అక్షర

బుచ్చిబాబు అంతరంగ మథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు-మొదటి సంపుటి.
పేజీలు: 240.
వెల: రు.150/-
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, తెలంగాణలోని
అన్ని బ్రాంచీలు.
**
ఒక నవల (చివరకు మిగిలేది), 80కి పైగా కథలు, 20కి పైగా నాటకాలు, నాటికలు, ఒక కవితా సంకలనం రచించిన బుచ్చిబాబు 40కి పైగా సాహిత్య వ్యాసాలు కూడా రచించాడు. ఆయన రచించిన సాహిత్య వ్యాసాలన్నింటినీ బుచ్చిబాబు సాహిత్య వ్యాసాల పేరుతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 1997లోనే 500 పేజీల పుస్తకంగా ప్రచురించారు. సాహిత్యాభిమానులకు ఎంతో ప్రయోజనకరంగా రూపొందిన ఈ పుస్తకం ప్రస్తుతం లభించడం లేదని గుర్తించిన నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు ఈ పుస్తకంలోని వ్యాసాలను రెండు భాగాలుగా విడగొట్టి రెండు సంపుటాలుగా ప్రచురించారు. మొదటి సంపుటిలో తెలుగు రచయితలను గురించి, తెలుగు సాహిత్యం గురించి రచించబడిన వ్యాసాలను, రెండో సంపుటిలో ఆంగ్ల రచయితల మీద రచించబడిన వ్యాసాలను చేర్చారు.
ఈ మొదటి సంపుటిలో 24 వ్యాసాలున్నాయి. తెలుగు రచయితలైన చలం, బాపిరాజు, గోపీచంద్, మొక్కపాటి, దేవులపల్లి కృష్ణ శాస్ర్తీ, బాలగంగాధర్ తిలక్ లాంటి రచయితల మీద బుచ్చిబాబు అభిప్రాయాలను ఈ వ్యాసాల్లో చదువుతాం. అలాగే కథానికల్ని గురించి ‘కథకుడి అంతరంగం’, ‘నన్ను మార్చిన పుస్తకం’, ‘నవలలోని కనబడని పాత్రలు’, ‘ఆధునిక నాటకం ఎందుకు ప్రజల్ని ఆకర్షించడంలేదు’, ‘అత్తాకోడళ్ల కలహాలు’, ‘మనసులోని మారుమూలలు’-మొదలైన అంశాలను గురించి బుచ్చిబాబు చేసిన విశే్లషణల్ని కూడా ఈ వ్యాసాల్లో చదువుతాం.
ఈ పుస్తకానికి ‘అంతరంగ మథనం’ పేరుతో ముందుమాటను రచించిన బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మిగారు ‘తను ఇప్పటికీ-అంటే బుచ్చిబాబు చనిపోయి 50 ఏళ్లు గడిచిపోయినా, ఆయన స్మృతుల్లోనే బతుకుతున్నానని చెబుతూ ‘నేను అప్పటినుంచే కాదు ఇప్పటిదాకా అవేరోజులు, అవే ఊహల్లోనే జీవిస్తున్నా. కాలం వయసుని వెక్కిరిస్తూ ఇంక విశ్రాంతి తీసుకొమ్మనే రోజులు దగ్గరపడుతున్నా, ఈ శరీరం మూలిగినా, అందుకు దిగులు లేదు. గతంలోనే మధురమైన క్షణాలు అవే.
నావల్ రాయడం, కథలు రాయడం, వ్యాసాలు రాయడం, విమర్శలు రాయడం వీటిలో మీకు ఎక్కువ ఇష్టం ఏది? అన్న ప్రశ్నకి గట్టిగా నవ్వి అలా అడిగితే ఎలా చెప్పగలను అబ్బాయి? వేటికి అవే అనాలి. నాకు నాటకాలు రాయడంలో ఆనందం. అంతేకాదు-నేను రాసేవన్నీ సుబ్బులు (సుబ్బలక్ష్మి) చేత చదివిస్తా. ఆవిడ అందులో లీనమై, ఆపకుండా చదివేస్తే వాటిని చూసి నేను అనుకున్నది చెప్పేశాను అనుకుంటా’ అనేవారు బుచ్చిబాబు’ అంటుంది.
బుచ్చిబాబు రాసిన ఈ వ్యాసాల్లో స్పష్టత, సూటిదనం, అపారమైన సాహిత్య జ్ఞానం మొదలైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
కథలెలా రాస్తారు? అని అడిగితే తను ఏమని సమాధానం చెబుతాడో బుచ్చిబాబు ఇలా చెప్పాడు-‘కథలు ఎలా రాయాలో చెప్పడం నేను కథలు ఎలా రాస్తానో చెప్పడమే అవుతుంది. ప్రతి రచయితా తాను రాసే పద్ధతిని సమర్ధిస్తూ అందులోంచి కొన్ని సూత్రాలను ప్రతిపాదించి ఒక వీలునామా దిగవిడిచే ప్రమాదం ఉంది. గనక కథలు ఎలా రాయడం చెప్పడం కంటే, నేనెట్లా రాస్తానో చెప్పటం సముచితం అనుకుంటాను’ అంటాడు బుచ్చిబాబు.
