అక్షర

పురివిప్పిన దళిత చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లందపొద్దు’’ (తెలంగాణ బహజన్ కవిత్వం)
గుడిపల్లి నిరంజన్,
పూలే- అంబేద్కర్
అధ్యయన వేదిక:
నాగర్‌కర్నూలు
వెల: రు.100/-;
పేజీలు: 160,
ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు
**
తోలును నానబెట్టి శుభ్రపరచడానికి ఉపయోగించే ‘‘పిట్’’లకు తెలుగులో ‘లంద’ అనే చక్కటి పదం వాడుకలో వుంది. మాదిగల కులవృత్తిని సూచించే ‘‘లంద’’ వాళ్ళ ఆత్మగౌరవ చిహ్నంగా వెల్లివిరియాలని కవి భావన. అందులో భాగంగానే మాదిగ సంస్కృతిని ఉన్నతీకరిస్తూ రాసిన కవిత చూద్దాం. ‘‘కనురెప్పల కదలికలు/ నొసట బొమ్మల ఎగిరేత/ రూపాయి బిళ్ళ నొసట్లో సూర్యుడై/ భూగోళం డప్పై/ సిడితల భజన సిటుకులు/ జడ కొప్పు కోలాహం/ జమిడికే డప్పు దరువులు/ జీవితం నిండా కళలే/ కళలన్నీ మాదిగ వాడలో... ‘‘నిజమే. కాని ఆ మాదిగవాడ ఎలా వుంది?’’ ఏ ఊరిలోనైనా సరే/ మా దిగ్గేరి ఆగ్నేయ దిక్కులో/ దుఃఖపు దుక్కిలపరుచుకున్నది’’అంటూ తెలియజేస్తారు. మాకేం కుల పట్టింపులు లేవు అని నీతులు చెప్పేవాళ్ళు కూడా ఎలా అంటరానితనం పాటిస్తారో, వారి ‘‘జారిపడ్డ చిరునవ్వు’’ చూసి ‘‘కులం మనస్సుపై/ అంటిన మొండిమరక/ ఎంత ఉతికినా పోవట్లేదు’’అని బాధపడతాడు./ ‘‘కులాన్కో దేవతున్న ఈ దేశంలో/ అందరికి పూలదేవతైన బత్కమ్మ/ ఇంకా వెలివాడను/ ఆవాహనం చేసుకోవాల్సి ఉంది’’అంటూ తెలియజేస్తారు. ‘‘పక్కనున్న మనిషిని అసహ్యించుకుంటూ... లేని ప్రేమను గోవులపై కుమ్మరించడాన్ని చూపిస్తూ జాగ్రత్తపడమంటారు. ‘‘పక్క మతంవాడిని/ ద్వేషించడమే దేశభక్తి అంటే/ ఆ దేశభక్తి నాకొద్దు/ పక్కనున్న నన్ను నీవు/నిత్యం అవమానిస్తూ/ నీవు పాడే దేశభక్తి పాటలో/ కోరస్ పాడమంటే నేను పాడను’’అని స్పష్టంగా తెలియజేస్తారు. కుల వ్యవస్థపై కవి తిరుగుబాటు చైతన్యాన్ని ‘‘ఇప్పుడు మాదిగ పనిముట్లు మేల్కొన్నాయి/ చెప్పులు ముడిసె/ ఆరె, రంపె, పన్రాయి/ ప్రతీకారానికై/ పళ్ళు నూరుతున్నాయి. ‘‘ఎప్పుడూ కాళ్ళకు/ హత్తుకుపోయే/ చెప్పులు తిరగబడి/ దేశ కుల చరిత్ర ముఖచిత్రం మీద/ పల్లుమని రెండు సరిసింది’’అనే రెండు కవితల ద్వారా గుర్తించవచ్చు. తరతరాలుగా మాదిగలు ఎదుర్కొంటున్న అవమానాలు- వివక్షతను పారదోలి సమానత్వాన్ని అభిలషించే క్రమంలో అగ్రవర్ణాలను ధిక్కరించడమే కాదు. చివరకు దళిత ఉద్యమంలోనుండి విడివడి, హక్కుల పోరాటానికి దారితీసిన మాదిక దండోరాలో భాగంగా కవి తన గొంతు విప్పుతున్నాడు. ‘‘మొదట రాజ్యాధికారంకన్నా/ బహుజన స్నేహసామ్రాజ్యం/ నిర్మించే ప్రయాణం సాగిద్దాం’’అంటూ ‘‘రిజర్వేషన్ల అన్నం గినె్నలో/ అగ్నిపర్వతం బద్దలవ్వాలి/ 59 ముక్కలను సమానంగా ఏరుకుని తినాలి’’అని స్పష్టం చేస్తారు.
