అక్షర

స్వాగతించాల్సిన పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలపుంత
-కె.సదాశివరావు, పుటలు:282,
వెల: రూ.150/ -
ఎమెస్కో బుక్స్ ప్రై.లి.,
దోమలగూడ,
హైదరాబాద్-29, ఫోన్:23264028

పాలపుంత అనే శీర్షిక కింద నోబెల్ సాహిత్య వ్యాసాలు, ఇతరాలూ.. అది కవర్ మీదే రాసి ఉంది. నోబేల్ అనాలి, నోబెల్ కాదు. వ్యాసాలు తరువాత కామా ఉండాలి. కవరుబొమ్మ, అచ్చు, పుస్తకం సైజు అన్నీ అసాధారణంగా ఉన్నాయి.
ఈ పుస్తకంలో రెండు, మూడు భాగాలున్నాయి. ఎందులోనూ నోబేల్ సాహిత్య వ్యాసాలు లేవు. గత ఇరవయి అయిదు సంవత్సరాలుగా సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికైన వారి గురించి వ్యాసాలు వంటివి ఉన్నాయి. అది మొదటి భాగం. ఈ బహుమతి ఎప్పుడు ఎవరికి ఇస్తారన్నది ముందు తెలియదు. కొన్ని ఊహాగానాలు మాత్రం వినవస్తుంటాయి. ఇంటర్‌నెట్ అన్నది పేరుకు కూడా లేనప్పుడే ఈ రచయిత, బహుమతి ప్రకటించిన వెంటనే ఆయా రచయితల గురించి వ్యాసాలు ఎప్పటికప్పుడు రాయడం గమనించదగిన విషయం. అందుకే వ్యాసాలు ఒక పద్ధతిలో లేవు. సమాచారం అందినంతవరకు మాత్రమే తెలుగులో ఇచ్చారు తప్పితే, కనీసం కొన్ని వాక్యాలలోనయినా మరింత విశే్లషణ రాసినట్లు కనిపించదు. నిజం చెప్పాలంటే రచయితల పేర్లను రాసే తీరు నుంచి మొదలు అన్నీ సమస్యలే. సమాచారం అందదు. అందితే సమగ్రంగా ఉండదు. ఆ రచయిత(త్రి) గురించి అంతకుముందే పరిచయం వుంటే తప్ప వ్యాసం బాగా రాదు. నాడీన్ గాడ్జిమర్ గురించి చిన్న వ్యాసం అక్టోబర్ 1991 అంటే బహుమతి ప్రకటన వెంటనే వచ్చింది. ఆమె కథల విశే్లషణ ఒక నెల తర్వాత వచ్చింది. తరువాత, ఇటీవల కూడా కొన్ని కవితలను అనువాదం చేసి పరిచయం చేశారు రచయిత.
ఇక పుస్తకంలో రెండవ భాగం (ఇతరాలు) 201 పేజీల్లో మొదలవుతుంది. ఇందులో అయిదు అనువాద కథలున్నాయి. ‘అతడు చేసిన తొమ్మిది హత్యల్లో చివరిది’ లాంటి అర్థంతరం వాక్యాలున్నా, కార్ల్ చాపెక్ కథ ఎంతో బాగుంది! మిగతా నాలుగు కథలు కూడా బాగున్నాయి. ఈ రచయిత మరిన్ని అనువాదాలు అందిస్తే బాగుంటుంది.
పుస్తకంలో చివరన మరో కొన్ని వ్యాసాలు, నిజానికి ఎనిమిది, ఒక నాటిక ఉన్నాయి. మోహ్‌దీ హసన్, ఆర్.కె.లక్ష్మణ్, బాపు లాంటి ప్రముఖులతో తమ అనుభవాలను రచయిత ఈ వ్యాసాల్లో అందించారు. అవన్నీ నిజంగా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈయన మరింత రాస్తే బాగుండును అనిపించేదిగా ఉన్నాయవి.
కె.సదాశివరావు పెద్ద హోదాలో పనిచేసిన పోలీసు అధికారి. అయినా సాహిత్యంమీద అభిమానాన్ని, అభినివేశాన్ని వదులుకోకుండా రాస్తూనే ఉన్నారు. రచనలు మొదట వచ్చినప్పుడు ఉన్న తొందర, పుస్తకంగా వేస్తున్నప్పుడు ఉండదు. ఉండకూడదు. కనుక వ్యాసాలను మరింత పొందికగా తిరగరాస్తే బాగుండేది. ఇటువంటి పుస్తకాలు తెలుగు పాఠకులకు ఎంతో అవసరం. ప్రపంచ సాహిత్యం గురించి పట్టించుకునే తీరిక మన పత్రికలకు ప్రచురణ సంస్థలకు లేదుగాక లేదు. పాలపుంత అనే ఈ పుస్తకాన్ని పాఠకులు స్వాగతిస్తారు. ఈ రకం పుస్తకాలు మరిన్ని రావాలి. మరింత పకడ్బందీగా రావాలి.

-గోపాలం కె.బి.