అక్షర

శివునిపై అక్షర బిల్వాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ శివమంగళం చరణ సురభి వ్యాఖ్యాత: డా.తాడేపల్లి
పతంజలి,
వెల: రు.250/-;
ప్రతులకు: రావి మోహనరావు,
104- జంజం కాంప్లెక్స్,
చీరాల- 523155
ప్రకాశం జిల్లా
సెల్: 9440115411
**

పంచాక్షరీ మంత్రానికి తొమ్మిది అర్ధాలున్నాయని మనకు ఈ గ్రంథం తెలుపుతున్నది. ఇదొక అపూర్వ సంకలన గ్రంథము. ఈ ప్రయత్నాన్ని చేసినవారు తాడేపల్లి పతంజలి. వివిధ సంస్కృతాంధ్ర గ్రంథములలోని ప్రారంభ ప్రార్థనా శ్లోక పద్య సంపుటి- సవ్యాఖ్యానము. ప్రతి గ్రంథమునకు ముందు ప్రార్థనా శ్లోకం ఉంటుంది. అందులో భావి కథార్థ సూచనను కవిచేయటం ఒక చమత్కృతి. ధూర్జటిగారి శ్రీ విద్యానిధియై అనే తొలి పద్యంలో మొత్తం శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యా కథలన్నీ సూచింపబడ్డాయి కదా? బలిజేపల్లి వారి హరిశ్చంద్ర ప్రార్థనా శ్లోకంలో హరిశ్చంద్ర, నక్షత్రకాది పాత్రలన్నీ ఉదహరింపబడ్డాయి. పతంజలిగారు ఈ ప్రయత్నం చేయడానికి వారికి రావి మోహనరావుగారు, శ్రీమతి కృష్ణకుమారిగారు ప్రోత్సాహాన్ని అందించారు. ఇంకేం? శివసాక్షాత్కారం జరిగింది. ఇందులో మనకు ననె్నచోడుని నుండి విశ్వనాథ వరకు గల ప్రముఖ తెలుగుకవులు దర్శనమిస్తారు. సంస్కృత ప్రసిద్ధ కవుల శ్లోకములన్నీ ఉన్నాయి. సామాన్య విద్యార్థికోసం అర్థతాత్పర్యములు వ్యాఖ్యానము ప్రతి పద్యానికి ఇచ్చారు. ఇవన్నీ పిన్నలేకాదు పెద్దలుకూడా కంఠస్థము చేయవలసిన స్తుతులు. నాందిలో ఎనిమిది లేక పనె్నండు పదములుండాలి. పదమంటే పాదం అని ఒక నిర్వచనం. చంద్రముద్ర ఉండాలి. అందువల్ల ఈ సంకలనకర్త కొన్ని సందర్భాల్లో రెండవ పద్యం గ్రహించారు. లోగడ తాడేపల్లి వారు అన్నమయ్య కౌముది ప్రచురించి ప్రసిద్ధులైనారు. ఇప్పుడు ఈ గ్రంథంతో శివాస్థాన కవులైనారు. ఇదొక పవిత్ర కార్యము. ద్వితీయ ముద్రణలో సంకలనకర్త కొన్ని సూచనలు పాటించాలి. 1) సంస్కృత విభాగం వేరుగా తెలుగు వేరుగా వింగడించాలి 2) అకారాద్యనుక్రమణిక ఉండాలి 3) కాలానుక్రమణిక చాలా ముఖ్యం. ఎందుకంటే ఇద్దరు ప్రాచీన కవుల మద్య ఒక ఆధునిక కవి పద్యం లేదా గేయం ఉండకుండా చూడాలి. 4) మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్ర్తీగారి మృత్యుంజయ శతకము వంటి మరికొన్ని శతక పద్యాలు తప్పనిసరిగా చేర్చాలి. అప్పుడు ఈ గ్రంథమునకు త్రికాలాబాధిత శాశ్వతత్వం లభిస్తుంది. 169వ పుటలో హర్షచక్రవర్తి రచించిన ప్రియదర్శినిలోని రెండవ నాందీ శ్లోకం ఇచ్చారు. సామాన్యంగా నాలుగు పంక్తుల తొలి శ్లోకమే నాంది అనుకుంటారు. కాని ఎనిమిది పంక్తులను కూడా పరిగణనలోనికి తీసుకోవచ్చునని ఇలాంటి ఉదాహరణలు తెలుపుతున్నాయి. తాడేపల్లి పతంజలికి సంస్కృతాంధ్రములపై మంచి పట్టు ఉన్న కారణంగా వ్యాఖ్యానం రసవత్తరంగా ప్రామాణికంగా సాగింది. నందియే నాంది. కాబట్టి ఈ నాందిపై శివపార్వతులు కావ్యములో కూర్చుంటారని అర్థం. ఇట్టి గ్రంథమును ప్రతివారూ తమ ఇంట్లో ఉంచుకొని బిడ్డలకు రోజూ ఒక పద్యం నేర్పిస్తే జాతి బాగుపడుతుంది. పాండిత్యం కూడా వస్తుంది. ఇదొక శివ కైంకర్యము. దీనిని ఇంతకుమించిన వందిమాగధీయము అవసరము లేదు. రచయితతోబాటు ప్రకాశకులు కూడా శివానుగ్రహ పాత్రులైనారు. ఇందులో మొత్తం 108 బిల్వదళము లున్నాయి. పాణిమంత్రముతో కృతి ముగించారు. ఈ తరంవారికి బొత్తిగా పరిచయం లేని చెఱవు సత్యనారాయణశాస్ర్తీ (పుట 241) వంటి వారి పద్యములను కూడా సేకరించటం లో సంకలన కర్త శ్రమను మనం అర్థం చేసుకోవచ్చు. వ్యాఖ్యానం సరళ వ్యావహారికం లో సాగింది. ద్వితీయ ముద్రణలో ననె్నచోడునితో కాక నన్నయ లేదా సంస్కృతకవి శ్లోకముతోనో మొదలుపెట్టినట్లయితే బాగుంటుంది! ఇందుకు రెండు కారణాలున్నాయి. అవి పండిత గ్రాహ్యములే.

-ముదిగొండ శివప్రసాద్