అక్షర

ధర్మాగ్రహ దిగంబర కవిత్వంపై నిగ్రహ విశే్లషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధిక్కారవాదం
దిగంబర కవిత్వం
-డా.జూపల్లి ప్రేమ్‌చంద్,
25 పుటలు,
ప్రతులకు: నవోదయ
బుక్‌హౌస్
కాచిగూడ, హైదరాబాద్, ప్రజాశక్తి బుక్‌హౌస్,
విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు.
**
తెలుగు సాహిత్యంలో మనకు విమర్శకులు లేరనే నిరాశావాదులు కొంతమంది. మనకి సరైన విమర్శకులు లేరనే ఆలోచనాపరులు కొంతమంది. మనకు విమర్శకులు లేకపోలేదు అయితే వీరావారా అనే తర్జన భర్జనలలో కొంతమంది. ఇలా వివిధ ఆలోచనలు వుంటూ వచ్చాయి. ఇలా వుండగా దిగంబర కవి నగ్నముని. అవసర సందర్భాలలో తల కొట్టుకుని మరీ చెప్పేది ఒకటుంది. అదేమిటంటే మనకు విశే్లషకులు కావాలి అనేది ఈ పుస్తకానికి అర్ధశతాబ్ది విహంగ వీక్షణం దిగంబర కవితోద్యమం అని బహు అంత నిక్షిప్తమైన కేవలం నాలుగు పుటల ముందు మాటల్లో ఈ ఆధునిక సామాజిక ముని ‘‘తెలుగులో, ఆధునిక కాలంలో విశే్లషకులు బహుతక్కువ’’ అన్నారు.
ఇప్పుడు ఈ ధిక్కారవాదం దిగంబర కవిత్వం పుస్తకం డా.జూపల్లి ప్రేమ్‌చంద్ అనే మంచి విశే్లషకుడు మరొకరున్నారని నాట బలుకుతోంది. తెలుగు సాహిత్యంలో సమాజంలో చరిత్రాత్మక పాత్ర వహించిన దిగంబర కవుల్లో ఇద్దరు ‘స్వర్గీయులు’కాలేదు! కీర్తిశేషులయ్యారు. ఇప్పుడు మన కళ్ళ వెలుగులుగా నగ్నముని, నిఖిలేశ్వర్, భైరవయ్య, మహాస్వప్న సజీవులై వున్నారు. వీరిలో భైరవయ్య ఆధ్యాత్మిక మార్గప్రవేశం చేసే భైరవ స్వామీజీగా మారిపోయారు. ఏదిఏమైనా భారతదేశంలో స్వాతంత్య్ర సాధనానంతరం పక్షరక్షణ కవచాలు లేకుండా స్వతంత్రంగా పుట్టి వికసించి సామాన్య ప్రజల పక్షంగా చరిత్రను సృష్టించుకున్న ఉద్యమం దిగంబర కవితోద్యమం. ఉద్యమం పూర్వాపరాలు, చారిత్రకాంశాలు, ప్రాణభూతమైన కైతల ఉటంకింపులు, వ్యతిరేకుల విమర్శాంశాలు వంటివన్నీ ఉండడంతో ఈ పుస్తకం పాఠ్యగ్రంథంగా పెట్టించుకోతగ్గ స్థాయికి చేరింది.
రచయిత జూపల్లి కవి. తెలుగు కవిత్వం విభిన్న ధోరణులు, వచన కవిత్వంపై తన పరిశోధనలకు విశ్వవిద్యాలయ పట్టాలను పొందిన నేపథ్యం వున్నవారు. నగ్నముని ముందుమాటల్లో యాభై సంవత్సరాలల్లో దిగంబరులపై, దిగంబరుల కవిత్వాలపై విసిరిన రాళ్ళు, పూలు, వర్షంలో తడిసి, స్పందన ప్రతిస్పందనలకతీతంగా మారిన క్షణాల్లో ఈ గ్రంథాన్ని చదివాను మనసారా చెబుతున్నాను. ఇది నిశ్చితమైన విశే్లషణంతో కూడిన అరుదైన గ్రంథంగా భావిస్తున్నాను. గతంలో చాలామంది విమర్శకులు ఒకటోరెండో కోణాల్నుండి చూశారేతప్ప ప్రేమ్‌చంద్ దాదాపుగా ముఖ్యమైన కోణాల్నుండి దిగంబర కవిత్వాన్ని పరిశీలించారు. కొత్త అంశాలను వెలికితీశారు’’ అని ప్రశంసించారు. ఇది పైపై మెచ్చుకాదు, అచ్చమైన సత్యమైన మెచ్చే అని పాఠకుడూ అంగీకరించేలా వుంది మొత్తం పొత్తం.