‘కథా-దాని కమామీషు’ అన్న ఈ వ్యాసంలో మళ్లీ మళ్లీ చదివించే ఖండకావ్యం ఎలా రాయాలో బుచ్చిబాబు సోదాహరణంగా వివరించాడు. చిన్న కథలు రాయాలనుకున్న రచయితలు ఈ వ్యాసం నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
‘నన్ను మార్చిన పుస్తకం’ అన్న వ్యాసంలో తను ఎన్నో గొప్ప పుస్తకాల్ని-ఇంగ్లీషులోను, తెలుగులోను చదివానని, వాటిల్లో తనను గాఢంగా మార్చివేసిన పుస్తకం-అది పుస్తకం కూడా కాదు-బెర్‌ట్రాండ్ రసెల్ రాసిన ఒక వ్యాసం అంటాడు బుచ్చిబాబు. ఆ వ్యాసం పేరు ‘స్వేచ్ఛా జీవుల ఆరాధన’ (ఎ ఫ్రీ మాన్స్ వర్షిప్). ఈ వ్యాసం తన జీవిత దృక్పథాన్ని మార్చేసింది అంటాడు.
రసెల్ రాసిన ఈ వ్యాసం తనమీద అంత గాఢమైన ప్రభావాన్ని ఎందుకు కలిగించిందో చెపుతూ రస్సెల్ వ్యాసంలోని కొన్ని వాక్యాలను మన ముందుంచుతాడు. ‘ప్రతివారి జీవితంలో ఎప్పుడో అప్పుడు ప్రతివారికి జీవితంలో సమాధానపడి, వైరాగ్యం పొందే పరిస్థితి వస్తుంది. యవ్వనానికి అసాధ్యమైంది లేదు. కాని మృత్యువు వల్లనో, వ్యాధివల్లనో, బీదతనం వల్లనో ఈ ప్రపంచం మనకోసం కాదని, ప్రతివారు గ్రహించే అవసరం వస్తుంది. స్వప్నాలు భగ్నమై ఆదర్శాలు కూలినప్పుడు మనోవ్యథ వదిలి, సమాధానపడి జీవిత శక్తిని అంగీకరించి వైరాగ్యం అలవరుచుకోవడం జ్ఞానం. అహంని చంపి, చీకటిని ఛేదించి, మనతో నిమిత్తం లేని దైవాన్ని విడిచిపెట్టి వైరాగ్యంలోనుంచి కొత్త జగత్తును నిర్మించడం మన కర్తవ్యం’ అంటాడు రసెల్.
‘నేను పాపిని-ఏదో తప్పు చేసాను. నరకం అనుభవిస్తాను అనేభయం నుండి ఈ వ్యాసం నాకు విముక్తి కలిగించింది. ఈ దృక్పథం ఈనాటి వరకు ఆచరణ యోగ్యంగానే కనపడింది. ఇది నన్ను మార్చివేసింది అనుకోవడంలో నన్ను నేను మోసగించుకోవడం ఉందనుకోను’ అంటాడు బుచ్చిబాబు.
ఈ సంపుటిలో చోటు చేసుకున్న చివరి వ్యాసం ‘సినీ కవిత (కావ్య ప్రశంస)’. బుచ్చిబాబు లాంటి ఒక సీరియస్ రచయిత ఒక సినిమాలోని ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదానా’ అన్న పాటను గురించి ఇంత పెద్ద వ్యాసం రాయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
‘ఈ గేయం (పాట) నాకిష్టం అన్నాను. ఒక సామాజిక వ్యవస్థకు సాంకేతికంగా ఉన్న ఒక అమాయకురాలైన కన్యను కవి కొన్ని ప్రశ్నలడగడం నాకునచ్చింది. ఈ గేయంలో మూడు ప్రశ్నలున్నాయి. ఆ మూడూ మూడు విలువలకు సాంకేతికాలుగా స్వీకరిస్తాను. బుగ్గమీద గులాబిరంగు సౌందర్యానికి సాంకేతికం. చలువరాయి బలానికి, శక్తికీ సాంకేతికం. చీరలో శిల్పం కళకి సాంకేతికం. చివరలో ‘నీతి’ కూడా నాకు నచ్చింది. ఒక్క బాగాలేనిది ‘సాగదింక తెలుసుకో’ అన్న బెదిరింపే అంటాడు బుచ్చిబాబు. ఈ వ్యాసంలో సినిమా పాటల విషయంలో కూడా బుచ్చిబాబుకున్న నిశితమైన పరిశీలన ద్యోతకమవుతుంది.
ఇలా ఈ సంపుటిలోని వ్యాసాలన్నింటిలోనూ బుచ్చిబాబుకున్న ఒక అపూర్వమైన విశే్లషణా దృష్టిని తిలకించవచ్చు.
ఈ సంపుటిలోని కొన్ని వ్యాసాల్లో- ‘ఉత్తుత్తి ఊహా చిత్రాలు’, ‘మొదటి మాటలు’ లాంటి వాటిల్లో బుచ్చిబాబుకున్న హాస్య దృష్టిని చూడవచ్చు.

-అంపశయ్య నవీన్