పాలమూరు నీటి కరువు గురించి ‘‘తాగేందుకు లేవు నీళ్ళు/ పల్లె కాళ్ళకింద మాదిగ కన్నీళ్ళు’’అని చెబుతూ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలని చూసే ప్రతిపక్ష పార్టీల వైఖరికి నిరసనగా రాసిన కవిత కూడా వుంది, ‘‘ఇప్పుడు రైతు లేడు/ రాజ్యం వుంది/ సెజ్ డేగలు/ రైతు భూమిని కోడిపిల్లల్లా...’’ తన్నుకుపోతున్నారనీ చెబుతాడు. ‘‘ఎవుసంల సీకటిబడ్డది/ కొత్త పాలనకు కనికరం లేదు’’అనడంలో ఏ ప్రభుత్వం వచ్చినా రైతు పరిస్థితిలో మార్పులేదనే ఎరుక ఆ కవితల్లో కనిపిస్తుంది. ప్రపంచీకరణ తెచ్చిన పరిణామాలను, ప్రజాజీవితాన్ని కల్లోల పరిచిన పరిస్థితులను కవి ప్రతిభావంతంగా అక్షరీకరించాడు. ‘‘దేశం గ్రాఫ్ పైన/ దోపిడి వృద్ధిరేటు పెరుగుతునే వుంది’’అంటూ ‘‘నాతో ముడిపడిన ఏ సమస్యకు/ పరిష్కారం వెదకకుండానే/ దేశం అభివృద్ధిలో/ ముందరికి పోతూనే వుందట’’అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతాడు. మార్కెట్ విస్తరిస్తుంటే/ మనిషి అంతర్ధానమైపోతున్నాడు’’అనే సత్యాన్ని తెలియజేస్తారు. చెప్పులు కుట్టే వృత్తి లెదర్ టెక్నాలజిగా ఆధునీకరణ చెందిన అగ్రవర్ణ బడా వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకే కవి ‘‘నేడు నా వృత్తి/లీగల్‌గా దోపిడి కాబడి/ బాటా కంపెనోడి బూటైంది’’ అని గుర్తిస్తారు. ‘‘ప్రపంచీకరణ వ్యాపారీకరణ/మాదిగ అవశేష జీవిత సమాధులపై/ జెండాలై ఎగురుతున్నాయి’’అని తన ఆవేదన వెలిబుచ్చుతారు. ఇలా దళిత స్పృహ, ప్రాంతీ య చైతన్యం, ప్రపంచీకరణలపై ఎక్కువగా కవిత్వం రాస్తున్న గుడిపల్లి నిరంజన్ కవిత్వంలో వాడి, వేడి వుంది. తన అభిప్రాయా లను, నిరసన ను స్పష్టంగా తెలియపరచే కొన్ని కవితల్లో మాండలిక పదాలు అలవోకగా ఒదిగిపోయి ఆ కవితలకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇటీవల వెలువడుతున్న దళిత కవితా సంపుటాలలో గుడిపల్లి నిరంజన్‌ది ఒక విశిష్టమైన సంకలనంగా నిలిచిపోతుంది.

-కె.పి.అశోక్‌కుమార్