అక్షర

అక్షరాలలో ఒదిగిన అనల్పార్థ భావ చిత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోటమాలి
కవితా సుమాల సమాహారం
వెల: రు.100/-
ప్రతులకు: నవోదయ
బుక్‌హౌస్, కాచిగూడ,
హైదరాబాద్-27
--

అక్షరం ధ్వని ప్రతిబింబం. పదాల వెంట పరుగులు తీసే మనసు అక్షర రూపం ఇస్తుంది. అలా గుబాళించిన పరిమళాల సౌందర్య ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వర్తమానానికి ఊపిరిలూదుతాయి. ఇలాంటి మానసిక వౌన సంభాషణల్లోంచి వెలుగు చూసిన కవితా సంపుటి ‘తోటమాలి’ సహత్వం, సౌందర్యం, సంప్రదాయం తొంగిచూసిన భావ కుసుమాల వెల్లువకు నిలువెత్తు రూపం ఈ పుస్తకం. దీని కవి వ్యాకరణం అచ్యుతరామారావు
ఈ కవితా సంపుటిని 5 విభాగాలుగా విడదీసారు కవి. అవి 1. ‘స్వ’్భవ కుసుమాలు, 2. భావావేశ కుసుమాలు, 3. అనుభూతి భావ కుసుమాలు, 4. ‘రమ్య‘్భవన కుసుమాలు 5. కుసుమాంజలిగా. ప్రధాన శీర్షికల్లో ఉప శీర్షికని ప్రవేశపెట్టి కవితాగానం చేసారు. ఆధ్యాత్మిక, ఆత్మాశ్రయ, భావుకత, సహజ సౌందర్యం వంటి లక్షణాలు ప్రధాన వాహికగా చేసుకుని మూల సూత్రాలను కవిత్వ రూపంలో అందించారు. వీటి అనుభవ సారాన్ని అందిపుచ్చుకోవడానికి కవి అంతరంగంతోపాటు కవితావేశ రెమ్మల్ని ఒడిసిపట్టుకుని క్షణాలతో కరచాలనం చేయిస్తారు. ఈ నేపథ్యాన్ని వాస్తవిక దృక్పథంతో కవి అధ్యయనం చేసే తీరును అతని పదాల మాటున దాగిన రహస్యానే్వషణ అడుగులను ఏరుకునే ప్రయత్నం చేద్దాం.
‘వాటి ఝంకారాలకి పరవశవౌతూ
హోయలుగారే వయారాలనే ఒలికిస్తూ
మొక్కలన్నీ కల్యాణి రాగంలో గళాలు విప్పి
రారండని స్వాగత గానాలే వినిపించాయ్!
అంటారు ‘తోటమాలి’ కవితలో. ప్రకృతికి-మనిషికి మధ్య ఉన్న సహజ స్వభావాన్ని పూలమొక్కల రూపంలో ఆవిష్కరించారు. విత్తు మొలకెత్తి పూలుగా వికసించే పరిణామ దశల్ని భావుకత నేపథ్యంలో పచ్చదనాన్ని నింపే బతుకు పచ్చని కలల్ని స్వభావ రీత్యా ఆపాదించే గుణాన్ని ఈ కవితలో వ్యక్తీకరిస్తాడు కవి. కవి దృష్టి జీవజాలం మనుగడను ఆవే రీతిలో కవిత్వీకరించారు. ఈ కవితలోని పద్య సంప్రదాయ వచన నడక పాఠకుల్ని సమ్మోహపరస్తుంది. కవిగా భావుకత, సొగసుల్ని రమణీయ సుందరంగా చెప్పడం కనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ ఈ ‘తోటమాలి’ కవితలో- ఆ అక్షరాలలో డా.వ్యాకరణం అచ్యుతరామారావుగారు విశదీకరించడం కడు కమ్మదనం.
‘నీకిచ్చేందుకు నాదగ్గర ఇంకేమీ లేదు
భూమిలోన ఉండాల్సిన నా వేళ్లు
ఎండలే ఎక్కువై వానలే కరువై
బీడు వారుతున్న ఈ దిబ్బలో నీళ్లే కనుమరుగై
