అక్షర

నేల పరిమళభరిత కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకు కదలని చోట
కవిత్వం
బాల సుధాకర్‌వౌళి
135 పేజీలు,
వెల: రూ.116/-
ప్రచురణ: సిక్కోలు
బుక్‌ట్రస్ట్, శ్రీకాకుళం
ప్రతులకు: 9989265444
**
తెలంగాణ కవిత్వం దర్బారు చుట్టూ చక్కర్లు కొడుతున్నవేళ, పోటాపోటీగా ఒకరి చూపుడువేలు మీదుగా చూపు సారించి కచేరీ చేస్తున్న సందడిలో ‘ఆకు కదలనిచోట’ అంటూ కళింగాంధ్ర బాలకవి బాలసుధాకర్‌వౌళి వెచ్చటి కొత్త కవిత్వపు పూలవాన కురిపించారు.
కవి ఎప్పుడూ కాలిన పెంకులా సిద్ధంగా ఉండాలని శివారెడ్డిగారన్నట్లు ఓ మిత్రుడు చెప్పాడు. వస్తువు ఇలా తగలగానే కవితగా మారిపోవాలని ఆయన ఉద్దేశం కావచ్చు. ఆ కాలిన పెంకుతనం బాల సుధాకర్‌వౌళిలో ఉంది. ఏ కళలో అయినా సాధకుడి పరిణతియే తొలి ప్రామాణికత. రెండోది సామాజికత. తన కాన్వాసు మనిషి చుట్టూ తిరిగితేనే మనిషి ఆయన చుట్టూ తిరుగుతాడు. రెండూ కలగలిసిన సృష్టి ‘ఆకు కదలని చోట’లో ఉంది.
ఎవరు రాసినా, రాసినదంతా కవిత్వం కాకపోవచ్చు. కవితో చదువరి కలిసి నడవాల్సినంతనే నడుస్తాడు. బలవంతం చేసినా రాడు. తర్వాత కవికి ఒంటరి ప్రయాణమే మిగులుతుంది. జత కలువని అడుగులన్నీ కవికి మైనస్ పాయింట్లు. బాల సుధాకర్‌వౌళి కవిత్వంలో ఇవి తక్కువని చెప్పవచ్చు.
ప్రకృతి, మనిషి ఈ కవి ప్రధాన వస్తువులు. తన జీవన సామాజిక కోణాన్ని దుర్బిణిలా చేసుకొని వాటిలోంచి అక్షరాల్ని ప్రోదిచేసుకోవడమే కవి పనిగా పెట్టుకున్నాడు. కనిపిస్తున్న రాళ్లలోంచి ఓ మెరుపు మెరిసినదాన్ని ఏరుకొని దానికి చలనం నేర్పుతాడు.
పలు సందర్భాలు కవిని తట్టిలేపినట్లున్నాయి చాలా కవితలు. వీలయినచోట సందర్భం లేకుండా సమయం మాత్రం ప్రతి కవిత చివరన కవి పొందుపరచాడు. నిజానికి సమయం సందర్భం లేని రచన ఉండదుగాని వీటిని బహిర్గతం చేయడంవల్ల చదువరికి కవితలో దిగడానికి ఇవి ఓ ఊతంలా పనికొస్తాయి.
’అతనింకా’ కవితలో నదిని/ అతడెంతగా ప్రేమిస్తాడో/ రెండు సెలయేళ్లుగా మారిన అతని కళ్లు పాడాయి’ అంటూ ఆ అక్షరాల్లో గంటేడ గౌరునాయుడి రూపాన్ని చెక్కుతాడు.
‘గాయం-గానం’అంటూ సోనీసోరీ కోసం రాసిన కవితలో గాయమైనా/ గానమైనా/ ఒకో తడితనంలోంచి/ పుట్టే/ రెండు మనోహర పుష్పాలే’ అంటూ మద్దతు ప్రకటిస్తాడు.
మా వూరి నేల పాట గాదు ‘విశ్వనాథం’కి అంటూ ‘అతను నిద్రించినచోట/ ఈ వూరు మట్టిలోంచి/ వొక తూర్పు కిరణమైనా పొడుస్తుందా.../ తెల్లారెప్పుడవుతుందా.../’ అంటూ నేలను గుండెలకద్దుకుంటాడు.
అనంతపురం దుఃఖాన్ని కవి ‘హలాధరుడు/ వేసిన తొలి అడుగువద్దే శిలైపోతున్నాడు/ ఎడారి/ చెమ్మ ఆరి వడలిన ముఖంలా నేల/ నేల పొరల్లో తెగిన లక్షల కన్నీటి గొంతులు/ భూమీద తొలిసారి/ గాలి కొయ్యబారడాన్ని చూస్తున్నాను’అంటూ పైరు, పిట్ట, నీడ, మనిషి జాడ లేని దుఃఖ హృదయాన్ని తవ్విపోస్తాడు.
‘కాళ్లకు చెప్పుల్లేని జీవితం’ చూసిన వౌళి ‘కాళ్లకింద సముద్రాన్ని అది ‘నిద్రలేపుతుంది’ అంటాడు.
పరాయి రాష్ట్రంలోని పర్లాకిమిడికి వెళ్తూ ‘వొకే చెట్టుకు పూసిన/ రెండు పూవుల్లాంటి/ రెండు భాషలను మోసుకు తిరుగుతున్న/ గాలిని ప్రేమిస్తాను’ అంటూ ప్రాంతాలకతీతంగా ప్రేమను పంచుతాడు.
వివిధ సందర్భాలలో రాసిన కవిత్వమే అయినా అంతా ఒకే తంత్రిపై మోగించిన సంగీతనాదంలా సమదృతిలో ఉంది. వస్తువుతో కవి పెనవేసుకున్న తీరు అక్షరమక్షరంలో కనిపిస్తుంది. వ్యక్తీకరణలోనే శిల్పం రూపుదిద్దుకొనే దశలో మనుషులు మనుషులు, ఈ అడవి ఈ అడవి... అంటూ పదాల పునరుక్తి కనబడుతోంది.
ఊరి చివర, బతికుండటం, శరణార్ధి అంతరంగం, ప్రాణమున్న చేతులు, స్వేచ్ఛ, యాత్ర, పొద్దున్న- మంచి కవితల్లో మరిన్ని.
ఒక పేజీ కవితల్లోకన్నా నిడివిగల కవితల్లోనే కవి ముద్ర బలంగా కనబడుతోంది.
వస్తువుపై కవిత్వీకరణపై చేయిగా తన ప్రతిభతో గాఢమైన ముద్రవేస్తున్న యువకవుల్లో బాల సుధాకర్‌వౌళి స్థానం ముందువరుసలోనే. ‘ఎగరాల్సిన సమయం’ తర్వాత మళ్లీ తొందరగానే ‘ఆకు కదలనిచోట’ అంటూ ముందుకొచ్చాడు. కవిత్వంతో ప్రాణాల్ని తడుపుకుంటున్న కవులే కావాలిప్పుడు. చివరగా ఈ బుక్ డిజైన్ చేసిన జుగాష్ విలీనీ అభినందించక తప్పదు.

-బి.నర్సన్