అక్షరాలోచన

ఆకలి సాహస విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ సంచార జీవనానికి అవశేషమతడు
దేశదేశాలు సంచరించే దేశ దిమ్మరి
దిమ్మరి నుంచే అతడు దొమ్మరైనాడు
ఈ విశాల ప్రపంచంలో స్థిరంగా
ఉండడానికి జానెడు చోటులేనివాడు
వెనుకా ముందూ బలంలేని అనాథుడు
ఈ ఊరు నాది ఆ ఊరు నీదన్న
భేదాభేద చింతనాతీతుడు
ఊరూరు చెడ తిరిగిన వొఠ్ఠి సంచార జాతివాడు
ఒకనాడు రాజుల ఆస్థానాలలో
సామంతుల సంస్థానాల యందు
పాలెగాళ్ల మధ్యన
సాహస విన్యాసాలు ప్రదర్శించి
మడిమాన్యాలు పొందిన దర్జా అతనిది.
సన్మానాలు సత్కారాలు అందుకున్న ఠీవి అతనిది
నాటి దొమ్మర మాన్యాలు
నేడు దౌర్జన్యుల ఆక్రమణపాలు కాగా
అతడు దొమ్మరాటను ప్రపంచ సర్కస్‌కు
మూల రూపాన్నిచ్చి దేశ గౌరవం పెంచినాడు
కాలం కాలక్రమేణ దృశ్యం మార్చుకుంది
ఆట రాజాదరణ కోల్పోయింది
భృతి కోసం భక్తి కోసం ఆట వీధిన పడింది
అతడు జన సమూహాల నడుమ
ఆట పాట ఆడి పాడి కడుపాత్రం చేసుకున్నాడు
తన పెద్దక్క ఆకాశమెత్తు గడే అతి నేర్పుగా ఎక్కి
మాదాకబళం కోసం చూపులు సారించేది
తన చిన్నక్క తాటిపై అత్యంత చాకశక్యంగా నడచి
ఆకలి చేతులు సాచేది
తన చెల్లి కులుకుల లయలు వొలికించి
చూపరుల మతులు పోగొట్టేది
పెద్దన్న మందసరి బండలను
వొట్టి చేతులతో సులువుగా
పగలగొట్టి విస్మయపు జల్లు వెదజల్లేవాడు
చిన్నన్న తలకిందులుగా అరచేతులపై తేలిగ్గా నడచి
ప్రజా సంతోష వాకిళ్లు తెరిచేవాడు
తమ్ముడు అంతర్లంతర్లు సునాయాసంగా పల్టీలుగొట్టి
జనానందానికి చలియలికట్ట తెంచేవాడు
తాను ఎతె్తైన కర్ర కాళ్లపై అవలీలగా నడచి
పరిసర ప్రజల్ని అబ్బురంతో నింపేవాడు
తండ్రి బపనం చెప్పడంలో బహుదా ఆకట్టుకొనేవాడు
అమ్మ అర్థింపులతో సంభావనలు సమీకరించేది
కాలం దశాబ్దాలుగా కరిగి తరిగిపోయింది
ఆట చలనచిత్రాల ధాటికి ఆకలి తీర్చలేకపోయింది
ఎడ్లకొమ్ములు అందంగా జవిరి బతుకుబొమ్మ
చూసుకోసాగాడు
ఎడ్ల స్థానంలో ట్రాక్టర్ల ఆగమనంతో
జీవికకు అతడు చెక్క దువ్వెనలకు వింత నగిషీలుగా
రూపాన్నిచ్చి ప్రజల తలలు దువ్వాడు
ప్లాస్టిక్ ప్రవేశం అతడి వెన్నులో బాకు దూసింది
ఆపై అతడు వరాహాల పెంపకంలో
పోషణ పడుతుండగా
ఎక్కడో మెదడు రోగం తగిలించుకున్న రాజ్యం
సూకరాల ఊపిర్లు తీసి వాడి ఉసురు పోసుకుంది.
యావన్మందిలో అతడు
చంద్రధ్వజులకు అస్పృశ్యుడై తృణీకరింపబడ్డాడు
నూటికి మించిన కులాల బి.సి సంకుల సమరంలో
అశాస్ర్తియంగా అతన్ని త్రోసి
వాడి భవితపై సమాధి రాయి ఎత్తి
వికృతంగా నవ్వుకుంది ప్రభుత.
మళ్లీ అతడు ఆకలి తీర్చుకొనే వేటలో పడ్డాడు.
*
* బపనం - బప్ అన్న ఉర్దూ పదం తెలుగు రూపాంతరం - హాస్యవ్యాఖ్యానం

-కాశీవరపు వెంకటసుబ్బయ్య 9849800389