అక్షర

కథారచనకు ఇదీ వరస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానిక-పాఠాలు
గౌరవ సంపాదకులు:
పెనుగొండ లక్ష్మీనారాయణ
సం: వల్లూరి శివప్రసాద్
పేజీలు: 182..వెల: రు.100
ప్రతులకు: విశాలాంధ్ర,
నవచేతన పబ్లిషింగ్
హౌస్‌లవారి అన్ని
బ్రాంచీలలో

గుంటూరుజిల్లా అరసం శాఖ ఎన్నో సాహిత్య పాఠశాలలు, సభలు, పుస్తక ప్రచురణ చేపట్టి చాలా ఏండ్లుగా సాహిత్య సేవ చేస్తున్నది. అందులో భాగంగానే స్వల్పకాలిక కథానిక పాఠశాల నిర్వహణ; అది 1946 నుండి ఇటీవల 2014 వరకు తరచుగా సాగుతున్నది. అలాగే అది చాలామంది యువ ఉత్సాహకులకు శిక్షణ ఇచ్చి ఎంతోమంది రచయితలను వెలుగులోకి తెస్తున్నది. ప్రస్తుత గ్రంథం ‘కథానిక-పాఠాలు’ లక్ష్యం కూడా అదే. ఇందులో 18 వ్యాసాలున్నాయి. అవి ప్రముఖ విమర్శకులు, కథకులు రాసినవే.
మొదటి వ్యాసం ‘ఆధునిక సాహిత్యం-పుట్టుక, నేపథ్యం’లో డా.కాత్యాయనీ విద్మహే భిన్న సాహిత్య ప్రక్రియలు ఆధునిక యుగ స్వభావాన్ని ఎట్ల ప్రతిఫలిస్తాయో తెలుపుతారు. కొడవటిగంటి కుటుంబరావు కథా-నవలా సాహిత్యాన్ని కొత్త ఎత్తుకు తీసుకువెళ్లినవారు. ‘జీవిత వైవిధ్యంలో మార్పు చాలా వేగంగా జరుగుతున్నది’. ఈ మార్పును కథకులు సాహిత్యంలో చిత్రించాలి. ‘రాబోయే కథకులు ఒక బాధ్యత గుర్తించాలి. తాము తమ వర్గాలకు, కులాలకీ, తమకు సన్నిహితంగా వచ్చే జీవితానికీ ‘ఎన్నుకోని ప్రతినిధులు’ అని గుర్తించాలి (పు.21) అంటారు ఆయన. మధురాంతకం రాజారం జగమెరిగిన కథకుడు. కథలలో ప్రస్తావితమయ్యే వివిధ అంశాలను ఆయన మన ముందుంచారు. కోడూరి శ్రీరామమూర్తి ప్రముఖ కథా విమర్శకుడు. కథకుడు కథారచనలో గుర్తుంచుకోవాల్సిన రెండు ముఖ్య లక్షణాలను ప్రస్తావించారు. అవి సంక్షిప్తత, అనుభూతి ఐక్యత. తెలుగులో మరో పేర్కొనాల్సిన సాహిత్య విమర్శకుడు డా.రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. ‘నూరేళ్లకు పైబడిన తెలుగు కథా సాహిత్యాన్ని ఉద్యమాలు, వాదనల నేపథ్యంలో’ (పు.41) ఆయన అధ్యయనం చేసారు. శీలా వీర్రాజు చెప్పుకోదగిన కథకులలో ఒకరు; రచనలో ముఖ్యమైన మూడు అంశాలు-వస్తువు, శైలి, శిల్పంపై రచయిత దృష్టి సారించాలి అని అంటారు.
ఆచార్య మేడిపల్లి రవికుమార్‌కు కథవేరు, కథానిక వేరు; కథలు పేదరాశి పెద్దమ్మ కథలు. కథానిక ఆధునిక మైనది. అలాగే వస్తువు-ఇతివృత్తం కూడ భిన్నమంటారు ఆయన. ‘రచయిత తన రచనకు స్వీకరించిన ముడి సరుకు వస్తువు; ఆ ముడిసరుకు రచనలో పొందిన రూపం ఇతివృత్తం.’ శిల్పంలో శీర్షిక, ఎత్తుగడ తదితరాలను చర్చించాక ముగింపుకు గల ప్రాముఖ్యతను వివరిస్తారు ఆయన. డా.