అక్షర

చదువరులను కదిలించే బతుకు తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనక్ (ఇంద్రధనుస్సు) కథ-స్క్రీన్‌ప్లే: నగేష్ కుకునూర్, నవలీకరణ: అనుష్కా రవిశంకర్, అనువాదం: కె.సురేష్
పేజీలు: 112, వెల:70/-
- మంచి పుస్తకం, తార్నాక, సికింద్రాబాద్-500017, ఫోన్:9490746614
**

ఈ పుస్తకాన్ని పిల్లల నవల అనవచ్చు. పెద్దవాళ్లు చదవకూడదని అనవలసిన అవసరంలేదు. నాగేష్‌కుకునూర్ (పేరును నగేష్‌గా ఎందుకు వేశారు? అదే సరయినపేరా?) అసలు సిసలయిన హైదరాబాదీ. అతను ఇలాహీ హెప్‌తుల్లా అనే మిత్రురాలితో కలిసి మంచి సినిమాలు తీసాడు. నాగేష్ సినిమాలు హిందీలో వుండడం ఒక విశేషం. ధనక్ అతని ఇటీవలి బొమ్మ. అందులోని కథను బొంబాయి రచయిత్రి అనుష్కా నవల రూపంలో రాసింది. దాన్ని మంచి పుస్తకం సురేష్ అనువాదించారు. అందమయిన పుస్తకం అందరికీ అందింది.
అంతకు ముందు తాను తీసిన సినిమా చాలా మొరటుగా జీవిత సత్యాలను చెప్పింది అనుకున్న నాగేష్ ఈ చిత్రాన్ని పూర్తి ‘ఆశావాదం’ ఆధారంగా తీశానని అతనే చెప్పాడు. ఆ రకంగా ఇద్దరు దిక్కులేని పిల్లల కథను అతను మన ముందు సినిమాగా వుంచాడు. అదే నవల అయింది.
ఛోటూకు కళ్లు కనిపించవు. (చూపు కనపడదు అన్నారు అట్టవెనుక బ్లర్బ్‌లో!) అతని అక్క పరీ. వాళ్లిద్దరూ పినతండ్రి ఇంట్లో వుంటారు. పినతల్లికి మాత్రం పిల్లలు నచ్చరు. తమ్ముడు కళ్లు లేకుండా వుండకూడదని పరీ పంతం పడుతుంది. నేత్రదానం గురించిన పోస్టర్‌లో నటుడు షారుఖ్‌ఖాన్ గురించి గమనిస్తుంది. అతను సాయం చేస్తాడన్న ఆశతో అక్క, తమ్ముడు, ఉత్తరాలు రాస్తారు. జైసల్మేర్‌లో షూటింగ్ జరుగుతున్నదని తెలిసి, షారుఖ్‌ను కలవడానికని వాళ్లు స్వయంగా బయలుదేరతారు.
దారిలో పిల్లలకు రకరకాల కష్టాలు ఎదురవుతాయి. ట్రక్ డ్రైవర్, మంత్రాల మనిషి, పోలీసాయన, ఎంతమందో! అందరూ ఏదో అనేవాళ్లే! అపహాస్యం చేసేవాళ్లే! అయినా పిల్లలు మాత్రం పట్టువదలరు. ఒకరికొకరుగా వాళ్లిద్దరూ బతికే తీరు చదువరులను కదిలిస్తుంది. వాళ్ల పట్టుదల ఆసక్తికరంగా కనబడుతుంది. జోధ్‌పూర్ బస్సు, పూరీ, కేసరి లాంటి సంఘటనలను నాగేష్ ఊహించిన తీరు, అతనికి వచ్చిన పేరు వెనుకవున్న శ్రమను తేటతెల్లం చేస్తాయి. మంచి మాటకారితనంతో రచన ముందుకు సాగుంది.
అసలు సినిమాను పిల్లల పుస్తకంగా తేవడమే ఒక చక్కని ఆలోచన. దానికి తెలుగు అనువాదం చేయడం మరో మంచి ఆలోచన. సినిమా బాగుంటుంది. అందులోనుంచి కొన్ని బొమ్మలు రంగుల్లో అచ్చువేసారు కానీ, నవలలో పాఠకుని ఊహ పరిమితిగా ఎదురవుతుంది. ఇక తెలుగులోకి వచ్చేసరికి మాట తీరు మరింత అడ్డు వస్తుంది. అనువాదం మరింత బాగా వుండివుండవచ్చు. ‘ఇవ్వాళ సినిమాకు వెళ్లాల్సిన రాత్రి’ లాంటి మాటలు తెలుగులా లేవు. చనిపోబోవడంలేదు, పరిచయంగా అనిపించిన గొంతులాంటి మాటలు బాగాలేవు.
పిల్లల పుస్తకాలు రావడం ఎంతో అవసరం. ఈ పుస్తకాన్ని అందరూ చదవవచ్చు. కనుక మరింతగా అవసరమైన రకం పుస్తకం ఇది.

-స్వాతి.కె