అక్షర

ఆలోచనానుభూతుల దొంతరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర గాంధారం
- సాంధ్యశ్రీ,
80 పుటలు,
వెల :రూ.100/-,
ప్రతులకు: రచ యత, 40-241/3, జి1,
నరసింహ రెసిడెన్సీ,
కృష్ణవేణీనగర్, వౌలాలి,
హైదరాబాద్-40. మరియు ప్రముఖ పుస్తక విక్రేతల కేంద్రాలు.
**
ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో కవిత్వాలుగా భాసించేవెన్నో! కవిత్వపు విందులు కొనే్న! పళ్ళెరపు భోజనాలు ఆకలిని తీరుస్తాయి. సంపూర్ణ భోజనాలు కావలసినవన్నీ ఇస్తాయి.
పూర్తి బోనాన్ని కవిత్వపు విందుగా ఇచ్చే గ్రంథం ‘అంతర గాంధారం’. మహిత సమాధి స్థితిని దీపంలా జ్వలించే కవి సాంధ్యశ్రీ తన అంతస్సీమలనుండి ప్రయాణిస్తూ సీమావధులు లేకుండా 36 పద్యాలలో చేసిన కవితా భావ విహార యాత్ర రుూ సంపుటి.
కంఠంలో, వీణలో పుట్టే స్వరాన్ని గాంధారం అంటారు. స్వరాంతంలోని శ్రుతిని పుచ్చుకొనేదాన్నీ గాంధారం అంటారు. గాంధార దేశ జనులచే పాడబడేదాన్ని గాంధారం అంటారు.
లోపలినుండి లోతులనుండివచ్చే భావనా కవితా స్వరాలు ఈ అంతర గాంధారం.
లోగడ నగ్న చిత్రాలు, తుంగభద్ర, పుప్పొడి చినుకులు, చెట్టు ఒక పద్యం, కడలి గడప మీద గొంతు జెండా, గుమ్మం తొక్కిన జ్ఞాపకాలు వంటి గ్రంథాలతో సాంధ్యశ్రీ అభిజ్ఞ పాఠకులకు పరిచితులైన సాంధ్యశ్రీ పునాదిగల కైత కట్టడాల నిర్మాత అని ఈ అంతర గాంధారం సాక్ష్యం పలుకుతుంది.
‘‘కళ్లగట్లు తెంచుకుని కలల నదుల్లో పడి / కొట్టుకుపోతున్న మనస్సును / పూచిన చెట్ల పూవుల పుప్పొడి ప్రవాహం మీద తేలుతున్న సీతాకోకచిలుక’’ అనీ; ‘ఒళ్ళో ఒదిగిన నాటినుంచీ/ గింజకు తలను పైకెత్తడం నేర్పిన నేల / అరణ్యాలను ధరిస్తుంది/ ఆకాశం దాకా ఎదిగిన కొమ్మల్తో..’ అన్న కవి ఇప్పుడేమంటున్నారంటే-
‘ఇప్పుడింకా తూర్పు కోడి బంగారు గుడ్డు పెట్టలేదు / ఎగురుతున్న కెరటాల మీద ఏ బంతీ తేలటంలేదు / తోటకోసం వెతుకుతున్న తుమ్మెదకు మందార ఆహ్వానమందలేదు / శూన్యంతో నిండిన వేణువులో శబ్దమొకటి రాగంగామ్రోగలేదు /కంటి రెప్ప వొదిలి కల పూర్తిగా జారిపోలేదు’ అంటారు.
కొన్ని పద చిత్రాలు కవిత్వ సంపద భావ చిత్రాలైపోతాయి. సాగిపోతూ చదువుకునే కవితలు కావివి. ఆగి ఆగి కవి కవితలో తాదాత్మ్యం చెందడానికి మన సెన్సిబిలిటీని (గ్రహణ శక్తని) పెంచుకుంటూ చదవ తగ్గ కవితలు.
