అక్షర

తెలిసిన వ్యక్తిలో తెలియని అంశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ కె.వి.
రమణాచారి
-సాంస్కృతికోద్యమదృక్పథం
రచన: డాక్టర్ సావిత్రీసాయి
వెల: వంద రూపాయలు
ప్రతులకు: అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు
**
సావిత్రీ సాయి చాలా సాహసం చేసారనిపిస్తుంది. డాక్టరేట్ చేయడానికి ఎన్నుకున్న ఇతివృత్తం అలాంటిది మరి. జగమెరిగిన మనిషి కె.వి.రమణాచారి సాంస్కృతికోద్యమ దృక్పథం అనేది రచయిత్రి అనండి, పరిశోధకురాలు అనండి సావిత్రీ సాయి ఎంపిక చేసుకున్న అంశం.
‘తీసివేసిన థీసిస్‌లు, ఎత్తిపోతల పథకాలు వంటి తెలుగు పరిశోధనల పరంపరలో యోగ్యుడైన ఒక కళావతంసుని కృషిని అంశంగా స్వీకరించి పరిశోధన చేసిన సావిత్రీసాయిని అభినందిస్తున్నాను’ అని ఈ పరిశోధనకు పరీక్షకునిగా వ్యవహరించిన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు పేర్కొనడం సావిత్రి గారికి డాక్టరేట్‌ని మించిన కితాబు.
కేవీ రమణ (రమణాచారి అనే తన పేరులో వున్న చారి అనే రెండక్షరాలను ఆయనే స్వయంగా తొలగించుకున్నారు) జీవితం ఒక తెరిచిన పుస్తకం. పుస్తకం అట్ట వెనక రచయిత్రే స్వయంగా ఈ విషయం పేర్కొన్నారు. అందరికీ తెలిసిన వ్యక్తిలో అందరికీ తెలియని అంశాలను కూడా పరిశోధించి రాయడం అంటే మాటలు కాదు. ఆ దిశగా చేసిన కృషి, ఆ క్రమంలో చూపిన పట్టుదల ఆవిడకు డాక్టరేట్ పట్టాను అందించింది. సావిత్రీ సాయి శ్రమ ఫలించడం వల్ల ఒక ఉపకారం కూడా జరిగింది. కేవీ రమణ జీవన చిత్రంలోని సాంస్కృతిక కోణం సమగ్ర రూపంలో ఆవిష్కృతమైంది. తెలుగు పాఠకులకు, ప్రత్యేకించి సాంస్కృతిక ప్రియులకు పుస్తక రూపంలో ఒక అమూల్యమైన కానుక లభించింది. ఇందుకు డాక్టర్ సావిత్రీ సాయి బహుదా అభినందనీయులు.
ఈ పుస్తకాన్ని సమీక్షించడం అంటే ఒక రకంగా కేవీ రమణ జీవితాన్ని ఆమూలాగ్రం స్పర్శించడమే. అందుకే కాబోలు ఆయన కొండంత వ్యక్తిత్వాన్ని ఆవిడ కొద్ది మాటల్లో గుదిగుచ్చి ఇలా చెప్పారు.
‘దేశానికి ఒక అబ్దుల్ కలాం...ఒక అన్నా హజారే...
తెలుగు వారికి ఒక రమణాచారి’
అల్పాక్షరాల్లో అనల్పార్థాలను పొదగడం అంటే ఇదే!
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి రచయిత్రి కృషి గురించి రమణీయంగా ఒక మాట చెప్పారు.
‘పరిశోధకురాలు విషయాన్ని సంగ్రహించి, ఔచిత్యాన్ని గ్రహించి, ఎంతగానో శ్రమించి ఈ సిద్ధాంత గ్రంథాన్ని రచించార’న్న మాటల్లో ఎంతో సత్యం ఉంది.