పైకి తన్నుకొచ్చాయి, అవే నాకు మిగిలాయి.
చెట్టుకు మనిషికి ఉన్న అనుబంధాన్ని అందంగా చెప్పిన ఈ కవిత ‘ఒంటరి మామిడి చెట్టు’. బాల్యంనుంచి మధ్య వయస్కుడిదాకా ఎదిగిన యువకుడి అనుబంధం. ప్రతీ మనిషి ఎలా వాడుకున్నా, నిర్లక్ష్యం చేసినా చివరికి ప్రకృతి అతనికి అండగ నిలుస్తుందన్న ఒక వాస్తవాన్ని తెలియజెప్పిన కవిత ఇది.
బతుకును పంటగా చెయ్యాలని కలలుగనే భూస్వామికి నిరుత్సాహాన్ని ఆక్రందనగా మిగిల్చిన కవిత కూడా ఎండకు ఎండి బీటలు వారిన భూమి గుండెపగుళ్లు నెర్రెలిచ్చిన విషాద కలలుగా ఆక్రోశిస్తూ ముగుస్తుంది ఈ కవిత. ప్రకృతి జీవన వైఫల్య ధోరణి సహజ సిద్ధ పరిణామాల్ని మానవానజయంగా పరిణమించే తరుణాన్ని కవి ఎలుగెత్తి చాటుతారు. నిర్లిప్తత, నిస్సహాయతలను అడుగడుగునా ధ్వనింపచేసే జీవ వాస్తవికతకు ఇది దర్పణం.
‘‘సాఫీగా నడిపిస్తున్నామనుకునే
జీవిత నావను కుదిపేస్తూ
మనబోట్ల మామూలు బతుకుల
పునాదులనే కదిలించేస్తూ
దారి తెన్ను తప్పించి అలజడి చేస్తూ
న్యాయాన్యాయాల విచక్షణ లేకుండా
మేమెంతో అభిమానించే/మంచి మనుషులకే, మనవాళ్లకే
క్షణికంలో పిడుగులా తగిలే
దాక్షిణ్య రహితమైన విద్యుద్ఘాతమే ఆపద’’
అసంకల్పిత చర్యలకు, అప్రయత్న ఫలితాలకు మధ్య జరిగే వ్యక్తిగత, సామాజిక జీవన సంఘర్షణలకు ప్రతిరూపం ‘ఆపద’ కవిత. ఊహించని హఠాత్ పరిణామాలకు ఇచ్చిన వాక్య సందేశ రూప సారాంశమే దీని ఇతివృత్త మూలాన్ని కవితాత్మకంగా చాటిచెప్తుంది. కవి అంతర్మూలలను వెతికి పట్టుకునే తడుములాట దీనిలో కనిపిస్తుంది. కాబట్టే ఇది హృదయావిష్కరణకు కేంద్రంగా మారింది.
ఇంక ‘కుసుమాంజలి‘లో
‘విడవొద్దు కన్నీళ్ళు బేలపడిపోయి
అలజడిగా గట్టిగా మీరేడ్వ తగదు
నిదుర పోతున్నాడదిగో చిరునవ్వుతోటి
పరమాత్మ ఒడిలోన సచ్చిదానందముతోటి’’
అని రాస్తారు ‘అనురాగమయి’ కవితలో.
ఆధ్యాత్మికా తపన దైవచింతనతో ముడిపెట్టి జీవన రహస్యాన్ని సామూహిక చేతనగా అక్షరాలలో పరిచి నివేదించిన కవిత ‘అనురాగమయి’.
ఇలా కవిత్వం పొడుగునా వెన్నంటే వెతుకులాడే విభిన్న మనస్తత్వాల, భావాల గుబాళింపులు ఆనందపరవశుల్ని చేస్తాయి.
సందర్భోచిత సంక్లిష్ట, సరళత్వం నింపిన పద సమూహ వాక్యాలు, కొత్త ఆలోచనల మధ్య దోబూచులాడతాయి. అభివ్యక్తిలో సంప్రదాయక, ఆధునిక తీరుతెన్నుల్ని ప్రదర్శించిన నైజం కనపడుతుంది. పలురకాలు భావ సమాహార విషయ చిత్రణ ఇందులో ద్యోతకమవుతుంది. ఈ రకమైన అనుభవాలను సృజనాత్మక సొబగులతో కవిత్వాత్మకంగా తీర్చిదిద్దారు అచ్యుత రామారావుగారు.

-బులుసు సరోజినీదేవి