ఆధునిక కవిత్వంలో ఒక పాయను అర్థం చేసుకోవాలంటే స్వీయానుభూతి శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే అది అర్థతాత్పర్యాల పరిధినీ, దండొన్వయాల పరిధినీ దాటిపోతోంది. అది రసాయనిక చర్చావిశేషం.
జానపద కవులు నిరంతరం ప్రకృతిలో బ్రతికారు. ప్రాకృతిక కవిత్వాన్ని బతుకు కతలతో పలికారు. అందుకే అది ప్రాచీన కవిత్వమైనా శాశ్వతకాలీన కల్పితమైంది.
అంతరగాంధార కవి ప్రకృతిలో మమేకమై, తరువాత విడివడి, తన దర్శనంతో ప్రాకృతిక అనుభూతుల్ని స్వీయాలోచనతో రంగరించి మనకు సమర్పించారు.
తుమ్మెదల గీతాలు, కనె్నలు, వెనె్నల, వసంతఋతు సౌందర్యాలు పువ్వులు. నాకు ఎక్కడ పడితే అక్కడ దృశ్యమానవౌతున్నాయి. ఇవి తప్ప నాకెవ్వరూ ఏం చెప్పినా బోధపడదు. ఇది వివేకం కాదని ఎవ్వరనుకున్నా నాకభ్యంతరం లేదన్న అర్థాలు ధ్వనించే పద్యాలు రాసిన తొలి తెలుగు జంట కవులు మలయ మారుత కవులు గుర్తుకొస్తున్నారు. తన అంతర గాంధారం పుస్తకానికి సాంధ్యశ్రీ రాసుకున్న ముందు మాటలు ‘ఒక మాటను’ పరికిస్తే.
‘‘కనీస ఉష్ణాంశువు లేని చోట జ్వాలజృంభించదు. కవిత్వమనే నాజూకు మడతను విప్పదీసి మనసున్న కళ్ళకి నైవేద్యం పెడితే తప్ప చూపు చిత్తం అద్వయానంద విభూతిని పొందలేవు’’ అన్న మాటలు రసజ్ఞ జన ఆమోదయోగ్యాలే!
గుంటూరు శేషేంద్ర శర్మ వంటి వారిలాగే సాంధ్యశ్రీ అకవిత్వం పట్ల ఆవేదనని తీవ్ర నిరసన గళంతో వ్యక్తీకరిస్తాడు. దాపరికాల నీడల్లో బ్రతకడం ఇష్టం లేకపోవడంవల్ల సాంధ్యశ్రీ ప్రాంతీయ భావకవులు ‘పృష్టనేత్రులు, కర్ణకణ్వులు’ అనే అంతదాకా వెళ్ళారు. ముందుమాటలు రాసుకొనే సందర్భాలలోనూ, వ్యాసాలూ రాసే సందర్భాలలోను లౌకిక అంశాల్నీ స్పృశించి రచించే సాంధ్యశ్రీ, కవిత్వ రచనలో అలౌకిక లోకాలకు మనల్ని తీసుకువెళ్లి ఏవేవో కొత్తగా చూపిస్తూ దర్శన నిదర్శనాలను ప్రతిఫలింపజేస్తారు, ఈ అంతర గాంధారంలో. పనికట్టుకు చేసే పొగడిక కాదు- ఈ గాంధార శిల్ప కవితల్ని చదువుతూ భావమననం చేసుకుంటే విశ్వనాథ సత్యనారాయణగారు ‘భ్రష్టయోగిని కవిజన్మ బసడినాడ’ అని ఎందుకన్నారో అర్థమవుతుంది.
కృష్ణశాస్ర్తీ, మల్లంపల్లి శరభయ్య వంటివారు గొప్ప కవులు మాత్రమే కాదు, గొప్ప కవిత్వ ప్రచారకులు కూడా. అటువంటి కవిత్వ ప్రచారకులు ఉంటే నెత్తిమీద పెట్టుకుని ‘సహృదయావిష్కరణ’లు చేసుకోదగినదిది అనిపించింది.
