అక్షర

అన్నమయ్య ఆంతర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నమయ్య కౌముది
(సంస్కృత కీర్తనలు
అర్ధ విశేషాలు)
-డా.తాడేపల్లి పతంజలి
వెల: రు.120
ప్రతులకు: రచయిత, ఫ్లాట్‌నెం.201
సాయికీర్తి రెసిడెన్సీ
సత్య ఎన్‌క్లేవ్, చందానగర్
హైదరాబాద్
**
అన్నమయ్య స్వరపరిచిన సంకీర్తనల్లో సంస్కృత సంకీర్తనలు కూడా వున్నాయి. అందులోనుండి తొంభై కీర్తనలను తీసుకుని తాడేపల్లి పతంజలిగారు అన్నమయ్య కౌముది పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. సంకీర్తనలకు భావంతోపాటు అర్థ విశేషాలను అందించారు. ఇందులో దేవదేవంభజే, జయజయరామా, మాధవా కేశవా! మధుసూదనా!..వంటి ప్రజాదరణ పాత్రమైన సంకీర్తనలతోపాటు ప్రాచుర్యాన్ని పొందాల్సిన కీర్తనలు కూడా వున్నాయి. రాధాకృష్ణులకు సంబంధించినవి, శివ కేశవ అభేదాన్ని చాటేవి, చతురమైన మాటలతో కూడినవి, దశావతారాలను వర్ణించినవి, తాను బిడ్డగా అయి తల్లిదండ్రులుగా శ్రీ అలమేలు మంగమ్మ శ్రీనివాసులను వర్ణించేవి, తాను నాయికగా మారి వేంకటేశ్వరుడిని ప్రేమ పారవశ్యంతో దెప్పి పొడుస్తూ చెప్పినకీర్తనలు వున్నాయి. నాయిక నాయకుడిని ఆక్షేపిస్తూ చేసిన దశావతార వర్ణనతోకూడిన కీర్తన వుంది. భావ గంభీర్యంతో నిండినవి, చమత్కారాన్ని కలిగినవి వున్నాయి. శ్రీమన్నారాయణ అనే కీర్తనను చూస్తే అందులో శ్రీమన్నారాయణ పదం పల్లవిలో మూడుసార్లు వచ్చి నీ శ్రీపాదమే శరణు అని వుంటుంది. ఇది చక్కని చమత్కారాన్ని కలిగివుంది. విష్ణుమూర్తి వామనుని రూపంలో బలి చక్రవర్తిని కోరుకున్నది మూడు అడుగులు, ఆ మూడు అడుగులకు ప్రతీకగా మూడుసార్లు శ్రీమన్నారాయణ అని చెప్పిన అన్నమయ్య నీ శ్రీపాదమే శరణు అనడం ద్వారా వామనావతారాన్ని స్ఫురింపచేసారు. ఆయా దేవతలను తనివితీరా వర్ణించాడు. భక్తితత్పరుడై స్తుతించాడు. నరసింహస్వామికి సంబంధించిన కీర్తనల్లో ప్రహ్లాద వరద అనే సంభోధనను ఎక్కువగా ప్రయోగించాడు. దీనికి కారణం ప్రహ్లాద వరదుడిగా పిలిపించుకోవడమే ఆ స్వామికి ప్రీతి అని అన్నమయ్య భావనగా రచయిత వివరించారు. దనుజ, చెన్నకేశవుడు, ద్వారక, నరనారాయణులు, గోవింద, అంజలి, రాధ, దశరథుడు మొదలైన పదాలకు సముచితమైన రీతిలో అర్థాలను అందించారు. గరుడోత్సవం మొదలైన అంశాలను గురించి తెలిపారు. కలిపురుషుని కథ, భృగు మహర్షి కథలున్నాయి. తిరుపతి వేంకటేశ్వరుడు కుమారస్వామిగా, శక్తి స్వరూపిణిగాను,మహాత్మ్యాన్ని కలిగి వున్న విధానాన్ని వివరించారు. సందర్భానుసారంగా నవనారసింహ క్షేత్రాలు, పంచ నారసింహ క్షేత్రాలతో పాటు ఇతర నారసింహ క్షేత్రాలను, పూరీ జగన్నాథుని ప్రస్తావించారు. భక్తిద్వారా భగవంతుని చేరుకోవచ్చుననే అన్నమయ్య సంకీర్తనల ఆధారంగా రచయిత దైనందిన జీవితంలో భగవంతుని సేవకు తగిన సావకాశం లేనివారు భగవంతుడ్ని మనస్ఫూర్తిగా స్మరించి మననం చేస్తూ వుండడం ద్వారా ఆ భాగ్యాన్ని పొందవచ్చునని తెలిపారు. రాధా కృష్ణులు, జీవిత్మా పరమాత్మలు, నాయికా నాయకులు అనే ద్వంద్వాల ద్వారా ద్వంద్వాతీతమయ్యే విధానాన్ని వివరించారు. కొన్నిచోట్ల అన్నమయ్య ప్రయోగించిన పదాలు, చేసిన వర్ణనలు ఉన్నవి వున్నట్టుగా తీసుకుంటే కుదరదు, అందులోని విశేషాన్ని గ్రహించాలి, సామాన్యులకు నచ్చినరీతిలో రసాన్ని రుచి చూపించి భక్తి రసామృతాన్ని పంచాలన్నది అన్నమయ్య సంకల్పంగా రచయిత భావించారు. లౌకిక విషయం ద్వారా పారలౌకికాన్ని సాధించే మార్గాన్ని అన్నమయ్య చూపించాడు. అందువల్ల అల్పమైన భావాలతో, అపోహలతో అన్నమయ్య మాటలను అన్వయించుకోకుండా దీనిలోని ఆంతర్యాన్ని తెలుసుకోవాలి అని రచయిత సమన్వయం చేసి చూపించారు. అంతరార్ధాలను కూడా వివరించారు. ఉధాహరణకు కింకరిష్యామి అనే కీర్తనను తీసుకోవచ్చు. సామాన్య ప్రజానీకానికి గల లక్షణాన్ని అన్నమయ్య వేంకటేశ్వరునికి తెలియజెపుతున్నాడా! అన్నట్టు వుంది. ఇటు వాంఛలు వదులుకోలేక అటు వేంకటేశ్వరుని కొలువలేక మధ్యలో నలిగిపోయే వారి మనస్తత్వాన్ని అన్నమయ్య ఈ కీర్తనలో చిత్రించాడు. నేనేమి చేయగలను? ఏమి చేసెదను? అనే ఆవేదనకు స్వామితో దగ్గరితనం పెంచుకోవడమే పరిష్కారమట. సంకీర్తనలు వినడం ద్వారా ఆనందాన్ని పొందడంతోపాటు భావాన్ని కూడా తెలుసుకుని వుంటే అందులోని స్వారస్యాన్ని ఆస్వాదించేందుకు వీలవుతుంది. ఈ పుస్తకం పఠితులకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నది.

-కె.లక్ష్మీఅన్నపూర్ణ