అక్షర

కాల స్తబ్ధతను బద్దలుకొట్టే కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిగంబర కవులు
మూడు కవితా సంకలనాల ఏకైక సంపుటి;
285 పుటలు;
వెల: రూ.100/-లు;
ప్రతులకు- ప్రధాన పుస్తక విక్రేత సంస్థలు.
**

తిట్టుకవిత్వం తెలుగు సాహిత్యంలో ఎప్పటినుండో వుంది. రావూరి దొరస్వామిశర్మ రాసిన ‘తెలుగులో తిట్టుకవిత్వం’ గ్రంథాన్ని చదివితే ఆ కైతల ఆనుపానులు తెలుస్తాయి. వైయక్తికమైన తిట్టు కవితలు సవాలక్ష వుండుగాక! సామాజిక అవసరమైన తిట్టుకవిత్వం దిగంబర కవులది. వారు ఎవరెవర్ని తిట్టారని లేక విమర్శించారని ప్రశ్నించుకుంటే ఎవర్నీ వదల్లేదనేదే జవాబు. సంప్రదాయ కవుల్ని, భావకవుల్నీ, కొండొకచో అభ్యుదయ కవుల్నీ, ప్రధానంగా ప్రజావ్యతిరేక దుర్మార్గపాలక వర్గాన్నీ, మారవలసిన ప్రజానానీకాన్ని తీవ్రంగా విమర్శించారు. మార్పు దిక్కు గమనం కోరుతూ ఘాటుగా సూటిగా నిందించారు. ఇదంతా ప్రజాక్షేమ ప్రేమతోనే చేశారు. దిగంబర కవిత్వాన్ని కేవలం తిట్టుకవిత్వంగానే భావించుకుంటే పప్పులో కాలేసినట్లే. అది కాలస్తబ్ధతను భళ్ళున బద్దలుకొట్టిన కోటి శంఖాల చైతన్యపూరిత ధిక్కార కవిత్వం.
దిగంబర కవిత్వం మూడు సంపుటాలు వేరువేరుగా 1965, 1966, 1968 సంవత్సరాల్లో వచ్చాయి. ప్రబంధ సాహితీ వంటి ప్రయోగాలుచేసి, పుస్తక ప్రపంచం పత్రికను నడిపిన చరిత్రగల ఎం.శేషాచలం అండ్ కో., వారు 1971లో మూడు కవితా సంకలనాలను కలిపి ప్రకటించడం చరిత్రాత్మక కవిత్వ భద్ర కార్యక్రమాన్ని నిర్వర్తించింది. కాగా ఇప్పుడు 2016లో విజయవాడలో ‘సాహితీ మిత్రులు’ సంస్థ మూడు కవితా సంపుటాల ఏకైక సంపుటిని పునాసకాపుగా ప్రకటించడం ఆవురావురుమంటున్న సామాజిక కవితాప్రియుల దప్పికను తీర్చడమే. ఈ సత్కావ్యపునరుద్ధరణ సత్కార్యం చరిత్రకేకాక వర్తమాన కాలానికీ అవసరం. కారణం శ్రీశ్రీ విశే్వశ్వరరావు ముందుమాటలు కొన్ని చదివితే తెలుస్తుంది. ‘‘గుర్తింపు రాజకీయ ఉద్యమాలు సైతం పోరాడినంతకాలం పోరాడి భావజాల అలసటకు గురైన వాతావరణం నేటి సాహిత్యంలో కనిపిస్తున్నది. దిగంబరుల లాగా విస్ఫోటించే ఉద్యమమొకటి తెలుగు సమాజ సాహిత్యాలకు బహుదా అవసరం. అటువంటి ఉద్యమం వెల్లువెత్తుందనే ఒకటి మాలో మిగిలే వుంది... అటువంటి బాగును ఆశించి ఈ సంపుటిని తెస్తున్నాం’’అని ఆశావాదాన్ని ప్రకటించారు. కాగా ‘వాళ్ళారుగురు. మనం నలుగురుం... ఇంకా అనేకులు’ అనే శీర్షికతో కాంతివంతమైన చరిత్రాత్మక వాక్యసంచయాన్ని ఇచ్చిన కవి సీతారాం. ‘దిగంబర కవిత్వ ప్రాసంగికత ఇనే్నళ్ళలో మరింత పెరిగిందే తప్ప రవ్వంత కూడా తరగలేదు. మరికొన్ని సంక్లిష్టతలు వచ్చిచేరాయి. ఇప్పుడున్న పరిస్థితులలో మరో దిగంబర ఉద్యమ కవిత ఉద్భవిస్తుందన్న ఆశలేదు. ఆస్కారమూ లేదు’’అని నిరాశను ప్రకటించారు.
అయితే నిజానికి ఇప్పుడు అవినీతి వ్యతిరేక ధిక్కార ఉద్యమం రావలసిన అత్యవసర పరిస్థితి వుంది. ఎందుకంటే ఇప్పుడు టీవీ చానల్స్‌ను పెట్టుకుంటే చాలు- పాలక పక్ష- ప్రతిపక్ష అవినీతి ధారావాహికలు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహాస్వాములవి వేడిగా తాజాగా వస్తూనే వున్నాయి. ముక్కుమీద వేలేసుకోవడం కూడా మానేశాం కారణం అవి అనుదిన దర్శన చర్యలుగా మారిపోవడంవల్ల.
