అక్షర

విభిన్న జీవితాల సమాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కథ-2015
- సంపా:ఆడెపు లక్ష్మీపతి, ఎ.వి.రమణమూర్తి,
కథా సాహితి, వెల:రూ.65/- పే:205,
ప్రతులకు:అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు.

ప్రతి సంవత్సరం దాదాపుగా రెండు వేల కథలకు పైగా వెలువడుతున్నాయి. ఇన్ని కథలను అందరూ చదవడం అసాధ్యం కాబట్టి ఒక సంవత్సర కాలంలో వెలువడిన కథలనుండి కొన్ని మంచి కథలను ఏరుకొని ఒక సంపుటిగా వేయడం కథా సాహితితోనే మొదలయింది. సమకాలీన సమస్యలు - సంఘటనలు ఇతివృత్తంగా వస్తురీత్యా, శిల్పరీత్యా విభిన్నమైన కథా కథనాలతో వచ్చినవాటిని మంచి కథలుగా గుర్తించి, పాతికేళ్లుగా ఈ సంకలనాలను తీసుకువస్తున్నారు. ఆ వరుసలో వచ్చిందే ఈ ‘కథ-2015’. ఇందులో దళిత కథలున్నాయి. స్ర్తివాద కథలున్నాయి. కుటుంబంలో, వృత్తుల్లో, సమాజంలో వస్తున్న మార్పులను తెలిపే కథలున్నాయి.
ఆంగ్లేయుల పాలనలో వాళ్ళకు విధేయంగా నడుచుకున్న బ్రాహ్మణులు అధికార వ్యవస్థలో దూరిపోయారు. నాయకత్వ లక్షణాలు గల రాజులు కాంట్రాక్టర్లుగా రూపాంతరం చెందారు. అత్యంత నిపుణుడైన సంకరజాతి కొండమనిషి గుర్తింపునకు నోచుకోక అనామకంగా అడవిలోనే రాలిపోతాడు. అభివృద్ధి క్రమంలో కులం వహించిన పాత్రను ‘మూడు కోణాలు’ తెలియజేస్తుంది. కులాల మధ్య, మతాలమధ్య, మనుషుల మధ్య కనిపించని అంతరాలు, ఈ గోడల్ని బద్దలు కొట్టలేమా అని ‘తోలు మల్లయ్య కొడుకు’ ఆలోచించడమే ఒక కథ. తోలు మల్లయ్య, కొడుకు మారయ్యను చదువు మానిపించి తోలు పనిలోకి తీసుకువస్తాడు. చెప్పులు కుట్టుకుని బతికే మారయ్య కొడుకులకు చదువంటకపోవడంతో పెద్దోడు రాజకీయాలలో తిరుగుతుంటాడు. చిన్నవాడు ఆటో నడుపుకుంటాడు. కుల వృత్తిని నీచంగా భావించిన మారయ్య కొడుకులు దాన్ని వదిలేసి తమకు నచ్చిన మార్గాలను ఎంచుకున్నారు. ఒకవేళ బాగా చదువుకుని వుంటే అంతకంటే మంచి పరిస్థితుల్లో వుండేవారేమో? చదువే అభివృద్ధికి మార్గం అని అంబేద్కర్ బోధించింది అందుకే. బాగా చదువుకున్న దళితులు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని పైకెదిగే క్రమంలో వారి వారి కుల వృత్తులు కనుమరుగవడం సహజమేనని ‘చివరి చర్మకారుడు లేడు’ అనే కథ నిరూపిస్తుంది. ఒకప్పుడు గొలుసు కట్టు చెరువుల నిర్మాణం ద్వారా కాకతీయులు వ్యవసాయాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. చెరువు నిండినప్పుడు పొలాలకు వంతుల వారీ నీరు వదిలే పనికి నీరుటికాడు కావాల్సి వచ్చింది. ఆ వృత్తి క్రమంగా కులంగా మారిపోయింది. చెరువు నిండితే పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే రైతులే కాదు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వృత్తులవాళ్ళకు కూడా జీవిక దొరుకుతుంది. ఒకవేళ చెరువులే ఎండిపోతే రైతులే కాదు, ఆయా వృత్తులవారు కూడా నష్టపోవాల్సి వస్తుంది. వానలు లేక కొంత, పాలకుల నిర్లక్ష్యం వల్ల కొంత చెరువులు వాటి ఉనికిని కోల్పోతున్నాయి. పంట పొలాలతో పాటు చెరువులను కూడా ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు. ఇక చెరువే లేనప్పుడు నీరిటివాడు వుండడు. అలా ఆ కులవృత్తి నశించిపోతుంది. ఇంకోవైపు వ్యవసాయం జూదంగా మారి రైతుల ప్రాణాలు తీస్తుంటే, వ్యవసాయదారులు కూడా భూమికి దూరం అవుతున్నారు. వాస్తవంగా చూస్తే, దేశంలో అందరూ సుఖంగానే బతుకుతున్నారు, ఒక్క వ్యవసాయం చేసేటోడు తప్ప. రోడ్లమీద తోపుడుబళ్ళు పెట్టుకున్నవాళ్ళు కూడా హాయిగా బతుకుతున్నారు. పంటలు కొన్న వ్యాపారులు ఇంటిమీద ఏడాదిలో అంతస్తు లేపుతున్నారు. పండించిన రైతు మాత్రం అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినప్పటికీ రైతు వ్యవసాయం చేయడానికే సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు కావాల్సింది రవ్వంత ధైర్యం, కాసింత భరోసా అని ‘ఊరవతల ఊడలమర్రి’ తెలియజేస్తుంది.