ప్రకృతి కవితా వస్తువైనప్పుడు, ఆ వస్తువు కవిత్వమైనప్పుడు అది విశ్వజనీనం కాకుండా వుండలేదు. అందులోనూ లౌకికాన్ని అలౌకికంతో చెలిమికట్టించవచ్చు.
‘‘శబ్దాల్ని మూపున మోస్తున్న అక్షరాల బాటసారికి / నా సంకల్ప పత్రమొక సేద విడిది / సూర్యుడు నా హృదయంలో క్రుమ్మరించిన తేజశే్శవధిని / పదం చేసి పద్యం చేసి పాట చేసి ప్రబంధం చేసి / ఆయువు కోసం పీల్చే వాయువు కందిస్తా / అంతరాగ్నిని త్రవ్వి తీసి ఆకాశవీధికి / నాగలి ముక్కుతో నవ ధాన్యాల నారుమడుల్నిస్తా’’ అనడంలో శిలలో సెలయేరులా శబ్దాలలో కవి హృదయం ప్రవహించింది. సేదవిడిది- ఎంత చక్కని తెలుగు పద ప్రయోగం! కవిత్వం కాంతిమంతం. ఈ కవికి సూర్యుడు హృదయంలో కాంతినిధుల్ని ఇస్తే ఆ నిధుల్ని కవిత్వం చేసి వాయువుకు అందిస్తారట. వాయువుకే ఎందుకందిస్తారంటే ఆయువు కోసమట- ఇది లోతైన భావన. అనుభూతి వివశదశల్లో ఈ కవి కవిత్వంలో పూలు, పక్షులు, చెట్లు, మొగ్గలు, పరీమళాలు, సెలయేరులు, ఆకాశం, నేల, వెనె్నల, ఋతువులు, చిగురు పుష్పించడాలు, చీకట్లు, పగలు, వెలుతురులు ఉదయాస్తమయాలు. ఇవన్నీ కవితా స్పందనల్లో క్రొత్త ఆలోచనల్లో భావుకతల్లో రూపాల మార్పిడుల్లో నూతనాలై చేతనావరణల్ని దృశ్యమానం చేస్తాయి.
‘పువ్వు పెదవులమీద చిరునవ్వుల చిరునామా వ్రాసుకొచ్చి- కాలం / బ్రతుకు కోనేట్లో ముకుళిత కమలినీ లాస్యాన్ని / చిటితరగల మీద దిగబోసి ఉదితిని ఉల్లేఖించింది / ఇప్పుడు దిక్కులన్నీ ఒక్క మాట మీదనే ఉన్నట్లు / పరిమళాన్ని విరజిమ్మిన వెండికాంతుల జలప్రళయం / వెచ్చగా ఉన్నా / అంతరాత్మ కల్లోలంలో పడి అదృశ్య మవుతుంది!.. అన్నారొక వచన పద్యంలో. ఇందులో ఆలోచనాననుభూతులలా ఉంచి.. ‘పరిమళాన్ని విరజిమ్మిన వెండికాంతుల జలప్రళయం’ అన్నందుకు చేతులెత్తి కవితకూ కవికీ మ్రొక్కాలనిపిస్తుంది.
సాంధ్యశ్రీగారికి కలలొచ్చినా అందులోనూ జగన్నాథ పండిత రాయలో, క్షేమేంద్రుడో, నీలకంఠుడో కనపడి ఏవేవో ప్రబోధిస్తారేమో తమ గ్రంథాలకు అదనంగా అనిపిస్తుంది.
కవిత్వం బంగారం వంటిదనుకుంటే అది ఇంత లోతులోనే దొరకాలని అని మనం నిర్దేశించుకోకూడదు. శ్రామికతత్త్వంతో త్రవ్వుకోవాలి. కవిత్వాభరణాలను హదృయాలకు హత్తుకోవాలి.
అలల అలల ఆలోచనల అనుభూతుల దొంతరలు ఈ అంతర గాంధారం.

-సన్నిధానం నరసింహ శర్మ