సామాజిక రంగం, సాంస్కృతిక రంగం అనే శీర్షికల్లో కాలపరిణాలు, పాలక వ్యవస్థల ప్రజావ్యతిరేకతలు, వామపక్షాల వైఫల్యాలు, అభ్యుదయ కవిత్వం ఉద్ధృతి తగ్గటం ఒక నిస్తబ్ద వాతావరణంలో దిగంబర కవిత్వం ఉద్యమంగా విజృంభించడం వంటివి తమ వివేచనల ఆలోచనలతో ఇచ్చారు. రచయిత అంశాల్ని ఎంత సున్నితంగా స్పృశించి సునిశితంగా చెబుతారో అనడానికి కొన్ని వాక్యాలు. ‘‘దిగంబర కవితా సంపుటి వెలువడింది. దిగంబర కవిత్వాన్ని తీవ్రంగా విమర్శించిన విమర్శకులు కూడా సమాజం ఎంతగా పతమయ్యిందో దిగంబర కవులతో ఏకీభవించిన వాస్తవాన్ని మనం గుర్తించాలి.’’ ‘‘సమాజంలోని కుళ్ళుతో, వంచనలతో, కుహనా సంస్కారాలతో, కపట సామాజిక విలువల్తో, కుతంత్రాలతో, అరాచకీయాలతో, దగాలతో, మోసాలతో విభేదించకుండా ఏ కవీ ఉత్తమ కవిత్వాల్ని సృజించలేడు. సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని భయం భయంగా పిరికితనంతో రాసేది నిజమైన కవిత్వం కాదు, ఒకవేళ రాసినా అది ఉత్తమ కవిత్వంకాదు, కాలేదు. కేవలం గతానుగతికంగా వస్తున్న కవితా విలువల్ని అనుసరించిన అనుకరణ కవిత్వంగా మిగులుతుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన దిగంబర కవులు కవిత్వానికి నూతన ద్వారాలు తెరిచారు. ఎందుకంటే దిగంబర కవులు చేవచచ్చిన, వెనె్నముక లేని పిరికిపందలు కారు. ధైర్యంగా ఆంధ్రదేశానికి తెలుగు సాహిత్యానికీ ముందు దారిచూపిన పథ నిర్దేశకులు. (ట్రెండ్ సెట్టర్స్.)’’
దిగంబర కవిత్వంతో మమేకమై, దిగంబర కవులతో పరకాయప్రవేశం చేసి, దూకుడుతనం లేకుండా స్థిమిత వివేచనలతో ఈ గ్రంథాన్ని సంతరించి పెట్టారు. మన ఈ తెలుగు ప్రేమ్‌చంద్.
సర్వరోగగ్రస్థ వ్యవస్థను బాగుపరచడానికి శస్తచ్రికిత్సదిశామార్గంలేదని దిగంబర కవులు స్థిరమైన సైద్ధాంతిక నిబద్ధతను కలిగి వున్నారని చెబుతూ జూపల్లి ఆయా కవులు సామూహికంగా వహించిన పాత్రను చెప్పారు. ఆయా సందర్భాలలో ఆ కవులు వేటికి ప్రాధాన్యమిచ్చారో ఎవరి ప్రత్యేకతలు ఎటువంటివో విస్పష్టంగా చెప్పడంలో ప్రామాణికమైన బేరీజు వేశారు.
ఇతర దేశాల్లో, బెంగాల్లో వచ్చిన విలక్షణ కవితోద్భమాల చారిత్రక సందర్భాలను చెబుతూ వాటికన్నా దిగంబర కవితోద్యమం ఏ విధంగా ఉత్కృష్ఠమైందో చెప్పిన తీరు అభినందనార్హం. ప్రజల దృష్టిలోకి రావడానికి, ప్రచార ప్రాధాన్యం పొందడానికి లేకిడి పనుల్ని దిగంబర కవులు చేబట్టలేదనే భావాన్ని విపులీకరించారు.
జాతీయోద్యమ కాల ప్రముఖ పద్యం 44వ పుటలో ‘్భరతదేశంబు, చక్కని పాడియావు/ హైందవులు లేగదూడలై ఏడ్చుచుండ’అని తప్పుగా ఇచ్చారు. అందులోని భరత ఖండంబు అనీ హిందువులు అనే వుండాలి.
దిగంబర కవిత్వంపై రా.రా. ఒకనాడు చేసిన విమర్శలపై ఈ రచయిత చేసిన ప్రతి విమర్శలు హేతుబద్ధంగా ఉన్నాయి. ఆసక్తికరంగా, ఒక ఉపన్యాసంగా ఒక పరిశోధనా వ్యాసంగా లోతు చూపుతో ఒక కాలాన్ని దిగంబర కవిత్వాన్ని ప్రశంసల్ని, విమర్శల్ని- ఇన్నిటిని నిక్షిప్తంచేసి మరీ రాసిన ఈ గ్రంథం అవస్య పఠనీయం. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల్లో వచ్చిన ఇంటర్వ్యూలు అనుబంధాలుగా ఇవ్వడంతో అప్పటి దిగంబర కవులు కొందరు ఇప్పుడేమనుకుంటున్నారో కూడా తెలియడానికి మార్గం సుగమమయింది. ఇది సామాజిక ధర్మాగ్రహ దిగంబర కవిత్వంపై నిగ్రహ విశే్లషణల గ్రంథం.

-సన్నిధానం