కేతు విశ్వనాధరెడ్డి ప్రముఖ విమర్శకుడు, రచయిత. ‘కథానికలో నినాదాలు పనిచెయ్యవు. కథానికల ద్వారా అందించే జీవితం మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి జీవితానికి రచయిత ఎంత దగ్గరగా వుంటే అతని కథానికలు ప్రజలకు అంత దగ్గరగా వెళ్తాయి’ (పు.83) అంటారు ఆయన. డా.పాపినేని శివశంకర్‌కు పేరెన్నిక, ఎత్తుగడ, ముగింపు, ముఖ్యంగా జీవిత తాత్వికతలలో కథా సౌందర్యం దృశిస్తుంది. పోరంకి దక్షిణామూర్తి కథలలో ‘్భషా ప్రయోగాలు-్భవ వైవి(రు)్ధ్యల’ గురించి ప్రస్తావిస్తారు. కె.పి.అశోక్‌కుమార్ ‘కథ-అనుబంధ ప్రక్రియలు; రూప విమర్శ’ గురించి చెప్పారు. డా.మధురాంతకం నరేంద్ర మరో మంచి కథకుడు. తెలుగు కథపై పాశ్చాత్య సాహిత్య ప్రభావం ఎలా వుందో ఆయన వివరించారు.
వల్లపాటి వెంకట సుబ్బయ్య చెప్పుకోదగిన సాహిత్య విమర్శకుడు. కథను ఎలా చదవాలో ఆయన చెప్పారు. విహారి పేర్కొనదగిన కథకుడు. ‘క్లుప్తత, స్పష్టత, ఏకాంశవ్యగ్రత, వర్తమానత, సామాజికత, వాస్తవికత, స్థానికత-ఈ సప్త ‘త’కారాల్నీ పాటించాలి’’ (పు.135) అంటారు ఆయన. సింగమనేని నారాయణ మంచి కథకుడు. ‘కథకు క్లుప్తత ఆయువుపట్టు. నవలకూ కథకు తేడా కొట్టొచినట్టుగా వుండాలి. నవలను కథలాగ, కథను నవలలాగ రాయడం శిల్పరీత్యా పెద్ద లోపం’ (పు.138) అన్నది ఆయన అభిప్రాయం. కాళీపట్నం రామారావు కథా సాహిత్యానికి చేసిన సేవ మరువరానిది. ‘కథలెలా రాస్తారో’ ఆయన విశదీకరించారు. డా.చందుసుబ్బారావు మరో చేయి తిరిగిన రచయిత. ‘ప్రత్యక్షంగా చూసినది, పరోక్షంగా విన్నది, కళ్లతో చదివినది అనే అనుభవ త్రయంనుండి కథలు ఉద్భవిస్తాయి’ (పు.156) అంటారు ఆయన. ప్రఖ్యాత సాహిత్యవేత్త, కథకుడు ఆయిన ఆరుద్ర ‘కాబోయే కథకులకు పనికివచ్చే చిట్కాల’ను సోదాహరణంగా ఒక కథగా హృద్యంగా చెప్పారు.
ఏమయినా కాబోయే కథకుడికి తన అనుభవాలను, అనుభూతులను తను చూసిన జీవితాన్ని కాయితం మీద పెట్టాలన్న తపన వుండాలి. ఆ పని అయిందాక అది అతనికి ఊపిరి సలపనివ్వకూడదు. ప్రముఖ రచయిత విలియం సోమర్‌సెట్ మామ్‌కు తను చూసిన జీవితాన్ని, తన అనుభవాలు, అనుభూతులను కథనం చేయకపోతే మానసిక విముక్తి కలగదు. అయితే కొడవటిగంటి కుటుంబరావు అన్నట్టు ‘ఒక కథకుడికి రచనా సామర్ధ్యం లేకపోయినా సరిచేయవచ్చును కానీ, జీవితం తెలియకపోతే తెలియజెయ్యడం ఎవరివల్లా కాదు. శిల్పం, భాషా రచనకు ముఖ్యం కావని కాదు; అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూల పరికరాలు, ముడిపదార్ధం జీవితం.’ (పు.21)
అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారు కథానికలో మెళకువలు తెలియబరుస్తూ రాబోయే కథకులకు మార్గదర్శకం చేయడం ముదావహం. వారు ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు చేయాలని ఆశిద్దాం.

-కాకాని చక్రపాణి