అక్షర

మనిషితనం కోసం కవి ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దిగి వచ్చిన గగనం’
-డా.సి.హెచ్.ఆంజనేయులు
పేజీలు: 140,
వెల: రు.70/-
ప్రతులకు: రచయత
ఇం.నెం.6-3-264
బ్యాంక్ కాలనీ,
ఖమ్మం-507002
సెల్: 7702537453
**
‘ఆప్యాయతల ప్రేమ హస్తాలు అందించి.. మమతల వర్షం కురిపించి.. మానవతా ఆదర్శదీపాల వెలుగుదారి చూపేవి పుస్తకాలే అక్షరాల ఏనాటికీ’ అని గట్టిగా విశ్వసించే కవి డా.సి.హెచ్.ఆంజనేయులు ‘దిగి వచ్చిన గగనం’ పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించి.. తమ సృజనను చాటుకున్నారు. కవిత్వమే ఈ కవియొక్క మాధ్యమమై.. ఈ గ్రంథంలో కొలువుదీరిన కవితల్లో అస్తిత్వవాదంతోపాటు... ఆత్మిక చింతన ఉండటం విశేషం! అంతేగాక ఆత్మిక సౌందర్యానికి పట్టంకట్టే విధంగా ఇందలి కవిత్వం ఉంది. అన్నింటికి మించి... మనిషి, మనిషితనంకోసం కవి పడే ఆరాటం కానవస్తుంది. మనసుకీ, మనసుకీ మధ్య మమతల వంతెన వేసేలా.. కవి తన రచనను కొనసాగించడం విశేషం! మట్టిముద్దగా వున్న మనిషిని, విద్య ద్వారా ప్రాణ స్పందన కలిగించే గురువును ప్రేమించమని కవి కాంక్షించడం బాగుంది. సామాజిక బాధ్యతతో కవి పండించిన ఇందలి కవిత్వం అందరినీ ఆలోచింపజేస్తుంది..
ప్రకృతిని, మనిషిని, సృష్టిలోని స్వరాన్ని, చీకట్లను తొలగించి చైతన్యాన్నిచ్చే సూర్యున్ని, చల్లని కాంతినిచ్చి హాయినిచ్చే వెనె్నలను, సర్వసృష్టిని వీక్షించేందుకు జన్మనిచ్చిన తల్లిని కవి ఆంజనేయులు తమ కవిత్వం ద్వారా ఉన్నతంగా ఆవిష్కరించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో.. గ్రామాలలో వివిధ వృత్తులవారు పడుతున్న వ్యథలకు అద్దంపట్టారు..
కవిత్వంలో తడి వున్నప్పుడే మనిషిని, మనిషిని కలిపి కట్టేయగలమనీ... కవిత్వంలో తడిలేకపోతే.. జీవితం ఎడారిలా మారిపోతుందని వ్యాఖ్యానించారు.
‘కల’కాలం కవితలో... కలలు మనల్ని నిత్యం మేల్కొల్పే చైతన్య రాగాలని, కొన్ని కలలు నిత్యం మన వెంట నడిచే తోడు నీడలని అభివర్ణించారు. అయితే.. కలలను కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకోవడంలోనే విశ్వమానవ విజయముందని తేల్చిచెప్పారు.
‘ఈ క్షణం బాగుండు’ కవితలో కవి ప్రకటించిన భావాలు కవితాత్మకంగా వున్నాయి.. ‘ఈ క్షణం మల్లెపందిరిలో తొలినాటి... ప్రేమ పలుకుల ఊసులు నాలో పదే పదే సవ్వడి చేసి.. గిలిగింతల పులకింతలు రేపి... ఇవి ఇలాగే నిల్చిపోతే బాగుండునని’’చెప్పిన తీరు బాగుంది. ‘ఈ లోకం నుదుటి శోకపు తలరాతను ఏమారిస్తే మనిషిగా మనస్సున్నందరికీ బాగుండు’’అని చక్కని ముగింపునిచ్చారు.
‘నవ్వులే భూషణాలు’అంటూ రాసిన కవితలో.. నవ్వులను వివిధ కోణాల్లో విశే్లషించారు. ప్రతి నవ్వుకు అర్థంపరమార్థం వుందని చెబుతూ... నవ్వుల నజరానాలు... నవ్వుల హేళనలు, సందడులు, నవ్వుల జయాపజయాలు, నవ్వుల వరాలు బాధల గురించి ఏకరువుపెడుతూ... నవ్వులు ఆనందలోక విహారాలుగా, నవ్వులు సకలమానవాళి మనో లోకాభరణాలుగా పాఠకుల ముందుంచారు.
కొందరు వలపుల కౌగిలిలో బందీలు.. మరికొందరు బ్రతుకుకోసం ఆకలి కౌగిలిలో బందీలు.. ఎవరు ఏ కౌగిలిలో బందీలైనా చివరకు మృత్యువు కౌగిలిలోనే బందీ కావల్సిందేనని ఓ కవితలో.. కవి తమ తాత్త్వికతను చాటుకున్నారు.
బ్రతుకు నడకలోగల ఎన్నో అనుభూతులను ‘సహజాలు’ కవితలో చక్కగా చిత్రించారు.
లోక ప్రేమికుడివై.. సర్వానుభవాలను జీర్ణించుకొని.. విశ్వంలో ఎగిరే పక్షిలా వీచే స్వేచ్ఛావాయువులో ముందువెనుకలు చూడకుండా... ‘గగనం అంచులదాకా’ సాగిపొమ్మని హితవుపలికారు.
మనిషి నేడు స్వయంకితాబుల మతలబుల గ్రహణశక్తి అయ్యాడనీ.. ఏది ఏమైనా.. మమతల నగలే మానవతా నవ్యకాంతులు... నిత్య నడవడిలో నేర్చుకునే గుణపాఠాలని మరువరాదని సూచించారు.
మనస్సునుగూర్చి రాసిన కవిత బాగుంది. ‘‘బతుకెప్పుడూ మార్గదర్శి’’ కవితలో... బ్రతుకును తొలిపొద్దు సూర్యునిలా ఆవిష్కరింపజేయాలని కాంక్షించారు. బ్రతుకునెప్పుడూ నిరాశ గర్భంలోకి... నిశ్శబ్ద లోయలోకి సాగిపోనీయ్యకుండా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
ఊహలే నూతన అనే్వషణదారులకు నిత్య స్వాగత తోరణాల ప్రేరణలని భావించే కవి.. నిశ్శబ్దంనుంచి శబ్దంలోకి తన భావాలను తీసుకెళ్ళేందుకు ఆయన చేసిన ప్రయత్నం ప్రశంసనీయం..
ఇంకా ఇందులో.. కడివెడు నీళ్ళకోసం జనంపడే కష్టాలను ఓ కవితలో ఆర్ధ్రంగా ఆవిష్కరించారు. బాల్య వసంత తోటలో ఆయన విహరించిన అద్భుత క్షణాలను మరో కవితలో బంధించారు.
ఇలా ఈ కవితా సంపుటిలోని అనేక పంక్తులు ఉదహరించడానికి యోగ్యంగా వున్నాయి.. ముఖ చిత్రం గ్రంథానికి నిండు శోభను కూర్చింది.

-దాస్యం సేనాధిపతి