అక్షర

భావజాలంతో నిండిన అమృతభాండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నమయ్య
పదం - పరమార్థం
-డా.తాడేపల్లి పతంజలి
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యమాయని ఈ వేళ అన్నమాచార్య కీర్తనలకు విశేషమైన ఖ్యాతి లభిస్తోంది. ఎందరో ఈ కీర్తనలు ఆలపిస్తున్నారు. వేలాది, లక్షలాది శ్రోతలు విని ఆనందిస్తూ వున్నారు.
పదకవితా పితామహుడైన అన్నమయ్య తెలుగు భాషలోనే వేలాది సంకీర్తనలు వెలయించాడు. ఆయన రోజుల్లో వాడుకలో వున్న తెలుగు భాష అది. అప్పటికాలంలో వాడుకలో ఉన్న మాండలీకాలు, పలుకుబడులు, మధురోక్తులు, కొన్నికొన్ని దేశి పలుకుబళ్లు, జానపదులు వాడే మాటలు, అనేకం ఆయన కీర్తనలలో కనిపిస్తాయి. కొన్ని తెలిసిన మాటలు, కొన్ని తెలియనివి.
‘హరి హరి హరియని వెరగొందుట గాక
సిరివర! మాకు బుద్ధి చెప్పగదవయ్యా’ అని ప్రారంభించిన పల్లవిలో ‘పాపపు కొంపలో వారు పంచమహాపాతకులు, కాపులకు పదుగురు, కర్తలందుకు కాపి కాండ్లారుగురు ధర్మాసనము వారు చాపలమే పనులెట్టు జరగనయ్యా!’ అంటారు.
శరీరమే కొంపలో మాయవల్ల పుట్టిన శత్రువులను జయించలేక పోతున్నానయ్యా! ఇవన్నీ విచారించి నన్ను గట్టున పడేయమని స్వామిని వేడుకుంటాడు అన్నమయ్య. ఇటువంటి మాటలు పాడుతున్నప్పుడు శ్రోతకు తిన్నగా చేరేలా ఆ బాణి ఉండాలి. గాయకుడికి ఆయా మాటల అర్థం, తెలియాలి. పరమార్థం తెలియాలి. పాడేవాడికే అర్థం తెలియకపోతే వినేవాడికేమి ప్రయోజనం? ఒకే మాటకు ఎన్నో అర్థాలుంటాయి. సందర్భాన్నిబట్టి అన్వయం చేసుకోవాలి. తెలుగు భాషలో వున్న త్యాగరాజ కీర్తనలన్నీ, తెలుగు మాతృభాష కానివారి కంఠాల్లో ఎక్కువగా పాడబడి, విశేషంగా ప్రచారమైపోయాయి. సంగీతం పట్ల అభిరుచినీ, ఆసక్తినీ, అనురక్తినీ కలిగించాయి - ఎందరో విద్వాంసులు తయారైయ్యారు. త్యాగరాజ కీర్తనలలో విశేషార్థాలున్న మాటలు, కాలక్రమంలో నెమ్మదిగా అర్థమవుతూ వచ్చాయి. వాటిలో సాహిత్యంతోబాటు సంగీతం పట్ల విపరీతమైన మోజు ఏర్పడింది. త్యాగరాజ శిష్య ప్రశిష్యులందరూ నిర్దిష్టమైన స్వరలిపితో (నొటేషన్) ప్రచారం చేసేశారు. అన్నమయ్య పాటలకు ఆ అదృష్టం చిక్కలేదు. కానీ, కీర్తనలలోని సాహిత్య విశేషాలు తెలియజేసే గ్రంథాలు, అర్థ తాత్పర్యాలతో ఎన్నో వెలువడ్డాయి. ఆయన ఉపయోగించిన పలుకుబడులలోని భావాన్ని అందించాలనే ప్రయత్నమే ‘అన్నమయ్య పదం - పరమార్థం’ గ్రంథం. పతంజలి గారు రచించిన ఈ గ్రంథం చూస్తే బాలకృష్ణుడిపై అన్నమాచార్యుల వారికి ఎందుకో ఎక్కువ మక్కువ ఉందనిపిస్తుంది.
చందమామ రావో జాబిల్లి రావో సంకీర్తనలో ‘కుందనపు పైడికోర’ అనే మాటకు అర్థం -మేలిమి బంగారపు గినె్న. బాలకృష్ణుణ్ణి (వేంకటేశ్వరుణ్ణి) బిడ్డగా భావించాడు అన్నమయ్య. లలితమైన పదం ‘కుందనపు పైడికోర’.
ఈ కీర్తన మొదటిసారి డా.శ్రీపాద పినాకపాణిగారి కంఠంలో విన్నాను. బేహాగ్ రాగంలో రూపక తాళంలో ఎంతో మధురమైన బాణీలో వినిపిస్తుంది.
అల్లో నేరేళ్లు పదాన్ని ‘అల్లునేరేళ్లుగా’ అన్నమయ్య ప్రయోగించాడు. జానపదుల భాషలో దొరికే మాట ఇది. బాలికలు వెనె్నలలో ఆడుకునే ఆట ఈ ‘అల్లు నేరేళ్లు’. సనాతన సంప్రదాయంలో ఇటువంటి ఆటలు ఒకప్పుడు విధిగా ఆడేవారు. విజయదశమి వెళ్లిన తర్వాత ఆశ్వయుజ మాసంలో వచ్చే అట్లతద్ది- ‘ఆడపిల్లలకు వేడుకను కలిగించే పండుగ. ‘గోరింటాకు’తో ముచ్చటగా ఆడుకునే వేడుక.
