అక్షర

‘పరిశోధన చేస్తే ఇట్లా చేయాలె’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తథ్యము సుమతీ
(పరిశోధన గ్రంథం)
-డా.మచ్చ హరిదాసు
వెల: రూ.200/-
ప్రతులకు: ప్రసిద్ధ
పుస్తక శాలలు
9849517452
**
మచ్చ హరిదాసు అంటే యాత్రా చరిత్రలపై రాసిన తొలి పరిశోధన గ్రంథం గుర్తుకు వస్తుంది. సినారె అన్నట్టు ఉత్తమ పరిశోధకుని లక్షణాలు వొంటబట్టించుకున్న వారు మచ్చ హరిదాసు. వీరిది సత్యనిష్ఠ. బద్దెన రాసిన నీతి శతకం ‘సుమతి శతకం’. ఒకనాడు ఇది పఠన పాఠశాలలో ఎంతో ఆదరణ పొందింది. 12వ శతాబ్దంలో వృషాధిప శతకం తొలి శతకమైతే వెంటనే (13వ శతాబ్దంలో) ప్రజాదరణ పొందిన సుమతి శతకం వెలువడింది. దీనిని బద్దెన రాయలేదన్న వారూ ఉన్నారు. హరిదాసు మొదట 1984లో దీనిని ప్రచురించారు. మరింత విపులంగా, లభ్యమైన మరికొన్ని పద్యాలతో సమాచారమిచ్చి పరివర్థిత ముద్రణగా ఇప్పుడు వెలువడింది.
సుమతి శతక కర్తృత్వం, కాలం, పద్య సంఖ్య, పాఠ భేదాలు వంటివి ప్రథమ భాగంలో ఉన్నాయి. ద్వితీయ భాగంలో కంద పద్యం ప్రాముఖ్యం, సుమతి నీతి సామాజికత, అనుసరణలు, సుమతి శతక ప్రభావం, బ్రౌన్ ప్రతి, ఐతిహ్య బలంగల పద్యాలు అనే అంశాలతో వివరణ ఉంది. అనుబంధం 1,2 లలో చివర పరిశోధన నేపథ్యాన్ని తెలియజేశారు. ‘పరిశోధన చేస్తే ఇట్లా చేయాలె’ అనే విధంగా ఉన్నదని శతక వాఙ్మయ వికాసంపై ప్రామాణిక పరిశోధన చేసిన ఆచార్య కె.గోపాలకృష్ణారావు అనటం మచ్చ హరిదాసుకు గొప్ప మెచ్చుకోలు!
సుమతీ శతక కర్తృత్వంపై ఇప్పటికే అనిశ్చితి ఉంది. చాలామంది బద్దెన క్రీ.శ.1140కి పూర్వుడు కావచ్చునని చెప్పిన దానిని హరిదాసు అంగీకరించారు. ఈ చర్చలు కీ.శే.డా.వి.చక్రపాణిరావు (లెక్చరర్, అమలాపురం) విస్తారంగా చర్చించి బద్దెన రాయలేదన్నారు. ఈ అంశం హరిదాసుగారి దృష్టికి వచ్చినట్టు లేదు.
కవి కాలాదులు, కర్తృత్వాల చర్చ ఇప్పుడు అవసరం కాదు గానీ పరిశోధకులకు మాత్రమే ప్రయోజనం. బద్దెన రాసినట్టు స్థిరపడింది గదా! ద్వితీయ భాగమే మచ్చ హరిదాసుగారికి పేరు తెచ్చి పెడుతుంది. సుమతీ శతకం కంద పద్యాలలో రాయబడింది. అందుకని ‘్ఛందః శిల్పం’ అనే భాగంలో కంద పద్య చరిత్ర ఉంది. ‘కందం రాసిన వాడే కవి - పందిని పట్టినవాడే బంటు’ అన్నది సామెత. ఉద్యమ కవైన శ్రీశ్రీకి కూడా ‘కందం అంటే - అందులోని జగణం అంటే ఇష్టం. ‘సుమతి నీతి - సామాజికత’ అనే అంశమే అవసరం. శతక సారాన్ని, ప్రయోజనాన్ని హరిదాసు గారు స్పష్టంగా వెల్లడించారు. సంస్కృతి నీతి శ్లోకాలను ఉదహరించి బద్దెన వాటిని అనుకరిస్తూ చెప్పిన పద్యాలను అందించారు. సుమతి శతకానికి పేరడీలు వచ్చాయంటే ఎంత ప్రభావం చూపాయో తెలిపారు. ఈ పుస్తకానికి అనుబంధాలు గొప్ప చేర్పు. శతకాలు సార్వకాలీనమైనవి - సార్వజనీనమైనవి. సుమతి శతకంలో మానవ స్వభావాలు, అప్పటి పద్యాలు - నేటి స్థితి, దృష్టాంతాలు, భాషా ప్రయోగాలు వంటి వాటిని చేర్చి మరో ముద్రణ తీసుకువస్తారని ఆశించవచ్చు. ఇప్పటికీ సుమతి శతకంపై ఈ పుస్తకం మార్గదర్శకం.

-ద్వానా శాస్ర్తీ