మన పండుగలన్నీ సామూహిక సంబరాలే. ఆయినప్పటికీ అవన్నీ కులాలవారీగా చేసుకుని సంబరపడాల్సిందే. పట్టణాల్లో ఇది కనిపించదు గాని పల్లెల్లో కుల వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను జాతీయ పండుగగా ప్రకటించడంతో ఎన్నడూ ఆడనివాళ్ళు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. రోడ్లమీద అందరూ కలిసి బతుకమ్మ ఆడడం ఒక ఉద్యమ అవసరం. అలాగే ఊళ్ళల్లో ఆడతామంటే ఎలా కుదురుతుంది? తమ అవసరాల కోసం పద్మ చుట్టూ తిరిగిన బిసి కులాల వాళ్ళే, చివరకు ఆమెది ‘అంటరాని బతుకమ్మ’గా దూరం పెట్టినపుడు ఆమె పడిన వేదన వర్ణనాతీతం. దళితులు కుల వివక్ష, అవమానాల నుండి తప్పించుకుని మనుషులుగా బతకడానికి కొత్త మతంలోకి చేరితే అక్కడా అదే పరిస్థితి. భారతదేశానికి వచ్చిన ఏ మతమైనా కులాలవారీగా చీలికలు, పేలికలు కావాల్సిందే. క్రైస్తవంలోకి చేరినవారు కూడా భద్రంగా తమ కులాలను మోసుకుపోవాల్సిందే. అక్కడ కూడా అగ్ర కులాలవారికే పెద్ద పీట వేస్తారు. నిమ్న కులాలవారి పట్ల చూపే వివక్ష- అవమానాలు అక్కడ కూడా ఎలా కొనసాగుతాయో ‘పరిశుద్ధ వివాహము- మూడో ప్రకటన’లో చూడవచ్చు.
జీవితమంతా ప్రేమకోసం, సరియైన ప్రేమికుడి కోసం సాగించిన అనే్వషణే ‘తొమ్మిదో నెంబర్ చంద్రుడు’గా రూపుదాల్చింది. యవ్వన ప్రాయంలో యువతరంలో తలెత్తే లైంగిక భావనలు, ప్రణయ స్వైరకల్పనలను చిత్రిస్తూ కథలు వచ్చినప్పటికీ, స్ర్తి దృక్పథంతో వచ్చిన కథగా ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ‘శతపత్ర సుందరి’ కథలో పదేళ్లుగా సహజీవనంలో వుంటున్న నీలవేణి, సుజాత, సదాశివ జీవితంలోకి దూసుకువచ్చిన లలీ లాయరమ్మను చూసి ఈర్ష్యపడకపోగా, ఆసక్తితో ఆమెను పరిశీలిస్తుంది నీలవేణి. అదే నీలవేణి, గౌతమ్ ఆకర్షణలో కొట్టుకుపోతుంటే సదాశివ భరించలేకపోతాడు. ఎలాంటి బంధనాలు లేని స్వేచ్ఛ అంటే ఒక సహజీవనంలో నుండి మరో సహజీవనంలోకి పయనిస్తూ వుండటమేనా? మనుషులకి అన్ని రకాల స్వేచ్ఛలు ఉండాలనీ, అదే అంతిమ విలువ అని ఇద్దరూ నమ్ముతున్నపుడు ఈ గొడవంతా దేనికి? నీలవేణి ఇద్దరితో ఉండటానికి ఒప్పుకుంటుంది. కాని సదాశివ ఆమె తన స్వంతమే కావాలనుకుంటాడు. అక్కడే వస్తుంది పేచి. ఈ కొత్త కొత్త ప్రేమలు, కొత్త ప్రేమికుల అనే్వషణలు చివరికి మొగవాడికే లాభిస్తాయన్న సంగతి వీరు ఎప్పుడు తెలుసుకుంటారో? ఈ లైంగిక స్వేచ్ఛల గోల సంగతి పక్కన పెడితే, ఉద్యమం పేరుతో ఆడవాళ్లకు జరిగిన అన్యాయాన్ని ‘సావిత్రి’ కథ ప్రతిభావంతంగా చిత్రీకరించింది. ప్రేమించిన