లాలనుచు నూచేరు లలన లిరుగడల బాల గండ వర గోపాల నిను చాల; అంటాడు ఓ కీర్తనలో.
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని గండవరమనే గ్రామంలో వెలసిన గోపాలకృష్ణుని ‘బాల గండవర గోపాల’ అని సంబోధిస్తాడు అన్నమయ్య.
శరీరానికి అన్నమయ్య ఎన్నో ముద్దు మాటలు పెట్టారు. ఆయన సంకీర్తనలో ఆకర్షణగా నిలిచేవి ఈ మాటలే.
‘గాలి మూట, తిత్తిలో సుఖమునకు తిరిగెనీ ప్రాణి, యెరవుల దేహాలివి (పరాయి దేహాలు) కలిమిగల ఇంద్రియపు కాపులుండిన వూరు (ఇంద్రియ లౌల్యంతో బాధపడే దేహాలు) లాంటివి ‘దేవుడొక్కడే మాకు దిక్కుగాని కాన నెవ్వరును లేరు కళలింతే కాని
‘గాలి మూట చిక్కితిమి కన్నచోటే తొక్కితిమి ఆలించి యేమిటి వారమయ్యేమా కాని’
మైల కొండ మనసూ మణుగు గొంతానాయ తాలిమి నా విధి యేమి తలచీనో కాని’ అన్న అన్నమయ్య పాటకు అర్థాన్ని పతంజలి ఇలా చక్కగా వ్యాఖ్యానించారు. అన్నమయ్య ఎంత లోతుగా ఆలోచిస్తాడో ఈ కీర్తన వింటే తెలుస్తుంది. ప్రాణవాయువులతో నిండిన ఈ శరీరంలో చిక్కుకున్నాం. ఏ ప్రదేశంలో మా తల్లులు మమ్మల్ని కన్నారో, ఆ కన్నచోటునే మా సుఖాలకు నిలయం చేసుకున్నాం.’ మాలిన్యం శరీరంలో వుండనే వుంది. పైగా కోరికల మూటలతో బరువెక్కిపోయాయి అనటం ఎంతో సమంజసమైన మాట. అన్నమయ్య కీర్తనలు లోతైన భావజాలంతో నిండిన అమృత భాండాలు. సామాన్య గాయకులు, వాటిని స్పృశించి పాడే ప్రయత్నం చేసి, వాటి స్థాయిని తగ్గించి పాడకూడదు - అలా చేస్తే ఎక్కువ కాలం మనలేవు’ అన్న సంగీత కళానిధి డా.మంగళంపల్లి వారి మాట మరిచిపోకూడదు.
మాటల అర్థం తెలియడం వేరు. తెలిసి పాడటం వేరు. వాటి పరమార్థాన్ని కీర్తనకు అన్వయిస్తూ వ్యాఖ్యానించడం వేరు. ఇందులో అన్నమయ్య సాహిత్యంపై ఎంతో మక్కువతో పరిశోధన చేసి, గ్రంథస్థం చేస్తున్న డా.పతంజలి బహుదా ప్రశంసనీయులు.
తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తనలలో ప్రక్షిప్తమై వున్న పారిభాషిక పదాలు, మాండలిక స్వరూపాలు, జాతీయాలు, సామెతలు, ఆనాటి భాషా స్వరూపాన్ని, ప్రజల నవ్య ప్రియత్వాన్ని తెలియజేస్తాయి. అన్నమయ్య వాడినది, సిద్ధ వ్యవహారిక నాష. కానీ మాండలికాన్ని మక్కువతో ప్రయోగించాడు. ఈ మాండలిక పదాల అర్థాలు గాయకులు తెలుసుకోవలసిన అవసరం వుంది. అన్నమయ్య కీర్తనలు వ్యాఖ్యాన సహితంగా వింటే ఫలితం ఎక్కువగా ఉంటుంది.
అన్నమయ్య సంకీర్తనలలో ‘జాజర’ అనే మాట తరచుగా వింటాం. ఏమిటీ జాజర? వేంకటేశునితో ఆత్మీయత పెంచుకున్న భక్తుడు, మధుర భక్తికి సాక్షి అన్నమయ్య. ఆయన ఒక నాయికగా మారిపోయి స్వామితో ముచ్చట లాడుకుంటూ, వాడిన మాట ఈ జాజర. ఆలోచిస్తే స్వామితో సాన్నిహిత్యం కలిగి ఉండటం ఏమైనా సామాన్యమైన విషయమా? ఆ అదృష్టం దక్కినది పరమభక్తుడైన అన్నమయ్యకే.
అన్నమయ్య కీర్తనలలో నిండిన అనేక పద్యాలు తెలియకపోవడం.. పాడేవారికి అవరోధం, వినేవారికి అయోమయం - ఆ లోపాన్ని తీర్చాలని బద్ధకంకణులైన శాంతా వసంతా ట్రస్టు, వరప్రసాదరెడ్డి గారు ఈ బాధ్యతను తన భుజస్కంధాలపై పెట్టుకోవడం ఎంతైనా అభినందనీయం. అన్నమయ్య పదాలకు గల పరమార్థాన్ని, ప్రయోజనాన్ని తెలుగువారు పొందాలని, ముఖ్యంగా గాయకులు లబ్ధి పొందుతారని ఆశిద్దాం.

-మల్లాది సూరిబాబు