50 ఏళ్ళ క్రితం వచ్చిన దిగంబర కవిత్వం గతకాల కవిత్వం కాకుండా ఇప్పటి కాలంలో స్వాగత కవిత్వం అవడం గమనార్హం. దిగంబర కవిత్వంలో అశ్లీలం వుంది అంటారని వారు పసికట్టేసి ఇలా అంటున్నారు, నగ్నముని- ‘... కేళి చూస్తున్నాను’. ఖండికలో / అశ్లీలం పలుకుతోంది దిగంబరాక్షరం/ అంటున్నావు సిగ్గులేకుండా/ నీ మెదడు పురుగు తినేసింది/ నీ చర్మం కుళ్ళిపోయింది/ నీ ... పుచ్చిపోయింది./ నీ కళ్ళకి కన్నంపడింది/ నీ మనసు కక్కూసుగా మారింది/ ఇంక నీకు ప్రతిదానిలోనూ/ అశ్లీలంగాక మరేమి కనబడుతుంది/ బాహాటంగా పట్టపగలు జరుగుతున్న అన్యాయాలూ అక్రమాలూ అమానుషాలూ/ ఉన్నదున్నట్లు చెబితే నీకు అశ్లీలంగానే కనబడుతుంది/... రాజకీయ రంకు భక్తులూ/ ఇసక నైవేద్యపు కంట్రాక్టర్లూ/ ఉడతాభక్తి వాటాదార్లూ/ మనుష్యుల్ని కొనేసి వ్యాపారంచేస్తున్న యూనిఫారమ్ ...కొడుకులూ/ ఆ దేశం వాళ్ళకీ/ ఈ దేశం వాళ్ళకీ / బిస్కత్తులు చూపించే అడ్డమైన వాళ్ళకీ/ కుక్కల్లా అమ్ముడుపోయినవాళ్ళూ.../ డబ్బుకోసం/ పదవికోసం/ ముఖాలకి పెంటరాసుకోమన్న/ ఫేస్‌పౌడర్లా పూసుకునే వాళ్ళూ/ బద్మాష్... కొడుకులూ/ వాళ్ళ తమ్ముళ్ళూ బామ్మర్దులూ/ పంట పొలంనిండా కలుపుమొక్కల్లా/ ధాన్యాగారం నిండా పందికొక్కుల్లా బలిసి పోయినారంటే/ నీకు అశ్లీలంగానే వినబడుతుంది/ వాడు/ ..... / ఆ బొజ్జ ... కొడుకు/ మన అభ్యుదయం గూర్చి మైకు బద్దలుకొడుతున్నవాడు/ క్షణంలో లక్షాధికారి ఎట్లా అయినాడని అడిగితే/ అదీ నీకు అశ్లీలంగానే వినబడుతుంది/.... ఇంక ప్రజలే ఎదురుతిరిగి/ పరిపాలన మార్చలేరా అని కుమిలిపోతే/ అది నీకు అశ్లీలంగా వినబడుతుంది. ఇంకా ఎన్నో మలుపులు తిరిగినాయి.
ఈ దేశ భీభత్స రస ప్రధాన కవిత ‘ఒరే పీనుగా/ ఇదికూడా నీకు అశ్లీలంగానే కనబడుతున్నదా’ అన్న వాక్యంతో బిగింపైన ముగింపుతో ముగుస్తుంది. ఇది విన్న శ్రోత లేదా చదివిన పాఠకుడు వెంటాడే ఆలోచనలతో ఉంటాడా లేక అశ్లీలం అంటాడా ఆలోచనీయం. సమాజంలోని నలుగురి గురించీ ఆరుగురు వ్రాసిన దిగంబర కవితల్లో దేశభక్తి కుదురుకున్న అంశాన్ని మనం గ్రహించాలి. యువతరంపై వారి విశ్వాసాన్ని గమనించాలి.
విజయవాడ ‘సాహితీ మిత్రులు’ సంస్థ దిగంబరకవులు కవిత్వాన్ని సంకలనత్రయ సంపుటిగా తేల్చిన కాలంలోనే, ఆ కవిత్వంపై ప్రేమ్‌చంద్ రాసిన ‘్ధక్కారనాదం దిగంబర కవిత్వం ప్రకటించి కవిత్వ, విమర్శ గ్రంథాలు ఏకకాలంలో తెచ్చినవారయ్యారు.
ధిక్కారవాదం దిగంబర కవిత్వం పుస్తక పీఠికలో నగ్నముని ‘‘ఈ గ్రంథం రాబోయే రోజుల్లో దిగంబర ఉద్యమం రాజకీయ విలువల స్థాపన ప్రేరణతో మరో ఉద్యమానికి దారి చూపుతుందని ఆశిస్తాను’ అన్నారు. నిజానికి ఆ వాక్యాలు ఆ పుస్తకానికన్నా ‘దిగంబర కవులు’ మూల కవిత్వానికే అధికంగా వర్తిస్తాయనిపిస్తుంది.
మూల కవిత్వం మూల పడకుండా చేసిన సంస్థ అభినందనీయం.
ఇప్పటి కాలస్తబ్ధతనూ బద్దలుకొట్టగలిగిన కవిత్వం దిగంబర కవిత్వం.

-సన్నిధానం నరసింహశర్మ