అక్షర

అపసవ్యతపై గళం.. కాలనాళిక స్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలనాళిక
(తెలంగాణ కవిత్వం)
పేజీలు: 120,
వెల: రూ.60/-
ప్రతులకు: ధ్వని పబ్లికేషన్స్, మహబూబ్‌నగర్
9849444944
**
నిజ కవి సర్వస్వతంత్రుడు. తన ఆలోచనలను కైగట్టి జనం ముందుంచుతాడు. దానిలోని మంచి, చెడులను వేరుచేసుకొనే పని పాఠక హంసలది. కవుల్లో ఏ కాలంలోనైనా శ్రీనాథులుంటారు, రాజు మాటను బేఖాతరు చేసే పోతనలూ ఉంటారు. ఇదే రాయాలి, ఇలా రాయాలి అని శాసించే హక్కు ఎవరికీ లేదు. మాటకు తలొగ్గిననాడు కవికుండే ప్రాథమిక లక్షణాన్ని కోల్పోతాడు.
భౌగోళికంగా వేరుపడ్డ తెలంగాణలోని కళాకారుల్లో ఓ అసంతృప్తవర్గం కదలాడుతోంది. కొత్త పాలనలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఏమేరకు నెరవేరుతున్నాయో లెక్కించే పనిలో ఆ వర్గం ఉంది. ఇప్పటికే కొందరు వాగ్గేయకారులు తమ దృష్టికి వచ్చిన అపసవ్యతను గానం చేస్తున్నారు. ఇదే దిశలో ఈమధ్యకాలంలో వచ్చిన కవిత్వాన్ని ‘కాలనాళిక’ పేరిట సంకలన పరచి ముందుకు తెచ్చింది తెలంగాణ రచయితల వేదిక, మహబూబ్‌నగర్ జిల్లా శాఖ.
చిన్న, పెద్ద కవులు 46 మందిలో ఒకరిద్దరు తప్ప అందరూ తెలంగాణలో సాగుతున్న పాలనను ప్రశ్నించిన వారే. ప్రభుత్వం తనదైన శైలిలో ఒక్కోమెట్టు ఎక్కుతూ, క్రమంగా అన్ని రంగాలను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటున్న తరుణంలో మేం ప్రభుత వెంట కాదు ప్రజల వెంట ఉన్నామంటూ ‘కాలనాళిక’ కవులు ముందుకొచ్చారు. తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కవుల ప్రతిస్పందనగా పలు పత్రికల్లో అచ్చయిన కవితలు ఇవన్నీ.
అందెశ్రీ తన ‘వర్తమానం’ కవితలో- తెలంగాణ విముక్తికోసం పండుటాకుల్లా రాలిన/ అమరత్వపు స్థూపానికి, దీపానికి దిక్కే లేకుండ పోతున్నదే!’అని దీనంగా అడగడం చూడొచ్చు. ‘అభద్రతాభావమేదో ఆవహిస్తూ ఉన్నది/ పెదవులపై పురుడుపోసుకునే ప్రతి పదం/ నిషేధానికి గురౌతుందా, గొంతే పెకలడం లేదు’అనే భావన అందెశ్రీ ‘పొద్దుతిరుగుడు పూలు’లో వ్యక్తమవుతోంది. తెలంగాణ జాతి గీతం రాసిన కవి ఇలా కుమలడం ఇబ్బందికర విషయమే.
గోరటి వెంకన్న సైతం- ‘రైతు దేవునివోలె కొలిసిన నేలకెప్పుడూ శుభములేనట/ ఏలికల కది తెలిసేదెప్పుడో నేల కల నెరవేరెదెప్పుడో’ అని అపనమ్మకాన్ని వ్యక్తం చేశాడు ‘దిగులు గూడు’లో.
జూకంటి జగన్నాథం నిరసన గళం నిష్ఠూరంగా ఉన్నది. కరాకండిగా చెప్పకుంటే కవిని కాదంటూ- ‘వచ్చుడో సచ్చుడో’అంటే/ సచ్చుడు మా వంతైపాయె/ కుర్చీలు మీ సంతైపాయె’అని రాసి దాపరికంలో లేకుండా బయటపెట్టాడు.
మిత్ర బంగారు తెలంగాణను తియ్యని విషగుళికతో పోల్చాడు. పిట్టల రవీందర్ దీర్ఘకవిత ‘తల్లికోడి తప్పించుకున్నది...??’లో ఎన్నో విషయాల ప్రస్తావన ఉంది. తల్లికోడి గతి తప్పి, మతి తప్పి, ఇచ్చిన మాట తప్పి, నడిచొచ్చిన బాట తప్పి, తోడొచ్చిన నీడను మరిచి, నీడిచ్చిన జాడను మరిచి, త్యాగాల చరితను తుడిచి’ తప్పించుకు తిరుగుతున్నదంటూ అధినాయకుడికి చురకలు అంటించాడు కవి.
అమరవీరులను ‘సకల జనుడు’గా పోల్చుతూ అమ్మంగి వేణుగోపాల్ రాసిన కవిత హృద్యంగా ఉంది. ‘పనె్నండువందల రూపాల వీరాధివీరుడు’ అంటూ కవి వారికి అక్షర హారతి పట్టాడు.
ఉద్యమంలో అన్నివర్గాలు కలిసొచ్చినా ఫలితం పీడిత జనాలకు అందక తప్పదని అన్నవరం ఆశ. అందుకే- పీడనపై దండెత్తిన పాదాలు/ పీడించి పీడించి నడిచొచ్చిన పాదాలు/ కలెగల్సి ర్యాలీలు తీయవచ్చు/ ఆ అడుగుజాడలను వేరుచేయడమే కాలనాళిక’ అన్నాడు.
మా పాలన బాగుబాగు అని ఏలికలు జబ్బలుచరుచుకుంటు ఉంటే, ఔను ఔను అంటూ కలాలు గళాలు చప్పట్లు కొడుతుంటే ఈ కాలనాళిక పరీక్షలో ఫలితాలు మరోలా ఉన్నాయి.

-బి.నర్సన్