రమణది అందరికీ తెలిసిన వ్యవహారం కనుక తెలిసిన విషయాలను తేలిగ్గా సేకరించి దానికి పరిశోధన పత్రం అనే రూపాన్ని ఇవ్వడం చాలా సులభమని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడినట్టే. రమణ పూర్తి వ్యక్తిత్వాన్ని ఆపోసన పట్టడానికి సావిత్రీసాయి ఎంతో శ్రమించారు. ఎక్కడెక్కడో స్థిరపడిన రమణ బాల్య స్నేహితులను, కళాశాల సహాధ్యాయులను, సహోద్యోగులను, సహచరులను, బంధు మిత్రులను, పరిచయస్తులను స్వయంగా కలుసుకుని మాట్లాడి విషయ సేకరణ చేసారు. ఆయన పాల్గొన్న అనేకానేక సాంస్కృతిక సభలు, సమావేశాలకు హాజరై రమణ ప్రసంగ రీతులను శ్రద్ధగా గమనించారు. రమణ గురించి సర్వం తెలుసు అనుకునేవారు కూడ నివ్వెరపోయే అనేక అంశాలను సావిత్రీసాయి తన గ్రంథంలో పొందుపరిచారు. చక్కగా చదువుకుని డాక్టరై సమాజానికి సేవ చేయాలనే తండ్రి ఆశయానికి అనుగుణంగా బుద్ధిమంతుడైన రాముడి మాదిరిగా మసలుకుంటున్న రమణ, ప్రత్యేక తెలంగాణ నినాదం పట్ల ఆకర్షితుడై పదిహేడేళ్ల ప్రాయంలోనే ఆనాటి విద్యార్థి ఉద్యమంలో పాల్గొని అరెస్టయి జైలుకు వెళ్లి చిప్ప కూడు తిన్న విషయం ఇందులో వెలుగు చూసింది. బాల్యంలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మండుటెండలో తండ్రి వెంట బడికి పరుగులు తీసిన రమణ తదనంతర కాలంలో ఉన్నత చదువులు చదివి, ఉన్నతోద్యోగాలలో రాణించడం వెనక దాగివున్న శ్రమ ఈ రచనలో అడుగడుగునా కనిపిస్తాయి.
రమణకు స్వతహాగా నాటకాలంటే అనురక్తి. బాల్యంలోనే అంకురించిన ఈ అభిరుచి ఆయనతోనే పెరిగి పెద్దదైంది. విద్యార్థిగా వున్నప్పుడు, అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు, తదుపరి ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు రమణలోని నటనాసక్తి బయటపడుతునే వుండేది. రేడియో నాటకాలంటే చెవి కోసుకునే రమణకు ఎలాగైనా సరే రేడియోలో నాటకం వేయాలనే కోరిక బలంగా వుండేది. సైఫాబాదు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేటప్పుడు మధ్యాహ్న భోజన విరామంలో కాలినడకన దగ్గరలో వున్న రేడియో స్టేషన్‌కు వెళ్లి చూస్తూ లోపలకి ఎలా వెళ్లడం అనుకుంటూ వుండేవారు. ఆయనలోని ఈ ఆకాంక్షకు అక్కడి గేటు దగ్గరి గూర్ఖా అడ్డుపడేవాడు. మొత్తంమీద అతడు లేని సమయం చూసుకుని లోపలికి ప్రవేశించి వేలూరి సహజానందను కలుసుకుని రేడియో నాటకాల్లో నటించాలనే తన అభిమతాన్ని వ్యక్తపరిచారు. వారి సలహా పాటించి ఆడిషన్‌లో అర్హత సంపాదించి రేడియో నాటకాల్లో నటించగలగడం తన జీవితంలో ఒక మరుపురాని అధ్యాయం అని రమణే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నారు.
ఎప్పుడూ దరహాస వదనంతో కానవచ్చే రమణకు చిన్ననాటినుంచే హరికథలు అంటే అనురక్తి. పదహారేళ్ల వయసులో సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ఉత్సవాల్లో ఆయన చేసిన సీతాకల్యాణం హరికథా కాలక్షేపం అందరినీ ఆకట్టుకుంది.
కార్యక్రమం అనంతరం మెడలో పూలదండతో, అంగవస్త్రంతో, పట్ట్ధువతితో, నుదుట తిలక ధారణతో మెరిసిపోతూ వచ్చిన రమణను చూసి ఆశ్చర్యపడడం ఇంట్లో వాళ్లవంతైంది.
అలాగే దేవస్థానం అనే సినిమాలో కూడా రమణ నటించారు. జనార్ధన మహర్షి రూపొందించిన ఈ సినిమాలో విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సరసన నటించడం ఆయనకు మరో మరపురాని అనుభూతి.
ఇటువంటి ఆసక్తికర అంశాలను అన్నింటినీ సేకరించి ఒక క్రమపద్ధతిలో, అధ్యాయాల వారీగా విభజించి ఈ పుస్తకంలో పొందుపరచడానికి సావిత్రిసాయి పడిన శ్రమ కూడా తక్కువేమీ కాదనిపిస్తుంది ఇది చదివిన తర్వాత.

-్భండారు శ్రీనివాసరావు