ప్రకాశరావు కోసం సావిత్రి కట్టుబట్టలతో వచ్చేస్తుంది. విప్లవకారుడిగా ఆమెతో రహస్య కాపురం చేసిన ప్రకాశరావు కొంత కాలానికి ఇద్దరు పిల్లల సావిత్రిని వదిలేసి ఉద్యమంలోకి వెళ్లిపోతాడు. రషీద్ సాహచర్యంతో సావిత్రి ఆ పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేస్తుంది. ముసలితనంలో అనారోగ్యంతో ఉద్యమంలోంచి బయటికొచ్చిన ప్రకాశరావును పిల్లలు దొంగచాటుగా కలవడాన్ని, చివరకు అతడ్ని తమతో ఉంచుకోవడానికి ప్రయత్నించడం సావిత్రి జీర్ణించుకోలేకపోతుంది. ఆమె నిరాసక్తతను గమనించిన ప్రకాశరావు అపరాధ భావనతో వెళ్లిపోతాడు. గిల్టీగా ఫీలయ్యే పిల్లల అజమాయిషీలో వుండటం కంటే, తనను అభిమానించే రషీద్ దగ్గరకే వెళ్లిపోవాలనుకుని సావిత్రి నిశ్చయించుకోవడంతో కథ ముగుస్తుంది.
కుటుంబ సంబంధాలలో వున్న ఆత్మీయతను తెలిపే కథ ‘తాతిల్’. ఇందులో కోడలిని అభిమానించే అత్తామామలు, చిన్న ఇంట్లో కొడుకు - కోడలుకు ఏకాంతం కలిగించడానికి పడిన పాట్లు పాఠకుడి మనసుకు హత్తుకుపోతాయి. ఈ కథ చదువుతుంటే కాళీపట్నం రామారావు ‘నో రూమ్’ కథ ఎంత కృతకంగా వుందో తెలియజేస్తుంది. అలాగే కుటుంబ సంబంధాలు వ్యాపార సంబంధాలుగా మారుతున్న వైనాన్ని మరో కథ చిత్రీకరించింది. అలా రియల్ ఎస్టేట్ వ్యామోహంలో పడి స్వంత అక్క శత్రువుగా మారినా ‘రాతి మిద్దాయన చిన్న కుమార్తె’ తీసుకున్న నిర్ణయం, ఆమె మంచితనం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
నలుగురు వ్యక్తుల కథనాలతో ప్రధాన కథకు ఒక రూపం కలిగించడం జానపద ...... ‘చివరి చర్మకారుడూ లేడు’లో కనిపిస్తుంది. ఉత్తమ పురుషలో విలక్షణమైన శైలి సాగిన కథ మోహిత రాసిన ‘తొమ్మిదో నెంబరు చంద్రుడు’. కనుమరుగవుతున్న గ్రామీణ జీవితం కవితాత్మకంగా ‘నీరెటుకాడి కల’‘లో గుడిపల్లి నిరంజన్ చిత్రీకరించారు. దళిత క్రైస్తవ జీవితాల్ని చిత్రించిన ఘనత పి.వి.సునీల్‌కుమార్‌ది. ఇందులో వున్న అయిదు మాండలిక కథలలో చిత్తూరు మాండలికంలో నామిని రాసిన ‘రాతి మిద్దాయన చిన్న కుమార్తె’, నెల్లూరు మాండలికంలో కృష్ణజ్యోతి రాసిన ‘నేను తోలు మల్లయ్య కొడుకును’, తెలంగాణ మాండలికంలో గుడిపల్లి నిరంజన్ ‘నీరెటుకాడి కల’, పి.చిన్నయ్య రాసిన ‘అంటరాని బతుకమ్మ’, కొట్టం రామకృష్ణారెడ్డి ‘తాతిల్’ ఉండటం విశేషం. ఈ సంకలనానికి ప్రత్యేక సంపాదకుడిగా ఆడెపు లక్ష్మీపతి రాసిన ముందుమాట ఈ పుస్తకానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

-కె.పి.అశోక్‌కుమార్