అక్షర

శిల్ప ప్రజ్ఞతో - నేలమీద తలయెత్తిన కథానికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని వెలుగు నీడలు
డా.వెన్నం ఉపేందర్ కథలు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
కథాసాహిత్యం సమకాలీనతనీ, సామాజికతనీ ప్రతిబింబించటమనేది ఒక అనివార్యమైన ఆవశ్యకతగా స్థిరపడింది. కథారచన పట్ల చిత్తశుద్ధిగల రచయితలు ఈ బాధ్యతని నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. డా.వెన్నం ఉపేందర్ ఆ కోవలోని రచయిత. ఉపేందర్ సంవేదన నుండి, మనసు మధనం నుండి ఉబికివచ్చిన సృజన రూపాలు ఈ సంపుటి లోని కథలు. ప్రక్రియాపరంగా ఇవన్నీ సానబెట్టిన కథానికా వజ్రాలు. శుభ్రంగా, స్వచ్ఛంగా మెరుపులీను తున్నాయి. ఏకాంశ కేంద్రీకరణం కథానికకు ప్రాణం. క్లుప్తత, చదివించే గుణంగల ఇతివృత్త నిర్వహణ కథానికపై దేహా వయవాలు. వస్తువుకు సంబంధించి- జీవితం మొత్తం ‘కేన్వాస్’ని తీసుకుని, పులుముడు లేకుండా- మనిషి జీవితంలోని ఒక పార్శ్వాన్ని లేక ఒక స్వభావ వైచిత్రిని లేక ఒక విలక్షణమైన సామాజికాంశాన్ని మాత్రమే తీసుకుని- ‘కథానిక’పరంగా అర్థవంతమైన అవగాహనకి నమూనాలుగా వీటిని ఆవిష్కరించారు ఉపేందర్.
సంపుటిలో మొత్తం 32 కథలున్నాయి. ‘అనాధెవరు?’ కథలో సంజీవరావ్ తోటివారికి లోభి, పిసినారి, కుటుంబమే లేని అనాధలాంటివాడు. సాటివారి సానుభూతిని పొందలేని అతను- మరణిస్తూ- తన ఆస్తినంతా వృద్ధాశ్రమానికీ, పిల్లల అనాధాశ్రమానికీ రాసిపోతాడు! ప్రాణప్రదంగా పెంచుకున్న కూతురు మెట్టినింటివారి నిర్దయకు బలిఅయిపోతే, ఆమె ‘బాబు’ తనకు కాకుండా పోతాడేమోననే ఆందోళన, వేదన-ఒక ముసలి ప్రాణంది. ఆ ‘బాబు’నేను మీదగ్గరే ఉంటాను’ అని నిస్సందేహంగా చెబితే.. కూతురు ఫొటోముందు ఉగ్గుగినె్న దీపపుకాంతిలో ప్రకాశిస్తూ కనిపించింది ఆ పెద్దాయనకి. కథ పేరు ‘ఉగ్గుగినె్న’! సామాజిక పరిణామాలూ, అభ్యుదయ పథకాలూ ఎంతెంతో వేగంగా జరుగుతున్నాయని పైపైన మురుస్తుంటే- ‘బక్కులు’లాంటి బక్కజీవుల జీవితాల్లో వెలుగు కనిపించటం లేదు. కిర్రు చెప్పులు కుడుతూనే ఉన్నారు. చుట్టూ బురద నిండిన ట్యాంకు నీళ్లని పట్టుకుపోతూనే ఉన్నారు. ‘బక్కులు’ తన జీవితం బాగుపడాలంటే ఏ పోరాటం చేయాలి? ఎవరితో చేయాలి?’- ఇదీ అలజడి కలిగించే ప్రశ్న! ‘కిర్రుచెప్పులు’ కథనం ఆలోచనాప్రేరకంగా సాగింది.
‘కొత్తగాలి’ కథానిక ఒక ‘మాస్టర్ పీస్’. ప్రపంచీకరణ తర్వాతి పర్యవసానాల్ని ‘గాలి’ప్రస్థానం ద్వారా, దర్శనంద్వారా వివరిస్తూ, ప్రయోగాత్మకంగా రాశారు రచయిత. గతాన్నీ వర్తమానాన్నీ తులనాత్మకంగా ఆవిష్కరిస్తూ, ఎక్కడా ‘గతి’ తప్పకుండా కథానిక గుణ విశేషాల ‘మేర’మీరకుండా- ఒక నిక్కమైన రచనా నీలంని అందించారు. కథ ముగింపులో ‘పల్లెనుంచీ వచ్చిన పట్నం గాలి, పల్లెగాలిని కలిసింది. ఇద్దరు ఒకర్నొకరు చూసుకుని హత్తుకున్నారు. ఒకరిలో ఒకరు లీనమైనారు. వాళ్ల శరీరాలు మునుపటిలా లేవు. ఏవో కొత్త వాసనలు రాసాగాయి. వాళ్లిద్దరి దుఃఖం కట్టతెంచుకుంది. వాన మొదలైంది. కన్నీటి చుక్కలు వానలో కలిసాయి. మూసి అనే నది పొంగింది. చెత్తాచెదారం కొట్టుకుపోసాగింది. ఈ కొత్తగాలి వానకి పడమటి గాలి స్తంభించింది’! భావస్ఫోరకంగా, ధ్వనిమంతంగా రాసిన చివరి వాక్యం- ఒక్కటీ ఒక రసరేఖగా తేజోవంతంగా నిలిచింది. తెలుగు సంకలనాల్లోనేకాక, భారతీయ భాషల్లోని కథాసంకలనాల్లోనూ చోటుచేసుకోవలసిన ఉత్తమమైన కథానిక ఈ ‘కొత్తగాలి’!
ఉపేందర్ రచనాప్రణాళికలో- ఈనాడు దేశంలో జరుగుతున్న సాంస్కృతిక విధ్వంసాల్ని కథాత్మకం చేయాలనే ఆశయం గాఢంగా ఉన్నది. అందుకనే, ఆయన ఒకప్పటి సౌభాగ్యచిహ్నాల చేత ఆత్మకథల్ని చెప్పించారు. ‘మేన’, ‘ఉత్తరం’, ‘మట్టిమనిషి’ వంటివి దీనికి ఉదాహరణలు. ‘నిమజ్జనం’ కథలో జైలుగది తన ఆత్మకథని వివరిస్తుంది. మూణ్ణాళ్లు ఉండిపోవచ్చు లెమ్మనుకుని హంగుతో వచ్చిన రాజకీయ నాయకుడు ఆ గదిలోనే ‘నిమజ్జనం’పాలైనాడు! సెల్‌ఫోన్ విచ్ఛిన్నంచేస్తున్న కుటుంబ సంబంధాల స్థితిగతుల్ని ‘నెట్‌వర్క్ ఫెయిల్యూర్’లో చిత్రించారు. ఇలా కథలన్నిటా ఈనాటి సమాజస్థితే ఈనాటి మనుషుల దుస్థితీ, ఈనాటి వికృత పరిణామాల దుర్గతీ- సాంద్రంగా ప్రతిఫలించాయి. ‘ఎన్నాళ్లయింది చీకట్లోంచీ వెలుతురులోకి ఉరికి’(కన్యాశుల్కం) అన్నట్లు- ఉపేందర్‌గారి కథలు చదువరి ప్రాణానికి హాయిగా కమ్మతెమ్మెర స్పర్శనిస్తున్నాయి. అవశ్యం ఆ అనుభూతినందుకోండి!
**
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-విహారి