అక్షర

నొప్పించని విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యానుభూతి
(వ్యాస సంపుటి)
రచన: కోడూరి శ్రీరామమూర్తి,
వెల: రు.150/-
ప్రతులకు: చినుకు పబ్లికేషన్స్,
దత్తాస్ నయాబజార్,
గాంధీనగర్, విజయవాడ-520003
**
తెలుగులో కవిత్వ విమర్శకులు ఉన్నంతగా వచన సాహిత్య విమర్శకులు లేరు. ఆ లోటును తీరుస్తున్నవారిలో ముందు వరుసలో ఉంటారు కోడూరి శ్రీరామమూర్తి. వీరి ఇటీవలి విమర్శవ్యాసాల సంపుటి ‘సాహిత్యానుభూతి’ సద్విమర్శకు ఆనవాలు. శాఖాచంక్రమణం గానీ, పరుష వచనాలుగానీ లేకుండా వస్తుప్రధానంగా జరిగిన విశే్లషణాత్మక వ్యాసాలివి.
కొన్ని కథల్ని, నవలల్ని మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని అన్వయించి వివేచిస్తే పాత్రల స్వభావాలు బాగా అవగతమవుతాయి. ముఖ్యంగా బుచ్చిబాబు, గోపీచంద్, రావిశాస్ర్తీ ‘అల్పజీవి’, నవీన్ ‘అంపశయ్య’.....లను సైకాలజీ ప్రకారం అర్ధంచేసుకోవలసి వుంది. విశ్వనాథవారి ఏకవీర, తెరచి రాజు వంటి నవలల్లో మనస్తత్వ చిత్రీకరణ కనిపిస్తుంది. ఇటువంటి అంశాలను శ్రీరామమూర్తి మొదటి వ్యాసం ‘‘ఆధునిక సాహిత్య విమర్శనారీతులు- మనోవైజ్ఞానిక విమర్శ’’లో చర్చించి ఆలోచనలు రేకెత్తించారు.
ఉన్నవవారి ‘‘మాలపల్లి’’ నవలలో గాంధీయ దృక్పథం ప్రధానాంశమని వివరించారు. బుచ్చిబాబును ఆంగ్ల రచయిత సోమర్‌సెట్ మామ్‌తో తులనాత్మక పరిశీలన చేశారు. మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని అందరూ బుచ్చిబాబు, గోపీచంద్, శ్రీశ్రీ (కోనేటిరావు కథలు)లకి వర్తించి చెప్తారు. కోడూరివారు బాపిరాజుగారి నవలల్లోగల వైజ్ఞానిక కోణాన్ని ఆవిష్కరించిన తీరు సముచితంగా వుండి ‘నవ్యత’ను వెల్లడించారు.
తొలినాటి కొ.కు. కథలపై లోతైన పరిశీలనతో విమర్శ చేశారు శ్రీరామమూర్తి. ‘‘తొలినాటి కథలకు చలం కథలు చాలావరకూ నమూనాగా ఉపయోగపడ్డాయి’’అనే అభిప్రాయాన్ని సున్నితంగా ఖండిస్తూ చలంలోని తిరుగుబాటు ధోరణి ప్రభావంతో కొకు వ్యక్తివాదంనుంచి సమిష్టివాదానికి మారాడంటారు శ్రీరామమూర్తి. కాల్పనిక వచన సాహిత్యంలో హాస్యంపై మంచి వ్యాసంరాశారు. వచన రచయితలు తప్పకుండా చదవవలసిన వ్యాసమిది. అయితే శ్రీరమణ, పొత్తూరి విజయలక్ష్మి, గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు వంటివారిని పేర్కొనకుండా కోడూరి శ్రీరామమూర్తి కూడా కొన్ని హాస్య రచనలు చేశాడు’’ అనటం సముచితంగా లేదు.
తెలుగు సాహిత్యంలో ప్రాసంగిక వ్యాసాలపై సమాచారమిస్తూ ‘‘ఒక రచయిత రచించిన ‘జంఘాలశాస్ర్తీ క్ష్మాలోకయాత్ర’’ అన్నారు. అలా రాస్తే ఎలా? ఆ రచయిత పేరు- ఏలూరుపాటి అనంతరామయ్యగారని తెలుసుకోవాలి గదా! ‘స్వీచరిత్ర రచనా ధోరణులు’ వ్యాసంలో అలనాటి వాటి గురించి మాత్రమే రాయటంవల్ల అసమగ్రంగా వుంది. అముద్రిత పుస్తకంలో మరి కొన్నిటిని చేర్చాలి. భరాగో, విశ్వనాథల కథలపై విమర్శ సహేతుకంగా వుంది. వీరిద్దరూ తెలుగుకి రెండు శిఖరాలా? అన్నంతగా విశే్లషించారు. ఆకాశవాణికోసం రాసిన వ్యాసం కాబట్టి ‘‘తెలుగు కథల్లో గోదావరి’’అనేది ‘‘కట్టె-కొట్టె-తెచ్చె’’అన్నట్టుంది. దీనిపై పెద్ద వ్యాసం రాయదగినవారై ఉండి పుస్తకంలోనైనా రాసి వుండాల్సింది. ఏమైనా వచన సాహిత్య విమర్శ గ్రంథంగా, కథల విశే్లషణాత్మక వ్యాస సంపుటిగా మంచి పుస్తకమిది.
**

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-ద్వా.నా.శాస్ర్తీ