ్రమపడే మనిషికి సేదదీర్చేవి క్రీడాకళలే. సెల్లుఫోనులు, టీవీలే జీవన భాగాలు కావు అని యువతరానికి చెప్పడానికి ఇటువంటి పొత్తాలు చదివింపజేయాలి. తెల్లకొక్కర్ల తెప్పం, వెండి మెయిళ్ళు- బండ బతుకులు వంటి కథల గ్రంథాలకే రాసి పేరొందిన అగరం వసంత్ అరుదైన ఈ గ్రంథం స్వేదబిందు ఫలంగా ఇచ్చినందుకు అభినందనీయుడు.